రాజీ - - పి బి రాజు

rajee

ఆమె నవ్వింది.

గలగలా గోదారిలా -

ఉరకలెత్తే జలపాతంలా -

మెల్లగా - మనోహరంగా - తెరలు తెరలుగా - అలలు అలలుగా

అదే అమాయకత్వం

అలా గలగలా నవ్వగలిగే అదృష్టం ఎందరికుంటుంది?

రాజీ మళ్ళీ నవ్వింది - మెల్లగా మెలమెల్లగా - విరిసీ విరియని గులాబిలా - ముత్యాల పలువరుస తలుక్కుమనేలా--

ఆ నవ్వే కదా నన్నిలా ఫ్లాట్ ఛేసింది.

ఆమె ముందు మౌనిలా నిలబెట్టేసింది.

మాట రాని మూగవాడిలా నన్ను కట్టిపడేసింది - గత ఏడాదిగా

ఇంతకీ ఆమె ఏమడిగింది?

" మాధవ్! నన్ను పెళ్ళిచేసుకుంటావా?"

ఎంత సింపుల్ గా అడిగింది.

ఎంత అమాయకంగా అడిగింది - ఎలాంటి సంకోచం లేకుండా

స్త్రైట్ గా అడిగేసింది. అడిగేసి అంతే నిర్మలంగా నవ్వేసింది.

ఒక్క క్షణం నివ్వెరపోయాను.

"ఏం మాధవ్! ఏమంటావు? మన కొలీగ్స్; చుట్టుపక్కలవాళ్ళు ఆల్రెడీ డిసైడయిపోయారు. పెళ్ళెప్పుడని అడుగుతున్నారు."

మళ్ళీ అదే చెదరని నవ్వు - చెదిరిన ముంగురులను సవరించుకుంటూ –

ముక్కుసూటితనం ... గలగల మాటలు....కలుపుగోలుతనం ...తనెక్కడున్నా సందడే సందడి.

* * *

" మాధవ్ గారూ! ఈవిడ ఈ రోజే జాయిన్ అయ్యారు. మీ పక్క సీట్లో కూర్చోమన్నారు మేనేజర్ గారు " మా కొలీగ్ ఇంట్రడూస్ ఛేశారు.

వెను తిరిగి చూశాను.

"గుడ్ మార్నింగ్ సార్! నా పేరు రాజీ ...రాజేశ్వరి ! " ముకు ళిత హస్తాలతో - చక్కని చిరు నవ్వుతో ఓ అందాలరాశి ఎదురుగా -

చిలక పచ్చని చీరలో మెరుపు తీగ లా –

పదహారణాల తెలుగుదనం ఉట్టిపడేట్లు చక్కని అవయవ సౌష్టవంతో పోతపోసిన విగ్రహం లా -

బ్రహ్మదేవుడు చాలా జాగ్రత్తగా, నేర్పుగా, ఓర్పుగా తీర్చిదిద్దిన శిల్పంలా -

అచ్చం బాపు బొమ్మలా –

క్షణం పాటు రెప్పవాల్చడం మర్చిపోయాను.

"హాయి ! వెల్కం ప్లీజ్. బీ సీటెడ్ " అన్నాను తేరుకొని,

అద్బుతమైన సౌందర్యం !!! ఇరవై ఏండ్లు కూడా నిండినట్లు లేదు. కాలేజ్ నుండి ఇప్పుడే బయటపడినట్లుంది.

సీట్లో పొందికగా కూర్చొంది.

"ఫ్రెష్ అప్పాయింట్మెంటా?" అడిగాను.

"అవును సార్. ఫస్ట్ అప్పాయింట్మెంట్."

''ఫైన్. ఛాలా అర్లీగా జాబ్ సంపాదించినట్లున్నవే !" అన్నాను.

"యస్ సార్! డిగ్రీ పైనల్ మొన్ననే రాశాను."

తర్వాత వాళ్ళ ఫారెంట్స్ ను పరిచయం చేసింది.

వాళ్ళు కూడా నాతో అట్టే కలిసి పోయారు.

అద్దెకు ఇల్లు చూసిపెట్టమన్నారు.

ఇంతలో కనకయ్య టీ తీసుకొచ్హాడు. వాళ్ళకూ ఇప్పించి కనకయ్య కు ఆ పని పురమాయించాను.

కనకయ్య మా ఆఫీస్ కు కాఫి, టీ సప్ప్లై చేస్తుంటాడు. ఆ వూర్లోనే పుట్టి పెరిగాడు. ఏదో చిన్న వ్యాపారం చేస్తుంటాడు.

ఏడాది క్రితం నేను జాయిన్ ఇనప్పుడు వాళ్ళ ఇంటి ప్రక్కనే నాకు రూం చూసి పెట్టాడు. ఆ చిన్న వ్యాపారానికి చేదోడు వాదోడుగా; మా ఆఫీస్ కు కాఫి, టీ సఫ్లై చేయడానికి నేనే పురమాయించాను. దానికి తోడు పార్టీస్ కు; ఫంక్షన్స్ కు అతని చేత నే చే యిం చే వాడిని. తక్కువ ఖర్చుతో క్వాలిటి మైంటైన్ చెయ్యడంవల్ల మా ఆ ఫీస్ లో అందరికి బాగా నచ్చింది. దానికి తోడు నేను బ్యాచ్లర్ అవ్వడంవల్ల నాకు భోజనం చేయమని చెప్పి ఒక చిన్న మెస్ లాంటిది ఏర్పాటు ఛేశాను. నా ఒక్కడితో ప్రారంభమైన మెస్ ఇప్పుడు సుమారు 15-20 కోసం నడుస్తోంది. అందుకే అతనికి నేనంటే గురి. సెలవుల్లో; ఆదివారాల్లో నా కాలక్షేపం కనకయ్యే.కనకయ్య కు నా మాటంటే వేదం. సాయంత్రానికల్లా వాళ్ళ ఇంటి ప్రక్కనే ఓ ఇల్లు అద్దెకు రెడి చేశాడు. దగ్గరుండి వాళ్ళకు కావాల్సిన ఏర్పార్ట్ లు చూశాడు. ఆ రాత్రి మెస్ లోనే భోంచేశాం.

ఏర్పాట్లు చూసి చాలా మురిసిపోయారు రాజీ అమ్మానాన్నలు. పోటీ పడి మరీ థాంక్స్ చెప్పారు. వాళ్ళు ఊహించని రీతిలో ఏర్పాట్లు చక చకా జరిగిపోయే సరికి చాలా ఆనందపడిపోయారు.

'థాంక్స్ మాధ వ్ గారు! ఇంత తొందరగా మాకు అన్ని ఏర్పాట్లు చాల చక్కగా చేయించారు. ఇంతకీ మీకు మంచి శిష్యుడే దొరికాడు. " రాజీ నవ్వుల మధ్య అంటుంటే ; మా వాడికి సందు దొరికింది నన్ను పొగడడానికి.

అలా మొదలెడితే మా వాడికి అద్దు అదుపు ఉండదు. ఎంత వారించినా నోరు మూతపడదు. నేను రాకముందు అతని పరిస్థితి; నేను చేసిన సాయం ఇంతకు అంత చెప్పడం మొదలెట్టాడు. ఎంతో మంది ఉన్నా నాలాగా హెల్ప్ చేసింది ఎవరూ లేరట.

అంతా చెప్పాక, “ మీకెలాంటి సాయం కావాలన్నా అడగండి. మొహమాటం పడకండి సార్ లాగా” అని అభయం కూడా ఇచ్చేశాడు.అతని దృష్టిలో నాకు చాల మొహమాటం. అదీ నిజమే.

రాజేశ్వరి మంచి బ్రిలియంట్. ఏకసంధ్యాగ్రాహి. ఏ పనైనా నిమిషాల్లో చేసేసేది. అనతి కాలంలోనే పనిలో నైపుణ్యం సంపాదించి పై అధికారుల ప్రశంసలు అందుకొంది. ఆఫీసులో ఎక్కువ సేపు గడిపేది. ఎవరే పని చెప్పినా కాదనకుండా చేసేది.

ఆఫీసులో సీటు, ఇళ్ళు ప్రక్కప్రక్కనే కావడం వల్ల ఆఫీసుకు పోవడాలు, రావడాలు కలిసే చేసేవాళ్ళం. నాకు ఆఫీసుకు అర గంట ముందు, ఆఫీసు ఐన తర్వాత అరగంట ఉండే అలవాటు. పెండింగ్ వర్క్ అటెండ్ అయ్యేవా ణ్ణి. ఆమెక్కూడా అదే అలవాటయ్యింది. ఆఫీసు సర్కులర్స్, డి పార్ట్ మెంట్ టెస్ట్ లకు కలిసే చదివేవాళ్ళం. అలా మిగతా కొలీగ్స్ కన్నా నా దగ్గర చనువు పెరిగిందావిడకు.

మేము జూనియర్లవడం; మిగతా వారంతా చాలా సీనియర్లవడం వలన అప్పుడప్పుడు వారి పన్లు కూడా మా కప్పగించేసేవారు. అవి పూర్తిచేయడానికి లేట్ సిటింగ్స్ అలవాటయింది. నాతో పాటూ ఆమె ఉండేది - పని నేర్చుకోవడానికి

ఇక కుటుంబ విషయానికొస్తే, ఆ ఇంట్లో రాజేశ్వరే చిన్న అమ్మాయి. ఆమెకు ఒక అక్క, ఒక అన్న ఉన్నారు. ఇద్దరూ చదువుకొంటున్నారు. తండ్రికి ఈమధ్యే హార్ట్ ప్రాబ్లంతో ప్రైవేట్ ఉద్యోగం మానేశాడు. లక్కీగా అదే సమయంలో ఈమెకు ఈ ఉద్యోగం రావడం ఆ కుటుంబానికి ఎంతో ఊరట. ప్రస్తుతానికి ఆమె కుటుంబానికి ఆమె జీతమే జీవనాధారం.

కుటుంబానికి చిన్నపిల్ల కాబట్టి వాళ్ళింట్లో అందరికీ ముద్దే. ఇంట్లో ఏకైక సంపాదనాపరురాలయి నప్పటి నుంచి మరీను. వాళ్ళమ్మయితే కాళ్ళు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా చూసుకునేది. రాజీ పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే ... చాలా సున్నితం - శారీరకంగా, మానసికంగా కూడా -

ఆమెకు అన్ని రంగాల్లోనూ మంచి అవగాహన ఉంది. పైగా సివిల్ కు ప్రిపేర్ అవుతోంది. మా మాటల్లో రాజకీయాలు, సంగీతం, సాహిత్యం, సినిమాలు ...ఒకటేమిటి అన్నీ చోటుచేసుకునేవి. ఆమెకు అవగాహన లేని సబ్జెట్ అంటూ ఏమీ లేదు. ఏ టాపిక్ పైనైనా అనర్ఘళంగా మాట్లాడగలదు. అభిప్రాయాలు నిర్ధిష్టంగా, ఖచ్చితంగా ముక్కుకు సూటిగా ఉండేవి. ఇక మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొస్తే టైమే తెలిసేది కాదు. తన వాదనలో పస తగ్గినప్పుడు చూడాలి ఆమె ఉడుకుమోత్తనం! వెనక్కు తగ్గడం చాలా వరకూ నా వంతే అయ్యేది. ఇంత చిన్న వయసులో అంత తెలివితేటలుండడం నిజంగా అమోఘమే!

నాకు షేక్స్ప్యియర్ అంటే ఇష్టం. ఆమెకు మిల్టన్ అంటే ఇష్టం. నాకు ఘంటసాల అంటే ఇష్టం. ఆమెకు బాలు అంటే ఇష్టం. నాకు ఆత్రేయ అంటే ఇష్టం. ఆమెకు వేటూరంటే ప్రాణం. మా వాదన ప్రతివాదనలు ఏ పదిన్నర, పదకొండు వరకో సాగేది. చుట్టుప్రక్కల వారికి కూడా మంచి కాలక్షేపం. భోంచేసి ఎనిమిదన్నర, తొమ్మిదింటికో మాఇంటి ముందు ఆరు బయట పెద్ద అరుగు మీది కొచ్చేసేవారు. హాయిగా మంచి కాలక్షేపం చల్లని గాలిలో ... వెన్నెల వెలుగుల్లో . రోజుకో టాపిక్. పాటలు, అంత్యాక్షరి చాలా హుషారుగా పాల్గొనేవారు. టైమే తెలిసేది కాదు.

చివరికి మా జంటను చూసి చాలా మంది అపోహ పడే స్థాయికి వెళ్ళిపోయింది.

ఒకరోజు కనకయ్య అన్నాడు - "మీరిద్దరూ ప్రే మించుకుంటున్నారని అందరూ అనుకొంటున్నారు."

ఒక్కసారిగా ఉలిక్కిపడి - "అలాంటి దేమీ లేదు" అన్నాను.

"తప్పేముంది. ఇద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు. ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఇద్దరి అభిరుచులు దాదాపు ఒకటే. ఆలోచించండి. అమ్మాయితో మాట్లాడమంటే మాట్లాడుతాను."

"నో ...నో..."

"ఎందుకు? ఆ ఫీ సులో కూడా అందరూ అనుకొంటున్నారు. మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని ... మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారని ... "

"నాకలాంటి ఆలోచనేదీ లేదు కనకయ్యా!"

"పర్వాలేదు. ఇప్పుడైనా ఆలోచించండి. మంచి అమ్మాయి. అందానికి అందం... గుణానికి గుణం. మంచి ఉద్యోగం. పైగా మీరంటే ప్రేమ. ఎవడో తన్నుకుపోక ముందే చెప్పండి!" అన్నాడు.

"అంటే..."

"అంటే ఏముంది! అయినా ఇందులో ఆలోచించడానికేముంది? సలక్షణమైన పిల్ల. వంకర పెట్టడానికేమీ లేదు. ఎవడైనా కళ్ళకద్దుకొని చేసుకొంటాడు. నాక్కూడా మీ జంట బాగుంటుందనిపిస్తోంది"

కనకయ్య మాటలు నాలో పెను దుమారమే రేపింది.

ఇంతవరకు నాకలాంటి ఆలోచ నే లేదు.

మేమిద్దరం ఎన్నెన్నో మాట్లాడుకొన్నాం కానీ, ఇలాంటి టాపిక్ మా మధ్య ఎప్పుడు రాలేదు.

ప్రశాంతంగా ఉన్న చెరువులోకి రాయి విసిరి అలలు సృష్టించాడు కనకయ్య.

అతను చెప్పినట్లు కాదనడానికి కూడా ఎలాంటి కారణం లేదు.

అన్నీ బాగున్నాయి కానీ ...? ప్రేమ...పెళ్ళి ల గూర్చి చాలా ఆలోచించాలి.

ప్రేమయితే ఇద్దరు చాలు.ఐతే పెళ్ళి విషయానికి వచ్చేసరికి చాలా చాలా ఆలోచించాలి. నా పరిస్థితులు వేరు.

నా కుటుంబ పరిస్థితులు ఆమె పరిస్థితులకు భిన్నమేమీ కాదు.

ఇంటికి పెద్ద కొడుకుగా - నలుగురి చెల్లెళ్ళ బాగోగులు చూసుకోవలసిన బాధ్యత నా పై ఉంది. నాన్న పోయి ఐదేళ్ళయింది. అమ్మను చూసుకోవాలి. అందర్నీ అలా వదిలేసి నా స్వార్థం చూసుకోలేను. నేనే వారికి ఆధారం. వారికి దారి చూపాల్సిన బాధ్యత నాకుంది. బాధ్యత పూర్తయ్యేంత వరకు ప్రేమ… పెళ్ళి ల జోలికి పోదలుచుకో లేదు.

ఎడతెరిపి లేని ఆలోచనలతో ఆ రాత్రంతా నిద్ర కరువయింది.

ఉదయం ఏడు గంటలకే రాజీ వాళ్ళమ్మ "నీతో కొంచం మాట్లాడాలి" అంటూ ఇంటికొచ్చింది.

వాళ్ళింటి పరిస్థితి, వాళ్ళాయన అనారోగ్యం, మిగతా పిల్లల చదువుల గూర్చి చెప్పుకొచ్చింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సహాయం చేయమని ప్రాధేయపడింది. రాజీ చిన్న పిల్ల. మొండిది. ఎలాగైనా సామరస్యంగా, సున్నితంగా పరిష్కరించమని వేడుకొంది. ఆమె పరిస్థితీ అర్థం చేసుకోతగ్గదే. ఆలోచించి ఎవరికీ ఇబ్బంది లేని పరిష్కార మార్గాన్ని సూచించాను. వెళ్తూ వెళ్తూ "థాంక్స్" చెప్పి వెళ్ళిందామె తృప్తిగా . మేం మాట్లాడుతున్నంత సేపు కనకయ్య అక్కడక్కడే తారట్లాడడం నా దృష్టి దాటిపోలేదు.

"నాకు విజయవాడ ట్రాన్స్ ఫర్ అయింది. వెంటనే రిలీవ్ చేయమని హెడ్డాఫీస్ ఆర్డర్స్. రేపు రిలీవ్ చేస్తారట." అంది రాజీ.

"కంగ్రాట్యులేషన్స్. నీ బాధలు చాలా వరకు తగ్గుతాయి."

"ఎందుకు"

"అందరూ కలిసి ఒకటిగా ఉండొచ్చు. మీకు ఖర్చులు తగ్గుతాయి."

"అంటే"

"అక్కడొక ఫ్యామిలీ ... ఇక్కడొక ఫ్యామిలీ మైంటెనన్స్ కష్టం కదా! ఇప్పుడు అందరూ కలిసి ఉండొచ్చు. హాఫియే కదా! "

"నాకు లేదు"

ఎందుకు"

"ఇక్కడి వాతావరణాన్ని, మిమ్మల్నందర్నీ వదిలి వెళ్ళడాని కిష్టం లేదు." బుంగమూతి పెట్టింది.

"జాబ్ అన్న తర్వాత ట్రాన్స్ ఫర్స్ తప్పనిసరి రాజీ! మన కిష్టం ఉన్నా లేకున్నా తప్పదు" అనునయిస్తూ అన్నాను.

ఆమె కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి.

"జీవితమంటే అదే రాజీ ! అంతా మనమనుకున్నట్లు; మనం చెప్పినట్లు జరుగవు. ఎదురు చూడనివి, ఎదురు దెబ్బలు తప్పవు." " అయితే పోక తప్పదా?" అంది చిన్న పిల్లలా

"ఉద్యోగం కావాలంటే తప్పదు. మధ్య తరగతి జీవితాలంటేనే సర్దుబాట్లు" ఓదార్చాను.

రెన్నిమిషాల మౌనం తర్వాత - "మీనుంచి నా కింకా సమాధానం రా లేదు" అంది రాజేశ్వరి .

"ఏం సమాధానం"

"అదే మన పెళ్ళి విషయం"

నేనేం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను - క్షణం పాటు .

"మౌనంగా ఉంటే ఏమనుకోవాలి. అర్థాంగీకారమా? లే క ..."

" రాజీ ! మనం కొంచెం మనసు విప్పి మాట్లాడుకోవాలి !" అన్నాను.

" చెప్పు" అంది.

"మనం ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా మనిద్దరం ఒకే పడవలో ప్రయణిస్తున్నాం."

"నాక్కావల్సింది పడవులు ...ప్రయాణాలు కాదు. సూటిగా సమాధానం" కరకు గా అంది.

"మనిద్దరి కుటుంబాలు మనపైన్నే అధారపడిఉన్నాయి. ఇలాంటప్పుడు మన స్వార్థం మనం చూసుకొని వారిని బలి చేయడం నాకు ఇష్టం లేదు."

"అంటే"

"అంటే ఏముంది? కుటుంబాలు కిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మం."

"ఇప్పటిలాగే ఆదుకొందాం. మన పెళ్ళి దానికి అడ్డని నేననుకోవడం లేదు."

"నీవు చిన్న పిల్లవు. చెప్పినా కొన్ని అర్థం కావు. మన పెళ్ళి ...నా చెల్లెళ్ళ, మీ అక్క పెళ్ళిళ్ళకు ఆటంకం కారాదు. ఎందుకంటే మనం జీవిస్తున్నది సమాజంలో ..."

"వెయిట్ చేద్దాం?" మధ్యలో అడ్డుపడుతూ అంది.

"ఎంతకాలం? బాధ్యతలు ఎప్పుడు తీర్తాయో తెలియదు. మధ్య తరగతి సమస్యలకు అంతం ఎప్పుడో చెప్పలేం."

"ఇదేనా ! మీ అఖరి సమాధానం"

"నీవు నాకంటే తెలివైన దానివి. మంచి భవిష్యత్తు ఉన్నదానివి. మనలాంటి మధ్య తరగతి జీవితాల్లో కొన్ని కొన్ని ఆశించ డం కూడా అత్యాశే అవుతుంది. ఇంతకు మించి నన్నేమీ అడక్కు. నాకు నా పెళ్ళికన్నా బాధ్యత ముఖ్యం. అర్థం చేసుకో! ఇక బయలు దేరదాం" మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లేచి నిలబడ్డాను.

* *

రాత్రి - రైల్వే స్టేషన్లో రాజీ కు; వాళ్ళమ్మకు సెండాఫ్ ఇవ్వడానికి వెళ్ళాం - నేను కనకయ్యా

ఒక్క రోజులో రాజీ లో చాలా మార్పు కనపడింది. గల గలా, చలాకీగా, సందడిగా ఉండే రాజీ మౌనాన్ని ఆశ్రయించింది. నాకు తెలుసు అమెలో బడబాగ్ని రగులుతోందని ... అగ్ని పర్వతం ఎప్పుడైనా బ్రద్దలవ్వచ్చనీ... అయినా తప్పదు. పరిస్థితులతో రాజీ తప్పదు. పదిమంది సుఖం కోసం ఇద్దరి బాధ అంత పెద్దదేం కాదు. ఈ బాధను కాలం మార్చగలదేమో చూడాలి. కదలబోతుండగా -

నవ్వింది మళ్ళీ ... అలలు అలలుగా ... తెరలు తెరలు గా.

నొక్కి వదిలింది నా చేతిని.

తేలిక పడింది.

డోర్ దాకా వచ్చి, "నీ మేలును జన్మలో మర్చిపోలేను బాబూ!" అంటూ చేతులు జోడించింది.

ట్రైన్ కదిలింది.

నేను చేతులూపి బయట పడ్డాం.

మరిన్ని కథలు

Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi
Kundalo Gurralu Tolaku
కుండలో గుర్రాలు తోలకు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు