చివరి కేసు - చిత్రవెంకటేష్

the last case

“చీర్స్ “ఆన్నాడు సహదేవ్.

“చీర్స్”అన్నాను నేను.

“నిన్నటితో మీరు ఉద్యోగంలోంచి రైటర్ అయ్యారు కదూ”అన్నాను.

“అవును మూర్తిగారు. దాదాపు పాతిక సంవత్సరాలు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను. నిన్నటితో నా ఉద్యోగ పర్వం ముగిసిపోయింది. అప్పుడు ప్రతి క్షణం డిపార్ట్ మెంట్ కోసం పనిచేశాను. ఈ రోజునుంచి ప్రతి క్షణం నా కోసం ఖర్చు పెట్టుకుంటాను.

“మీరు పోలీస్ కమీషనర్ గా రిటైర్ అయ్యారు అవునా?అన్నాను.

“అవును”అన్నాడు సహదేవ్.

“వృత్తీ రిత్యా మీరు ఎన్నో కేసులు సాల్వ్ చేసిఉంటారు. వాటిలో హత్యలు కేసులు ఉండొచ్చు, దోపిడి కేసులు ఉండొచ్చు, లేదా రేప్ కేసులు ఉండొచ్చు. వాటిలో మీకు చాల కష్టమనిపించిన కేసు మమ్మల్ని చాలెంజ్ చేసిన కేసు ఏదైన ఉందా”అన్నాను.

సహదేవ్ వెంటనే ఏం మట్లాడలేదు. ఆలోచిస్తున్నట్టు కళ్ళు మూసుకున్నాడు. సహదేవ్ నేను మంచి స్నేహితులం. ఇద్దరు ఒకే ఏరియాలో ఉంటున్నాం. తరుచు ఆఫీసర్స్ క్లబ్ లో కలుసుకుంటాం. నేను ఒక ప్రభుత్వ బ్యాంక్ లో పనిచేసి ఇటివలే జనరల్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను. సహదేవ్ కంటే నాలుగు రోజులు ముందు నేను రిటైర్ అయ్యాను. ఆ సందర్భం పురస్కరించుకుని సహదేవ్ కు ఇదే బార్ లో పార్టీ ఇచ్చాను. నిన్న సహదేవ్ రిటైర్ అయ్యాడు. ఈ రోజు నాకు పార్టీ ఇస్తున్నాడు. ప్రస్ధుతం ఇద్దరు సిటిలో ఒక ఖరీదైన రెస్టారెంటులో కూర్చున్నాం. మేము కూర్చున్నచోటులో అంతగా వెలుతురు లేదు. మా పక్కన చిన్నగా ఒక డిమ్ లైటు మాత్రం వెలుగుతోంది. జ్యూక్ బాక్స్ లోంచిసన్నగా విదేశీ సంగీతం వినిపిస్తోంది.

“చాల మంచి ప్రశ్నవేశారు మూర్తిగారు”అలోచననుంచి తేరుకుంటు అన్నాడు సహదేవ్. నాకెరీర్ లో ఎన్నో క్రిమినల్ కేసులను పరిశోధించాను. వాటిలో తొంబైతొమ్మిది శాతం విజయం సాధించాను. ప్రతి కేసును చాలెంజిగా తీసుకునేవాడిని. ఆ కేసు ఎంత కష్టమైన పట్టువిడవకుండ సాల్వ్ చేసేవాడిని. ఒక్కోక్కకేసులో నాకు చిన్న క్లూ కూడా దొరికేది కాదు. అలాంటి పరిస్ధితిలో ఇంకా కష్టపడవలసివచ్చింది. నా పాతిక సంవత్సరాల పోలీస్ ఉద్యోగంలో నేను సాల్వ్ చెయ్యని కేసు అంటు ఏది లేకపోయింది. కాని ఒక కేసు మాత్రం నా అనుభవానికి కాని తెలివితేటలకు కాని అంతుచిక్కలేదు. నిజానికి అది పెద్ద కాంప్లికేటేడ్ కేసు కాదు. అయిన ఆ కేసు సాల్వ్ చెయ్యటానికి నాకు పాతికసంవత్సరాలు పట్టింది”అని ఆగాడు సహదేవ్.

“ఏమిటి మీరుంటున్నారు. ఒకకేసు సాల్వ్ చెయ్యటానికి మీకు పాతికసంవత్సరాలుపట్టిందా.చాల ఆశ్చర్యంగా ఉంది”అన్నాను విస్కీ సిప్ చేస్తూ.

“మీరే కాదు ఎవరైన ఈ మాట వింటే ఆశ్చర్యపోతారు. నిజానికి ఆ కేసు ఏమంత కాంప్లీకెటెడ్ కాదు. చాల సాధారణమైన కేసు. నాకు కూడా పైకి అలాగే కనిపించింది. కాని నీళ్ళలో దిగితే కాని లోతు తెలియదని అంటారు. ఈ నానుడి ఆకేసు విషయంలో నిజమైంది. ఆ కేసు శర్మిష్ట కేసుగా పేరుపొందింది.”

“ఎవరా శర్మిష్ట”ఆసక్తిగా అడిగాను.

“శర్మిష్ మహేంద్రవర్మ కూతరు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు శర్మిష్ట, రెండో కూతరు విమల, మూడో కూతురు మందాకిని. మహేంద్రవర్మ పెద్ద బజినెస్ మాగ్నట్. ఆయనకు విశాఖపట్టణంలోను హైదరబాదులోను చాల వ్యాపారాలు ఉన్నాయి. కాని ఆయనకు మాత్రం భైరవలంక అంటే చాలఇష్టం. విశాఖపట్టణానికి రెండువందలకిలోమీటర్ల దూరంలో ఉంది భైరవలంక ఊరు. ఆ ఊరు చాల అందంగా పచ్చగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి ఆ ఊరు పెట్టింది పేరు. అందుకే మహేంద్రవర్మ ఒక పెద్ద ఇల్లు కట్టుకుని అక్కడ స్దిరపడ్డాడు. ఆ భవనం పేరు వర్మ మాన్షన్స్. దాదాపు పదహారు గదులు ఉన్నాయి ఆ మాన్షన్ లో.

“సరే ఇక అసలు విషయానికి వస్తాను. ఈ సంఘటన జరిగినప్పుడు శర్మిష్టకు పదహారు సంవత్సరాలు. ఊటిలో చదువుకుంటుంది. అక్కడే ఆమె రుద్రప్రతాప్ అనే యువకుడిని ప్రేమించింది. రుద్రప్రతాప్ తండ్రి భూపతి వర్మ కూడా బాగా ధనవంతుడు. మహేంద్రవర్మ లాగే అతనికి కూడాచాల వ్యాపారాలు ఉన్నాయి. పైగా మహేంద్రవర్మ భూపతివర్మ మంచి స్నేహితులు. తన కొడుకు శర్మిష్టను ప్రేమిస్తున్నాడని తెలియగానే భూపతి వర్మ చాల సంతోషపడ్డాడు. ఈ విషయాన్ని మహేంద్రవర్మకు చెప్పాడు. ఆయన కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు. పదిహేను రోజుల తరువాత ఇద్దరికి నిశ్చితార్ధం జరిగింది. ఆ శుభకార్యానికి నేను కూడా వెళ్ళాను. ఆ సమయంలో నేను భైరవలంకలో కొత్తగా యస్.ఐ గా చార్జ్ తీసుకున్నాను. మహేంద్రవర్మ నన్ను కూడా తన కూతురు నిశ్చితార్ధానికి ఆహ్వానించాడు. అనుకున్న తేదికి రుద్రవర్మకు శర్మిష్టకు నిశ్చితార్ధం జరిగింది. చాల మంది వి.ఐ.పీలు ఆ శుభకార్యానికి వచ్చారు. నిశ్చితార్ధం అయిన తరువాత రుద్రప్రతాప్ తన స్నేహితులతో మాట్లాడటానికి బయటకు వెళ్ళాడు. నేను కూడా అతనితో పాటు వెళ్ళాను. అప్పుడు శర్మిష్ట తన స్నేహితులతో లోపల కబుర్లు చెప్పుతుంది. ఉన్నట్టుండి శర్మిష్ట లేచి లోపలికి వెళ్ళింది. అందరు బాత్ రూంకు వెళ్ళిందని అనుకున్నారు. పదినిమిషాలు గడిచిన ఆమె రాలేదు. ఆమె స్నేహితులు ఈ విషయాన్ని మహేంద్రవర్మ కు చెప్పారు. నేను మహేంద్రవర్మ లోపలికి వెళ్ళి చూశాం. కాని శర్మిష్ట ఎక్కడలేదు. చుట్టు పక్కల అంతా వెతికాం. మాన్షన్ వెనుక కొంత దూరంలో ఒక చిన్న చెరువు ఉంది. అక్కడికి కూడా వెళ్ళి చూశాం. చివరకు చుట్టుపక్కల అడవిలో కూడా గాలించాం. కాని శర్మిష్ట జాడ ఎక్కడ తెలియలేదు.”

