మంచం కింద కాళ్ళు - చెన్నూరి సుదర్శన్ ,

mancham kinda kaallu

హైకోర్టు హాలు..

కిక్కిరిసిన హాలు ఆత్రుతగా ఎదురి చూస్తోంది.. చూడదు మరీ..!

కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకున్న ప్రముఖ సినీ నిర్మాత ‘ఆల్ ఇన్ వన్’ బొందలోని శవం అంటే మాటలా..? మజాకా..?. శవం పూర్తి పేరు బొండలోరి శైశవం. కాని అతగాడు తీసిన సినిమాల ప్రాచుర్యం వాళ్ళ పేరు కాస్తా బొందలోని శవమని స్థిరపడింది. సింపుల్ గా జనం అతన్ని శవం అని పిలవడం కద్దు.

అన్నట్టు ఆల్ ఇన్ వన్ అంటే అర్థమయ్యిందనుకుంటాను.. కథ నుండి మొదలుబెడితే. సినిమాను సింగారించే సరంజామా.. అంతా మన శవంగారి చేతి చలువే.. స్క్రిప్ట్ రైటర్ ఇంకా డైరక్టర్ కూడానూ..

అయితే ఈ మధ్య తన స్వంత కథలతో వ్యథలు మొదలయ్యాయని ఏంమ్మాయ చేసాడో.. ఏమో..! గాని ‘మంచం కింద కాళ్ళు’ అనే సినిమా వివాదంలో చిక్కుకుంది.

‘మంచం మీద కోళ్ళు’ అనే నా నవలను కాపీ చేసి ‘మంచం కింద కాళ్ళు’ అనే సినిమా అనుమతి లేకుండా తీసారని సదరు రచయిత హరిశ్చంద్ర జిల్లా కోర్టుకెక్కాడు. విజయం సాధించాడు. అయితే అది జీర్ణించుకోలేని శవం.. తీర్పు తన వశం కావాలని హైకోర్టులో సవాలు చేసాడు.

జడ్జి గారి ప్రవేశంతో హాలు సద్దుమణిగింది.

అలవాటు ప్రకారం జడ్జి గారు “ఆర్డర్.. ఆర్డర్..” అంటూ చెక్క సుత్తితో బల్లపై రెండుమార్లు మోదాడు.. కేసు విచారణకు అనుమతించాడు. కేసు వాదోపవాదాలు జడ్జిగారి సుత్తిని నిలవరించలేక పోతున్నాయి. డిఫెన్స్ లాయర్ తన అపూర్వమైన అనుభవానికి అమోఘమైన వాక్ చాతుర్యం తోడై కోర్టును దడ, దడ లాడిస్తున్నాడు.

“మై లార్డ్.. హరిశ్చంద్రగారి అభియోగం హాస్యాస్పదం.. అసలు పేరులోనే గొప్ప వ్యత్యాసముంది. నవల పేరు మంచం మీద కోళ్ళు.. బొండలోరి శైశవంగారు తీసిన సినిమా పేరు మంచం కింద కాళ్ళు.. కథంతా ఆ కాళ్ళతోనే నడుస్తుంది.”

అంతలోనే అఫెన్స్ లాయరు అడ్డుకున్నాడు.

“మై లార్డ్.. నవలలో కూడా నడిచే కథ సాంతం కాళ్ళ మీద కోళ్ళ మీదే..

కథానాయకుడు, నాయకురాలు మంచం మీద అయితే దొరికి పోతామని మంచం కింద దూరుతారు. అప్పటికే మంచం కిందున్న ఒక కోడి పెట్టపై పారుదామని లైనేసే కోడి పుంజు భయపడిపోతుంది. రెండూ కలిసి జంపై మంచమెక్కుతాయి.

మంచం మీద వాటి పని కాగానే మంచం కింద కదిలే కాళ్ళను కోళ్ళు పసిగడ్తాయి. తమకు ఆటంకం కలిగించిన వాళ్ళను వదులొద్దని పగబద్తాయి. వాళ్ళ పనికీ ఆటంకం కలిగించాలని ఆ జత కాళ్ళను మాటి మాటికి కెలుకుతూ వుంటాయి కోళ్ళు. దాంతో కోళ్ళకు ప్రాముఖ్యతనిచ్చి నవల పేరు మంచం మీద కోళ్ళు అని నా క్లయింట్ హరిశ్చంద్రగారు ఆ పేరు పెట్టారు.

నవలలోని ప్రతీ అంశం మక్కీకి మక్కీ కాపీ గొట్టి తీసిన సినిమా ఇది. ప్రేక్షకుల కోసం శవంగారొక పజిల్ పెట్టారు. ‘హీరో.. హీరోయిన్ తృప్తి చెందారా..! లేదా..! కోళ్ళ పగ తీరిందా..? ’ అనేవి పజిల్ లోని ప్రశ్నలు.. దాంతో డబ్బులు దండిగా దండుకున్నాడు” అని ధీటుగా జవాబిచ్చాడు.

“ఆబ్జెక్షన్ మై లార్డ్.. పజిల్ అనేది ఈ కేసుతో సంబంధం లేనిది” అంటూ జడ్జిగారు మూర్చ పోయేంతగా గట్టి కేక వేసాడు డిఫెన్స్ లాయరు.
“ఆబ్జెక్షణ సస్టైండ్” అన్నాడు జడ్జి. డిఫెన్స్ లాయర్ ముఖం బండి గీరంతగా మారింది. పెదవులపై మొలచిన నవ్వుతో కళ్ళు ఎగరేసాడు.
“అయినా రచయిత హరిశ్చంద్రగారు డబ్బుకాశపడి ఈ కేసు వేయలేదు.. సినిమాలో తన పేరు కథా రచయితగా వేయలేదన్న మానసిక క్షోభ అతన్ని కోర్టుకు దారి చూపింది” అని అఫెన్స్ లాయరందుకున్నాడు. ప్రేక్షకుల హర్షధ్వనుల మధ్య చప్పట్లు మోగసాగాయి.

“ఆర్డర్.. ఆర్డర్..” అంటూ జడ్జిగారి సుత్తి దెబ్బలు మామూలే..

“కథ కాళ్ళ మీద కోళ్ళ మీద అయితేనేం..!

నవలలో హీరో కాళ్ళు హీరోయిన్ కాళ్ళపై వుంటాయి. సినిమాలో హీరో కాళ్ళు హీరోయిన్ కాళ్ళ కింద వుంటాయి. నవలలోని కోళ్ళు నల్లవి.. సినిమాలోని కోళ్ళు తెల్లవి. ఆమాత్రం తేడా మన అఫెన్స్ లాయరుగారు గుర్తించక పోవడం శోచనీయం” అంటూ ముఖం గక్కే చెమటలను తుడ్చుకోసాగాడు డిఫెన్స్ లాయర్.

హాల్లో నవ్వుల వర్షం కురిసింది. జడ్జిగారు సైతం తన నగుమోమును దాచ ప్రయత్నం చేసేడు. తీర్పు మరో వారానికి వాయిదా పడింది.

***

“ఇదే మంచి తరుణం.. మించినా దొరకదు. జడ్జిగారు కావాలనే తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేసాడు. మీ కేసుకు రెండు సూటుకేసుల డబ్బు చాలు. ఇప్పటికే నేను నాశాయశాక్తులా ప్రయత్నిస్తున్నాను. మీ కేసు నాకనుకూలమైన బెంచీకి అలాట్ చేయించుకోవడం.. నేననుకున్న జడ్జీని నియమించుకోవడం తడిసి మోపడయ్యింది.

మన జడ్జి గారి సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఆరు మర్డర్లు చేసి ఆరు లక్షలిస్తే సాక్ష్యాలను తలకిందులు అవలీలగా కేసు నుండి గట్టేక్కిస్తాడు.

అదంతా నీకు వివరించాలంటే సాప చిరిగి చాటంతైతదిగాని.. నీ కెందుకు చెప్పు. డబ్బిస్తే చాలు జడ్జి గారినే కాదు.. వాడి జేజేమ్మను కూడా మేనేజ్ చేయగల సత్తా వుంది నాకు..” అంటూ డైరక్టర్ శవం మెదడు వేపి తినసాగాడు డిఫెన్స్ లాయరు.

శవం చేసేదేమీ లేక తన వద్ద ఉన్నది ఊడ్చి చేతిలో పెట్టాడు.

‘దీని కంటే ఆ రచయితకు డబ్బిచ్చినా పుణ్యమైనా దక్కేది. లేదా ‘కథ – రత్నం’ అని సినిమాలో పెరేసినా నాకీ నక్షత్రకుని బాధ తప్పేది అని మనసులో కుమిలిపోసాగాడు శవం. తలపై తెల్ల గుడ్డ తప్పదేమో.. అని అనుమానం లేకపోలేదు. కాని కేసు ఇంత దూరం వచ్చాక తప్పతుందా..? ‘నిండా మునిగిన వానికి చలి పెట్టదన్నట్లు’.

***

సిగ్నల్ సెక్షన్ వద్ద “బాబూ.. ధర్మం చెయ్యండి..” అంటూ అడుక్కునే గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించి కారు సైడు మిర్రర్ లో నుండి చూసాడు డిఫెన్స్ లాయర్. ఒంట్లో వణుకు పుట్టింది. గ్రీన్ లైట్ పడగానే కారు స్టార్టు చేసాడు.. శవంగారి శాపనార్థాలు వినరానంత వేగంగా కదిలి పోయాడు.

***

మరిన్ని కథలు

Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం