వంశవృక్షం - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

vamsha vruksham telugu story by prathapa venkata subbarayudu

బ్రాహ్మీముహుర్త సమయంలో పెట్టిన అలారం మోగడంతో రాంబాబుగారు లేచికూర్చున్నారు. అసలు నిద్రపోతేగా!

రాంబాబుగారి మనసు మనసులో లేదు.

ఇంకొద్ది గంటల్లో ఆయన కల నెరవేరబోతోంది.

ఒకటా రెండా దాదాపు పది సంవత్సరాలు ఆ కార్యాన్ని అకుంఠిత దీక్షతో... అసిధారావ్రతంలా సాగించారు.

ఆయన మనసు గతాన్ని స్పృశించింది.


**** **** **** ****


రాంబాబు తనకొడుక్కి నామకరణ ఉత్సవం చేద్దామనుకుని ఎవరెవర్ని పిలవాలా అని పట్టిక తయారుచేసుకున్నాడు. దాదాపు అందరూ తెలిసున్న వాళ్ళూ స్నేహితులే! చుట్టాలందరూ ఏమైపోయారు? తనకు తెలిసిన కొద్దిమంది బంధువులని అడిగాడు. ఊళ్ళో ఓ పదిహేనుమంది, విదేశాల్లో మరో పదిమంది ఉన్నట్టు తేలారు. అంతేనా? తరతరాలుగా అందరూ విడిపోతూ వచ్చారన్నమాట. మనిషన్నతర్వాత బలగమే బలం కదా! మరి ఎవరికి వారు చెట్టునొదిలి పోయే పక్షుల్లా ఎగిరిపోతే ఇంక ‘మన’ అనుకున్నవాళ్ళు ఎవరు?

రక్త సంబంధీకులందరూ... కలసి శుభ కార్యాల్లో పాలు పంచుకుంటే ఎంత ఆహ్లాదంగా వుంటుంది? అశుభ కార్యాల్లో మనవాళ్ళ ఓదార్పులో ఎంత సాంత్వన లభిస్తుంది? ఎవ్వరూ అర్ధంచేసుకోరు. బంధువులంటే రాబందులనీ, ‘మాఇంటికొచ్చావు మాకెం తెచ్చావు? మీ ఇంటి కొచ్చాం మాకేం పెడతావు’ అన్నట్టుగా స్వార్థంగా వుంటారని. అదే స్నేహితులైతే ఆపద సమయాల్లో ఆదుకుంటారని అంటుంటారు. కాని ఆ స్నేహితులే ఇంకొకరికి చుట్టాలని తెలుసుకోరు. మనం విదేశాల కెళితే అక్కడో భారతీయుడు... మరో రాష్ట్రాని కెళితే ఆంధ్రుడు కనిపిస్తే ఎడారిలో మరీచికని చూసిన ఆనందం కలుగుతుంది. ఎవరు మాట్లాడుకున్నా ‘మన కులం... మన ప్రాంతం’ అనే. మరి మన వంశవృక్షంలో ఎంతమంది కళల్లో నిష్ణాతులు... సాహితీప్రపంచంలో వాసి కెక్కినవారు... వైద్యరంగంలో అపర దన్వంతరులు వున్నారో! ఏదేమైన వాళ్ళు రక్త, జన్యు సంబంధీకులు. తనవాళ్ళు. అప్పుడే రాంబాబు నిర్ణయించుకున్నాడు తన వాళ్ళందరినీ కలుపుకోవాలని. అయితే ఉద్యోగరిత్యా చాలా బిజీగా వుండడంవల్ల ఆ పనిలో నిమగ్నమవలేకపోయాడు. ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడల్లా కళ కళ్ళాడే సంపూర్ణ బంధుగణం లేని లోటు కనిపించేది. మనసులో ఆ బాధ పీకుతుండేది.


**** **** **** ****


రాంబాబుగారు రిటైరయ్యారు.

అందరూ ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. మెడలో దండలేసి పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు. ఆ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.

రాంబాబు గారు లేచి అందరికీ కృతజ్ఞతలు చెప్పి మాట్లాడడం మొదలెట్టారు.

'నేను’ అనే దానిలో లేని పూర్ణత్వం ’మన” అనే దానిలో వుంది. ఈ సంస్థలో మనందరం కలసి పనిచేస్తేనే... ఈ రోజు వరకూ కడుపులో చల్ల కదలకుండా హాయిగా మనుగడ సాగించాం. అందుకే "కలసి వుంటేనే కలదు సుఖం" అనే దాన్ని నేను విశ్వసిస్తాను. రిటైరైతే రేపటినుండి నేనేం చేయాలి? ఎలా కాలక్షేపం చెయ్యాలి? అనుకుంటారు చాలామంది. కాని నాకా దిగులులేదు. బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నాముందు ఒక పెద్ద పని వుంది. అది పూర్తయ్యేవరకు ఆ భగవంతుడు శక్తినిస్తే చాలు." అని ముగించాడు. రాంబాబుగారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యంగా ‘ఏమిటాపని?’ అని అడిగారు ఇంటికొచ్చాక.