“ఎవరైన ఆమెను కిడ్నాప్ చేసిఉండవచ్చని భావించాం. కాని నాలుగురోజులు గడిచిన కిడ్నాపర్స్ దగ్గర్నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేశాం. శర్మిష్టకు రుద్రప్రతాప్ తప్ప ఇంకో బాయ్ ఫ్రెండ్ లేడు. ఆమె మగవాళ్ళతో అసలు మాట్లాడదని తెలిసింది. అన్ని కోణాలలో పరిశోధన చేశాం. కాని విచిత్రంగా ఆమె గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. గాలిలో కలసిపోయినట్టుగా మాయమైంది. జరిగిన దారుణం మహేంద్రవర్మ కుటుంబం తట్టుకోలేకపోయింది. కూతరు జాడ తెలియక తల్లడిల్లిపోయారు. బాధతో కృంగిపోయారు. రుద్రప్రతాప్ పరిస్ధితి అంత కంటే దయనీయంగా మారింది. తన ప్రేయసిని తలుచుకుని కుమిలిపోయాడు. నిద్రాహారులుమాని సన్యాసిలా అయిపోయాడు. బాహ్యప్రపంచంతో పూర్తిగా సంబంధాలు వదిలేశాడు. సంవత్సరం గడిచింది. నేను ఎంత ప్రయత్నించిన శర్మిష్ట జాడ తెలుసుకోలేకపోయాను.కనీసం చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయాను. సంవత్సరం తరువాత నాకు బదిలీ అయింది. నేను వెళ్ళిపోయిన తరువాత నా స్ధానంలో ఇంకో ఆఫీసర్ వచ్చాడు. అతను కూడా శర్మిష్ట గురించి ఆరాతీశాడు. అతనికి కూడా ఏం తెలియలేదు. కొన్ని రోజుల తరువాత అతను కూడా వెళ్ళిపోయాడు. తరువాత ఇంకో ఆఫీసర్ వచ్చాడు. ఆఫీసర్స్ మారుతున్నారు కాని ఎవరు శర్మిష్ట ఆచూకి మాత్రం తెలుసుకోలేకపోయారు”అని ఆగాడు.

“అంటె ఇప్పుడు కూడా శర్మిష్ట కేసు ఇంకా పెడింగ్ లో ఉందా”ఆత్రంగా అడిగాను.

“పోయిన సంవత్సరం వరకు అది పెడింగ్ లో ఉంది. అదే సంవత్సరం నా కెరీర్ లో ఆఖరి సంవత్సరం. ఆతరువాత నేను ఉద్యోగంలోంచి రిటైర్ అయిపోతాను. ఒకసారి అనుకోకుండ ఏదో పని మీద భైరవలంక వెళ్ళాను. రుద్రప్రతాప్ ను కలుసుకున్నాను. అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. కనిపించకుండ పోయిన తన ప్రేయసిని తలుచుకుంటు పెళ్ళిచేసుకోకుండ ఉండిపోయాడు. అజన్మబహ్మచారిగా ఉండిపోయాడు. శర్మిష్ట మీద అతనికి ఉన్న ప్రేమనుచూసి నవ్వాలో బాధపడాలో అర్ధం కాలేదు. మాటల సందర్భంలో మళ్ళి శర్మిష్ట ప్రసక్తి వచ్చింది. నేను కుతుహలం చంపుకోలేక మళ్ళి శర్మిష్టకు సంబంధించిన పుస్తకాలు డైరీలు తెప్పించుకుని చదివాను. శర్మిష్ట చెల్లెలు విమల డైరీ చదువుతుంటే విమల డైరీలో రాసుకున్న ఒక విషయం నన్ను ఆకర్షించింది.”

“ఇంతకుముందు చాల సంవత్సరాలకు ముందు నేను యువ పోలీస్ అఫీసర్ గా ఉన్నప్పుడు ఆ డైరీ చాల సార్లు చదివాను. కాని అందులో ముఖ్యమైన సమాచారం నాకు ఏది కనిపించలేదు అప్పుడు. కాని ఒక కమీషనర్ గా చదువుతున్నప్పుడు విమల రాసుకున్న విషయంలో అసలు అర్ధం తెలిసింది. విమల డైరీలో ఇలా రాసుకుంది.

“అక్కకు దొంగపోలీస్ ఆట అంటే చాలఇష్టం. ప్రతి సారి ఆ ఆటలో అక్కే గెలుస్తుంది. ఎక్కడ దాక్కుంటుందో కాని మాకు కనిపించేది కాదు. ఈ రహస్యం చెప్పమని అక్కని చాల సార్లు అడిగాను. కాని తను చెప్పలేదు”అనిఉంది.

“అది చదివినతరువాత నాకు అసలు విషయం తెలిసింది. నేను చేసిన తప్పు ఏమిటో అర్ధమైంది”అన్నాడు సహదేవ్. “విమల రాసుకున్న విషయంలో ముఖ్యమైన విషయం ఏముంది. నాకు మాత్రం ఏం తెలీటం లేదు”అన్నాను విస్సుగా.

“ముందు నాకు తెలియలేదు. అనుభవం వల్ల ఆ మాటల్లో అర్ధం అప్పుడు నాకు అర్ధమైంది. వెంటనే రుద్రప్రతాప్ ను తీసుకుని వర్మ మాన్షన్ కు వెళ్ళాను. గంటసేపు వెతికిన తరువాత ఒక గదిలో నేలమాళిగకు దారి కనపించింది. కాని తలుపుకు తాళంలేదు. కిందికి దిగటానికి మెట్లు కనిపించాయి. ఇద్దరం కిందికి వెళ్ళాం. లోపల చాల చెత్తపనికి రాని సామానులు ఉన్నాయి. వాటిలో ఒక పాతకాలంనాటి సేఫ్ కూడా ఉంది. అది విదేశాలలో తయారయిన సేఫ్. పూర్తిగా ఆటోమెటిక్ లాకింగ్ సిస్టమ్ ఉన్న సేఫ్. “

“ఎంత ప్రయత్నించిన మేము సేఫ్ తెరవలేకపోయాం. చివరకు ఒక తాళం బాగు చేసేవాడిని పిలిపించి సేఫ్ తెరిపించాం. లోపల మాకు శర్మిష్ట కనిపించింది మాములుగాకాదు మమ్మీ రూపంలో”అంటు ఆగాడు సహదేవ్.

“ఆమె చనిపోయి చాల సంవత్సరాలు అయింది కదా. ఆమె శవం కుళ్ళిపోయి ఎముకలు మాత్రం మిగలాలి కదా మమ్మీగా ఎలా మారింది”ఆశ్చర్యంగా అడిగాను.

“ఆ రోజు కూడా శర్మిష్ట తన అలవాటు మానలేదు. ఎవరికి కనిపించకుండ వెళ్ళి నేలమాళిగలోని ఆ సేఫ్ లో దాక్కుంది. కొంచంసేపు పెద్దవాళ్ళను కంగారుపెట్టాలని ఆమె ఉద్దేశం. ప్రతిసారి మాములుగా ఆమె ఆ సేఫ్ లో కొంచంసేపు దాక్కునేది. కొంచంసేపయిన తరువాత ఏం తెలీనట్టు మాములుగా బయటకు వచ్చేది. ఆ రోజు కూడా అలాగే వెళ్ళి దాక్కుంది. ఏం జరిగిందో ఏమో కాని అనుకోకుండ సేఫ్ పై తలుపులు మూసుకున్నాయి. దాంతో అది లాక్ అయిపోయింది. మాములుగా తెరిస్తే రాదు. తాళం చెవులతోకాని తలుపులు తెరవలేరు. లోపలున్న శర్మిష్ట తలుపులు తెరవటానికి విశ్వప్రయత్నం చేసింది. చేతులతో తలుపు మీద గట్టిగా బాదింది. గొంతుచించుకుని అరిచింది. కాని ఆమె అరుపులు ఎవరికి వినిపించలేదు. అందరు నిశ్చితార్ధం హడావిడిలో ఉన్నారు. గదిలో వాతావరణం పొడిగా ఉంది. ఆక్సిజన్ కూడా చాలతక్కువగా ఉంది.”

“ప్రాణవాయువు ఉన్నంతవరకు శర్మిష్ పోరాడింది. అది తగ్గిపోయేసరికి ఉపిరి అందక చనిపోయింది. అందుకే సహజంగా మమ్మీగా మారిపోయింది. జరిగింది ఊహించిన రుద్రప్రతాప్ తట్టుకోలేకపోయాడు. చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ శర్మిష్ట మమ్మీ మీద పడిపోయాడు. కొంచం సేపయిన తరువాత శర్మిష్టతో సహ సేఫ్ ను వర్మ మాన్షన్ కాంపౌండ్ లో పెట్టాం. జరిగింది తెలుసుకన్న భైరవలంక జనం తండోప తండాలుగా వచ్చారు. అందరి మొహంలో విషాదం తాండవిస్తోంది. తేరుకున్న రుద్రప్రతాప్ ప్రజలను ఉద్దేశించి అన్నాడు. “ఇంతకాలం నా శర్మిష్ట గురించి నానామాటలు అన్నారు. కొంతమంది ఆమె లేచిపోయిందని అన్నారు. మరికొంతమంది ఆమె ఆత్మహత్యచేసుకుందని అన్నారు. ఇంకాకొంతమంది హత్య చెయ్యబడిందని అన్నారు. కాని నేను మాత్రం ఆ మాటలు నమ్మలేదు. నా శర్మిష్ట అలాంటిది కాదని నాకు తెలుసు. కాని దాన్ని నిరూపించే ఆధారాలు అప్పుడు నా దగ్గర లేవు. ఇప్పుడు ఉంది. ఇదిగో నా శర్మిష్ట. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరు ఆమెను హత్యచెయ్యలేదు. తన అజాగ్రత్తవల చనిపోయింది. ఏది ఏమైన నా శర్మిష్ట ఉత్తమురాలు ఉత్తమురాలు ఉత్తమురాలు అని మూడుసార్లు అని అకస్మాతుగా నేలమీద పడిపోయాడు. క్షణంలో అతని ప్రాణంపోయింది. నాకు నోట్లోంచి మాటరాలేదు. నేను ఎంతో మంది ప్రేమికులను చూశాను. పుస్తకాలలో చదివాను. కాని రుద్రప్రతాప్ లాంటి ప్రేమికుడిని నేను ఇంతవరకు చూడలేదు. ఇకచూడబోనుకూడా. ఈ నాటి ప్రేమికులకు అతను ఆదర్శప్రాయుడు. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు.ఒక రకంగా అతని చావుకు నేనే కారకుడిని”

“ఇందులో మీ తప్పు ఏం ఉంది. తన ప్రేయసిని చూసి అతను తట్టుకోలేకపోయాడు. ఆ వత్తిడికి అతడి గుండె అగిపోయింది”అన్నాను. “కేవలం నా ఈగోను తృప్తిపరచుకోవటానికి మళ్ళి ఆ కేసు ఓపన్ చేశాను. రుద్రప్రతాప్ పరిస్ధితి గురించి ఆలోచించలేకపోయాను. నేనే ఆ కేసును మళ్ళి తెరవకుండ ఉంటే రుద్రప్రతాప్ ఇంకా కొంతకాలం బతికేవాడు. తన ప్రేయసిన తలుచుకుంటు మరో పదిసంవత్సరాలవరకు జీవించేవాడు. ఇలా అర్ధాంతరంగా చనిపోయేవాడు కాడు. అతని చావుకు పరోక్షంగా కారకుడిని నేనే. చాల పెద్ద తప్పు చేశాను. దేవుడు నన్నుక్షమించిన నా అంతరాత్మ నన్ను ఎప్పటికి క్షమించదు. నేను బతికిఉన్నంతవరకు అ తప్పు నన్ను రావణ కాష్టంలా దహిస్తునే ఉంటుంది”అన్నాడు సహదేవ్ కన్నీళ్ళతో.

మరిన్ని కథలు

Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి
Nee nagumomu naa kanulara
నీ నగు మోము నా కనులారా....
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్
Kapati
కపటి
- Viswanath coushik
Evaraa amaayakudu
ఎవరా అమాయకుడు ?
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు