కామెడీ దెయ్యాలు - సాయి సోమయాజులు

Commedy Dayyalu

దెయ్యాల్లో కామెడీదెయ్యాలుంటాయా?... ఉంటాయండి బాబు. తల్చుకుంటే కిత కితలు పెట్టినట్టు నవ్వొస్తూంది.

మరేమో ఇప్పటిదాకా గుండెలరచేత పెట్టుకుని... కళ్ళు విప్పార్చుకుని... వెంట్రుకలు నిక్కబొడుచుకునుండగా హిచ్ కాక్ కథలు చదివి రామ్ గోపాల్ వర్మ హారర్ సినిమాలు చూసి ధడుసుకున్న మనం దెయ్యం అనగానే భయపడ్డం మామూలే!

కాని నేను చెప్పేది వింటే మీకూ నవ్వు రావడం ఖాయం. దెయ్యపు భయాన్ని మీ డిక్షనరీలోంచి తుడిచెయ్యడం డబుల్ ఖాయం.
మరి చదవండి.

*****


నేను ఊరికి దూరంగా వున్న ఆ ఇంటిలోకి అద్దె చాలా తక్కువని దిగాను. ఇల్లు కూడా ఐసోలేటేడ్ గా వుండేది. సాయంత్రం ఏడయిందంటే అంతా నిర్మానుష్యం. చెప్పొద్దూ నాకూ భయంగానే వుండేది.

ఒకరోజు రాత్రి నేను కప్పుకున్న దుప్పటి పక్కకి తొలగించినట్టనిపించింది. నేను మీదకి లాక్కున్నాను. మళ్ళీ తొలగింది. నేను మళ్ళీ లాక్కున్నాను. కాని ఈసారి భయంతో. "ఎన్నిసార్లు దుప్పటి లాగాలిరా" అని కీచు గొంతు వినిపించింది. అంతే ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టేశాయి. నాలుక దాహంతో పిడచకట్టుకు పోయింది.

నేను ఇహ తప్పదని దుప్పటి తెరిచి చూద్దును కదా... నా పక్కగా తెల్లని దుస్తుల్లో జుట్టు విరబోసుకున్న దెయ్యం కూర్చునుంది. నా పై ప్రాణాలు పైకే పోయాయి.

"అహ్హహా... నన్ను చూస్తే భయం వేసింది కదూ" అంది కిచ కిచ నవ్వుతూ.

"వే..స్తోం..ది" పొడి పొడిగా అన్నాను.

"నేను నిన్నేమీ చేయను... నేను చెప్పినట్టు వింటే!" అంది.

"అలాగే" అన్నాను నీరసంగా.

"నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం. నన్ను నవ్వించాలి. నన్ను ఎంత నవ్విస్తే నీకు అంత ఉపకారం చేస్తాను" అంది.

"దీని దుంపతెగా... దీనికి జోక్స్ ఇష్టమా? నాకు హాస్యరచనలు చాలా ఇష్టం. వాటి కలెక్షన్ నా మెదడు మెమరీలో ఎప్పుడూ భద్రంగా వుంటుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మేరేజెస్ కి... ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణాన్ని నవ్వులమయంచేస్తా. అందుకే నన్నందరూ ఆహ్వానిస్తారు. నా అదృష్టం బాగుండి అదే అభిరుచి వున్న దెయ్యం తటస్థపడింది." అనుకుని రెండు జోక్స్ చెప్పాను. నవ్వింది. మరో రెండు వదిలాను పడీ పడీ నవ్వింది. "మ..ళ్ళీ రే.పొస్తా..ను". అని పొట్టచేతపట్టుకుని నవ్వుతో లుంగ చుట్టుకుపోతూ అంది.

చెప్పొద్దూ నాక్కాస్త ధైర్యం చిక్కింది. "రా..కానీ రోజుకో అరగంట మాత్రమే చెబుతాను. నాకు విశ్రాంతి కావాలి కదా మళ్ళీ మరుసటిరోజు పనిచెయ్యడానికి" అన్నాను.

"నేను వరమిస్తున్నాను. అలాగే" అంది.

హమ్మయ్య దెయ్యంవదిలింది. అనుకుని నిద్రపోయాను.

*****

మరుసటి రోజు తన తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళతో పాటు సకుటుంబ సపరివారంగా వచ్చింది.

అన్ని దెయ్యాల్ని ఒక్కసారి చూసేసరికి నాకు గుండె జారిపోయింది.

కాని అవన్నీ నన్నేం చేయవని మాటిచ్చేసరికి కాస్త ధైర్యం వచ్చింది.

నేను జోక్స్ చెప్పడం ప్రారంభించాను. అవి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాయి.

అలా ఒక వారం రోజులు గడిచాయి. ఒక రాత్రి నాకు దాహం వేసి నీళ్ళు తాగడానికి లేవబోయాను. అవి "ఎక్కడికీ?" అన్నాయి. నేను దాహం వేస్తోందనగానే అందులోంచి ఒకటెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. అంతే కాదు "నీకేం కావలసి వచ్చినా మమ్మల్ని అడుగు మేము తెచ్చి పెడతాం... జోక్స్ చెప్పవా ఫ్లీజ్" అన్నాయి.

అర్థమయింది. అవి నా జోక్స్ కి అట్ట్రాక్ట్ అయి... అడిక్ట్ అయి లొంగి పోయాయి. ఇప్పుడు నాలో భయం చచ్చి ధైర్యం చోటు చేసుకుంది. నెమ్మది నెమ్మదిగా ఇల్లు ఊడవడం... బట్టలుతకడం... వంట వండడం అప్పజెప్పాను. అవి చిటికెలో చేసి నా ముందు బుద్ధిగా కూర్చోసాగాయి జోక్స్ చెప్పమని.

ఆ తర్వాత, రోజు కింతని డబ్బు అడగడం మొదలెట్టాను. అవి తీసుకొచ్చి ఇయ్యసాగాయి. ఇప్పుడు లోకం కోసం ఉద్యోగం చేస్తున్నాను. కాని నేను లగ్జరీగా గడుపుతున్నది మాత్రం వాటిదయవల్లనే.

నా జోక్స్ విని విని జనంతో కామెడీ చెయ్యడం మొదలెట్టి తెగ ఎంజాయ్ చేస్తున్నాయట అవి. చెప్పి నన్నూ నవ్విస్తున్నాయి. ఇంతకు ముందు అహర్నీశలూ టెన్షన్ తో వాటికీ బి పీ, సుగర్ లు వచ్చి తెగ బాధపడిపోయాయట. ఇప్పుడవి రిలాక్స్ డ్ గా హాప్పీగా కాలంగడుపుతున్నాయట. నాకు పెళ్లయింది. నేనూ నా పెళ్ళాం కూడా ఇంటి పనేం చేయం. టీ వీ సీరియల్ లా ఇప్పుడు వాటికోసం 2500 వ ఎపిసోడ్ జరుగుతోంది.

మనిషి తెలివయినవాడు. సమస్త జంతుజాలాన్ని ప్రకృతిని లొంగదీసుకున్నాడు. రోదసీకి వెళ్ళాడు. పాతాళపు రహస్యాలు అవగతం చేసుకున్నాడు. అలాంటిది దెయ్యాలకీ భూతాలకీ భయపడటమేమిటి? నాన్సెన్స్. బలహీనతలు మనుషులతో పాటు దెయ్యాలకీ ఉంటాయి. తెలుసుకుని తడిగినతోం చెయ్యాలి అంతే! ఓకే మరి టైమయ్యింది వాటిని ఎంటర్ టైన్ చెయ్యాలి కదా. కామెడీ దెయ్యాలుంటాయని నమ్మారు కదా మీరు! ఇప్పుడు మీరు దెయ్యం కనిపిస్తే భయపడరు ఇన్ ఫాక్ట్ కనపడాలని కోరుకుంటున్నారు నాకు తెలుసు దాని బలహీనత తెలుసుకుని మీరు లాభపడదామని. ఒకే ప్రొసీడ్... బెస్టాఫ్ లక్!

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