రాంబాబుగారు అన్నాళ్ళు తనమనసులో గూడు కట్టుకున్న కోరిక చెప్పారు. "ఇహ ఆలస్యం చేయకుండా రేపటి నుండి బంధువర్గ వెతుకులాట ప్రారంభించాలి. ఎవరు ఎక్కడున్నా వెళ్ళడం... కలవడం... వివరాలు సేకరించడం చేస్తాను. అదృష్టవశాత్తు ఇది సెల్ ఫోన్ యుగం కాబట్టి ఒక కాల్ దూరంలో మీ మనసులకీ దగ్గరగానే వుంటాను. ఇప్పుడు నేను చేసే పని మన వంశానికి వెన్నెముక అవుతుంది. నాకు తెలుసు ఈ వయసులో హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కూర్చోక ఎందుకీ ఖర్మ అనుకుంటారని. కాని ఎవరికి వారు విడిపోతుంటే ఇక బంధుప్రీతి అన్న పదానికి అర్ధమెక్కడ వుంటుంది? అందుకే ఇహనైనా ఈ పనికి నేను పూనుకోవాలి. అందరి మనోపూలనీ కలిపే దారం నేనవ్వాలి. నా మనసుకి తృప్తినిచ్చే పని ఇది." అని చెప్పారు.

చెప్పినట్టుగానే మరుసటిరోజే బ్యాగులో బట్టలు, ల్యాప్ టాప్ సర్దుకున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పటినుండే దీనికోసం వేరేగా అకౌంట్ లో డబ్బు దాచారు దానికి సంబంధించిన డెబిట్ కార్డు, కొంత డబ్బు పర్సులో పెట్టుకుని బయల్దేరారు.


**** **** **** ****


ఒక ఊరు కాదు ఒక లోకం కాదు. ఆ వయసులో కుగ్రామాలు మెట్రో సిటీలు పిచ్చిపట్టినట్టుగా తిరిగారు. ఎక్కడ లింకు దొరికినా బద్ధకించలేదు. విదేశాల్లో వున్నవారిని ట్రేస్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. అక్కడి సాంస్కృతిక సంస్థలు తెలుగు వాళ్ళ సహకారంతో అదీ సాధించారు. అన్నీ ల్యాప్ టాప్ లో నిక్షిప్తం చేశారు. గర్భదరిద్రులు... కోటికి పడగలెత్తిన వాళ్ళు తన వంశంలో ఉండడం చూసి విధి వైచిత్రికి అబ్బురపడ్డారు. అందరూ ఆయన చేస్తున్న పనిని ప్రశంసించారు. కొంతమంది కావలసిన ధన సహాయం కూడా చేస్తానన్నారు. ఒక రిసెర్చ్ స్కాలర్ తన కిష్టమైన విషయంలో డాక్టరేట్ కోసం ఎంత తపన పడతాడో అంత పడ్డారు. పగలు రాత్రి మర్చిపోయారు. నిరంతరం... అనవరతం అదేపని. తొంభై శాతం పూర్తయ్యింది. ఇంకా పదిశాతానికి మూలాలు దొరకలేదు. ఫరవాలేదు దాదాపు సఫలీకృతమైనట్టే!

ల్యాప్ టాప్ లో పెద్ద చెట్టులాగా అందర్నీ అమర్చి చూసుకుంటే పెద్ద కాండం కొమ్మలు రెమ్మలు ఆకులు చివుళ్ళతో కళ కళ్ళాడుతోంది వంశవృక్షం. ‘అహరహం ఎంత కష్టపడ్డాను దీన్ని ఇలా చూడడానికి. ఇంత కాలంపట్టిందా నా కల సాకారమవడానికి.’ ఆయన మనసులో అలౌకిక ఆనందం.


**** **** **** ****


ఇప్పుడు అందరూ ఒకే వేదిక మీద కలవబోతున్నారు. అదీ ఆయన ఉద్విగ్నతకి కారణం.

