చారు కావాలి - సి.ఉమాదేవి

charukavali

“ కల్పనా!” పిలిచాడు రఘు.కాస్త గట్టిగానే పిలిచాడు అనడం కంటే అరిచాడు అనడం సబబు. తనకు నచ్చిన హిందీ సీరియల్ చూడ్డంలో పూర్తిగా లీనమైపోయిన కల్పన ఉలిక్కిపడింది.

“ మీరెప్పుడొచ్చారు?”ఆశ్చర్యంగా అడిగింది భర్తను .

“సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు రెక్కలు వేలాడేసుకుని వస్తానని తెలిసి తలుపు గడియ తీసిపెట్టి సీరియల్ చూడ్డంలో మునిగి పోతావు.దొంగలు వచ్చినా గమనించేటట్టు లేవు.” గొంతులో చిరాకు కనబడకూడదనుకున్నా శబ్దం అవసరమైనదానికన్నా మించి మల్లిక చెవులను తాకింది.

“ సరే శ్రీవారు,మీ కేకకు కారణంబెయ్యది?”

వాతావరణం చల్లబడాలంటే ముందు చల్లని గాలి వీయాలి కదా!

కల్పన చల్లని మాటే ఆమె భర్తకు నవ్వుల నజరానా!

“ ఏం లేదులే కాని చూడు, చూడు సీరియల్ ముగింపుకు వచ్చినట్లుంది.”

“ ప్రకటనలు వస్తున్నాయిలే చెప్పండి.”

“ అదే మన గుర్రం ఎక్కడపెట్టాం?”

“గుర్రమా!” ప్రకటనలో కనిపిస్తున్న రుచిని పెంచే రసంపొడిని ఆసక్తిగా చూస్తూ పరధ్యానంగా అడిగింది.

“ ఏంటలా చూస్తావు,గుర్రాన్ని ఎప్పుడు చూడనట్లు.”విసుక్కున్నాడు.

“ ఓ,మీ గుర్రమా వెనక కట్టేసాను,ఉలవలు తింటోంది.” కిసుక్కుమంది.

“ నీకంతా వేళాకోళమే, నేను గుర్రమంటా,నీవు ఐరన్ స్టూలంటావు.” నవ్వుతూనే ఉడుక్కుంటున్నాడు.

“ సరేలే మేడమ్ ఇంతకీ స్టూలెక్కడ?”

“ ఇందాక ప్రక్కింటి బామ్మగారు పెద్ద బిందె కావాలంటే వారి మనవడు స్టూలు వేసి ఎక్కి అటకమీంచి బిందె దించాడు.మన స్టూలక్కడే ఉంది.”

“అయితే మన పని మరింత సులభం.ఇలా ఓ సారి వచ్చి కాస్త కదలకుండా పట్టుకో పైకి ఎక్కాలి.”

“మహానుభావా,కాస్త కాఫీ తాగి తరువాత మొదలెట్టండి.అశ్వారూఢులై తదుపరి కార్యక్రమం కొనసాగించవచ్చు.”

“ నీ మాటల వీవన పని అలసటను మరిపిస్తోందోయ్.ఏమైనా హాస్యాన్ని మించిన మందు లేదు సుమీ!” అంటూ భార్య అందించిన కాఫీ మూడు గుక్కల్లో తాగేసి తనకవసరమైనవి అటక మీంచి దించాలని స్టోర్ రూంలోకెళ్లాడు.అటక పురాతన వస్తువుల ప్రదర్శనశాలలా కనువిందు చేస్తోంది. ‘ఎందుకిన్ని దాచుకోవాలా?ఈ రోజుల్లో వండినవాళ్లే వడ్డించేందుకు కూడా అన్నీ తెచ్చేస్తారు కదా’ అంటే ‘పెద్దవాళ్లు ఇచ్చిన ఆస్తులేకాదు వారి జ్ఞాపకాలు కూడా దాచుకోవాలికదా’ అంటుంది!పెద్దవాళ్లు వాడిన పెద్ద పెద్ద గుండిగలన్నీ ప్రతి పండుగకు శుభ్రంగా తోమి ఉంచుతుంది.ఇంటికి రంగులన్నా,ఇంటీరియర్ హంగులన్నా ఎంత సంబరమో వాటితోపాటు తోం తోం అంటూ అరకిలో చింతపండును ఇత్తడి సామానుకు,ఓ సీసాడు విమ్ లిక్విడ్, స్టీలు గిన్నెలకు ఆనందంగా అర్పిచ్చేస్తుంది కల్పన. గిన్నెల చప్పుడుకు టి.వి ఆపేసి గదిలోకొచ్చిన కల్పన భర్త చేస్తున్న హడావిడి చూసి, “ఏమిటీ మళ్లీ వండిస్తున్నారా?”ఆశ్చర్యంగా అడిగింది.

“గిన్నెలున్నాయని క్యాటరింగ్ మానేసి ఆఫీసును వంటిల్లు చేసేస్తున్నారు.” లెక్కకట్టి మరీ అప్పచెప్తుంది కల్పన.ఈ మధ్యనే హెడ్ ఆఫీసులో
బాస్ రిటైర్ అయితే షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేసారు.అది తిన్నవారు ఇప్పటికీ ఆనాటి రుచులను ఆనందంగా ఆస్వాదిస్తూనే ఉన్నారు.

“ మరి ఈ సారి వంటలు ఎవరు చేస్తున్నారు?”ఆసక్తిగా అడిగింది కల్పన.

“ఈసారి మంచి ఛెఫ్ ను పిలిపిస్తున్నాము.ఎన్నో వరైటీలు చేయిస్తున్నాము.”

“ రిటైరయిన బాస్ ప్లేస్ లో ఒక మేడం వస్తున్నారని చెప్పాను కదా.”

“ ఓ! అయితే మీరు టైంకు వెళ్తారన్నమాట.” నవ్వింది.

“ తప్పదు మరి.మేడం కన్నుల్లో పనిమంతుడే కాదు,కాలజ్ఞానం కలవాడుకూడా అనిపించుకుంటేనే కదా కాన్పిడెన్షియల్ రిపోర్ట్ లో మంచి మార్కులు పడేది.అయినా లేడీ బాస్ దగ్గర ఎవరు తిట్లు తింటారు?” అంటూ నవ్వాడు

“ అయితే ఆవిడెవరు? ఎప్పుడొస్తున్నారు? ” కుతూహలం పెరిగింది కల్పనలో.

“ ఆవిడ పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియవుకాని ఆవిడ ప్రమోషన్ పై ఇక్కడకు వస్తున్నారు.రేపు వచ్చి జాయిన్ అవుతారు కాని లంచ్ ఆదివారం ఏర్పాటు చేస్తున్నాం.”

“అదేం, వచ్చినరోజైతే బాగుండేదేమో కదా?”

“లంచ్ తినవచ్చుకాని ఆఫీసుటైం తినకూడదుకదా అని ఫోన్లోనే పంచ్ లేసారట స్టాఫ్ తో.అందుకే ఆదివారం రండి మేడం అంటే పచ్చ జండా ఊపారు.”

గిన్నెలందుకునే క్రమంలో చారు వడ్డించే స్టీల్ బకెట్ దబ్ మని క్రిందపడింది.

“ అయ్యో,సొట్టపడిందే.”బెంగగా చూసింది కల్పన.

“సారీ కల్పనా,హ్యాండిల్ ఊడినట్లుంది చూసుకోలేదు, అదలా ఉంచు నేను సరి చేస్తాలే.ఇదిగో ఈ అన్నం డేగ్షా పట్టుకో,” అంటూ అందించాడు.అతి జాగ్రత్తగా పట్టుకుని దించి క్రింద పెట్టింది కల్పన.“దించిన గిన్నెలన్నీ లెక్కపెట్టుకుని ప్యూన్ దగ్గర పంపించు.”

“మరి ఈ బకెట్ వద్దులే,చూడటానికి బాగుండదు.” సందేహించింది కల్పన.

“భలేదానివే,మనం ఆస్థాన సర్వీసు ఇస్తున్నాము.బయటతెస్తే అదనపు ఖర్చు.పైగా మిగిలిన పచ్చళ్లు నిన్నాదుకుంటాయి.”

“ వద్దులే బాబు మనకు ఆ కారాలు పడవు.”

“అయినా ఈ సారి అన్నీ స్పెషల్ గా చేయిస్తున్నాము.”లిస్ట్ చెప్పాడు.

“మరి చారు లేదే లిస్ట్ లో?ఎంత గొప్ప పెళ్లైనా ఉలవచారు పెట్టడంలేదూ.”

“అబ్బా మళ్లీ మరోటి చెప్తున్నావు,అయినా చారెవరు తింటారు జ్వరం వచ్చినప్పుడు తిన్నట్టు,మంచూరియా,నూడిల్స్,క్యాప్సికమ్ ఫ్రై,పనీర్ మసాలా,వెజ్ బిరియాని,వైట్ రైస్ మంచి గడ్డ పెరుగు..స్వీట్లు,ఐస్ క్రీం..”

“చాల్చాలు నోరూరిస్తున్నారు. అయినా ఇన్ని చేయిస్తున్నారా ?”ఆశ్చర్యపోయింది కల్పన.

“మాపై అధికారులకు ఈ లెవెల్ ఉండాలిలే.అన్నీ లిమిట్ గానే కదా,కాకపోతే కాస్త వరైటీగా.అంతే.”

“సార్” అన్న పిలుపు విని, “ రావోయ్ రా,నువ్వు వచ్చే లోపు నేనే అన్ని గిన్నెలు దించేసాలే.”

అన్ని గిన్నెలతో పాటు బకెట్ ను అందుకోబోతే “ చారు లేదుకదా,బకెట్ వద్దులే” వారించాడు.

“ఉంది సార్, చారు కూడా.” అని చెప్పారట మన అకౌంటంట్.

“ ఇంకా ఎన్ని కలుపుకుంటూ పోతారయ్యా అనవసరమైనవన్నీ.చారేమిటి అదో స్పెషల్ ఐటమా?”

“ఏమోసార్,అన్నీ ఉంటేనే విందన్నారండి.”

“సరే అయితే కాస్త ఆ హ్యాండిల్ సరి చేయించు.

సామానంతా బస్తాలో వేసి ఇచ్చింది కల్పన.

ఎదురు చూసిన ఆదివారం వేగంగానే వచ్చినట్టనిపించింది.

“ సో...నీకు ఆదివారం విశ్రాంతి దొరికింది కదా అని వంట మానెయ్యకు.ఏదైనా నీకిష్టమైనది వండుకుని తిను.”

“నో వర్రీ.అన్నీ ఉన్నాయిలే.” అంటూ హమ్మయ్య నాలుగు సీరియళ్లు లాగించెయ్యవచ్చు అనుకుంది మనసులో.
ఆఫీసుకు చేరుకునే లోపలే హాల్లో కుర్చీలు,బల్లలు అమర్చి ఉన్నాయి.వండించినవన్నీ వేడి వేడి ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి.ఇంకా కొన్ని సర్దుబాట్లు చేస్తున్నారు.

“అదిగో మేడం వస్తున్నారు.” ప్యూన్ గట్టిగా అనగానే ఎవరికి వారు తమ వెంట తెచ్చిన పూలబొకేలతో ముందుకురికారు.అప్పటికే ఒంటిగంట దాటుతోందని ఆమెకు పళ్లెమందించాలని అందరు కదిలారు.

“కాసేపు కూర్చుందాం రండి.ఇంకా సర్దుతున్నట్లున్నారు.” వారిని వారించింది వాళ్ల మేడమ్ వసుమతి.

‘ ఏమంటారు’ అన్నట్లు అందరివైపు చూసింది.

ఏమంటారు? ఎక్కడివాళ్లక్కడ కూర్చుండిపోయారు.ఆఫీసులో ఆడిట్ ఇన్సెక్షన్ ఉంటుందంటూ బిల్స్,ఖర్చులు,అమ్మకాలు వంటి వివరాలన్నీ సక్రమంగా ఉండాలంటూ బుర్ర ఊపి మరీ ఫీడ్ చేస్తుంటే ప్రొద్దుట ఫీడ్ చేసుకున్న ఉపాహారం కాస్తా ఆవిరయిపోయినట్లయింది అందరికీ.
‘రండి మేడమ్’ అంటూ సూప్ ఉన్న బౌల్ అందించాడు ఓ కుర్రాడు. ‘వద్దు బాబూ’ అంటూ వారించింది.అందరు లేవాలని ప్రయత్నిస్తున్నది చూసి, ‘సరే పదండి మళ్లీ చల్లారిపోతుంది.’అంటూ ముందుకు నడిచింది,గబగబా చిన్నపిల్లల్లా సంబరంగా లేస్తున్న వారందరినీ చూస్తూ.
“మన ఆఫీస్ లంచ్ టైం ఇదే కదా?”అంటూ వంటలన్నింటిని ఆసక్తిగా చూడసాగింది.తను వండిన వంటలను ఎలా ప్రదర్శించాలో ఛెఫ్ లకు బాగా తెలుసు.అలంకరణ ,ఆహార్యం మనిషికే కాదు , కూరగాయలకు అవసరమేననిపిస్తోంది పక్షులుగా ,పూలుగా,జంతువులు గా రూపొందిన కూరగాయలు ఒక వంక, పండ్ల జ్యూసులు మరొకవంక.

“ ఏంటి మరీ ఇన్ని ఐటమ్స్.తినగలమా అన్నీ రుచి చూసేసరికే కడుపు నిండిపోతుంది.” ఆశ్చర్యంగా చూస్తూ అంది వసుమతి. ‘అవును, అవును’ అందరు తలలూపారు.

“సరే మీరు కానివ్వండి, నేనొకసారి అన్ని చూసాక తింటాను.”అదే భాగ్యమనుకున్నారు వంటలను చేయించిన వారు. ఆమె అన్నీ రుచి చూస్తే చాలు మరిన్ని ఆర్డర్లు వస్తాయన్న సంబరం వాళ్లలో.ఒకొక్క డిష్ వంక చూస్తుంటేనే లాలాజలం పొంగుతోంది భోజనప్రియులకు.మేడం వసుమతి తీరు వారికి అర్థం కావడంలేదు. ఈవిడ అన్నీ రుచి చూసి వదిలేస్తుందా ఏమిటి? ఆవిడ కాస్తయినా వడ్డించుకుంటే వీళ్లు పళ్లాలు నింపుకోవచ్చనుకుంటున్నారు.బిర్యాని వంక చూసింది ,నూనె మెరపుతో కన్నులకే విందుగా ఉంది.ఆమెకు ప్లేటందించి బిర్యానీ వడ్డించబోయాడు.

“వద్దు ప్లెయిన్ వైట్ రైస్ వడ్డించు.”

అందరు వింతగా చూస్తున్నారు.అసిడిటీ ఉందేమో,పెరుగన్నం తింటారేమో అనుకున్నారందరు. సొట్ట తీసినా పోని బకెట్ లో చారు వేడివేడిగా ఆవిర్లు కమ్ముకుంటోంది.తనను తాకనైనా తాకలేదు అని కోపంగా పొగలు కక్కుతోంది.మేడమ్ దగ్గరకు రాగానే మనసారా తన ఘుమఘుమలు వెదజల్లింది.ఉలవచారు కూడా కాదు కంది పప్పులో బాగా మగ్గిన టమాటొలు కలిపి మెత్తగా రుద్ది,చింతపండు రసం తగినంతవేసి చక్కగా పోపు పెట్టి నెయ్యివేసి ఎండు మిరప చిదిమి, రసంపొడి,మెంతులు,ఆవాలు,ఆపైన కరివేపాకు నలిపి వేసి,కొత్తిమీరతో హంగును పెంచి, వెల్లుల్లి రెబ్బలు వేసాక పోపు వేసిన చారును చూడగానే వసుమతి గరిటనందుకుని ఆప్యాయంగా చారును అన్నం నిండా నింపుకుని మెత్తగా కలుపుతుంటే బిరియాని వదిలేసి చారన్నం తినాలనిపించింది అందరికీ. వసుమతి చెప్తున్న చారు వండే విధానాన్ని వర్ణిస్తుంటే చారు చేసిన వంటవాడే కాదు అందరు రసాస్వాదనలో మునిగిపోయి ఆశ్చర్యంగా చూస్తున్నారు.కల్పనతో విందులోని విశేషాలు చెప్తూ,“మేడం చారు మాత్రమే వేసుకున్నారు,” అన్నాడు రఘు. “మిగతావి..” ఆశ్చర్యంగా అడిగింది కల్పన.

“అందరు ఆవిడ చేత ఎలాగైనా కొన్ని వంటకాలైనా తినిపించాలని చూసారు.కాని లాభంలేక తెల్ల అన్నము,చారు బాగుంది బాగుందంటూ అందరు ఇంచుమించు చారు బకెట్ ఖాళీ చేసేసారు.పళ్లెంలోనే ఉడుకుతున్నట్లు బుడగలొస్తున్నట్లున్నచారు చివరిముద్దవరకు రుచిగా ఉంటుందట.మొదటి ముద్ద మెత్తగా మెదపి నోట్లో పెట్టుకుంటే నాలుకపై రసగంగా ప్రవాహమేనట!వండేందుకు కూరగాయలు లేనప్పుడు,జ్వరమొచ్చినప్పుడు ఆదుకునే చారు అని మరీమరీ ప్రశంసించారు.”

“ ఇంతకీ మీ మేడం గారు ఎలా ఉన్నారు?”కల్పన కళ్లెగరేస్తూ నవ్వింది.

“చారు మహత్యం కదా!మేము సరిగా పని చేయలేదనుకో వెంటనే ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టేస్తారు.”అంటూ నవ్వసాగాటు రఘు.
నవ్వు చారు తెర్లుతున్నట్లు తెరలుతెరలుగా ముంచుకొస్తోంది ఇద్దరికీ!

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల