అమ్మ వంట - Dr. లక్ష్మి రాఘవ

Amma Vanta

ఆరోజు ఎందుకో పలావ్ చెయ్యాలనిపించింది సుప్రజకి. భర్త రవికి పలావ్ అంటే ఇష్టం లేదు కానీ తనకు ఇష్టం. ఐదేళ్ళ కొడుకు ధనుష్ కి కూడా నచ్చుతుంది. అందుకే పలావ్ వండింది. రుచి చూస్తే బాగా కుదిరినట్టనిపించింది. రవి ఏమంటాడో చూడాలి అనుకుంది.

పెళ్లి అయిన కొత్తలో సుప్రజ బాగా వంటలు చేస్తుంది అని వాళ్ళమ్మ చెప్పగానే 'అదృష్టవంతుడిని' అనుకున్నాడు రవి. ఎందుకంటే రవి కాస్త భోజనప్రియుడే. రుచులు కూడా ఎక్కువే!

కొత్త కాపురంలో రోజుకో వరైటీ టిఫెన్ చేసేది.

ఒకరోజు ఎగ్ సాండ్విచ్, వెరైటీ నూడెల్స్, మరో రోజు పాస్తా... హోటల్లో తప్ప ఇంట్లో ఇవన్నీ చేసి తినచ్చు అన్న సంగతే తెలియని రవి బాగానే ఎంజాయ్ చేసాడు.

అప్పుడప్పుడు ‘ఉప్మా చెయ్యకూడదా’ అని సుప్రజను అడిగితే వింతగా చూసేది సుప్రజ! ఇన్ని వెరైటీ వంటలను రుచి చూపిస్తూ వుంటే afterall ‘ఉప్మా చెయ్యమనటమా?

“వెజిటబుల్స్ వేసి చెయ్యనా ఉప్మా?” అంటే?

“వద్దు అల్లం, ఉల్లిగడ్డలు వేసి చెయ్యి.చాలు” అని అతనంటే ఉత్సాహం నీరుకారిపోయేది. వెజిటబుల్స్ కూడా వెయ్యకుండా ఉప్మాకు రుచి ఎలావస్తుంది? అని అంటే.

“మాకు అమ్మ రోజూ పొద్దున టిఫిన్ ఉప్మానే చేసేది.” అతని సమాధానం విని.

“రోజూనా?? ఉప్మానా??” వెగటుగా చూసేది సుప్రజ. ఆపై ఏదో కోరుకుంటున్నాడు కదా అని అలాగే  చేసిపెట్టేది.

ఏంతో అపురూపంగా తినేవాడు రవి.

ఒకరోజు కన్నడ వంట ’బిసి బేలేబాత్’ చేసింది బాగా వెజిటబుల్స్ వేసి. అది పూర్తి సౌత్ ఇండియన్ వంట కాబట్టి రవికి బాగా నచ్చుతుంది అనుకుంది.

అది వడ్డించాక “మాఇంట్లో అమ్మ వెజిటబుల్స్ అయిపోతే ఈ బాత్ చేసేది. అలాగే అలవాటు నాకు"

"మరి హోటల్స్ లో వెజిటబుల్స్ వేసి చేస్తారు కదా”

“అవును. అందరు అలాగే చేస్తారేమో. మావూరిలో సంతకు వచ్చే కూరగాయలు వారం పొడుగునా సరిపోయ్యేవి కావు అందుకు కూరగాయలు అయిపోయిన రోజున ఇది చేసేది"

“ఒక మాట అడగనా...” అన్న సుప్రజ మాటలకి

“చెప్పు" అన్నాడు రవి.

“మీరు అమ్మదగ్గర ఎన్ని ఏళ్లు వున్నారు?”

“స్కూలు పూర్తీ అయ్యేవరకు...”

“ఆ తరువాత హాస్టల్ లో వుండే కదా చదువుకున్నారు? ఆ వంట కంటే నా వంట బాగుండదా?” కోపంగా అంది సుప్రజ.

“సారీ సుప్రజా, నీ వంట బాగుండదు అని నేను ఎప్పుడైనా అన్నానా?”

“మరి ఏమిటి ఎప్పుడు ఏది చేసినా మీ అమ్మ వంటతో పోలుస్తారే తప్ప ‘ఇది బాగుంది’ అని చెప్పరు కదా"

“అమ్మ చేసినవి గుర్తుకు వస్తాయి అని చెబుతాను అంతే. నీ వంట ఎప్పుడూ స్పెషల్ నాకు” సుప్రజను బుజ్జగించాడు రవి. తప్పదు మరి!


            **********************      **********************      **********************

స్కూల్ నుండి రాగానే బ్యాగ్ పడేసి బాత్ రూం కెళుతూ “మమ్మీ ఆకలి...” అని గట్టిగా అరిచాడు ఐదేళ్ళ ధనుష్.

“రెండు నిమిషాలు" అంది సుప్రజ ad లో వచ్చే మమ్మీ లాగ.

నిజంగానే వాడు బాత్ రూం లో నుండి రాగానే వేడి వేడి Maggie noodles రెడీ చేసిపెట్టింది. రవి లాగే ధనుష్ కి కూడా రుచులెక్కువ . అందుకే సుప్రజ వంటలో ప్రత్యేకత చూపుతుంది ఎప్పుడూ. రోజుకో రకంగా వెరైటీ టిఫిన్లు చేసిపెడుతుంది. సుప్రజ చేసే వెజిటబుల్ ఉప్మా కూడా వాడికి చాలా ఇష్టం. ఇడ్లి చేసినా క్యారెట్, జీడిపప్పు వేసి కలర్ ఫుల్ గా బాగా అందంగా వుండేలా చేస్తుంది.


          *********************        *************************     *******************

“ హాలిడేస్ కి అమ్మమ్మ దగ్గరికి వెడదాం ధనుష్" అని ధనుష్ తో అంటే చాలా ఉత్సాహపడ్డాడు ధనుష్. అదే మాట రవితో అంటే శని, ఆది వారాలు కలిసి వచ్చేలా చూసుకుని అందరూ సుప్రజ అమ్మగారింటికి బయలుదేరారు.

“పొద్దుటే వచ్చేస్తామమ్మా” ఫోనులో అమ్మకు చెప్పింది సుప్రజ .

“వచ్చెయ్యండి .నీకు ఇష్టమైన ఇడ్లీలు చేసిపెడతా” సంతోషంగా అంది సుప్రజవాళ్ళ అమ్మ సుశీలమ్మ.

“అమ్మ ఇడ్లీలు చేస్తుందట. అమ్మ ఇడ్లీలు ఎంత మెత్తగా చేస్తుందో తెలుసా రవీ” అమ్మ చేసే ఇడ్లీలు నోట్లో వేసుకుంటే ఎలా కరిగిపోతాయో అని సంతోషంగా చెప్పింది సుప్రజ .


                   ***************              *******************        *************

గుమ్మం దగ్గరే సుప్రజను ఆప్యాయంగా వాటేసుకుంది సుశీలమ్మ. మనవడిని ఎత్తుకుని ముద్దాడింది.

“అమ్మమ్మా ఆకలి...” అని అడిగాడు ధనుష్.

“వాడికి ఆకలి ఎక్కువమ్మా” అంది సుప్రజ.

“వేడి వేడి ఇడ్లీలు రెడీ... ముఖం కడుక్కుని రండి టేబుల్ మీద పెట్టేస్తా” హడావిడి గా వంటింట్లోకి వెళ్ళింది సుశీలమ్మ.

వీళ్ళు Fresh up అయ్యేసరికి సెగలు కక్కే కాఫీ ఇస్తూ, ఇడ్లీలు పెట్టిన హాట్ కేస్ మూత తెరిచింది. ఫ్రెష్ గా వున్న ఇడ్లీలు నోరూరించాయి .

ధనుష్ కి ఒక ప్లేట్ లో ఇడ్లీలు పెట్టి సాంబారు వేసింది సుప్రజ.

“చూడు ఎంత మెత్తగా వున్నాయో ఇడ్లీలు” అని సుప్రజ అంటున్నా ధనుష్ మాట్లాడకుండా తింటూ వున్నాడు.

“ధనుష్, అమ్మమ్మ ఇడ్లీలు బాగున్నాయా? నీకు అమ్మ ఇడ్లీలు ఇష్టమా, అమ్మమ్మ చేసేవి ఇష్టమా?” అనడిగాడు రవి .

ధనుష్ వెంటనే “అమ్మ చేసేవే బాగుంటాయి కలర్ ఫుల్ గా, ఇంకా టేస్టీ గా" అన్నాడు తిరుగులేనట్టు .

సుప్రజ గర్వంగా చూసింది కొడుకు వైపు!!!

“ఐదేళ్ళ వీడికే అమ్మ వంట రుచి అంతగా తెలిస్తే ఇన్నేళ్ళ నాకు మా అమ్మ వంట బాగుంటే తప్పేంటి?”

రవి మాటలకి అవాక్కయ్యింది సుప్రజ !!!

మరిన్ని కథలు

love affections
మమతానురాగాలు
- మల్లవరపు సీతాలక్ష్మి
Madhava seva
మాధవ సేవ (బాలల కథ)
- సరికొండ శ్రీనివాసరాజు
Bawa Bawa rose water
బావా బావా పన్నీరు....
- గొర్తి.వాణిశ్రీనివాస్
New cousins
కొత్త కోడలు
- యు.విజయశేఖర రెడ్డి
i hate my room mate
ఐ హేట్ మై రూమ్మేట్
- గంగాధర్ వడ్లమన్నాటి
gurupreet singh
గురుప్రీత్ సింగ్
- యు.విజయశేఖర రెడ్డి
pity sundaram
పాపం సుందరం!
- పద్మావతి దివాకర్ల
Listening to what is being said
చెప్పుడు మాటలు వింటే...!
- మీగడ.వీరభద్రస్వామి