సిటీలోని ఒక పేరున్న ఫంక్షన్ హాల్ ని బుక్ చేశారు. అందరికీ ఆహ్వాన పత్రాలు పంపించి తప్పని సరిగా వచ్చి అందర్నీ కలవాలని కోరారు. ఖర్చులు భరించలేని వాళ్ళకి రాను పోను టిక్కెట్లు పంపించాడు. ఒక పని నిబద్ధతతో చేస్తే ఖచ్చితంగా ఫలితం వుంటుంది.

రాంబాబు గారు ఆ హాల్ కి తెల్లవారంగానే వెళ్ళిపోయారు.

అప్పటికే వందమంది వచ్చేసున్నారు. మధ్యాహ్నం దాకా బిల బిల మంటూ వస్తూనే వున్నారు. సంపూర్ణ హాజరు. ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ అందరూ హడావుడి పడిపోతున్నారు. అన్నాళ్ళ ఆప్యాయతనీ ఒలకబోసుకుంటున్నారు. అదంతా రాంబాబుగారి చలవే అని ప్రశంసిస్తున్నారు. ఆ వేదిక మీదే పిల్లల సంబంధాలు కుదిరిపోయాయి, ఆర్థిక సహాయాలు అందుకోబడ్డాయి. ఆర్తులని ఆదుకోడానికి పెద్ద పెద్ద డాక్టర్లు లాయర్లు ముందుకొచ్చారు. మోయలేని భారమవుతున్న పిల్లల్ని జన్యు సంబంధమే కాబట్టి తేలిగ్గా దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు పిల్లల్లేనివాళ్ళు. అందరూ కలసి పెద్దతరాన్ని గౌరవ మర్యాదలతో చూసుకుంటామనడం వల్ల వాళ్ళు నిరాదరణకి గురయ్యే సమస్యే లేదు. తన ఒక్కడి కోరిక సఫలమై అంతమందికి ఆశాదీపమవుతున్నందుకు రాంబాబుగారి కళ్ళు ఆనందబాష్పాలతో చెమ్మగిల్లాయి.

ఆయన మైకు ముందుకొచ్చి సంతోషంతో గాద్గాదికమైన గొంతుతో "ఇలా మీరందర్నీ ఒకే వేదికపైన చూడాలని నా చిరకాల కోరిక. పది సంవత్సరాల నా కష్టం ఈ రోజుతో గాలికి కొట్టుకు పోయిన ఎండుటాకైంది. నాకు తెలిసి మీ ప్రతి సమస్యకీ ఇక్కడ సమాధానం దొరికింది. కలసి వుంటే అదే సుఖం. ‘మన’ అంటేనే అదో ధైర్యం. నేను మీ అందరికీ మన వంశ వృక్ష సి డి ని అందిస్తాను. మీ ఇళ్ళలో ఏ కార్యం జరిగినా దయచేసి అందర్నీ ఆహ్వానించండి. అందరూ తలోపని చేస్తే భారం తేలికౌతుంది. ఇది నేనిప్పుడు చెప్పడం కాదు మన ఉమ్మడి కుటుంబాల్లో అందరూ తలోచెయ్యి వేసి ఎంత కష్టమైన కార్యాలు సునాయాసంగా చేసేసే వారో మీకు తెలియంది కాదు. ఐకమత్యతలో బలం వుంది. ఇది తెలియక పనులన్నీ డబ్బులు వెదజల్లి చేయించుకుంటూ కృత్విమత్వానికి దగ్గరయి ఒక్కరోజులో తూ తూ మంత్రంలా కార్యక్రమం అయిందనిపించి చేతులు దులిపేసుకుంటున్నాం. అదా మనకు కావలసింది?. మనవాళ్ళకి నాలుగు పదార్ధాలు ఆత్మీయంగా వడ్డించి వాళ్ళు కమ్మగా తిని ఆశీర్వాదాలు అభినందనలు అందిస్తే ఆ తృప్తికి విలువ కట్టగలమా? నాలుగురోజులుండడానికి ఈ భూమ్మీదకు వచ్చాం, ఏం తీసుకు వచ్చాం?... ఏం తీసుకుపోతాం? పండుటాకులా రాలిపోయేవరకూ ఒకరికొకరం కష్ట సుఖాల్లో పాలుపంచుకుందాం. మన వంశ జనాభా లెక్కలు నేను చూస్తాను మీరందరూ ఈ లోకంలోకి వచ్చే చిన్నారుల... మరియు ఈ లోకాన్ని విడిచిపెట్టే వృద్ధుల వివరాలు పంపండి. నేను అప్ డేట్ చేసి అందరికీ పంపుతాను. నా తదనంతరం ఈ బాధ్యత నా పిల్లలు నిర్వర్తిస్తారు. అందరం కలసి మెలిసి వుండాలి... సుఖంగా వుండాలి." అని ముగించారు.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి