వైకల్యం - ఉషా వినోద్

Vaikalyam Telugu Story

అద్దం లో మరొకసారి తన రూపాన్ని అటు యిటు తల తిప్పి చూసుకుని, చీర కొంగు పిన్ను సరి చేసుకుని, పంచె వన్నెల చేతి రుమాలు తో, చిన్న పర్సు తో బయలు దేరింది సుస్వర. ఈ వేళ తనను ఒక టీవీ ఛానల్ లో ఒక ఫిజికల్లీ చాలెంజెడ్ పిల్లల పాటలు, నృత్యప్రదర్శనలకు గెస్టు గా పిలిచారు. తను స్టేజి పై పాట పాడితే చాలు ప్రేక్షక లోకం ఈలలు వేసి గోల చేసి "సుస్వర సుస్వర" అంటూ తెగ అరిచేస్తారు. అది తనకు ఎంత బలాన్నిస్తుందో... అది అనుభవైక వేద్యం... అనుకోకుండా తను చెన్నై నుండి హైదరాబాద్ వచ్చినందుకు టీవీ వాళ్ళు ఈ కార్యక్రమానికి జడ్జిగా పిలిచి తనకు సాదర స్వాగతం పలికారు.

ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకుంది తను... అయినా గుర్తుంచుకుని మరీ తననే ఆహ్వానించటం తనకు ఒకింత గర్వం గా కూడా అనిపించింది వెంటనే ఇతర పనులన్నీ పక్కకు పెట్టి ఈ ప్రోగ్రాం కి వచ్చింది సుస్వర. కార్యక్రమం మొదలయ్యింది ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య, ఒక వ్యాఖ్యాత్రి పరిచయ వాక్యాలతో... తన పేరు చెప్పగానే ఇక్కడ కూడా ప్రేక్షకులు, ఇతర జడ్జి లు, పాల్గొనే పిల్లలు అందరు కేరింతలు కొట్టటం మహదానందం కలిగించింది.

వేదిక కి ఒక ప్రక్కన జడ్జి ల వద్ద వచ్చి కూర్చుంది సుస్వర. అంతా తన వైపు ఎంతో సంతోషంగా చూస్తున్నారు, అభిమానంతో నవ్వుతున్నారు అందరికి ఒకసారి హాయ్ అంటూ చెయ్యి ఆడించి పలుకరించింది సుస్వర. ప్రోగ్రాం మొదలయ్యింది ఒక చూపులేని అమ్మాయి వేదిక పైకి వచ్చి ఈ మధ్యనే వచ్చిన సినిమాలోని చక్కని హుషారైన పాట పాడింది. ఎంతో సంభ్రమంగా చూసింది సుస్వర. ఈ పాప పాడుతుంటే కళ్ళు మూసుకుని విన్న సుస్వర కు అసలు నిజంగా సినిమా లో పాట పాడిన గాయని యే గుర్తు వచ్చింది. అందరి చప్పట్లతో తను శృతి కలిపింది తరువాత ఒక చెయ్యి లేని అతను వచ్చి తనకు అమర్చిన కృత్రిమ చేతితో చక్కని డోలక్ వాయించి శహబాష్ అనిపించాడు.

క్షణం సేపు తను కళ్లార్పకుండా అతన్నే చూసింది... మళ్ళీ వ్యాఖ్యాత్రి మరొక అమ్మాయిని పిలిచింది ఆమె, తన ట్రూప్ తో వచ్చి ఒక చక్కని జానపద గీతానికి నృత్యం చేసింది ఆ తరువాత చెప్పారు ఆ అమ్మాయికి అసలు ఆ పాటే వినబడదు అని, ఆమె ట్రూప్ కూడా ఎవరికీ మాటలు రావు, చెవులు వినబడవు అని... ఇది విన్న జడ్జి లు వాళ్ళ మాస్టారు ను అడుగుతున్నారు ఎలా నేర్పిస్తారండీ మరి? అని... ఏదో కొన్ని స్టెప్స్ గుర్తులు చెప్తానని, అలా కొన్ని గంటల పాటు చెప్తే అప్పుడు చేయగలుగుతారు ఆ స్టెప్స్ అనీ... మనకు లయ ప్రకారం మామూలుగా వినబడుతున్న పాట వాళ్ళు వినలేరనీ... అక్కడున్న అందరు అవాక్కయ్యారు ఇది విని.

ఈ పిల్లలు లోపములతో పుట్టినప్పుడు ఎంతో బాధ పడి ఉంటారు వారి తల్లిదండ్రులు, కాని నేడు? వీరు అన్ని అవయవాలు ఉన్న మన లాంటి వాళ్ళ కన్నా మిన్నగ ఈ ప్రదర్శనలు ఇస్తుంటే వారి కన్నవారి ముఖాల్లో తాండవించిన ఆనందం చూస్తుంటే అది నింగిని ఆనేంత ఎత్తుగా ఉంది ఆ దృశ్యం. సుస్వర ఒక్కసారి స్థాణువు లా అయ్యింది.

ఇంతలో ఒక్కొక్కరికి బహుమతులు అందజేశారు జడ్జి లు తన మాట గా ఏమి చెప్పాలా అని ఆలోచిస్తున్న సుస్వర తో వ్యాఖ్యాత్రి ఇలా అంది సుస్వర గారు! మొట్ట మొదట గీతం పాడిన పాపకు ఒక కోరిక ఉందట మీతో ఫోటో దిగాలని ప్లీజ్ మీరు వేదిక పైకి రండి అని... ఒక్క ఉదుటన సుస్వర అక్కడికి చేరి ఆ పాపను ఎత్తుకుంది ఆమె కళ్ళలో కన్నీరు ధారాపాతం గా వస్తూనే ఉంది.

ఆ పాప ఇలా అంది ఈ వేళ నా జన్మ ధన్యం అయ్యింది మేడం గారు! అని... సుస్వర కళ్ళు తుడుచుకుని ఆ పాపను ఎత్తుకునే ఫోటో తీయించుకుంది... హు... అసలు వీళ్ళు కాదు... తను వికలాంగురాలు... మానసిక వికలాంగురాలు... ఎందుకంటే వీరిని ఆ భగవంతుడు ఎందుకలా పుట్టించాడో తెలియదు కాని ఆ లోపాన్ని అధిగమించే మరో శక్తి యిచ్చాడు ఆ ప్రతిభ తో వీరు తమ వైకల్యాన్ని సైతం మరిచేలా సంతోషంగా ఉండేలా చూసాడు... కాని తను? కోపం, ద్వేషం, అహంకారంతో మానసిక వికలాంగురాలయ్యింది.

అందుకు ఉదాహరణ ఈ వేళ యింట్లో తాజాగా జరిగిన సంఘటనే... ఉదయం యింట్లో పని చేసే అమ్మాయి ఏదో పనుండి త్వరగా రాలేదు అని తాను ఎన్నో మాటలు అంది కావాలని పని ఎగ్గొట్టావు, ఇంకోసారి యిలా చేస్తే తీసేస్తాను పనిలో నుండి అని అన్నది తర్వాత వెళ్ళేటప్పుడు ఆమే తన కొడుక్కి జ్వరం వస్తే డాక్టరు వద్ద చూపించి వచ్చేసరికి ఆలస్యం అయ్యిందని చెప్పింది సర్లే అనుకున్నా అప్పుడు తెలియలేదు కాని యిప్పుడు అనిపిస్తోంది... తానలా తెలుసుకోకుండా తిట్టడం తప్పే అని, కొంచెం సేపు ఆగి ఆలోచించి ఉంటే ఆ కోపం తగ్గేది పాపం ఆ తిట్లు ఆమెకు అందరి ఇళ్ళల్లో అలవాటయ్యి ఉంటుంది కనుక ఏమీ అనుకోకుండా పని చేసి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఎవరికి లోపం ఉందో ఇక్కడ తనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

ఈ పాపను ఎత్తుకుంటే తన పని అమ్మాయి బిడ్డను ఎత్తుకున్నట్లు గా ఉంది... తద్వారా తన పశ్చాత్తాపం తనకు ఎంతో ఊరటను కూడా ఇచ్చినట్లైనది సుస్వర కు... ఒకే మాట పలికింది..." పాపా నేనే నీతో ఫోటో తీయించుకుందామని అనుకుంటున్నాను తల్లీ! ఈ వేళ నా జన్మ నిజంగా ధన్యమైనది..." అందరి చప్పట్ల మధ్య పాపకు ముద్దిచ్చి గుండెకు హత్తుకుంది సుస్వర. ఇక నుండి ఈ కోపం అనే మానసిక వైకల్యాన్ని జయించాలి... అని గట్టి నిర్ణయం తీసుకుంటూ వేదిక నుండి మరలింది సుస్వర!

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