కొత్త సినిమా.. - వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి

Kotta Cinema Story by Vemparala Srinivasa Murthy

ఇం ట్లో ఎవరూ లేరు.మా బంధువుల పెళ్ళికి బందరు వెళ్ళారు.సాయంత్రం ఆఫీసు నించి వస్తూ మధ్యలోని ఒక హోటల్‌లో కొంత గ్రాసాన్ని తిని ఇంటికి వచ్చాను.స్నానం, పానం చేసి టీ.వీ.ఆన్‌ చేసాను.

స్థానిక 'ఎల్‌.టీ.వి' చానెల్‌ లో 'ఫోన్‌ కొట్టు-టికెట్‌ పట్టు' లైవ్‌ ప్రోగ్రాం మెదలయింది. టీ.వీ లోంచి యాంకర్‌ రింగుల రోజా, తంబోలా రమేష్ చేతులూపుకుంటూ వచ్చారు. కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం..అంటూ హడావిడి మొదలెట్టారు. ఈ కార్యక్రమంలో మీతో పాలుపంచుకోవడానికి ప్రఖ్యాత నటులు, 'గుండెల్లో దడ' చిత్ర కథా నాయకులు 'శ్రీ గుండు గజానన్‌' గారు స్టూడియో కి విచ్చేసారు.

'గుండెల్లో దడ' చిత్రం ఈ మధ్య నే విడుదలై విజయవంతం గా ప్రదర్శింపబడుతున్న సందర్భం గా, ఈ చిత్ర విశేషాలను మీతో పంచుకోవటానికి వారు విచ్చేసారు. వారితో మాట్లాడటానికి మీరు ఫోన్‌ చెయ్యవలసిన నంబరు-040-20202020. ఫోన్‌ నంబరు ట్రై చేస్తూ వుండండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఫోన్ కొట్టండి-టికెట్‌ పట్టండి. ఇప్పుడో చిన్న బ్రేక్‌ తీసుకోండి." అంది రింగుల రోజా.

ఒకింత విసిగిస్తున్నా ఇవాళ ఈ ప్రోగ్రాం చూడాలని నిశ్చయించుకున్నాను.

'డబ్బు కోసమా, మీ చింత, మా డార్లింగ్‌ బ్యాంక్‌ వుంది మీ చెంత' అంటూ వాణిజ్య ప్రకటనతో ఒక హీరో తెర మీద ప్రత్యక్షం అయ్యాడు. అదయ్యే లోగానే తళ తళ లాడే పళ్ళ కోసం అందరి ఎంపిక మా 'గబుల్‌' పళ్ల పొడి అంటూ, మా పళ్ల పొడి వాడక ముందు అంటూ నోట్లో ఒక పన్ను కూడా లేని రమణా రెడ్డి లాంటి వాడ్ని చూపించారు. మా 'గబుల్‌' పళ్ళపొడి వాడిన తర్వాత అంటూ నోటి నిండా కట్టుడు పళ్ళున్న వాడ్ని ఒకడ్ని చూపించారు.

తిరిగి కార్యక్రమానికి స్వాగతం అంటూ రోజా, రమేష్ ప్రత్యక్షమయ్యారు. స్టూడియో లో ఫోన్‌ రింగైంది.

" హలో..ఎవరండీ..ఎవరు మాట్లాడేది. మీ పేరు, వివరాలు చెప్పండి." అంటూ వగలుపోతూ అష్ట వంకర్లు తిరిగింది రోజా.

" నా పేరు గునపాల గోవర్ధనం. నేను గుండాల పాలెం నుంచి ఫోన్‌ చేస్తున్నాను." అన్నాడు.

" ఆ..చెప్పండి, గోవర్ధనం గారు.." అంది రోజా.

" చెప్పడానికి ఏమీ లేదండి. మీరు చెప్పారు కదా! ఫోన్‌ కొట్టు, టికెట్‌ పట్టు అని ఫోన్‌ కొట్టాను. టికెట్‌ పంపించండి." అన్నాడు.

" అలా కాదు..గోవర్ధనం గారు, ఇక్కడ మీ ముందు స్టూడియో లో 'గుండెల్లో దడ' కథా నాయకుడు శ్రీ గజానన్‌ గారు వున్నారు. ఆయనతో మాట్లాడండి. తర్వాత మీ మైబైల్‌ కు ఎస్‌.ఎం.ఎస్‌ వస్తుంది. అది పట్టుకొని థియేటర్‌ కి వెళితే అక్కడ మీకు టికెట్‌ ఇస్తారు." చెప్పింది రోజా.

" నాకు ఆ గజానన్‌ గారు ఎవరో తెలియదు. సినిమా టికెట్‌ ఇస్తానన్నారని ఫోన్‌ చేసాను. ఎక్కువ సేపు మీతో సుత్తి కొట్టడానికి నా మొబైల్‌ లో బాలన్స్ లేదు. వెంటనే ఎస్‌.ఎం.ఎస్‌ పంపించండి." అంటూ కోపంగా ఫోన్‌ పెట్టేసాడు గోవర్ధనం .

