నీ వెచ్చటి కౌగిట్లో... - పి.వి.డి.ఎస్.ప్రకాష్

nee vecchati kougitlo

"ఎర్రగా బుర్రగా ఎంత అందంగా ఉందో? ఇంతందాన్ని చూసిన మనసు ఉరకలేయకుండా ఊరుకుంటుందా? తననొక్కసారి దగ్గరగా తీసుకుని తనివితీరా కౌగిలించుకోవాల్సిందే..." అనుకోవడమే తరువాయి తనని ముట్టుకునేందుకు ముందుకొచ్చాడు రాజు. సరిగ్గా అప్పుడే అతడి గొంతు నుంచి కూనిరాగంగా వెలువడిందా పాట-' ఎంతందంగా ఉన్నావే.....ఎవరే నువ్వు?"

ఎంతగానో నచ్చిన తనని ముట్టుకోబోయేంతలోనే అక్కడికొచ్చిన ఓ వ్యక్తి -" ఏం కావాలి?" అని గద్దిస్తూ అడ్డగించాడు.

" అది....అది..." చూపుడు వేలితో చూపిస్తూ నెమ్మదిగా అన్నాడు.

" మహా కాస్ట్ లీ. భరించే శక్తి నీకుందా ?" ఎకసెక్కంగా అడిగాడతడు.

" ఎంత ?"

" నాలుగొందలు..."

" నాలుగొందలే..." ఓ క్షణం అవాక్కయిపోయాడు రాజు.

" చూసావా? ధర చెప్పగానే గుడ్లు తేలేసావు. నచ్చడమే కాదు నచ్చినదాన్ని సొంతం చేసుకోవడానికి కూడా దమ్ముండాలి... సొమ్ముండాలి..."

" నువ్వలా చూస్తుండు. నే మళ్ళీ వచ్చి కచ్చితంగా దాన్ని నా సొంతం చేసుకుంటాను "అన్నాడు రాజు ఏ మాత్రాం బింకం సడలకుండా.

" చాలామందిని చూసాను. ఇష్టమంతా కళ్ళల్లోనే....కౌగిట్లోకి తీసుకోలేరు..." ఎద్దేవా చేసాడతడు.

" అది ఎవరికీ సొంతం కానీకు. నే మళ్ళీ వస్తాను..." చెప్తూనే రాజు అక్కడ్నుంచి కదలలేక కదలలేక కదిలాడు. అలా కదుల్తూనే మళ్ళీ మళ్ళీ వెనక్కి చూస్తూ దూరం చేస్తున్న ప్రతి అడుగునీ భారంగా వేస్తున్నాడు.

తను నడుస్తున్న రోడ్డుమీద వేగంగా పరుగులు తీస్తున్న కార్లు, ఆటోలు, స్కూటర్లు తనకు మాత్రం కాలినడకే శ్రణ్యం....కొందరికే భోగభాగ్యాలు. కొందరికి మాత్రమే కోరినవన్నీ క్షణాల్లో చెంతకు చేరే స్వర్గసౌఖ్యాలు. తనలాంటివాళ్ళకు మాత్రం ప్రపంచంలో ప్రతీదీ 'అందని ద్రాక్షే.'ఆపై బతుకంతా భరించరాని పులుపే.

ఆకలేసి అయిదు నక్షత్రాల పూటకూళ్ళ సత్రం వైపు చూపు సారించాడు రాజు. ఆ తర్వాత రోడ్డు పక్క మురికి కాల్వ దగ్గర వెలసిన పాకహోటల్లోకి వెళ్ళాడు. ఏ మధ్యాహ్నమో చేసిన చల్లారిన రెండు ఇడ్లీల్ని పులిసిన చట్నీతో నంజుకుని మరీ ఆబగా తినేసాడు. ఆకలి...భరించరాని ఆకలి. పగలొక ఆకలి. రాత్రి నరకం చూపించే మరో ఆకలి. బతికున్నంతకాలం ఆకలిని తీరుస్తూనే ఉండాలి. తీర్చకపోతే అది మనల్నే కాల్చేస్తుంది. కాటేస్తుంది.

రాజుకి మళ్ళీ అదే గుర్తొచ్చింది. ' ఎంతందంగా ఉంది...ఎలాగైనా సొంతం చేసుకోవాలనిపించేలా ఉంది.' అనుకున్నాడంతడు.

" అసలే కొండప్రాంతం. ఆపై చలికాలం. శరీరాన్ని మెత్తగా తాకుతూ చురకత్తిలా కోసేస్తున్న చలి. ఆ పై సుఖాలు కోరే పైలా పచ్చీస్ వయసు. ఇన్నేళ్ళ జీవితంలో ఒక్కరాత్రయినా హాయిగా గడిపిన క్షణాలున్నాయా? పుట్టిన దగ్గర్నుంచీ...కష్టాల్తోనే సహవాసం. ఛీ...ఛీ... !" తనని తాను ఛీదరించుకున్నాడు రాజు. అలా ఛీదరించుకోవడం ఎన్నోసారో? అతడికే లెక్కతెలీదు.

మాటిమాటికీ అదే గుర్తొస్తోంది. ఎర్రెర్రని గులాబీలా ముద్దొస్తున్న తనని ఒక్కసారి దగ్గరగా లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకున్నానన్న అనుభూతితో పరవశించిపోతున్నాడు. ఒక్కసారి తను ఒళ్ళంతా వెచ్చగా తాకితే చాలు. ఎన్ని చలికాలాలనిన ఇట్టే ఈదేయొచ్చు...కలల్లో తేలిపోతున్నాడు రాజు.

" ఎలాగైనా సరే తనని సొంతం చేసుకోవాల్సిందే. చలినే వెలివేసే నెచ్చెలి తోడుంటే తెల్లార్లూ సుఖమే కదా! తను కౌగిట్లోకి రావాలంటే కాసులు కురిపించాల్సిందే. అందుకోసం ఎంతకైనా తెగించాల్సిందే." అనుకున్నాడు రాజు.

నెల్లాళ్ళు గడిచినా ఆ కోరిక చావలేదు రాజుకి.

" తను సొంతం కావాలంటే డబ్బుండాల్సిందే. ఇంతకీ...తన దగ్గర ఎంత డబ్బుంది?" అనుకున్నదే తడవు గదిలో ఓ మూల ఉన్న తన ఒక్కగానొక్క ఆస్తి అయిన పెట్టె దగ్గరకు చేరుకున్నాడు రాజు. పెట్టె మూత తీసి అందులోకుక్కిన బట్టలన్నీ బయటికి పెకిలించి లోనికి తొంగిచూసాడు.

పెట్టె అడుగున ఔఇదు, పది, యాభై రూపాయల నోట్లతో పాటు మరికొన్ని చిల్లర నాణాలు కొన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక్కోనోటునీ అపురూపంగా తీస్తూ లెక్కపెట్టసాగాడు. "పది...ముప్పై....ఎనభై..నూరు..నూటయాభై..." కరెన్సీ నోట్లనే కాదు, నాణాల్ని కూడా లెక్క పెట్టసాగాడు. మొత్తం మూడొందల రూపాయలు. ఆర్నెల్లబట్టీ అడపాదడపా దాస్తూ వస్తున్న సొమ్ము అంతా కలిపితే...కేవలం మూడొందలే?" చేతిలో కనీసం అయిదొందలైనా లేకుంటే ఆ ముచ్చట తీరదు. అక్కడికి వెళ్ళి రావడానికే యాభై రూపాయలు. మధ్యలో కడుపులో ఎలకలు పరిగెడితే తరిమికొట్టడానికి మరో యాభై. ఆ ఖర్చుపోను చేతిలో నికరంగా మిగిలేది కేవలం రెండొందల రూపాయలే.

" ఊహూ! ఈ డబ్బు చాలదు. మరో మూడొందలు అప్పు చేస్తే తప్ప తను నా సొంతం కాదు.." లెక్క కట్టాడు రాజు.

ఓ టైలర్ దగ్గర పనిచేస్తున్నాడు రాజు. చాలీచాలని జీతంతో పూటగడవడమే కష్టమైన తరుణంలో తనని నమ్మి అంతసొమ్ము అప్పుగా ఎవరిస్తారు? ఎందుకిస్తారు??" ఒక్కసారిగా దిగులు ఆవరించిందతడిని. కోపం.....పిచ్చికోపంతో ఊగిపోతున్నాడు.

