అసలుకు కొసరు - మౌద్గల్య

asaluku kosaru telugu story

‘నీ బుద్ది పోనిచ్చుకున్నావు కాదు. ఇక్కడ కూడానా?’’ విసుకున్నాడు పెరుమాళ్లు.

మందాకిని ఓ నవ్వు నవ్వింది.

‘‘ఇక్కడ నీ చేతివాటం ఏం కొంప ముంచిద్దోనని నేను భయపడిఛస్తుంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదే?’’ అన్నాడు విసుగ్గా.

‘‘ఊరుకుందురూ’’ అంది మందాకిని సిగ్గుపడుతూ.

మందాకిని తీరే అంత.

కిరాణా కొట్టుకెళితే ప్రతి వస్తువు గీచి గీచి బేరమాడుతుంది. కందిపప్పు, వేరుసెనగనపప్పు లాంటి వాటిని షాపు వాడు తూచేలోపు ఓ గుప్పెడు పప్పు తీసుకుని గుటుక్కున నోట్లో వేసుకుంటుంది. అవతలవాడు ఏమన్నా పెద్దగా పట్టించుకోదు. నెలవారీ సరుకులు కొనేదాన్ని ఆ మాత్రం స్వతంత్రంగా ఉంటే తప్పేం ఉంది? అని ఎదురుప్రశ్నలు వేస్తుంది. లౌక్యంతో అవతల వాడి నోటికి తాళం వేసి తన పని కానిచ్చుకుంటుంది . కూరగాయల దుకాణానికి వెళితే, షాపు వాడి కన్ను కప్పి ఒకటో రెండో కాయలు బుట్టలో వేసుకునిగానీ ఇంటికి తిరిగి రాదు. ఏ స్వీటు షాపుకో వెళ్లినప్పుడు నాలుగయిదు రకాలు తుంపుకుని వాటి రుచిని ఆస్వాదిస్తుంది . లైబ్రరీకో, రీడింగు రూంకో వెళితే మూడో కంటికి తెలియకుండా పుస్తకాలు మాయం చేసి వెంట తెచ్చుకుంటుంది.

‘‘ఈ అలవాటు మానుకోవే బాబూ’’ చాలాసార్లు నచ్చచెప్పి చూశాడు పెరుమాళ్లు.

ఆమె వినలేదు సరికదా..

‘‘మీకు వ్యాపారుల సంగతి తెలీదు. అసలు ధరకు బోలెడు లాభం వేసుకుని అమ్ముతారు. తూకంలోనూ మోసం ఉంటుంది. ఇలా చేస్తే గానీ మనకు గిట్టు బాటు కాదు. ’’చేస్తున్న తప్పును సమర్థించుకుంటుంది. ఆమెకు చెప్పీ చెప్పీ విసిగిపోయాడు.

ఆరోజు తమ మూడేళ్ల కుమారుడిని స్కూలులో చేర్చటానికి బయలుదేరారు. అది నగరంలో బాగా పేరున్న టెక్నోస్కూలు. ఫీజులు భారీగా వసూలు చేస్తారని అంటారు. ఇక్కడ చదివితే బాగా రాణిస్తారన్న ప్రచారం ఉండటంతో పెరుమాళ్లు ఫీజు సంగతి అంతగా పట్టించుకోలేదు. భార్యను వెంటబెట్టుకుని అక్కడకు వచ్చాడు.

ఆమె దృష్టి లో పెరుమాళ్ళు నోరులేని సాధుజంతువు. ఇలాంటి వాళ్లని అవతల వాళ్లు తేలిగ్గా బుట్టలో వేసుకుంటారు. మాయమాటలు చెప్పి తమకు అనుకూలంగా మలుచుకుంటారు.

అందుకే ముందుగా హెచ్చరించింది అతన్ని.

‘‘అన్నీ నేనే మాట్లాడతా... మీరు చూస్తూండండి. మధ్య మధ్యలో మాట్లాడి వ్యవహారం చెడగొట్టకండి’’ .

అందుకే మందాకిని ఏకథాటిగా డైరక్టర్ తో అరగంట మాట్లాడినా పెరుమాళ్లు కల్పించుకోలేదు. నోరుమెదపలేదు. డైరక్టర్ చెప్పుకుపోతున్నాడు.

‘‘ఈ ఏడు ఐఐటి, ఎమ్ సెట్, బిట్స్ లో ర్యాంకులన్నీ మా కాలేజీ వాళ్లకే వచ్చాయంటే, ఇక్కడ కోచింగ్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ప్రతి విద్యార్థి పైన ప్రత్యేకంగా దృష్టి పెడతాం. వెనకబడ్డ వాళ్లని ఓ గ్రూపుగా చేసి, గైడెన్స్ ఇస్తాం. ’’

మందాకిని ఇంకేదో చెప్పబోయింది. డైరక్టర్ వినిపించుకోలేదు. తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు.

‘‘మొన్నా మధ్య నాసాకి ఎంపికయిన పిల్లలో సగం మంది ఇక్కడి వాళ్లే. వారానికి మూడు రోజులు క్లాసులయిన తరువాత శిక్షణ ఇస్తాం. దీనికి బయట కాలేజీల నుంచి నిపుణుల్ని రప్పించాలి. ఇదంతా ఒక ఎత్తు. ఆరోగ్యం సూత్రాలు ఒక ఎత్తు. శారీరక, మానసిక వికాసానికి స్పోర్ట్స్, గేమ్స్ కూడా చూస్తాం. మిగతా స్కూళ్లలో పిల్లల్ని బట్టీ యంత్రాలుగా మారుస్తారు. మేం మాత్రమే సృజనాత్మకత కల వారిగా తీర్చిదిద్దుతాం. యోగా, మెడిటేషన్ వంటివి మా సిలబస్ లో జోడించాం. మానవతా విలువల బోధన మా చదువులో ఓ భాగం. మీరొక్కసారి పిల్లవాడిని మాదగ్గర చేర్చి ఆతర్వాత వాడి గురించి మరిచిపోవచ్చు. హాస్టల్లో చేర్చండి . చదువు, తిండీ తిప్పలు అన్నీ మేమే చూసుకుంటాం...’’

ఒక్కో దానికి విడివిడిగా ఎంతవుతుందో చెప్పి, అందులో నుంచి ఓ పదివేలు తగ్గించి చెల్లించమని చెప్పాడు. ప్రిన్సిపాల్ని కలసి దరఖాస్తు పూర్తిచేసివెళ్లమని , అడ్వాన్సుగా ఓ పదివేలు చెల్లించి వెళ్లమని చెప్పాడు.

ఎప్పటిమాదిరిగానే మందాకిని బాగా బేరం ఆడింది. ఆరో తరగతిలో చేరితే ఇంటర్ వరకూ అక్కడే చదివిస్తాం. మా వాడు తెలివైన వాడు. స్కూలుకు మంచి పేరు తెస్తాడు...

ఇలాంటి మాటలేవో చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ మాటా ఈ మాటా చెప్పి చివరికి పాతిక వేల దాకా తగ్గేలా బేరం ఆడగలిగింది.

అక్కడి నుంచి వస్తూ ...

‘‘నిజంగా మంచిమాటకారి. ఆమె వల్ల ఫీజులో రాయితీ సాధ్యమయింది.’’ మనసులో మెచ్చుకుంటూనే... తెరవెనక ఏం చేసిందోనని ఆందోళన చెందుతున్నాడు.

అతను భయపడినట్టుగానే స్కూలు గేటు దగ్గర సెక్యూరిటీ వాడు ఆపాడు.

భయంతో పై ప్రాణాలు పైనే పోయాయి అతనికి.

‘‘ఇప్పుడు వాళ్లేం అంటారో... నలుగురి ముందు పరువుపోతుంది. సిగ్గుచేటు’’ అనుకున్నాడు.

‘‘మేడమ్... పొరపాటున ఆఫీసులో పెన్ను పట్టుకొచ్చారట’’ లోపల నుంచి వచ్చిన బాయ్ చెప్పాడు.

ఎడమ చేతి గుప్పెడలో ఉన్న పెన్ను తీసి అతని చేతి కిచ్చింది.

అది ఖరీదయిన పార్కర్ పెన్ను.

‘‘పొరపాటున తెచ్చావు అనుకున్నారు కాబట్టి సరిపోయింది’’ లేకపోతే ఈ పాటికి మనల్ని...’’ మందలించే ప్రయత్నం చేశాడు.

మందాకిని అదేం పట్టించుకోలేదు.

అప్పటికి స్కూలు గేటు దాటి రోడ్డు మీదకు వచ్చారు.

కొంటెగా నవ్వుతూ భుజాన వేలాడుతున్న హేండ్ బాగ్ నుంచి ఐపాడ్ తీసి అతని చేతిలో ఉంచింది మందాకిని.

కొన్ని నిముషాల క్రితం ఆ ఐపాడ్ ను ప్రిన్సిపాల్ గదిలో చూశాడు.

"ఖర్మ. కొసరు లేకుండా ఏ పనీ చేయవు కదా..." తలకొట్టుకున్నాడు పెరుమాళ్లు.

అదే సమయానికి బాయ్ మందాకిని తిరిగిచ్చిన పెన్నును డైరక్టర్ చేతిలో ఉంచి అడిగాడు.

‘‘అదేంటి సార్... అంత ఖరీదయిన ఐపాడ్ పట్టుకుపోతే పట్టించుకోకుండా... మామూలు పెన్ను తెమ్మని అడిగారు.’’

ఆ మాటలకు డైరక్టర్ చిరునవ్వు నవ్వాడు.

‘‘మన స్కూలులో అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలున్న విషయం వాళ్లకి తెలీదు. మనల్ని బోల్తా కొట్టించామని సంబరపడుతున్నారు. ఆ ఐపాడ్ పాతది. ఈ మధ్యనే పాడయింది. మిగిలిన ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇన్సూరెన్స్ కి అప్లై చేశా. రేపోమాపో డబ్బులు వస్తాయి. కొత్తవి తెచ్చుకుంటాం’’ అన్నాడు.

బాయ్ అయోమయంగా చూశాడు.

‘‘వాళ్లని అంత తేలిగ్గా వదలలేదు. బిల్డింగ్ ఫండ్, టూర్ ఫండ్, సైన్స్ క్లబ్... ఇలా రకరకాల పేర్లతో చాలా ఫీజు గుంజేశాం. అసలుకు కొసరు అన్నమాట’’ అన్నాడు.

గదిలో నుంచి బయటకు వెళుతూ ఓసారి వెనక్కి తిరిగి చెప్పాడు...

‘‘వాళ్లకే అంత తెలివితేటలుంటే... వ్యాపారం చేసేవాళ్లం మనకెంత ఉండాలి?’’

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి