అవసరానికే అమ్మ? - డా: పి.కె. జయలక్ష్మి

Avasaranike Amma?

వారం రోజుల్నించి అరుంధతికి కాళ్ళు భూమ్మీద నిలబడ్డం లేదు. ఒకటే ఉత్సాహం, కంగారూ, బెదురు, ఏదో జంకు అన్నీ కలిపి అలజడిగా ఉందామెకు లోలోన. దానిక్కారణం వారం క్రితం ముద్దుల కొడుకు అమెరికా నుంచి చేసిన ఫోన్ కాల్ మరి 'అమ్మా! మీ కోడలు వచ్చేనెలలో మీకు మనవణ్ణి అందించబోతోంది. నీకు తెల్సుకదా తనకంటూ ఎవరూ లేరు. తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. డాక్టర్లు రెస్ట్ అవసరమంటున్నారు. అన్నీ చేస్కోవడం కష్టంగా ఉంది ప్లీజ్ అమ్మా! ఎలాగయినా మీరు అమెరికా రావాలి. నేను టిక్కెట్లు పంపిస్తున్నాను. ఎన్నాళ్ళు ఆ పల్లెటూర్లో ఉంటారు మీరు మాత్రం? ఎంచక్కా అమెరికా అంతా చూడవచ్చు నేను మీ కోసం ప్రేమతో, ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను. తప్పకుండా వచ్చేయాలి తెల్సిందా!" అంటూ ఫోనుచేస్తే కాదని తను మాత్రం ఎలా అంటుంది? ఆమె ఆనందానికి అవధుల్లేవు. అందరికీ ఈ వార్త చెప్పి మురిసిపోసాగింది. చుట్టాలకీ, పక్కాలకీ, బంధువులకీ, మిత్రులకి వివరంగా చెప్పసాగింది. ఇదిగో ఇది విన్నారా? మా కోడలు నీళ్లోసుకుంది. మా అబ్బాయి మమ్మల్ని అమెరికా రమ్మనమని టికెట్లు పంపించాడు. ఏడు సముద్రాలు దాటి సీతారాముల లాగా పుష్పక విమానంలో కూచొని అమెరికా వెళ్తాము తెల్సా! అంటూనూ.

రెండు, మూడు రోజుల్లో అవసరమైన కాగితాలు, ఫ్లైట్ టిక్కెట్ వచ్చేసాయి. కాని ఒకటే టికెట్టు! ఇది చూడగానే అరుంధతి ఉత్సాహమంతా నీరుకారిపోయింది. ఇదేంటి? ఆయన్ని వదిలిపెట్టి నేనెలా వెళ్తాను? ఇక్కడ ఆయన్ని ఎవరు చూసుకుంటారు? ఎప్పుడూ ఆయన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు. ఇన్నేళ్ళ దాంపత్య జీవితంలో చుట్టాలిళ్ళల్లో పెళ్ళిళ్ళు, పేరంటాలు అయినా వెళ్తే ఇద్దరూ వెళ్ళడం లేకపోతే మానేయడం తర్వాత ఎప్పుడో కలిసినపుడు సంజాయిషీ ఇచ్చుకోవడమే గాని అర్జునరావుగార్ని ఒంటరిగా వదిలి వెళ్ళింది లేదు. తన జీవితంలో మొదటి స్థానం భర్తదే! తర్వాతే కొడుకు. అనిరుధ్ ఏకైక పుత్రరత్నం అయితే అయ్యాడు గాక, భర్తని వదిలి వెళ్ళే ప్రసక్తి లేనేలేదు. అని ఖచ్చితంగా నిర్ణయించేసుకుంది. కాని అర్జునరావుగారు నచ్చచెప్పడం మొదలు పెట్టారు "చూడు ఆరూ! అక్కడ కోడలుపిల్ల డెలివరీ టైం. ఎవరూ సాయంచేసే వాళ్ళు లేక మనవాడు ఎంతో మొహమాటంతో నిన్ను రిక్వెస్టు చేసాడు తోడుగా ఉండమని, నేను వచ్చి ఏం చేస్తాను చెప్పు? మనిషి మీద మనిషి భారమే గానీ! నాకా కోర్టు, క్లయింట్స్! వదిలి ఎలా రాగలను? నువ్వు ఒక్కదానివే వెళ్ళు! మరేం ఫర్వాలేదు. అక్కడి మెరుపులా మైకంలో మనవణ్ణి చూసుకున్న ఆనందంలో, కొడుకు - కోడళ్ళ ప్రేమలో నన్ను మర్చిపోయావంటే అనాధ అయిపోతాను. ఇక్కడ నా పనులన్నీ ముగించుకొని నేనూ వస్తాను. మనవణ్ణి చూసి, అమెరికా అంతా ఎంచక్కా ఇద్దరం చక్కర్లు కొట్టి చక్కగా ఇండియా వచ్చేద్దాము కలిసి సరేనా! ఆయన మాటలు వినిఅరుంధతి సిగ్గుపడిపోయింది". "పోదురూ మీకెప్పుడూ వేళాకోళమే! ఒక్కదాన్నే అంతదూరం వేరే దేశం వెళ్ళాలంటే నాకెందుకో భయంగా ఉంది తెల్సా" అంది కళ్ళు పెద్దవి చేస్తూ లాయరుగారు వారం రోజులు కిందామీదా పడి పరుగులు తీసి మొత్తం మీద వీసా ఏర్పాట్లు చేసారు. హైదరాబాద్ వెళ్ళి భార్యని అమెరికా విమానం ఎక్కించారు. అదే విమానంలో అమెరికా వెళ్తున్న తోటి ప్రయాణీకుణ్ణి అరుంధతికి ఏదైనా సాయం అవసరమైతే చేయాల్సిందిగా అభ్యర్ధించి, తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు.