మళ్ళీ స్టూడియో లో ఫోన్‌ రింగైంది.

" హలో..మీరు మాట్లాడే ముందు మీ పేరు, వివరాలు చెప్పండి." అంటూ రొటీన్‌ గా వంకర్లు తిరిగింది రోజా.

అవతల నుంచి " నమస్తే మేడం..నా పేరు గోసంగి సుబ్బారావు. నేను జొన్నాడ నుంచి ఫోన్‌ చేస్తున్నాను. గుండు గజానన్‌ గారికి ఇవ్వండి." అన్నాడు.

" ఆ వింటున్నారు, మాట్లాడండి." అన్నాడు రమేష్.

" గజానన్‌ గారు నాకు మీ నటనంటే మహా ఇష్టమండి. కానీ నాకో సందేహమండి. మీరేమో గాలేస్తే ఎవరికీ కనబడనంత దూరం ఎగిరిపోయేలా వుంటారు కదండి. మరి సినిమా లో చీపురు పుల్ల లాంటి చెయ్యేసుకొని, రుబ్బురోళ్ళ లాంటి విలన్లని ఎలా కొడతారండి. మీరు చెయ్యి వెయ్యగానే వాళ్ళు గాలిలో అలా ఎగిరిపోతారు కదండి. ఆ టెక్నిక్‌ గురించి ఈ కార్యక్రమం ద్వారా చెబితే విని తెలుసుకుంటామండి." అన్నాడు.

" చూడండి, సుబ్బారావు గారు, ఇలాంటి సినీ సూత్రాలు బహిరంగం గా చెప్పేవి కావు. ఈ సారి మీరు హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది." అన్నాడు గజానన్‌.

మీరు సినిమా కి సంబందించిన ప్రశల్ని మాత్రమే అడగాలని వెనకాల నుంచి రోజా సర్దుతోంది. ఇక లాభం లేదనుకొని పోన్‌ లైను కట్‌ చేసారు.

గుండు గజానన్‌ కి స్టూడియో లో చల్లగా ఏ.సి.తగులుతున్నా కిందనుంచి కనబడకుండా చెమటలు కారుతున్నాయి. ఇంకెలాంటి ఫోన్‌ లు వినిపిస్తార్రా భగవంతుడా అనుకుంటున్నాడు మనసులో.

ఈ లోపల ప్రేక్షకుల కోసం..మీకో సర్‌ప్రైజు సిద్ధం గా వుంది. అంటూ సందడి చేస్తున్నాడు తంబోలా రమేష్. ఆ సర్‌ప్రైజు మీ కోసం ఈ బ్రేక్‌ తర్వాత చూడండి. అన్నాడు.

మళ్ళీ ప్రకటనలు మొదలయ్యాయి.

తిన్నారా..పడుకున్నారా..తెల్లారిందా..మీకే తెలియదు. మా బెడ్‌ పై పడుకుంటే సరాసరి మీరు స్వర్గం లో వున్నట్టే. ' లంగూన్‌ ' పోంబెడ్స్‌. బెడ్‌ కొంటే పిల్లో ఫ్రీ. అంటూ ఊదర గొడుతున్నాడు.

మీకు గుండెల్లో మండుతోందా..మీ పెళ్ళాం ఊరెళ్ళిందా..అయితే వెంటనే రండి. రంభ, ఊర్వశి బార్‌..మీకు చేరువలోనే మా బ్రాంచీలు. మీకు మరింత చేరువ కావడానికి అతి త్వరలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభం. అంటూ మరో ప్రకటన.

తిరిగి కార్యక్రమానికి పునర్‌ స్వాగతం అంటూ వళ్ళు వేయి వంకర్లు తిప్పింది రోజా. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సర్‌ప్రైజు ' గుండెల్లో దడ ' చిత్ర కథా నాయకి కుమారి లక్ష్మీ పట్నం లతాంగి గారు స్టూడియో కి విచ్చేసారు. మీ కోసం..మీ కోసం ..మాత్రమే, ఇక్కడికి విచ్చేసారు. బయట ఎన్నో కార్యక్రమాలు వున్నప్పటికీ వాటిని వాయిదా వేసుకొని అభిమానుల్ని అలరించడానికి విచ్చేసిన లతాంగి గారికి చాలా చాలా థేంక్స్‌ అని చెవులు చిల్లులు పడేలా అరుస్తోంది రోజా.

" ముందుగా చెప్పండి లతాంగి గారు, మీ చిత్రం ఇంత పెద్ద సూపర్‌, డూపర్‌ హిట్‌ అయినందుకు ఎలా ఫీలవుతున్నారు." అడిగాడు రమేష్.

మూతి ముప్పయి మూడు వంకర్లు తిప్పుతూ " చాలా..అనందం గా వుంది." అంది లతాంగి.

" మీరు తెలుగు వారే కదా, తెలుగులో మాట్లాడలేరా.?"అడిగింది రోజా.

" నేను మాట్లాడేది తలుగే కదా."అంది లతాంగి.

" తలుగు కాదమ్మా, తెలుగు.." సవరించాడు గజానన్‌.

ఏ నన్నయో, తిక్కనో ఈ తెలుగు వింటే గంగలో ఒకరు, గోదారి లో ఒకరు దూకే వారేమో అన్నట్టుంది. ఓ పక్కన అష్ట వంకర్ల యాంకర్ల తెలుగు కి ఈ లతాంగి తెలుగు ఏమీ తీసిపోదనిపించింది.

ఇంతలో మళ్ళీ ఫోన్‌ మోగింది. " ఇందాకటి నుంచి ఫోన్‌ చేత్తావుంటే ఫోనెత్తరేటండి. మీకు ఫోన్‌ సేసి,సేసి మా సేతులు అడిపోతున్నాయి ఇక్కడ. బోడి మీరు ఏభై రూపాయల టికెట్‌ ఇత్తారో,ఇవ్వరో కాని,మా కు బోల్డు బిగినెస్‌ పోనాది ఇక్కడ. నా పేరు కిరాణా కొట్టు కనకరాజు." అని చెప్పేది వినే స్థితిలో లేకుండా వాయించేస్తున్నాడు.

" చూడండి..కనక రాజు గారు..మీలా చాలా మంది ట్రై చేస్తూ వుంటారు కదా. లైన్‌ కలవడానికి కొంతసమయం పడుతుంది. మీరు చికాకు పడకూడదలా.." అంటూ ముద్దు,ముద్దు గామెలికలు తిరిగింది రోజా.

" సరే కాని..మన స్టూడియో లో ' గుండెల్లో దడ ' హీరో గజానన్‌ గారు, హీరోయిన్‌ లతాంగి గారు వున్నారు. మీరు ఎవరితో మాట్లాడతారు."అని అడిగాడు రమేష్ .

" ఆ లతాంగి కోపాలి ఇవ్వండి. " అన్నాడు కనక రాజు.

" ఏటండి..లతాంగి గోరు మీరు, మరీ అంత పిసనారోళ్ళు..సినిమా, సినిమా కి బోలెడంత డబ్బుచ్చుకుంటారు గదా. ఏమీ లేనోళ్ళా ఆ పొట్టి,పొట్టి గుడ్డలేటండి. శుభ్రమైన పొడుగు గుడ్డముక్కలు కొనుక్కోవచ్చు కదా. ఓ పాళి మా వూరొచ్చారంటే, నేను దగ్గరుండి, మా జంగం బాబూరావు కొట్టుకు తీసుకెళ్ళి, శుభ్రమైన లాంక్లాత్‌ గుడ్డ తీసి, మా గోళీల సందు దగ్గరుండే..బొంతల.నారాయణ గాడి కిచ్చి బెమ్మాండం గా కుట్టిస్తాను."అన్నాడు.

కనకరాజు బాగా బుద్ది చెప్పాడనుకున్నాను మనసులో.

"అది కాదండి, కనక రాజు గారు, మీరు గజానన్‌ గారి సినిమా లేమైనా చూసారా. సినిమాల గురించి మాట్లాడండి."అంది రోజా.

" నేనెందుకు సినిమా సూత్తానండి. నేనేమైనా ఎర్రోన్నా. పిచ్చోన్నా, ఏభై రూపాయలు దండగ. ఎవడు తిన్నదీ కాదు. మీరు ఫ్రీగా టికెట్‌ ఇస్తానన్నారని ఫోన్‌ చేసాను కాని, లేకపోతే మాకెందుకీ దండగ కార్యక్రమం. ' టాటా టు టాటా ' ఫ్రీ ఫోనవడంతో మీతో ఇంతసేపు బాతాఖానీ కొడుతున్నాను."అన్నాడు.

వెంటనే ఫోన్‌ లైన్‌ కట్‌ అయిపోయింది.

గజానన్‌ కి ఎక్కడో కాలింది. ఈ టీ.వీ చానల్‌ వాళ్ళు తమ సినిమా ని ప్రమోట్‌ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టారా, లేకపోతే మా పరువు తియ్యడానికి కంకణం కట్టుకొని మరీ మా దురభిమానులందరిచేత ఫోన్‌ లు చేయించి అవమానిస్తున్నారా అనుకున్నాడు.

ఇంతలో షరామామూలే అన్నట్టు..కరెంట్‌ పోయింది.

పోన్లేరా బాబు, బుర్ర బాగా వేడెక్కినందుకు ఈ కామెడి కార్యక్రమంతో బాగానే కాలక్షేపం అయిందనుకున్నాను....

మరిన్ని కథలు

Markatapuram-Story picture
మర్కటపురం
- యు.విజయశేఖర రెడ్డి
Daridrudu
దరిద్రుడు
- mahesh amaraneni
Giligadi vachche puligadu chachche
గిలిగాడు వచ్చె-పులిగాడు చచ్చె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kotta jeevitam
కొత్త జీవితం
- చచెన్నూరి సుదర్శన్
Yachakulu kaanidi evaru
యాచకులు కానిది ఎవరు?
- యాచకులు కానిది ఎవరు?.
Vimukti eppudo
విముక్తి ఎప్పుడో!
- రాము కోలా.దెందుకూరు.
Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.