తనకొచ్చిన ఆ కోపం తీర్చుకునేందుకు మార్గం కనిపించడంలేదతడికి పుట్టగానే తల్లిని, నెలల పిల్లాడిగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఆదరించి అక్కున చేర్చుకునేవాళ్ళెవరూ లేక ఆ పంచన, ఈ పంచన అనాధలా పెరిగిన తను ఎట్టకేలకు ఎలాగోలా కాజాలు కుట్టే పనికి కుదిరి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఫ్యాంట్లూ, షర్టులు అలవోకగా కుట్టేయడం నేర్చుకున్నాడు. అయితే, రెడీమేడ్ దుస్తులు మార్కెట్ ని ఎడాపెడా ముంచేస్తున్న ఈరోజుల్లో పండుగలు, పబ్బాలొచ్చినప్పుడు కూడా చేతినిండా పని ఉండడంలేదతడికి. నచ్చిన బట్టలు తీసుకుని టైలర్ దగ్గరకొచ్చి కొలతలిచ్చి డ్రెస్ లు కుట్టించుకునే సంస్కృతి నెమ్మదినెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోతోంది. అయినా, అక్కడక్కడ... అప్పుడప్పుడు కొంతమంది రెడీమేడ్ డ్రెస్ లకన్నా టైలర్ కుట్టిన దుస్తుల్నే ధరిస్తుండడంతో కొద్దోగొప్పో పని లభించడంతో అతికష్టం మీద రోజులు వెళ్ళదీస్తున్నాడు.

లోకంలో తనపై ప్రేమ చూపించేందుకు ఎవరు లేనట్టే, తను కోపగించుకోవడానికి కూడా ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో అవసరాన్ని గమనించి మరీ డబ్బు ఎవరిస్తారు? తనకు తెలిసినవాళ్ళంతా టైలరింగ్ షాపుల్లో పనిచేసేవాళ్ళే. వాళ్ళెవరిదగ్గరా అదనంగా డబ్బులుండవు. అయినా, అడిగితే లేదనిపించుకుని నిరాశపడడం తప్ప ఫలితం కూడా ఉండదు.

" అవసరమైన డబ్బెలా సంపాదించడం?" ఆలోచిస్తున్నాడు రాజు.

" డైరెక్ట్ గా ఓనర్ నే అడిగితే?" అప్పుడప్పుడు అలా అతడు అనుకున్న సంగతి గుర్తొచ్చింది. అయితే, అడిగిన వెంటనే స్పందించి ఇచ్చే మనస్తత్వం కాదతడిది. సవాలక్ష యక్షప్రశ్నలడుగుతూ జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఎదుటివాడు నీరసించి పడిపోతుంటే ఆ స్థితిని గమనిస్తూ రాక్షసానందం పొంది చివరాఖరికి ఎంతోకొంత సాయం చేస్తాడు. అతడ్ని అప్పడగాలంటే ముందుగా ఆ నరకాన్ని అనుభవించేందుకు సిద్ధపడాల్సిందే. ఔనుమరి! అతడిదగ్గరే కష్టపడి ఊడిగం చేస్తున్నప్పుడు...డబ్బు సాయం చేసి అతడే ఆదుకోవాలి" ఆ ఆలోచనతో కాస్త ధైర్యం వచ్చింది రాజుకి.

" ఏరా...పనైపోయినా ఇంటికెళ్ళకుండా ఇక్కడే నిల్చున్నావు? నాతో పనేమైనా ఉందా?" కళ్ళముందే నిల్చున్న రాజుని చూసి ఆ ప్రశ్న అడిగాడు టైలరింగ్ షాప్ ఓనర్ అప్పల నరసయ్య.

సమాధానం చెప్పలేదు రాజు. అలాగే నిల్చున్నాడు.

" చెప్పు, ఏం తప్పు చేసావని నాముందు అలా ముద్దాయిలా నిల్చున్నావు, ఏం కావాలి?" రెట్టించి మరీ అడిగాడు. చప్పున అడిగేందుకు మొహమాటం అడ్డొస్తోంది రాజుకి. అడక్కుండా వెనక్కి వెళ్ళిపోదామనుకుంటుండగానే ఎర్రగా బుర్రగా ఉన్న తను ఊరిస్తూ, ఉడికిస్తూ గుర్తొస్తోంది. ఈరాత్రే తనని సొంతం చేసుకోవాలంటే నోరు విడిచి అడక్కతప్పదు. ఒక్కసారి సొంతం చేసుకుంటే...ఎప్పటికీ తనతోనే ఉంటుందిక....

" మాట్లాడకుండా ముంగిలా నువ్వుండగలవేమో కానీ, అవతల నాకు చాలా పనులున్నాయి.." అంటూ లేచి వెళ్ళిపోబోయాడు అప్పల నర్సయ్య.

" ఆయ్యగారూ!" అన్నాడు రాజు అతడు వెళ్ళిపోకుండా కాళ్ళకి బంధం వేస్తూ.

" ఊ...!"

" మూడొందలు కావాలి"

" ఏంతీ...రూపాయలే..?"

" ఔను...మూడొందల రూపాయలు. నా జీతంలోంచి నెలనెలా కొంత తీసుకోండి." అన్నాడు రాజు.

" సడెన్ గా ఇప్పుడంత డబ్బు ఎందుకురా? అమ్మాయి దొరికి పెళ్ళాడబోతున్నావా?" ఎకసెక్కాలాడాడు అప్పలనర్సయ్య.

"ఊరుకోండి..మూడొందల్లో పెళ్ళెక్కడవుతుందీ?"

" పెళ్ళి సరే..పిల్ల దొరుకుతుంది కదా? అదే, అంగట్లో అమ్మాయి..." అన్నాడు అప్పలనర్సయ్య. అమ్మాయిలె గురించి మాట్లాడడంలోనే అప్పలనర్సయ్య అంతులేని ఆనందాన్ని జుర్రుకుంటాడు.తనదగ్గర పనిచేసే కుర్రాళ్ళతో అలాంటి విషయాలు ప్రస్తావిస్తూ నోటి దురద తీర్చుకుంటాడు.

ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు రాజుకి. అలాగే మౌనంగా ఉండిపోయాడు.

" అసలే చలికాలం. తట్టుకోలేకపోతున్నావా? ఏ చెత్తోపోగేసుకుని ప్రతిరాత్రీ చలిమంటలేసుకుంటూనే ఉన్నారుగా" అడిగాడు మళ్ళీ అప్పలనరసయ్య.

" వేసుకుంటూనే ఉన్నామండీ...అయినా సరే, ఈసారి చలి చాలా ఎక్కువైంది.."

" వయసులో ఉన్నోడివి. చలీగిలీ నిన్నేం చేస్తాయిరా? వెర్రిమొర్రి ఆలోచనలు మానేసి ఇంటికెళ్ళి ఎంచక్కా దుప్పట్లో దూరిపో" కసురుకున్నాడు అప్పలనరసయ్య రాజు చెప్పబోయేదేమిటో అంచనాకి వచ్చేసినట్టు.

" అయ్యగారూ...మీ కాళ్ళు మొక్కుతా..వడ్డీ ఎంతైనా సరే దయచేసి అప్పుగా ఇవ్వండి..." కాళ్ళావేళ్ళా పడ్డాడు రాజు.

" సరే..ఇంతిదిగా అడుగుతున్నావు కనుక...ఇస్తాను.అసలే నీ జీతం తక్కువ. ఆపై నెలనెలా వడ్డీతోబటు అసలు కొంత తీర్చుకుంటె ఇబ్బంది పడతావేమో...నింపాదిగా మరోసారి ఆలోచించు" అన్నాడు అప్పలనరసయ్య.

తనదగ్గర పనిచేసేవాళ్ళకైనా ముందస్తు అప్పుగా కొంత సొమ్ము ఇచ్చేందుకు ఒకటికి నాలుగుసార్లు వెనుకాడుతాడతడు. ఇప్పుడూ అంతే. రాజుకి అప్పు ఇచ్చేందుకు మనస్సు అంగీకరించడంలేదు. అలాగని ఇవ్వకపోతే రాజు మరో టైలర్ ని వెతుక్కున్ని వెళ్తాడు. ఆ సంగతి అతడు నిల్చున్న తీరే చెప్పక చెప్తోంది. ఎంతపనైనా కిక్కురుమనకుండా చేసే రాజులాంటివాళ్ళని వదులుకోడానికి అప్పలనరసయ్యలోని యజమాని "ససేమిరా" అంటున్నాడు. ఎటూ తేల్చుకోలేక మరోసారి ఆలోచించమంటూ నిర్ణయాన్ని రాజుకే వదిలిపెట్టేసాడు.

" ఆలోచించాకే అప్పు తీసుకోవాలనుకుంటున్నానండీ.." బతిమాలుతున్నాడు రాజు.

" సరే " విధిలేని పరిస్థితిలో అప్పలనర్సయ్య వెంటనే బీరువా నుంచి వందరూపాయల నోట్లు మూడు తీసి రాజు చేతిలో పెట్టాడు. ఆ నోట్లని చూడగానే రాజు కళ్ళల్లో ఆనందం అంబరాన్ని తాకింది. కాళ్ళు నేలమీద నిలవలేదు. ఎంత తొందరగా బయటపడి....ఎర్రగా బుర్రగా ఉన్న తనని సొంతం చేసుకుందామా...అనే ఆలోచనలు అతడ్ని ఓ క్షణం నిలవనీయలేదు.

***

" ఏదీ....ఎక్కడ?" అడిగాడు రాజు...

"ఏదీ?" అర్థం కానట్లు చూసాడతడు.

"నెల్లాళ్ళక్రితం ఇక్కడే చూసాను...అప్పుడు చాలినంత డబ్బు చేతిలో లేదు. ఇదిగో...ఇప్పుడు అడిగినంత డబ్బు ఇస్తాను. ఎర్రగా, బుర్రగా ఉన్న అదే నాక్కావాలి." కళ్ళనిండా ఆశ నింపుకుని మరీ అడుగుతున్నాడు రాజు.

"ఎర్రగా...బుర్రగా ఉన్నదా?" అని ఓ క్షణం ఆగి "ఇప్పుడది లేదు" అన్నాడతడు.

"ఎందుకు లేదు?" అడిగాడు రాజు చిన్నబోయిన మొహంతో.

"బేరం కుదిరాక ఇంకా అది ఇక్కడెందుకు ఉంటుంది? అయినా, అదొక్కటేనా? ఇంత సరుకుంది...చూసి నచ్చింది ఎంచుకో"
"చూసీ చూడంగానే నచ్చింది అదే. అప్పట్నుంచీ ప్రతిరాత్రీ కలలో అదే కనిపించి కవ్వించింది. అదే కావాలి. అది లేకుండా నేనిక్కణ్ణుంచి కదల్లేను.." చిన్నపిల్లాడిలా మారాం చేసాడు రాజు.
" ఏదైనా నచ్చినప్పుడే సొంతం చేసుకోవాలి. ఆలసించిన ఆశాభంగం అన్నమాట నువ్వు విన్లెదా? చేజారిన తర్వాత అదే కావాలంటే కుదరదు. ఇప్పుడొక్కటే పరిష్కారం. అందుబాటులో ఉన్నదాన్నే అనుభవించాలి. కాదూ కూడదంటావా...కోరికలు చంపుకుని ముక్కుమూసుకుని తపస్సు చేసుకోవాలి. లోకంలో ఎక్కడైనా ఇదే సిద్ధాంతం. ఇందులో ఏ రాద్ధాంతం లేదు......" ఖరాఖండీగా చెప్పినా అతడు నిజమే చెప్పాడు. అప్పుడు మొదటిచూపులోనే తను నచ్చిన సంగతి నిజమే. కానీ ఇప్పుడు లేదు. అలాగనీ.....వెనక్కి వెళ్ళిపోతే ఇన్నాళ్ళూ తనని రగిలిస్తున్న కోరిక తీరదు.
రాత్రయితే ....అదే ఒంటరితనం...పంజా విసుర్తూ అదే చలిపులి. నిలువెల్లా వణుకుతూ శరీరం. ఎంత చెత్త తగలేసి ఎన్నిరాత్రులు వెలిగించినా తను కోరుకున్న వెచ్చదనం వరించి వస్తుందా? ఎలాగో...అప్పుచేసి అనుకున్న డబ్బును వెంట తెచ్చుకున్నాడు. ఇక్కడిదాకా వచ్చి ఇప్పుడింక వెనుకడుగెందుకు? అది కాకపోతే...మరోటి. అంగట్లో సరుకులకి లోటుంటుందా? అనుకున్నాడు రాజు.
" సరే...చూపించండి. మరేదైనా నచ్చుతుందేమో చూస్తాను..." అన్నాడు రాజు.
" అద్గదీ...మనిషంటే నీలా ఉండాలి. మనిషంటే ఎవరో తెలుసా?" అడిగాడతడు.
" ఊహూ...! తెలీదు"
"మనీ...షీ...భాయ్...ఈ లోకంలోని ప్రతి ఒక్కడికీ ఆసక్తి కలిగించేవి ఈ రెండే. చేతుల్లో పుష్కలంగా డబ్బుండాలి. ఆ డబ్బుతో ఎంజాయ్ చేసే దమ్ముండాలి. " తనకు తెలిసిన ఫిలాసఫీ ఒక్కోదాన్ని చూపిస్తున్నాడతడు.
" నిజానికి ఈ వ్యాపారం చేయడం చాలా కష్టం. వచ్చిన ప్రతిదీ నచ్చాలనీ లేదు. కానీ, నచ్చేలా ఆకట్టుకుని కనికట్టు చేయాల్సిందే.. అంతేనా? రోడ్ సైడ్ న పెట్టుకునే ఈ వ్యాపారమంటే అందరికీ లోకువే. మరోపక్క పోలీసోళ్ళ మామూళ్ళూ, బెదిరింపులూ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయినా సరే. మీలాంటి కస్టమర్లు కష్టపడకుండా ఉండాలనే ఈ వ్యాపారాన్ని నడుపుతున్నాం.? వాడు చెప్తున్నది వింటూ ప్రతిదాన్నీ పరిశీలనగా చూస్తున్నాడు రాజు.
అయినా...అతడి మనసులో అంతకుముందు చూసినదానిపైనే మనసుండిపోయింది.
" ఏం నచ్చట్లేదా..?"
" నచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నా..."
"ఏదో ఒకటి నచ్చుకోండి. జీవితాంతం ఇది మన వెన్నంటి ఉంటుందా ఏమిటి? ఇవాళ ఇది...రేపు ఇంకోటి...ఎల్లుండి మరోటి...ఇంత అందంగా ఉన్నా మీకు నచ్చడం లేదంటే...ఆశ్చర్యంగా ఉంది..."
" అందరికీ అన్నీ నచ్చాలనేం లేదుగా" అన్నాడు రాజు అంతకంటే ఏమనాలో తెలీక.
" కరెక్టే కానీ నలుపంత నాణ్యమైనది మరోటి లేదంటారు. నల్లగా ఉన్నా ఎంత బ్యూటీగా ఉందో...? బ్లాక్ బ్యూటీ " అతడు చెప్తూంటే తాకి చూసాడు రాజు .
మెత్తగా తగలడంతో ఒళ్ళు ఝల్లుమంది.
"నచ్చిందా? అయితే, అయిదొందల యాభై..." అన్నాడతడు.
" అప్పుడు ఆ ఎర్రది నాలుగొందలే అన్నావు?"
" అది నాలుగొందలే...ఇప్పుడది లేదు కదా...ఈ బ్లాక్ బ్యూటీ మహా కాస్ట్ లీ. గురూ" మడత పేచీ పెట్టాడతడు. ఇప్పుడిది కాదని వెనక్కి పోతే ఆ తర్వాత మళ్ళీ ఇది దక్కదేమో?" చలికాలంలో దీని డిమాండే వేరు. కౌగిట్లో చిక్కితే ఆ వెచ్చదనమే వేరు. డబ్బిచ్చి సొంతం చేసుకున్నాడు రాజు.

*************
రాత్రి బాగా ఎంజాయ్ చేసినట్టున్నావ్?" అడిగాడు ఫ్రెండ్ రాజుని.
"నీకెలా తెలుసు?"
"అప్పలనర్సయ్య దగ్గర మూడొందలు అప్పు తీసుకున్న సంగతి నాకు తెలుసు కదా!"
" ఔను, తీసుకున్నాను. ఈసారి చలిని అస్సలు భరించలేకపోతున్నాను. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా వదలని చలి. ఎన్ని చలిమంటలేసినా తగ్గని వణుకు...అందుకే...."
"అలాంటి సమయాల్లోనే 'బ్లాక్ డాగ్ అదే, నల్లకుక్కా సాయం తీసుకోవాలి. ఒక్కోగుక్క గొంతు జారుతుంటే చలిపులి తోకముడుస్తుంది."
" బ్లాక్ డాగ్ ఎప్పుడైనా తాగావా?" అడిగాడు రాజు ఆసక్తిగా.
"అంత భాగ్యం కూడానా....విన్నానంతే, అద్సరే...ఎలా ఎంజాయ్ చేసావో చెప్పుగురూ"
" బ్లాక్ బ్యూటీతో ఎంజాయ్ చేసాను........."
బ్లాక్ బ్యూటీనా? అంత అందంగా ఉంటుందా?"
"బాగా.....రాత్రయితే చాలు చలి చంపేస్తున్నా తన కౌగిట్లో వెచ్చగా ఎంత ఉంటుందో...ఇక ఈ చలికాలం నన్నేం చేయదు....ఇంతకీ బ్లాక్ బ్యూటీ ఎవరో తెలుసా?" అడిగాడు రాజు.
" ఎవరు?"
చెప్పాడు రాజు....
సమాధానం విన్నవెంటనే ఖంగుతినడం రాజు ఫ్రెండ్ వంతయింది.
ఇంతకీ...
రాజు చెప్పిన ఆ మూడక్షరాల సమాధానం....
" స్వెట్టర్"

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల