చూపు - పి.ఎన్.ఎస్. రమ్య

Choopu Telugu Story By Ramya

హైటెక్ సిటీలో బస్సు దిగి ఐటీ పార్క్ లో ఆవరణలోకి ప్రవేశించాను. పెద్ద పెద్ద భవంతులతో అదో కొత్త ప్రపంచంలా ఉంది. నేను కొత్తగా ఈరోజే చేరబోయే ఎంఎన్ సీ అందులోనే ఉంది. సెక్యూరిటీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని గేట్ దాటి లోనికి వెళ్తుంటే టెన్షన్ తో గుండె వేగంగా కొట్టుకుంటోంది. రెండునెలల క్రితమే బీకాం డిగ్రీతో కాలేజ్ గేట్ దాటి బయట ప్రపంచంలోకి వచ్చాను. నెల క్రితం ఐటి కంపెనీల జాబ్ మేళాకు అటెండవడం, రెండ్రోజుల పాటు రోజుకు మూడు చొప్పున ఆరు రౌండ్స్ ఇంటర్వ్యూలు జరగడం... వారం క్రితం సెలక్టయినట్లు ఆఫర్ లెటర్ అందుకోవడం... ఇదిగో, ఇవాళ ఇలా జాయినయేందుకు ఐటీపార్కులోకి అడుగుపెట్టడం... సినిమా రీళ్లలా చకచకా జరిగిపోతున్నాయి.

నిన్నమొన్నటి దాకా కాలేజీ లైఫ్ ని ఆస్వాదించిన తాను... ఇవాళ్టి నుంచి ఐటీ ప్రొఫెషనల్. ఈ ట్యాగ్ లైన్ బాగుంది కానీ, కొత్త జాబ్ ఎలా ఉంటుందో ఏమో? అరమరికలు లేకుండా కాలేజ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి అంతులేని స్వేచ్చను అనుభవించిన తాను... షిఫ్ట్ లవారీగా విభజించిన ఉద్యోగకాలానికి అంత తొందరగా కాగలనా?

ఎవరికివారే ఆర్ధిక స్వావలంబనతో తలెత్తుకు తిరిగే జాబ్ మేట్స్ తో కలిసిపోగలనా?

మదిలో ఎన్నో ప్రశ్నలు... మరెన్నో సందేహాలు.

ఆలోచిస్తుండగానే ఆఫీస్ లోకి ఎంటరైపోయాను.

ఆఫీస్ అంతా ప్రశాంతంగా ఉంది. ఎవరి పనులు వారు చేసుకుపోతున్నారు. సెంట్రల్ ఏసీతో కూడిన చాలా చల్లటి ప్రదేశం.

శరీరమే కాదు, మనసు కూడా హాయిగా ఉన్నట్లనిపించింది.

"ఎక్స్ క్యూజ్ మీ..." అంటూ ఎదురొచ్చిన ఎంప్లాయిని పలకరించి 'న్యూ జాయినీ' అంటూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

ఆమె కూడా నవ్వుతూ 'హాయ్' చెప్పింది.

ఆ తర్వాతే అసలు విషయం తెలిసింది. అదే... మా ట్రైనరు ఇవాళ లీవులో ఉన్నాట్ట. మా మేనేజరు అసలు ఈ దేశంలోనే లేడు.

ప్రక్క ప్రాసెస్ మేనేజర్ చెప్పాడు.

అంటే, ఇవాళ మొత్తం నాకేం చేయడానికి లేదు. ఆఫీస్ లో అందరిని పరిచయం చేసుకొని, ఇప్పటినుంచే గెట్ టు గెదర్ కి రెడీ అవ్వాలి. అనుకుంటుండగానే శరీరానికి పదునైన ముళ్ళు గుచ్చుకున్నట్లనిపించి ఉలిక్కిపడ్డాను. పరిశీలించి చూస్తే - ప్రక్క బే లో అమ్మాయి చిరాకుగా కనిపించింది.

బహుశా, సిస్టం లో ఏదో ఫాల్ట్ వచ్చిందనుకుంట.

నేను ఆమె దగ్గరకెళ్ళి "నా పేరు స్వప్నిక. కొత్తగా జాయిన్ అయ్యాను" అని పరిచయం చేసుకున్నాను. ఆమె నన్ను కూడా చిరాకుగా చూసింది. అలా ఎందుకు చూసిందో అర్ధంకాలేదు , కాసేపటి తరువాత ఆమె నన్ను, కంప్యూటర్ ని కోపంగా కొన్నిక్షణాలు చూడటం మొదలుపెట్టింది. ఆపై మౌనంగా ఉంది. ఇక లాభం లేక తిరిగి నా సీట్లో కూర్చొన్నాను. కాసేపటి తర్వాత ఇంకొక ఎర్ర చుడీదార్ అమ్మాయిని పరిచయం చేసుకోవాలన్న ఆలోచన తట్టింది. కాని, ఈమె ఎలా చూస్తుందో అని ఆ ఆలోచన మానుకున్నాను. అందరు వారి వారి పనుల్లో నిమగ్నమైవుండగా నేను వారిని గమనించసాగాను.

ఆఫీసంతా కూల్.

హమ్మయ్య! ఈ రోజు ట్రైనర్ వచ్చారు ఆఫీసుకు. ఇక నో బోర్, ఓన్లీ వర్క్, అనుకుంటూ హుషారుగా అతని దగ్గరికెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మా ట్రైనర్ చాలా ఫ్రెండ్లీ. బాగా సహకరిస్తున్నాడు.

రెండు వారాలకి నాకు ప్రాసెస్ వచ్చేసింది. ఇక మనశ్శాంతిగా చేసుకోవచ్చు అని అనుకుంటుండగా నా షిఫ్ట్ మారిందని చెప్పారు.

ఇక నుంచి మంచు కురిసే వేళలో నా పనివేళలు కూడా కలిపారని తెలిసింది.

హాయిగా మొదటి రోజు పనితో పనిగా ఎన్జాయి చేయాలని ఫ్లాన్ వేశా.

నా బే లో నేను తప్ప ఎవరూ లేరు. మా టీమ్ లో ఒకరు లీవ్ లో, మేనేజరు అమెరికాలో, మా ట్రైనర్ వర్క్ ఫ్రం హోం లో, నా సంతోషానికి హద్దులెవరూ లేరని సిస్టం ఆన్ చేశా. రిపోర్ట్ పుల్ చేసి వర్క్ చేయడం మొదలుపెట్టా. కాని,ఎక్కడో ఏదో నా శ్రద్ధకి అడ్డుకట్ట వేస్తోంది.

అదేమిటా అని సిస్టం ముందు నేను పనిచేస్తూ నాకు ఎదురుగా ఉన్న బే లో చూశా. ఆ రోజు నన్ను చిరాగ్గా చూసిన అమ్మాయే తదేకంగా చూస్తోంది. కోపంతో. నాకు అర్ధం కాలేదు. మొదట నాకు భయమేసింది. నన్ను నేను తమాయించుకుని కూర్చున్నాను.

అసలీ అమ్మాయికేమైంది? కళ్ళార్పకుండా కాల్చేలా చూస్తోంది. మేనఫేక్చరింగ్ డిఫాల్టా? లేక, తన చూపే అంత? క్షణాలు నిమిషాలవుతున్నా కదలకుండా, మెదలకుండా నన్నే ఎందుకలా చూస్తోంది? ఆమె నన్నేనా అలా చూస్తోంది. అందర్నీ అలాగే చూస్తోందా? నాకేమీ అర్ధం కావడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె చూపుల్ని అస్సలు భరించలేకపోతున్నాను. లేచి వెళ్లి డైరక్ట్ గా ఆమెనే ఎందుకలా చూస్తున్నావ్? అని అడిగి, కదిగిపారేయాలనిపిస్తోంది. సభ్యత, సంస్కారం అడ్డొచ్చి అలా చేయలేకపోతున్నాను. మొత్తానికి ఆమెవల్ల ఆఫీసులో ఉన్న సమయం ప్రత్యక్ష నరకంలా అనిపిస్తోంది. అంటే... మాటలు, చేతలతోనే కాదు, చూపులతో కూడా ఎదుటివాళ్ళని హింసించొచ్చని ఆ అమ్మాయి చెప్పకనే చెప్తున్నట్లుంది. ఎవరికైనా ఈ విషయం చెప్తే ఏమంటారు? ఆ అమ్మాయి నిన్ను చూస్తోందని నీకెలా తెలుసు అని ముందుగా ప్రశ్నిస్తారు. తర్వాత... నువ్వు కూడా ఆ అమ్మాయిని చూస్తున్నావు కదా... అని మరో ఎదురుప్రశ్న వేస్తారు. అయితే, నా చూపులకి, ఆమె చూపులకి మధ్య తేడాని వాళ్లు గుర్తించలేరు. అలా గుర్తించే ఆధారాలతో తాను వాళ్లకి విషయం చెప్పలేదు కూడా. కారణం... ఆమె చూస్తున్నట్లే ఉంది. కానీ, ఆ చూపుల్లో మాత్రం చిటికలో శరీరాన్ని గాయం చేసే పదునైన చురకత్తులున్నాయి. సర్రున కాల్చేసే అగ్నిశిఖలున్నాయి. అందువల్లనే ఆ చూపుల్ని భరించలేకపోతున్నాను. ఆ చూపులవల్ల నా పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను.

అంటే... కొత్తగా ఉద్యోగంలో చేరిన తనని చూపుల్తో మానసికంగా వేధిస్తూ ఇబ్బందిపాలు చేయడమనే శాడిస్టిక్ నేచర్ ఆమెలో దాగున్నట్లు తెలుస్తోంది.

కెఫెటీరియాలోకి వచ్చేశా. కిటికీ నుంచి చూస్తుంటే చీకట్లో చిన్నపాటి లైట్లు కనిపిస్తున్నాయి. వేరే కంపెనీలు కూడా ఉన్నాయి. వారి ఫ్లోర్స్ నిండా వెలుతురు. అక్కడ ఇంకొంచెం సమయం ఉండాలనిపిస్తుంది. కానీ, కంప్లీట్ చేయాల్సిన పని గుర్తొచ్చి వెళ్లి మళ్ళీ నా సీట్లో కూర్చొన్నా.

ఇక ఆమె గురించి పట్టించుకోలేదు. నా పనేంటో చేసుకుపోయా.

అ రోజు కొత్తవాటి గురించి ఏదో ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ నెం. 4 కి వెళ్లా. అక్కడ ట్రైనరు ఎక్స్ ఫ్లైన్ చేసి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. నేను సమాధానం చెప్తూ ఉండగా నన్ను ఇంకెవరో గమనిస్తుండడం నా మనసుకి తట్టడంతో అటువైపు చూశా. చూస్తే ఆ అమ్మాయే. నాకు చాలా బాధేసింది. నన్ను ఏడిపించడానికి తను ప్రయత్నిస్తోందని అర్ధమౌతోంది.

ఇలాగైతే నేను వేటిపై శ్రద్ధ వహించగలను? నా మనసులో అనుకుంటూ ఫ్లోరుకు వెళ్ళాను. మధ్య మధ్య మనసు చివుక్కుమంటున్న ఆ చూపులను గుర్తుచేసుకోకూడదని నా మనసుకి గుర్తుచేస్తున్నాను. ఇంతలో రాత్రి పదకొండు గంటలైంది. మిడ్ షిప్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మాత్రమే నా బే లో ఉంటాను. ఆమె వైపు చూడాలంటే భయంతో గుండెకు ధైర్యం చాలేదు.

ఇక కిందకి వచ్చేశా. అందరు స్నేహితులతో అక్కడకి వచ్చి చల్లగాలి పీలుస్తున్నారు. నేను మాత్రం మనసులో బాధతో, ఒంటరిగా. ఇంతలో, * * *
" అసలా అమ్మాయంటే నీకెందుకే అంత కసి? " నేను క్యాంటీన్ లోకి అడుగు పెట్టబోతుండగా వినిపించిందో గొంతు. " కసి కాదే, భయం, " నన్ను చూపులతో వేధిస్తున్న అమ్మాయి గొంతది. ఆశ్చర్యంతో అక్కడే ఆగిపోయాను. బహుశ, అంతా అదే బ్యాచ్ కావచ్చు. హస్కు వేసుకుంటున్నారు. నన్నెవ్వరూ గమనించలేదు. భయమా, అదేంటీ? అడిగిందింకొక వాయిస్. అవునే. నాకా అమ్మాయిలో ఎదో తెలీని షార్ప్ నెస్ కనిపించింది. డౌట్ లేదు. ఆ అమ్మాయి మనందరినీ దాటుకుని టీం లీడర్ అభిమానం పొందడానికి. అందుకే ఆ అమ్మాయిని ఏదోక విధంగా బయటకు సాగనంపాలని నిర్ణయించుకున్నా..." ఏమిటి? కేవలం చూపులతోనా? ఆశ్చర్యంగా అడిగిందింకో అమ్మాయి. చూపులతోనా అంటున్నావు, చూపుకెంత శక్తి ఉందో తెలుసా? నిరంతరం ప్రసరించే మన చూపులతో ఎదుటివారిని ఎంతో ఇరిటేట్ చెయ్యొచ్చు..."ఆ మాటలు విని నిర్ఘాంతపోయాను. ఒక సీనియర్ నామీదంత కసితో ఉంటే ఇక నేనక్కడ ఉండడం సాధ్యం కాదనిపించింది.
" నేనీ ఉద్యోగం చేయను డాడీ..." అదేరొజు చెప్పాను.." అలాగేనమ్మా.నీ ఇష్టం. కానీ ఎందు? అడిగారు డాడీ. విషయమంతా చెప్పాను. డాడీ కొంతసేపు అలోచించి..."చూడమ్మా. ఉద్యోగం చెయ్యడం, మానడం అనేది నీ ఇష్టం. కానె, అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను విను. ఇది మన జీవితం. మనం మన చుట్టూ ఉన్న మన లాంటి మనుషుల మధ్యే బ్రతకాలి. ఎక్కడికెళ్ళినా మనుషులే ఉంటారు. ప్రేమించేవారు ఉన్నట్టే, ద్వేషించేవారూ ఉండొచ్చు. అభివృద్ధికి అసూయ ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి. ప్రతికూల పరిస్థితులనూ, వ్యక్తులనూ, తట్టుకుంటూ, తప్పుకుంటూ, ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మన ప్రతిభ." అన్నారు. డాడీ మాటలతో నాలో ఏదో తెలీని శక్తి కూడగట్టుకున్నట్టనిపించింది. అప్పుడే ఒక స్థిర నిర్ణయానికి వచ్చాను.....
సరిగ్గా, అదే సమయంలో నాకో ఆలోచన తట్టింది. ఆ ఆలోచనే నాలో కొండంత ధైర్యాన్ని నింపింది.

* * *

ఆ ఆలోచనను వెంటనే అమలుపరచాలనుకుంటూ ఫ్లోర్ లో అడుగుపెట్టాను.

సీన్ రివర్సయింది. ఆమె కాదు... ఇప్పుడు నేనే ఆమెను తీక్షణంగా చూస్తున్నాను. కళ్ళార్పకుండా, కదలకుండా, మెదలకుండా అదేపనిగా ఆమెనే చూస్తున్నాను. చూపుల్లో ఏ భావం ప్రస్పుటం కాకుండా ఆమెనలా చూస్తూనే ఉన్నాను. క్షణాలు... నిముషాలుగా మారుతుండగా ఆమెనే చూస్తున్నాను. చూపు తిప్పకుండా అదేపనిగా ఒక్కళ్ళవైపే ఫోకస్ చేసి చూస్తే కలిగే ఇబ్బందేంటో ఆమెకి తెలియాలనే చూస్తున్నాను. నా చూపుల ధాటికి తట్టుకోలేక ఆమె వచ్చి సూటిగా నన్నేమైనా అడగగలదా? కచ్చితంగా అడగలేదు. ఎందుకంటే... నా చూపుల్ని ఆమె గమనించిందంటే... నన్నూ ఆమె చూస్తున్నట్లే కదా!

టిట్ ఫర్ టాట్... చూపుల్తో గుచ్చిగుచ్చి చంపేసే ఆమెలాంటివాళ్లకి అదేదారిలో గుణపాఠం చెప్పి తీరాల్సిందే... అనుకుంటూ ఇప్పటికీ ఆమెనే టార్గెట్ చేస్తూ అలా... అలా చూస్తున్నాను. ఈ గేమ్ ఎంత కాలం నడుస్తుందో నేనెలా చెప్పగలను? జవాబు చెప్పాల్సింది ఆమె మాత్రమే. ఔనా?

మరిన్ని కథలు

Markatapuram-Story picture
మర్కటపురం
- యు.విజయశేఖర రెడ్డి
Daridrudu
దరిద్రుడు
- mahesh amaraneni
Giligadi vachche puligadu chachche
గిలిగాడు వచ్చె-పులిగాడు చచ్చె.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kotta jeevitam
కొత్త జీవితం
- చచెన్నూరి సుదర్శన్
Yachakulu kaanidi evaru
యాచకులు కానిది ఎవరు?
- యాచకులు కానిది ఎవరు?.
Vimukti eppudo
విముక్తి ఎప్పుడో!
- రాము కోలా.దెందుకూరు.
Manninchumaa
మన్నించుమా!
- రాము కోలా.దెందుకూరు.