అరుంధతి మొట్టమొదటిసారిగా ఒంటరిగా దేశం కాని దేశం పాతాళలోకం అమెరికా వెళ్తోంది. మనసులో ఆందోళన, భయం, ఉత్సుకత అంతా కలగాపులగంగా వున్నాయి. 24 గంటలు ప్రయాణం ముందు జ్యూరిక్ లో కొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది. తర్వాత న్యూయార్కులో అనిరుధ్ ఫ్రెండ్ కెనడీ ఎయిర్ పోర్ట్ లో కలిసి, తన ఫ్లాట్ కి తీసుకువెళ్ళి మర్నాడు చిన్న విమానంలో అక్కణ్ణించి అట్లాంటా పంపిస్తాడు. అట్లాంటాలో భార్యా భర్తలిద్దరూ ఆమె కోసం ప్రేమగా ఎదురుచూస్తూ ఉంటారు. అయినా సరే ఆవిడకి టెన్షన్ గా ఉంది అరుంధతి ఇంటర్ వరకు తణుకులో చదువుకుంది. కొద్దోగొప్పో ఇంగ్లీషు చదవగలదు. కాని మాట్లాడలేదు. ఈ విమానంలో కొంతమంది తెలుగు వాళ్ళున్నారు. భోజనం కూడా ఫర్వాలేదు. కాని ముందు ముందు ఎలా ఉంటుందో? ఇరవై నాలుగు గంటల ప్రయాణం ముళ్ళమీద కూచున్నట్లుగా గడిపింది అరుంధతి. విశాలమైన కెనడీ విమానాశ్రయంలో తోటి ప్రయాణికుడి సహాయంతో అనిరుధ్ ఫ్రెండ్ అఖిల్ ని కల్సుకుంది. రెండు గంటల కారు ప్రయాణం అనంతరం వాళ్ళింటికి చేరుకున్నారు. అఖిల్ భార్యని, చిన్నబాబుని చూడగానే అరుంధతికి ఎంతో హాయిగా అన్పించింది. స్నానం, పూజ, భోజనం కానిచ్చేసరికి నిద్రముంచుకు వచ్చింది మర్నాడు మధ్యాహ్నం ఒంటిగంటకి ఆమెని అట్లాంటా ఫ్లైట్ ఎక్కించారు అఖిల్ దంపతులు. కరెక్ట్ టైమ్ కి అట్లాంటా చేరుకుంది విమానం. ఎయిర్ పోర్టుకి వచ్చిన అనిరుధ్ తల్లి కాళ్ళకి నమస్కారం చేసాడు. అరుంధతికి అలసటంతా తీరిపోయిన ఫీలింగ్ "అమ్మా! ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం. నీ సామాన్లు గుర్తుపడితే నేను వాటిని ఈ ట్రాలీ మీద పెడతాను." అంటూ ముందుకు దారితీశాడు. కోడలు కన్పించకపోవడంతో కొంచెం నిరాశ కల్గినా, డెలివరీ రోజులు కదా అన్న విషయం స్ఫురణకి రాగానే ఎలా వస్తుంది ఈ టైంలో అని తనకి తానే సర్దిచెప్పుకుంది. "లావణ్య చాలా భారంగా ఉందని, డాక్టరు బెడ్ రెస్ట్ తీస్కోమన్నారని" చెప్పాడు అనిరుధ్ దారిలో ఇంటికి వెళ్ళేసరికి కోడలు నిద్రలో వుంది బడలిక తీరకుండానే వంటపనిలో పడిపోయి కొడుక్కీ కోడలికీ వడ్డించి తనూ ఇంత తిని వంటిల్లు శుభ్రం చేసుకుని మంచం మీద వాలిపోయింది అరుంధతి.

రెండోరోజు తెల్లారుతూనే ఫోన్ గణగణమంటుంటే అరుంధతికి మెలకువ వచ్చింది. హాల్లోకి ఒక్క ఉదుటున వచ్చి ఫోన్ అందుకుంది భర్త గొంతు వినగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. అర్జునరావుగారు చాలా గాబరాగా వున్నారు. భార్య క్షేమంగా అట్లాంటా చేరుకుందో లేదోనని! ఆవిడ ప్రయాణం విశేషాలన్నీ పూసగుచ్చినట్లు గబగబ చెప్పసాగింది. ఈలోపు అనిరుధ్ తన గదిలోంచి వచ్చి ఫోన్ అందుకుని "సారీ డాడీ, నేనే ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఈ లోపు మీరే చేసారు. అమ్మ గురించి కంగారు పడ్డారా?" అని... మాట్లాడసాగాడు.

మర్నాటి నుంచి అరుంధతి ఇంటిపనిలో పూర్తిగా నిమగ్నమయి పోయింది. ఇల్లు సర్దుకోవడం, వంట, వడ్డింపులు, కోడలికి పరిచర్యలు రోజు ఎలా గడిచిపోతుందో అస్సలు తెలియడం లేదు. ఆవిడ ఎప్పుడూ తన జీవితంలో ఇంత కష్టపడి ఎరుగదు. భర్త సంపాదన తక్కువగా ఉన్న రోజుల్లో కూడా ఇంట్లో పనిమనిషి ఉండేది. ఇంట్లో చిన్న చితకా పనులు దగ్గర్నుంచి, బట్టలుతకడం దాకా అన్నీ చక్కగా చేసి పెట్టేది. వంట మట్టుకు అరుంధతి చేసేది. ఎందుకంటే భర్తకి అరుంధతి చేతి వంట తప్ప ఎవరు చేసినా నచ్చేది కాదు. కాని ఇప్పుడు ఇక్కడికి వచ్చేముందు పని అబ్బాయికి తాను నేర్పించిన వంట ఎంతవరకు భర్త తినగల్గుతున్నారో తలుచుకుంటే ఆమె కళ్ళు చమర్చాయి.

అనిరుధ్ పొద్దున్నే 8 గంటలకల్లా బ్రెడ్డు పాలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుని ఆఫీస్ కి వెళ్తే రాత్రి 7 గంటలకి అలసిసొలసి ఇల్లు చేరి, భార్య దగ్గర కాసేపు కూచుని, స్నానం కానిచ్చి భోజనాల దగ్గర తల్లితో కొంతసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడి నిద్రకి ఉపక్రమిస్తాడు. ఆదివారం బోల్డంత పని. ఇంటి క్లీనింగ్, వాషింగ్ మిషన్ లో బట్టలు వుతుకడం, మిషన్ తో బైట నీట్ గా గడ్డి కట్ చేయడం, తోటపని వగైరా వగైరా! అల్లారు ముద్దుగా పెరిగిన సుపుత్రుడు ఇలా కష్టపడుతుంటే అరుంధతి మనసంతా అదోలా అయిపోయేది. ఇండియాలో అయితే మగవాళ్ళు ఇంటిపన్లు ఇంతలా అస్సలు చేయరుగాక చేయరు! తినడానిక్కూడ తీరిక లేని ఈ దేశంలో వీళ్ళు ఏం సుఖం బావుకుంటున్నారో అర్ధం కావడం లేదు అరుంధతికి. అదే అంది కొడుకుతో "కన్నా! ఇదే మన ఊళ్ళో అయితే అన్ని పన్లకీ అంత మంది పనిమనుషులు ఉంటారు. కోడల్ని, పసిపిల్లాడ్ని చూస్కోవడానికి ఆయా రాత్రి పగలు ఉంటుంది. అందుకే నా మాట విని మన దేశం వెళ్లిపోదాం పదరా!" అనిరుధ్ తల్లి మాటలకి నవ్వేశాడు "వదిలేయమ్మా ఇవన్నీ! మనం బజారుకు వెళ్ళి వారానికి సరిపడ్డా సరుకులు తెచ్చుకుందాం పద" అంటూ మాట తప్పించేశాడు. పెద్ద పెద్ద స్టోర్స్ లో సామాన్లు అన్నీ వెదజల్లినట్లుగా ఉన్నాయి. ఎవరికేం కావాలంటే వాటిని బుట్టలో వేసుకుని కంప్యూటర్ దగ్గరకి వెళ్తే సరిగ్గా తూచి పెద్ద బిల్లు కాగితం చేతిలో పెట్టడం చూసి అరుంధతి అబ్బురపడిపోయింది. ఇక్కడకీ మన దేశానికి ఎంత వ్యత్యాసం కదా? ఎంత నిజాయితీ ఇక్కడ?

ప్రతి ఆదివారం ఠంచనుగా భర్త దగ్గర్నించి ఫోన్ కాల్! ఆయన గొంతు వినగానే ఆమె మనసు భారంగా అయిపోతుంది. ఆయనతో కాసేపు ముచ్చటిస్తే ఎంతో ఊరటగా
అన్పిస్తుంది ఆమెకి.

15 రోజుల అనంతరం కోడలు అందమైన బాబుని ప్రసవించింది. సిజేరియన్ చేసి బిడ్డను తీసారు. అంతా సంతోషించారు. బాబుని చూసి! వినాయక నవరాత్రులలో పుట్టాడని... గణేష్ పెట్టాలంది పేరు. కాని ఆమె మాటకి విరుద్ధంగా కొడుకు - కోడలు పిల్లాడికి జశ్వంత్ అని వ్రాయించేశారు. పదిరోజుల పాటు లావణ్య హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. అనిరుధ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళిపోతూ ఉండేవాడు అక్కణ్ణించి ఇంటికి వచ్చేవాడు. అరుంధతి కోడల్ని, మనవణ్ణి చూడాలని ఎంతో ఉవ్విళ్ళూరేది. కాని ఒక్కతే వెళ్ళలేదు. కొడుకు తీసుకువెళ్ళి, మళ్ళీ ఇంటి దగ్గర దింపాలంటే చాలా లేట్ అయిపోతుంది. అందుకని అనిరుధ్ తల్లికి నచ్చచేప్పేవాడు. "అమ్మా! కొన్నిరోజులు ఓపిక పట్టు. లావణ్య బాబుని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది అప్పుడు మనసు తీరా చూసుకుందువుగాని, సరే" అంటూ!

రోజంతా ఒక్కతే ఉండేది ఇంట్లో, ఏం తోచేది కాదు! ఎవరితో మాట్లాడుతుంది? ఇరుగా, పొరుగా? ఇంట్లో బందిఖానాలా అన్పించేది! టైం గడిచేది కాదసలు. ఒంటరిగా ఉండటం నరక ప్రాయంగా అన్పించేది! గట్టిగట్టిగా అరవాలన్పించేది. చాలా భయంగా ఉండేది.

లావణ్య, మనవడు ఇంటికి రాగానే ఒక్కసారిగా పని చాలా పెరిగిపోయింది అరుంధతికి. ఒక్క నిముషం కూడా తీరికలేనట్లు ఊపిరి సలపనంత పని... ఒకటే పని. మనవడితో ఆడుకోవాలన్న ఆనందం, ఆశ ఆవిరైపోయాయి. కష్టమ్మీద నెల గడిచింది. ఇప్పుడు ఆవిడకి మనసు శరీరం రెండూ అలసిపోయినట్లుగా అన్పిస్తోంది. ఆవిడకి ఇంటిమీద గాలి మళ్ళింది. ఇక్కడ ఏ పనిమీద మనసు లగ్నం చేయలేకపోతోంది. అనిరుధ్ ఇంటికి రాగానే "బాబూ! ఇప్పుడు లావణ్య కాస్త తేరుకుంది కదా, నన్ను మనవూరి పంపించేయరా కన్నా! అక్కడ మీ నాన్నగారు ఒక్కరే ఏం తిప్పలు పడుతున్నారో ఏమో! నా మనసు బేజారుగా ఉందిరా! ఇంటికి వెళ్లిపోవాలన్పిస్తోందిరా నాన్నా!" అని జాలిగా అడిగింది.

"ఏంటమ్మా! అలా అంటావు. ఈ ఇల్లు నీది కాదా? నాన్నగారు గుర్తువస్తే ఆయన్నీ ఇక్కడికే పిలుద్దాం. ఇంత ఖర్చుపెట్టి ఈ దేశం తీసుకువస్తే అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలాగే అమ్మా! కనీసం 6 నెలలయినా ఉంటే బాబు కూడా కొంచెం పెద్దవుతాడు. నువ్వు ఇంకా ఏమి చూడలేదు కూడ ఈ దేశంలో! అన్నీ చూసి స్థిమితంగా వెళ్దువు. సరేనా!" అని అనిరుధ్ బతిమాలేసరికి కాదనలేకపోయింది. అరుంధతి మనసు మూలల్లో బెంగ బెంగగా ఉన్నాసరే!

ఒకరోజు సాయంత్రం అరుంధతి వంట చేస్తూ చేస్తూ కళ్ళు తిరిగినట్లు స్పృహతప్పి పడిపోయింది. అదృష్టవశాత్తూ ఆ రోజు అనిరుధ్ ఇంటిదగ్గరే ఉన్నాడు. వెంటనే ఆమెని కార్లో హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడు. టెస్టులు చేసిన డాక్టర్ చెప్పిందేంటంటే "మీ మదర్ కి హై బి.పి. వుంది దాంతో స్పృహ తప్పారు. ఈసారి ఎలానో సేవ్ అయ్యారు. లేకపోతే పక్షవాతం వచ్చే ప్రమాదం వుంది. పూర్తి విశ్రాంతి, ట్రీట్ మెంట్ చాలా అవసరం".

డాక్టర్ అరుంధతిని అబ్జర్వేషన్ లో ఉంచాలన్నారు. కాని అరుంధతి ఒప్పుకోలేదు. "కన్నా! నేనిక్కడ ఒంటరిగా ఉండలేనురా! వీళ్ళ భాష నాకు అర్ధం కాదు, ఈ... తిండి నేను తినలేనురా! ఇంటికి పోదాం పద". అని పట్టుబట్టి ఇంటికి వచ్చేసింది. అనారోగ్యం వల్ల రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. చాలా అవిశ్రాంతిగా ఉంటోంది. ఇంతలో ఆవిడకి కొడుకు - కోడళ్ళ సంభాషణ చెవిన పడింది. "అత్తగార్ని ఏ పనిమీద పిలుచుకొచ్చారో ఆ పని పూర్తి అయింది. కాబట్టి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఆవిడని వెనక్కి పంపేయండి. ఆవిడ కేదయినా పెద్ద జబ్బుగాని చేస్తే ఆ సేవలు ఎవరు చేస్తారు? అంతేకాదు, ఇక్కడ వైద్యం కూడ ఎంత కాస్ట్ లీయో మనకు తెలియందేముంది? డాలర్లు మనం ఎక్కణ్ణించి తేగలం?" "నిజమే! బాగా చెప్పావు. నేను వీలయినంత త్వరగా అమ్మని ఇండియా పంపేసే ఏర్పాట్లు చేస్తాను..." అన్నాడు అనిరుధ్.

అరుంధతి మనసు ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. అయితే వీళ్ళకి అమ్మకాదు, పనిమనిషి అవసరం పడిందన్నమాట. అందుకేనన్నమాట నన్ను పిలిపించింది. మనుషులు ఎంత అవకాశవాదులు? బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆత్మీయతలు వేటికీ విలువ లేనే లేదు! ఇన్నాళ్ళు అహర్నిశలు వీళ్ళ కింద ఇంత చాకిరీ చేసి, ఇవాళ నేను జబ్బుపడే సరికి వాళ్లకి బరువైపోయాను. "ప్లీజ్ అమ్మా! నువ్వు ఎలాగయినా రావాలి" అని పట్టుపట్టింది ఇందుకన్నమాట ఆవిడ మనసు బాధతో మూల్గింది.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి