స్వర్ణముఖి దంపతులు ఇంటికి దగ్గరలోని వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళారు. దర్శనానాంతరం తిరిగి వెళుతుండగా వారికి గుడి ఆవరణలో ఎనిమిది సంవత్సరాల ఒక అమ్మాయి కనిపించింది. ఆమె వారి దగ్గరకు వచ్చి "అమ్మా! ఏదైనా పనివుంటే ఇప్పించండమ్మా, మీ ఇంట్లో పని చేసుకొని బతుకుతాను." అని వారిని ఎంతో దీనంగా బ్రతిమలాడింది.
ఆ అమ్మాయిని చూసి జాలిపడి వారితోపాటే ఇంటికి తెచ్చుకొని పెంచసాగారు.
స్వర్ణముఖి సాంప్రదాయ నృత్యకళాకారిణి. ఇంటివద్దే తరగతులు నిర్వహిస్తూ శిక్ష ణ నిస్తూ వుంటుంది. అనేకమంది ఆమె వద్ద శిక్షణ పొంది, అనేక ప్రదర్శనలిస్తూ వుంటారు.
స్వర్ణముఖి ఏకైక కూతురు నర్మద. నర్మద కి కూడా ప్రత్యేక శిక్షణ నిచ్చి ప్రముఖ నర్తకిని చేయాలని ఆమె ఆశ.
ఇంటికి తీసుకువచ్చిన ఆ చిన్నారికి గోదారి అని నామకరణం చేసింది. స్వర్ణముఖి కి గోదారి వచ్చిన దగ్గరనుంచి కొంచెం కాదు బాగానే పని తగ్గిందని చెప్పొచ్చు. ఇంట్లో నమ్రత గా వుంటూ, చిన్నపిల్లయినా ఇంటి పనినంతటిని చక్కగా చేసిపెట్టేది గోదారి.
స్వర్ణముఖి శిష్యులకు నృత్య పాఠాలు చెప్పడం దూరం నించే గమనించేది గోదారి. తనకి తెలియకుండానే పనులు చేసుకుంటూ అవలీలగా నర్తించగలిగేది గోదారి. ఏకలవ్య దీక్ష తోటే, ఇంచుమించుగా చాలావరకు గ్రహించింది. ఒకరోజు యాధృచ్చికంగా నర్తిస్తున్న గోదారి, స్వర్ణముఖి కంట పడింది.
"నీకు నాట్యం వచ్చా?" అని అడిగింది స్వర్ణముఖి.
" లేదమ్మా, ఏదో ఊసుపోక పనిలో సాయంగా అలా గెంతుతూ వుంటాను తప్ప నాకేమీ తెలియదమ్మా ." అని చెప్పింది.
"లేదు, నీకు తెలియకుండానే నీలో మంచి మెళుకువ వుంది. రేపటి నుండి నర్మద తో పాటు కలిసి నేర్చుకో." అని చెప్పి ప్రోత్సహించింది స్వర్ణముఖి.
అలా నర్మద, గోదారి ఇద్దరూ నాట్యం అభ్యసించడం మొదలెట్టారు. అనతికాలం లోనే ఇద్దరూ మంచి నర్తకిలుగా పేరు సంపాదించారు. ఇద్దరూ అనేక చోట్ల జంట ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు.
ఒకనాడు కళాతరంగిణి సంస్థవారు జాతీయస్థాయి పోటీలను నిర్వహించదలచి ఎంట్ర్రీలను కోరగా అనేకమంది దరఖాస్తు చేయడం జరిగింది. ఆ పోటీలకి నర్మద, గోదారి కూడా దరఖాస్తు చేయడం, సెలక్ట్ కావడం కూడా జరిగింది. కళాతరంగిణి జాతీయ అవార్డ్ ఇంచుమించు నాట్యరంగం లో అతి పెద్ద గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఫైనల్ విన్నర్ కి విదేశాల్లో నాట్యప్రదర్శన అవకాశాలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి అవకాశాన్ని ఎలాగైనా వదులుకోకూడదని స్వర్ణముఖి నిశ్చయించుకొని ఎలాగైనా నర్మద కి ఈ అవార్డ్ వచ్చేలా అనేక లాబీయింగ్ లు చేయించింది.
అయినా ఎక్కడ గోదారి ఈ అవార్డ్ ఎగరేసుకుపోతుందో అన్న సంశయం వచ్చిపడింది స్వర్ణముఖికి. ఈ రోజు వరకు ఏనాడూ తేడా లేకుండా విద్యను నేర్పినా, పనిపిల్ల గా ఇంట్లోకి తీసుకువచ్చినా పరాయి మనిషిగా చూడలేదు. కానీ తను పెంచిన మొక్కనీడ,తన మొక్కనే ఎదగనివ్వదేమోనన్న దుగ్ధ ఆవహించింది. అభిమానం స్థానాన్ని స్వార్ధం ఆక్రమించింది.
కానీ ఇప్పుడు గోదారి అడ్డుతొలగించుకోవడమెలాగో ఆమెకు అర్థం కాలేదు. ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతలున్న నాట్యవేత్త కూతురు కాకుండా, ఒక పనిపిల్ల ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా ఈ పోటీలకు వెళ్ళకుండా గోదారిని ఆపాలనుకుంది.
ఒక పక్క పోటీలకోసం ఇద్దరూ హోరాహోరీగా అభ్యాసం చేయసాగారు.
ఒక రోజు మెట్లమీదనించి దిగుతుండగా చూడకుండా నూనెపోసింది స్వర్ణముఖి. కానీ చిన్న తుంటినొప్పితో బయటపడింది గోదారి. స్వర్ణముఖి మొదటి ప్రయత్నం బెడిసికొట్టింది.
పోటీలు జరిగే రోజు రానే వచ్చింది.
ఆడిటోరియంకి గోదారిని వేరే డ్రయివర్ తో వేరే కారులో పంపించింది. ఆ కారులో బ్రేకులు తీసివేసింది. చివరి ప్రయత్నం ఈ సారి గురి తప్పదనుకుంది. కానీ విచిత్రం ఆ ప్రమాదం లో కూడా సురక్షితం గా బయటపడింది గోదారి.
ఆడిటోరియం లో హోరాహొరీగా పోటీలు సాగుతున్నాయి. నర్మద ప్రదర్శన పూర్తయింది. గోదారి కోసం ఎనౌ న్స్ చేసారు. ఆడిటోరియం అంతా ఒకటే చప్పట్లు, అభిమానుల కోలాహలం తో ఎంతో సందడిగా వుంది. కానీ విచిత్రం గోదారి రాలేదు. గోదారి ప్రదర్శన ఇవ్వలేదు. సమయం దాటిపోయింది.
నర్మద విజేత గా నిలిచింది. ఎంతో పేరు, హోదా, కీర్తి లభించాయి స్వర్ణముఖి కి గురువుగా.
కానీ గోదారి ఏమైంది, గోదారికి ఏమైంది?.
గోదారికారు యాక్సిడెంట్ అయినచోట ఒక ఉత్తరం దొరికింది స్వర్ణముఖి కి. దానిలో...
"అమ్మా, గుడిమెట్ల మీద బతకవలసిన నన్ను దేవాలయం లో దేవతగా తీర్చిదిద్దారు మీరు. గోదారిగా నామకరణం చేసి తల్లిదండ్రులెవరో తెలియని నాకు, తల్లిదండ్రులకన్నా ఎక్కువయ్యారు. ఊసుపోక గంతులేసే నాకు, గజ్జెకట్టి నాట్యగత్తెనయ్యే స్థాయి, హోదా కల్పించారు.
ఈ జీవితానికి ఇంతకన్నా ఎక్కువకోరుకుంటే దేవుడైనా నీది అత్యాశే కదా అనడా? మెట్ల మీదనించి జారిపడ్డప్పుడే నేను గమనించాను. కానీ జన్మనిచ్చిన తల్లికన్నా నాకు మీరెక్కువ... ఏ తల్లయినా పిల్లను కష్టపెట్టాలనుకోదు కదా! మా అమ్మకాని అమ్మ అంతకన్నా గొప్పది. అలా ఎందుకు చేస్తుంది. అని నా మనసు కొట్టి పారేసింది. కారులో మీరు మెకానిక్ కి చెప్పి బ్రేకులు తీయిస్తుండగా నేను చూసాను. తల్లి కోరుకుంటే తల్లికోసం ప్రాణాలు ఇవ్వగలిగితే నా జీవితానికి ఇంతకు మించిన ఆనందం ఇంకేముందనుకున్నాను.
విచిత్రం కారును జాగ్రత్తగా చెట్టుకు గుద్ది గండం నుంచి బయటపడేసాడు డ్రైవర్. అంతా విధి అనుకున్నాను.
మనిషి ఒకటి తలిస్తే దైవం మరోలా చేస్తున్నాడని గ్రహించాను. తీరా నేను గజ్జెకట్టి ఆడితే, నేను బాగా చేయకపోయినా అక్కడ కూడా అదృష్టం వరించి నేను విజేత నయితే, ఇక ఈ జీవితం లో నేను అమ్మకాని అమ్మ ఋణం తీర్చుకోలేనేమోనని ప్రదర్శన ఇవ్వడం మానేసాను."
ఇలా చదువుకుంటూ పోతున్న స్వర్ణముఖి కి నోట మాట రాలేదు.
కళ్ళ నించి జలజలా రాలుతున్న నీరు తప్ప... మనసులో అనుకుంది స్వర్ణముఖి, "నువ్వు వట్టి గోదారివి కాదు జలజల పారే నిండు గోదారి కన్నా గొప్పదానివని..."