శీతాకాలపు సాయంత్రం భానుడు కాసేపట్లో విశ్రమించబోతున్నాడు. చల్లగాలి రివ్వున వీచటం మొదలైంది. భూమాత ముడిచిన కొప్పులా కనిపించే నల్ల రాతి కొండ, దాని సిగలో పెట్టిన ముద్దమందారంలా కొండ అంచును తాకుతూ నారింజ రంగులో సూర్యుడు. జీవితం కష్టసుఖాలమయం అని చెప్పే ఏడు రంగుల నిర్మల ఆకాశం. ఆకాశం వైపూ, పొద్దు వైపూ సీతాలు ఒక్కసారి తల ఎత్తి చూసింది. తను ఇంటికి చేరే వేళ అయింది అనుకున్నదేమో, తను మేపుతున్న మేకల వైపు గబగబా అడుగులు వేసింది. ఆకులు మేస్తున్న మేకలను మందగా చేసి, మెల్లగా కొండ క్రిందుగా ఊర్లోకి దారి పట్టించింది. కొండమీది నుండి చల్లగాలి ఒక్కసారిగా వీచింది. ఆ గాలి ధాటికి తాను కప్పుకున్న చిరుగులుపడ్డ గుడ్డ ఎగిరిపోయింది. దాన్ని అందుకోబోయి పరిగెత్తింది. అడుగు ముళ్లపై పడి కాలికి ముళ్ళు లోతుగా గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా కెవ్వుమంది. కళ్ళల్లో నీళ్లు చివుక్కుమన్నాయి. బాధనంత పెదవుల్లో బిగించి గట్టిగా ముళ్ళు లాగింది. రక్తం బొటబొటా కారిపోతుంది. ఎగిరిన గుడ్డను అందుకొని చించి కాలుకు కట్టుకుంది. మెల్లగా కుంటుకుంటూ మేకల వెనక నడుస్తుంది. రాలుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ తనను తానే చూసుకుంది. మాసిపోయి, చెరిగిపోయిన జుట్టు. చిరుగులు పడి మసిగుడ్డల్లా తయారైన చిన్న లంగా, జాకెట్టు. రాళ్ల దెబ్బలు తగిలి చీము, రక్తం గూడు కట్టిన కాలివేళ్ళు. రాళ్లు, ముళ్ళు గుచ్చుకున్న అరికాళ్ళు. పసులపెంట, బురదల్లో నాని పుండ్లు పడి మాంసం ముద్దల్లా ఉన్న చేతివేళ్లు. చలి గాలికి నీళ్లు లేని రేగడి నేల పగుళ్లలా ఉన్న ముఖము, పెదవులు. దుమ్ము కొట్టి మురికి వాసన పట్టిన శరీరం. అంతా చూసుకుని గొంతులో దుఃఖం ఆపుకోలేక ఒక్కసారిగా బావురుమని ఏడ్చింది. చెదిరిపోతున్న మేకల్ని ఒకసారి అదిలించి, తన బ్రతుకెలా చెదిరిపోయిందో ఆలోచనలో పడిపోయింది. సంవత్సరం క్రితం ఆప్యాయంగా గుండెల్లో దాచుకునే అమ్మ. ఆదరంగా హత్తుకునే నాన్న. నాన్న లారీ డ్రైవర్. అమ్మ రోజు కూలీ. తను తన స్నేహితులతో కలిసి హాయిగా ఆడేది, పాడేది. బడిలో అన్నింటిలో తనే మేటి. తను తనలోని చురుకుదనం, కలుపుగోలుతనంతో బల్లోనే కాదు ఊళ్లోని వాళ్లకు కూడా తలలో నాలుకలా ఉండేది. తను చదివేది మూడైనా, పెద్ద మనసుతో మాట్లాడే మాటలకు దగ్గరకు తీసుకుని తల నిమరని వారు లేరు. హఠాత్తుగా నాన్నకి వారం రోజులుగా జ్వరం. పెద్ద డాక్టర్ పరీక్ష చేసి ఎయిడ్స్ అన్నారు. అప్పుడు అమ్మను పరీక్ష చేసి అదే అన్నారు. అమ్మ నాన్న ఏడుస్తుంటే తన పసి గుండె బద్దలై తనూ ఏడ్చేది. అమ్మ నాన్న ఒకరి తర్వాత ఒకరు తనని దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టుకుని ఏడుస్తుంటే ఏమీ అర్థంకాని తనూ వెక్కివెక్కి ఏడ్చేది. ఆ వేదనతో ఇద్దరు చిక్కిపోయి, కృషించి మంచం పట్టారు. వారి వైద్యానికి డబ్బిచ్చే వారేరి. సాయం చేసే వారేరి. అమ్మ నాన్నది ప్రేమ వివాహం. బంధువులు ఎవరో కూడా తెలియదు. నాన్న పనిచేసే లారీ యజమానిని ప్రాధేయపడితే కొంచెం డబ్బిచ్చేవాడు. ఆ డబ్బుతో ఊళ్లో డాక్టరు ఏవో మందులు ఇచ్చేవాడు. లారీ యజమాని ఇచ్చిన డబ్బుకు బదులుగా తనను ఆయన బంధువుల మేకల కాపలాగా ఉంచమన్నాడు. లేడీ పిల్లలా చెంగుచెంగున ఎగిరే తనను పంపడానికి మంచంలో ఉన్న అమ్మ నాన్న మనసు ఒప్పుకోక రాత్రంతా ఏడ్చిన వారిని తను ఎలా మరిచిపోగలదు. తను పెద్ద మనసుతో బడి మాని మేకల వెంట బయలుదేరింది. కొద్ది రోజులకి నాన్న, ఆ కొద్ది రోజులకి అమ్మ ఇలా ఒకరి తర్వాత ఒకరు తనను వదిలి వెళ్ళిన ఆ రోజులని తలుచుకుంటే గుండె పగిలిపోతున్న దుఃఖాన్ని ఆపుకోలేక బయటకే వెక్కివెక్కి ఏడుస్తూ, కుంటుకుంటూ ఊరి పొలిమేర చేరింది. కళ్ళు తుడుచుకొని యజమాని ఇంటిని చేరింది. పెంట వాసన వేస్తున్న ఆ మేకల పాకను మళ్లీ ఒకసారి ఊడ్చి మేకలను అందులో తోలి తడిక వేసింది. తను మేకలు తాగే ఆ తొట్టిలోని నీటిని కడుపునిండా తాగి, తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ, పాకలో ఒక మూల కూర్చుంది. పూర్తిగా చీకటి పరచుకుంది కడుపులో ఆకలికి పేగులు మెలిబెడుతున్నాయి. తనకు యజమానురాలు ఇచ్చిన స్టీలు పళ్లెం తీసుకుని పక్కనే ఉన్న యజమాని ఇంటికి వెళ్లి ఆమె పెట్టే ఆ సద్ది అన్నం, మాడు అన్నం తెచ్చుకుందామనుకుంది. కానీ ఎందుకో మనసు పొరల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖానికి వెళ్ల మనసు రాక, తొట్టిలో నీళ్లు కడుపునిండా త్రాగి, చిరిగిన గోనెసంచిని మేకల ప్రక్కన పరుచుకుంది. మేకల పెంట, మూత్రపు వాసన, చుట్టూ కటిక చీకటి. చల్లగాలి ఎక్కువయింది. పాతగుడ్డ కప్పుకుని, మోకాళ్లు కడుపులోకి ముడుచుకొని పడుకుంది. సమయం గడుస్తున్నా కొద్ది చలిగాలి పెరిగిపోతుంది. గాలి తేమకి గుడ్డలు పదునెక్కాయి. మంచు కురుస్తూనే ఉంది. తన కళ్ళు కన్నీళ్ళని రాలుస్తూనే ఉన్నాయి. సినిమా రీలులా తిరుగుతూ మారిపోతున్న సీతాలు జీవితాన్ని మొదటి నుంచీ చూస్తున్న రంగయ్య మాస్టారికి సీతాలు గుర్తుకు రాగానే కళ్ళు చెమర్చాయి. బడిలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఏదో వెలితి గానే ఉంది. ఆ వెలితి సీతాలే అని అర్థం అయింది. కన్నబిడ్డలా ప్రేమగా మెలిగే సీతాలును, తన బిడ్డలా చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటని రాత్రంతా ఆలోచించి ఉదయమే లేచాడు. చలి గాలి బాగా వేస్తుంది. సూర్యోదయం కాబోతుంది. మాస్టారు గారు నేరుగా యజమాని వద్దకు వెళ్లి సీతాలు తండ్రి తాలూకు అప్పు చెల్లించాడు. యజమాని సీతాలును పంపించడానికి అంగీకరించాడు. మాస్టారు మెల్లగా పసులపాక వైపు నడిచాడు. తడిక తీసి చుట్టూ మేకలలో కలియ చూశాడు. ఓ మూలన సీతాలు కనిపించింది. దగ్గరగా వెళ్లి మేకల పెంట వాసన వేస్తున్న సీతాలను పిలుస్తూ తాకాడు. కానీ గుండెల్లో ఏదో భయం, ఆందోళన. సీతాలు శరీరం చల్లగా ఉంది. పాపం సీతాలు శరీరం రాత్రి చలికి బిగుసుకుపోయి ఎప్పుడో చల్లబడిపోయింది. చల్లబడిన ఆ పసి శరీరాన్ని గుండెలకత్తుకొని భోరున ఏడ్చాడు రంగయ్య మాస్టారు. మెల్లగా స్మశానం వైపు అడుగులు వేశారు మాస్టారు గారు.

