అవకాశవాదం - కె. విజయ ప్రసాద్

avakaashavaadam telugu story

చంద్రశేఖర్ నివ్వెర పోయాడు

ఒక రకంగా షాక్ తిన్నాడు.

ఎందుకంటే అతను చాలా సున్నిత మనస్కుడు. కవి. ఆవేశంగా రాస్తూ ఉంటాడు. పేదల పక్షపాతి. ధనవంతులంతా దోపిడీదారులని - నిరుపేదలంతా పీడితులని అతని అభిప్రాయం. అతని కవితల్లో కూడా అలాంటి భావాలే వినిపిస్తుంటాడు.

ఎదురుగా వున్న బక్కపల్చటి ప్రాణిని తేరిపాక చూశాడు. మందు మీదున్నట్లున్నాడు - తూలుతున్నాడు.

శ్మశానం బయట అరుగుమీద కూర్చుని వున్నాడు. బీడీ తాగుతున్నాడు. చాలా నిర్లక్ష్యంగా బ్రతుకన్నా - భవిష్యత్తన్నా భయం లేనట్లు ఠీవీగా మొహం పెట్టాడు.

"చూడు అన్నా! వాళ్ళు వాళ్ళమ్మ చచ్చి ఏడుస్తున్నారు. నువ్వు ఆ శవాన్ని పాతిపెట్టడానికి - చిన్న గూడు దానిపైన కట్టడానికి ఎంత అడుగుతున్నావో తెల్సా?" చంద్రశేఖర్ నచ్చ చెప్పబోయాడు.

"నేనేం లక్ష అడిగానా - పాతికవేలు - పాతికమంది - గిట్టుబాటు కాదు." తలబిరుసుగా చెప్పాడు.

"ఇందులో గిట్టుబాటేంటి? ఇదేవన్నా వ్యాపారమా? చచ్చిన శవానికి అంత్యక్రియలు చేస్తున్నాం -" కోపంగా చెప్పాడు.

"చచ్చిన శవం కాబట్టే! బతికి వున్న వాడ్ని పాతికవేలకు ఎవరు పాతి బెడతారు! లక్ష యిచ్చినా చెయ్యరు -" హరిశ్చంద్రుడిలా చెప్పాడు.

"ఇందులో యింత కష్టపడాల్సింది ఏమీ లేదు - ఆరడుగుల గుంత - ఆపైన మట్టి - ఆపైన ఓ నూరు ఇటికలు - మహా అయితే ఓ బస్తా సిమెంటు - అంతే గదా!" నిస్సహాయంగా అన్నాడు.

"కష్టం మాది - చూసే మీకేం తెలుస్తుంది?"

"మీది కాబట్టే ఓ పదివేలు తీసుకో!"

"ఇదేమన్నా కూరగాయల బేరమా? పాతికకు ఒక్క వంద తగ్గినా శవాన్ని పూడ్చనివ్వం - ఇది ఫిక్సిడ్ రేటు.
నువ్వేదో ఇవ్వాళ వచ్చి కొత్తగా చెబుతున్నావు!" చులకనగా చూశాడు.

"మాకేం అనుభవం? రోజూ చావరుగా - నీకంటే అలవాటు -"

"సరే నాటైం వేస్టు చెయ్యకు - ముందు ఓ పదైదు యివ్వు పని పూర్తయింతర్వాత మిగితాది - పోయి శవాన్ని పట్టుకురా!" చికాగ్గా అన్నాడు.

చంద్రశేఖర్ యింకొంచెం నచ్చ చెప్పాడు.

"చూడు బాబు! వాళ్ళు కూడ నీ లెక్క పేదలే! వాళ్ళేమీ ధనవంతులు కారు. ఉన్నదంతా ఆ హాస్పటల్ సిబ్బంది నొక్కేశారు. వైద్యానికి వేలకు వేలు గుంజారు - శవాన్ని అప్ప చెప్పడానికి కూడ వేలు తీసుకున్నారు - వాళ్ళ దగ్గరున్నదంతా అయిపొయింది."

"అయితే నేనేం చెయ్యను - రోడ్డు మీద పారేస్తే - మున్సిపాలిటీ వాడు ఎత్తి పారేస్తాడు కదా!" విసురుగా అన్నాడు అతను.

ఈడ్చి తందామన్నంత కోపం వచ్చింది.

తమాయించుకున్నాడు - అవసరం తమది. ఇప్పటికిప్పుడు పోయి ఎన్ని శ్మశానాలు ఎంక్వయిరీ చేయగలడు? ఇది వాళ్ళింటికి దగ్గర -

పదివేలు వాడి మొహాన కొట్టి ఏర్పాట్లు చెయ్యమని వచ్చేశాడు చంద్రశేఖర్.

రత్నమ్మ శవం చుట్టూ చేరి బంధువులు - పిల్లలు - పెద్దలు ఏడుస్తున్నారు - ఆమెకు డబ్బై సంవత్సరాలు. గుండ్రాయిలాగా మొన్న మొన్నటి దాకా బాగుండేది. నోట్లోంచి నెత్తురు పడితే హాస్పిటల్లో చేర్పిస్తే ఆ టెస్టు ఈ టెస్టు అని చెప్పి వేలకు వేలు వసూలు చేశారు. ఆపైన మందులకని - ఆపరేషన్ అని యింకొన్ని వేలు కొట్టేశారు. చివరికి ఆపరేషన్ అయిన రెండు రోజులకే ఆమె కన్ను మూసింది. ఆమెను అలా హింసించక పోయినా యింకా కొన్ని నెలలు బ్రతికుండేది అని అనిపించింది చివరికి. కాని నింద లేంది బొంది పోదుగా!

చంద్రశేఖర్ తనే ఏటియం లోంచి కొంత డబ్బును విత్ డ్రా చేసి వాళ్ళకిచ్చాడు, కార్యక్రమానికి దాచుకున్న డబ్బంతా వైద్యానికే సరిపోయింది మరి - వాళ్లకు.

ఎలాగో శవాన్ని పాతి పెట్టి యిల్లు చేరుకున్నారు.

చంద్రశేఖర్ రత్నమ్మకు దూరపు చుట్టం అవుతాడు. ఆమె కొడుకు సింహం ఇతనికి మంచి స్నేహితుడు. కాని సింహానికి మంచి ఉద్యోగం లేదు. చిరుద్యోగంతో లాక్కొస్తున్నాడు బండి. రత్నమ్మ టీచరుగా రిటైరయింది. పెన్షన్ డబ్బులొచ్చేవి పిల్లల పెళ్ళిళ్ళు చేసి అప్పుల్లేకుండా సంసారం నడిపిస్తుండేది.

దండిగా భోజనాలు చేయించాల్సి వచ్చింది బంధుమిత్రులకు - దానికీ ఖర్చే!

మొత్తానికి పెద్ద కర్మ పూర్తయ్యేసరికి సింహానికి చుక్కలు కనిపించాయి. అప్పులు పాపాల్లాగా పెరిగిపోయాయి. అడుగడుగునా దోపిడీ!

ఎవడూ కూడా సందర్భం చూసి అయ్యో పాపం అన్నవాడు లేడు - అందినకాడికి దోచుకుందామన్న వాళ్ళే!

పేదవాళ్ళని పేదవాళ్ళు కూడా దోచుకుంటున్నారు - అంతకు ముందు ధనికులే అనుకునేవాడు చంద్రశేఖర్.

"చందూ! ఉన్నయిల్లు అమ్మేద్దామనుకుంటున్నాడు -" ఓ రెండు నెలల తర్వాత సింహం చెప్పాడు.

"ఈ కాలం ఇల్లు అమ్మితే మళ్ళీ కట్టుకోగలవా? టౌనులో యింత సెంటరులో ఎక్కడ దొరుకుతుంది? ఊరికి నాలుగు కిలోమీటర్లు దూరం పోయినా ఫ్లాటు కొనుక్కుందామన్నా మనకు అందుబాటు ధరలో లేదు." చంద్రశేఖర్ చెప్పాడు.

"ఏం చెయ్యను. వడ్డీలు కట్టలేక చస్తున్నా! పెన్షన్ ఆగిపోయింది - వడ్డీ కట్టాలి - నాది చిరుద్యోగం? ఎలా?" సింహం బాధ సింహంది.

"స్వంతిల్లుంది కాబట్టి తల దాచుకుంటున్నాను - అదే బాడుగకు తీసుకోవాలంటే మూడు వేలకు తక్కువ కాదు -" చంద్రశేఖర్.

"నిజం - అందుకే చిన్న గ్రామంలో తీసుకుని - రోజూ వస్తూ పోతూంటే బాగుంటుందేమోనని" సింహం చెప్పాడు.

"దానంత పిచ్చిపని యింకోటి లేదు. గ్రామాల్లో ఉన్నవాళ్ళంతా పట్టణాల్లోకి వస్తున్నారు పనీ పాటలు దొరక్క. ప్రయాణ ఖర్చులు తడిసి మోపుడవుతాయి, ఆపైన శ్రమ - టైం వేస్టు. ఆ ఆలోచన విరమించుకో!" అని కోప్పడి పంపించి వేశాడు.

చంద్రశేఖర్ బైకులో పోతూంటే సడెన్ గా తూలుకుంటూ ఒకడొచ్చి బండి కింద పడ్డాడు. దెబ్బలు బాగా తగిలాయి. రక్తం బాగా కారి పోతున్నది. స్టాండు వేసి వాడిని పైకి లేవదీశాడు.

హరిశ్చంద్రుడు! అప్పటికే చుట్టూ చేరి జనం నానా గోల చేస్తున్నారు. ఎవరో ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చారు.

చంద్రశేఖర్ కూడ అతని వెంబడున్నాడు.

"ట్రీటుమెంటు చెయ్యాలంటే ముందు పాతికవేలు కట్టాలి - ఎవరు కడతారు?" నర్సు వచ్చి అడిగింది.

అప్పటికి హరిశ్చంద్రుడి భార్య ఏడ్చుకుంటూ వచ్చింది.

"అమ్మా! మేము పేదోళ్ళం - మా దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది - కాటికాపరి మా ఆయన - కనికరించమ్మా!"

హరిశ్చంద్రుడి భార్య లబలబ కొట్టుకుంది.

"దానికి మేమేం చెయ్యం? మీలాంటి వాళ్ళు రోజుకు ఒకళ్ళు తగిలితే మా హాస్పిటల్ మూసుకుపోవాలి!"

చివరికి ఆమె చేతి గాజులు తాకట్టుపెట్టి తెచ్చింది.

డాక్టర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

"పచ్చి తాగుబోతు - యితని అలవాట్లు బాగోలేవు - మా చేతుల్లో ఏముంది? పదివేలు కట్టి శవాన్ని తీసుకుపోండి!" డాక్టరు చెప్పాడు నిర్వికారంగా.

హరిశ్చంద్రుడి భార్య గోల చేయడం చంద్రశేఖర్ కు వినపడ్డం లేదు. చివరికి ఎంతటి వాడైనా మనిషి ధనం చేతిలో బానిసయి పోయాడని బాధపడ్డాడు. దానికి రాజు - పేద ఎవరూ అతీతులు కారు.

మానవత్వం ధనం కాళ్ళక్రింద తొక్కి వేయబడుతున్నట్లు గ్రహించాడు చంద్రశేఖర్. అప్పటి నుంచి అతను ఆకలి కవిత్వం రాయడం మానుకున్నాడు.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి