కొత్తగా చేయించుకున్న కెంపుల జూకాలు పెట్టుకుని .. అద్దం ముందు మురిసిపోతుంది కాత్యాయని . ఎర్రటి ఎరుపు రంగులో ఉన్న కెంపులు .. కొత్త బంగారంతో కలసి .. ధగధగ మెరుస్తున్నాయి. అసలే అందమైన తనకి .. కొత్త నగ మరింత శోభ నిచ్చింది.
 
 కొత్త నగకి మేచింగ్ గా ఉంటుందని, పండక్కీ .. ఎరుపు రంగు కుందన్లు, మెరుపులూ కుట్టిన ‘చీరె’ తీసుకుంది. ఇంటికి పెద్ద కూతురు. త్వరలో తల్లి పెళ్లి చేసే యోచనలో ఉంది. అందుకే ముందు చూపుతో .. ఆ రోజుకి ఇప్పటి నుంచే .. అన్ని మెల్లమెల్లగా సమకూర్చుకుంటుంది.
 
 చెల్లి సాయిలక్ష్మికి కూడా అలాంటి చీరే తీసుకుంది.
 
 వీళ్ళ కన్నా .. అన్నయ్య మురళి పెద్దవాడే అయినా .. పోటీ ప్రపంచంలో చదువుకున్న .. చదువుకు ఏ ఉద్యోగం రాక .. ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుని, ఆమెతో వెళ్ళిపోయాడు, గుంటూరు.
 
 అందరి ఇళ్ళలో ఆడపిల్లలు అత్తవారింటికి వెళితే .. ఇక్కడ మగపిల్లాడే .. జీవితభాగస్వామి కోసం బయటకు వెళ్ళాడు.
 
 భర్త పోయిన దగ్గరనుంచీ అనసూయమ్మ పిల్లలతో ..
 
 ఇంట్లోనే ఓ ప్రక్కగా ఉన్న కిరాణాషాపుతో .. సంసారం నెట్టుకొస్తుంది. డబ్బు .. వడ్డీలకు కూడా తిప్పుతుంది. కొడుకు ఉండగా కూడా .. అతని ఆసరా అంతంత మాత్రమే .. అందుకని కొడుకు దగ్గర లేని ఇబ్బంది ఏమీ లేదు ఆమెకు. 
 
 బేరం చూసుకుంటా .. పని మీద ఇంట్లోకి వస్తే కాత్యాయని ఇంకా అద్దం ముందే కనిపించింది. “మురిసిపోయి౦ది చాలుగానీ, తీసి లోపల పెట్టు .. ఇప్పుడే అందరికీ చూపించెయ్యకు. మెల్లగా తరువాత వెట్టుకుందువు గాని ” కూతురు మురిపానికి ముచ్చటపడినా .. కోపం నటిస్తూ కసిరింది అనసూయమ్మ.
 
 తల్లి అలానే అ౦టుందని తెలుసు. పండక్కి అన్నయ్యా, వదినలు ఇంటికి వస్తారు. అన్నయ్య మాటెలా ఉన్నా .. వదిన వేదవతికే ఇప్పటి నుంచీ తెలియకుడదన్నది ఆమె తాపత్రయం.
 
 “ అదేం లేదు. నేను పండక్కి ఇవే పెట్టుకుంటాను .. చేయించుకున్నది ఎందుకు” అంది. ఎదురు ప్రశ్న వేసింది
 
 అసలు తను కొత్త నగ పెట్టుకు తిరగడం వదిన చూడాలన్నదే కోరిక.
 
 ఆవిడగారికీ ఉన్నాయి చిన్న కమ్మలు. పెళ్ళయినప్పటి నుంచీ అవే పెట్టుకుంటుంది. పోనీ, చీరెలన్నా సరిగా ఉంటాయా అంటే అవీ .. మాములు కాటన్ వే. తనకే గాని అలాంటి సంపాదన ఉంటేనా .. ఎన్ని వస్తువులు కొనుక్కునేదో.
 
 ***
 
 అనుకున్న సంక్రాంతి రానేవచ్చింది.
 
 పండుగ శెలవులు కలుపుకుని, మరో రెండు రోజులు శెలవు పెట్టి వచ్చింది వేదవతి అత్తవారి౦టికి .. రాజమండ్రి. రెండు రోజులు ఇక్కడ ఉండి .. మూడవరోజున బయలుదేరేస్తుంది.
 
 కనుమనాడు ‘కాకైనా’ కదలదు లాంటి సామెతలు పక్కనపెట్టి, పుట్టి౦టికి. లేకపొతే .. మళ్ళీ శెలవులు పూర్తి అయ్యేసరికి .. గుంటూరులో ఉద్యోగానికి చేరుకోలేదు.
 
 పండుగ రోజున ..ఆడపడుచులిద్దరూ కొత్తగా కనిపించారు.
 
 ఉద్యోగం చేస్తూ కూడా తను .. ఆడపడుచుల ముందు తక్కువగా ఉండడం ఇబ్బందిగానే ఉందేది. కానీ, ఏం చేస్తుంది?
 
 వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే బొటాబొటి. మురళికి ఏపనీ చెయ్యాలన్న ఆలోచనలేదు. ఊరు గాని ఊల్లొ తనకి తోడుంటే చాలనుకుంది అప్పుడు. ఇప్పుడు పిల్లలు ఎదిగి వస్తున్నారు.
 
 పండుగ ఎడ్వాన్సు పెట్టుకుని .. ఆ డబ్బుతో .. ఇలా వచ్చింది.
 
 కాత్యాయని చెవికున్న ఎరుపు రంగు కెంపుల బుట్టలు .. పెద్దవిగా వుండి, మెరుస్తూ ఆమె ఆమె అందానికి వన్నెతెచ్చాయి.
 
 సాయిలక్ష్మి కూడా చెవి దిద్డుకి, వెనుకవైపు నుండి వేలాడే పొడుగాటి బుట్టలు పెట్టుకుంది. అవి పొడవుగా గుడిలో .. వేలాదీసిన గంటల్లా ఊగుతున్నాయి.
 
 పిండి కొద్దీ రొట్టె అన్నట్టు.
 
 తనకి అంతగా నచ్చకపోయినా తండ్రి బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని, పెళ్ళిలో చిన్న కమ్మలే కొనుక్కుంది వేదవతి, ఈరోజుకీ అవే వాడుతుంది. పెద్ద ఆడపడుచు అంతగా ఎక్షిబిట్ చేస్తున్నా.. చూసి తను ఏమీ మాట్లాడకపోతే ‘జలసీ’ ఫీలవుతుందని అనుకోవచ్చు.
 
 అందుకే “ కొత్తవా” అడిగింది. 
 
 ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కాత్యాయని, “ మరే! ఇంట్లో పాత బంగారం ఉంటేనూ”అంది. ఆ బంగారమే ఇంట్లో లేకపొతే తను కొత్త నగ చేయించుకునేది కాదన్నట్లు.
 
 మళ్ళీ తనే “వాటికీ మేచింగుగా ఉంటుందని రెండు వేలు పెట్టి, ఈ చీరే తీసుకున్నా.. బాగుందా!” ఒంటి పొర మీద చీర కొంగు జీరాడేసుకుంటూ షోకేసులో బొమ్మలా ఫోజు ఇస్తూ అడిగింది. వదిన మెచ్చుకుంటే, ఏ ఆడపడుచు సంతోషపడదు.
 
 “చాలా.. చాలా .. ఖరీదుకి తగ్గట్టే ”
 
 “ చీరెకు ఎక్కువ ఖరీదు పెట్టానని .. మా అమ్మగారికి కోపం వచ్చింది. ఆ రోజు నాతో సరిగ్గా మాట్లాడలేదు ” తన కన్నా కొద్దిగా పెద్దదైన వదినతో ..తల్లి కోప్పడిన విషయం చెప్పి ఓదార్పు పొందాలనుకుంది.
 
 ఆ సంభాషణల్లో అక్కడే ఉన్న చెల్లి .. సాయిలక్ష్మిని కూడా భాగస్వామిని చేసింది. ఆరోజు అలా జరిగింది కదా! .. ఇలా జరిగింది కదా! అంటూ.
 
 నవ్వేసి ఊరుకు౦ది వేదవతి, ఏ ఇంటిలోనైనా ఉండేదే ఇది.
 
 తల్లి మాటల్ని బేఖాతరు చేసి అక్క, వదినతో అంత ఫ్రీగా మాట్లాడేయ్యడం .. సాయిలక్ష్మికి నచ్చినట్లుగా లేదు. వాళ్లతో నవ్వుతూనే .. ఏదో పని ఉన్నట్లు వీధి గుమ్మం వరకూ వెళ్లివచ్చి “ చూడు. నిన్నే.. అమ్మ పిలుస్తుంది కదా .. వినిపించడం లేదా ” అంటూ అక్కను కసిరింది.
 
 “కొట్లులో బేరం వచ్చే టైము కదా .. ఈ పండగ టైములో హడావుడిగా ఉంటుంది. కూర్చోవడానికీ ఉండదు ..నిలబడడానికీ ఉండదు” అందుకు వివరణ ఇచ్చింది సాయిలక్ష్మి..
 
 అత్తగారితత్వం వేదవతికి తెలుసు. తనున్న రెండురోజులూ .. వాళ్ళని తనతో కలవనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. 
 
 ఆవిడకు కూతుళ్ళు తప్ప .. కోడలు ఎప్పుడూ గుర్తుకు రాదు. గుంటూరులో తాము అద్దెకు ఉన్న ఇంటి ఓనరమ్మగారైతే, ఆవిడ కన్నా.. ఆవిడ కోడలికే ఎక్కువ ఖరీదైన చీరే కొనేది.
 
 ‘మా కోడలు ఉద్యోగానికి వెళుతుంది’ అంటూ.
 
 ఇక్కడ అందుకు పూర్తిగా వ్యతిరేకం.
 
 ఇంట్లోకి అడుగు పెడుతూనే “ బాగున్నారా! అత్తయ్యగారూ” అంటూ తనే .. ఎదురు పలకరించాలి. అక్కడ తనకేదో భోజనానికి లేక ఇక్కడికి వచ్చినట్లు. తను ఇన్నిసార్లు వచ్చి వెళ్ళినా ఆవిడ.. ఎప్పుడైనా .. పిల్లల చేతిలో అయినా పది రూపాయలు పెట్టిన పాపాన్నపోలేదు.
 
 ఆవిడ కొడుకునే దూరం పెడుతుంది సంపాదన లేనికారణంగా. చనువిస్తే తను ‘జీతం చాలడం లేదు అత్తయ్యా’ అంటుందని ఆవిడ భయం కావచ్చు. 
 
 ***
 
 మురళి ఇంటి పట్టున సుఖంగా ఉండడానికే అలవాటు పడిపోయాడు. ఎవరైనా అడిగితే “ నేను ఇంట్లోనే ఉంటున్నానండి” అనేవాడు అభిమానపడకుండా.
 
 మూడేళ్ళ తరువాత ..
 
 కాత్యాయనికి సంబంధం కుదిర్చింది అనసూయమ్మ.
 
 పెళ్ళికొడుకు అఖిలేష్ ఇంజనీరింగు చదివాడు.. పై చదువు అమెరికాలో చదివే ఆలోచనలో ఉన్నాడు. పిల్ల నచ్చడంతో .. వెంటనే పెళ్లి కుదిరిపోయింది.
 
 పెళ్లి పనులు భుజాన్న వేసుకున్నాడు మురళి. వాళ్ళడిగిన లాంచనాలతో, పది కాసుల బంగారంతో ఘనంగానే చేసింది అనసూయమ్మ.
 
 కూతురి పెళ్ళిలో మనవలకైనా ఓ జత బట్టలు కొనే ఆలోచన చెయ్యలేదు అత్తగారు.
 
 అదే వేదవతికి కష్టంగా తోచింది.
 
 తనూ ‘ఓసారి కట్టిన చీరెనే’ కొత్త దానిలా కట్టుకోవలసి వచ్చింది.
 
 తండ్రి ఆర్దిక పరిస్తితి సరిలేక .. తక్కువ కట్నానికే వచ్చిన ఉద్యోగం లేని మనిషిని చేసుకున్నందుకు ఏళ్ళు గడుస్తున్నా వేదవతి ఆర్ధిక పరిస్తితి ఎక్కడ వేసిన గొంగళి .. అక్కడే అన్నట్లు ఉండిపోయింది.
 
 కాలక్రమంలో సాయిలక్ష్మికీ పెళ్లి చేసి౦ది అనసూయమ్మ. పెళ్ళికొడుకు పెద్దగా చదువుకోకపోయినా వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఏ ఇబ్బందీ లేదు.
***
 పది సంవత్సరాల తరువాత ..
 
 తలవని తలంపుగా .. ఎప్పుడో వ్రాసిన బ్యాంకు పరీక్షల్లో మురళికి ఉద్యోగం వచ్చింది. స్పౌస్ కేసు కారణంగా .. గుంటూరు నుంచి ఆపరేట్ చేసేలా పోస్టింగు వెయ్యించుకున్నాడు. ఇప్పుడు వేదవతి జీవితం గాడిన పడింది.
 
 కాత్యాయని భర్త అఖిలేష్ .. అమెరికాలోనే చదువుకుని .. అక్కడే ఉండిపోయాడు ఏదో ఉద్యోగంలో. “ఇండియాలో ఏముంది? అక్కడిచ్చినంత జీతం .. ఏ కంపెనీ ఇస్తుంది నాకు” అంటూ.
 
 ఏడాది కొకసారి మాత్రం వచ్చి, రెండు నెలలు ఉండి వెళ్ళేవాడు. ముగ్గురు పిల్లలు. వాళ్ళ ఆలనాపాలనా అనసూయమ్మదే.
 
 ఇప్పుడు కిరణా షాపు తీసేసారు. డబ్బు కోసం అంత వెంపర్లాడాల్సిన పనిలేదు. వచ్చే వడ్డీలు చాలు.
 
 భర్త ఎంతకీ అమెరికా వదిలి రాకపోవడంతో .. తనే కొన్నాళ్లపాటు ఉండి రావలనుకుంది కాత్యాయని.
సవాలక్ష అబ్యంతరాలు చెప్పాడు అఖిలేష్.
 
 “ నీకు ఇంగ్లీష్ రాదు. ఉండలేవు” అంటూ. 
 
 “ ఎదురింటి సుబ్బాయమ్మగారు .. కూతురు డెలివరికి వెళ్లి రాలేదా! అంతకంటే తీసిపోయనా” అంది
***.
అమెరికాలో అడుగు పెట్టిన కాత్యాయని భర్త తెచ్చిన పడవంత కారుని చూసి సంబరపడింది. ఓ డుప్లెక్స్ హౌస్ చూపించి “ ఇదే మన స్వంతం ఇల్లు” అంటే గర్వపడింది. ఇన్నాళ్లూ భర్త ..ఎవరో! ఫ్రెండ్సతో కలసి ఉంటున్నాడు. ఇక ఆ అవసరం లేదు తను వచ్చేసింది. 
 
 ఇంట్లో..
 
 ఓ అమెరికన్ లేడీ, కాత్యాయనిని చూస్తూ ‘హయ్’ అంటూ పలకరించి, ఏదో మాట్లాడింది.
 
 ప్రతిగా అఖిలేష్ బదులిచ్చాడు ‘ మై వైఫ్’అంటూ కాత్యాయనిని పరిచయం చేసాడు.
 
 ఆ దగ్గరతనాన్ని చూస్తే ఆమె చాలా రోజులుగా పరిచయస్తురాలు అనిపించింది.
 
 “ఎవరామె” అడిగింది ఆశ్చర్యంగా.
 
 “ ప్రెండు ఆలీషా అని చెప్పాను కదా” అన్నాడు.
 
 ఆలీషా అంటే .. ఎవడో .. మగాడు అనుకుంది. ఆలీషా అన్న పేరు మగాళ్ళకుండడమే తనకు తెలుసు. ఇప్పటి వరకూ భర్తకు డబ్బు మీద ‘ఆపేక్షే’ అనుకుంది.
 
 ఒక్క నిముషం ..
 
 కాళ్ళ క్రింద నేల కదిలినట్లయ్యింది.
 
 దేశం కాని దేశంలో ఇనుప ముళ్ళ పంజరంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది.
 
 ఎందుకో ఆ నిముషం .. వేదవతి కళ్ళ ముందు నిలచినట్లు అనిపించింది. వదిన్ని డబ్బు కళ్ళతో చిన్నచూపు చూసింది.
 
 ఇప్పుడు భర్త ఉద్యోగం వల్ల వేదవతికి ఆకాశం వైపు తలెత్తి చేసే అవకాశం కలిగింది.
 
 బంగారం షాపు మెట్లేక్కే వీలుకలుగుతుంది. కొన్న చిన్నా చితకా తనకి చూపించినపుడు .. అలా చూసి చూసి కొనుక్కోవలసిన అగత్యం తనకు లేదనుకుంది.
 
 అందుకే ఎవ్వరి .. గుండెల్లోనూ పేలని అగ్నిపర్వతం పేలింది. అది కన్నీటి రూపంలో .. కళ్ళలోంచి ఎగజిమ్మింది.
***
కాత్యాయని వెళ్లి రోజులు గడుస్తున్నా.. అఖిలేష్ వైఖరిలో మార్పేమీ రాలేదు.
 
 ఈమే కాదు .. న్యూ డిల్లీలో కూడా ఓ గరల్ ఫ్రెండ్ ఉందని .. ప్రతిరోజూ రాత్రి పదకొండు తరువాత దానితో కూడా ఫోనులో గంటలు గంటలు మాట్లాడతాడని తెలుసుకుంది
 
 రోజురోజుకీ సవతులపోరుని భరించలేకపోతుంది “ నేను వచ్చి నెలరోజులవుతుంది .. ఇక దాన్ని పంపెయ్యి” అంది ఆలీషా ని ఉద్దేశించి.
 
 “ వెళ్ళిపోతుందిలే. ఇప్పటికిప్పుడు అంటే తనకి మాత్రం రూమ్ దొరకోద్డా. ఇదంతా ఇక్కడ కామనే” అనేవాడు. 
 
 ఆ ‘మాటే’ పుండు మీద కారం చల్లినట్లు ఉండేది.
 
 కంటి మీద కునుకు రావడం లేదు. ఎవరితో చెప్పుకోవాలి తన సమస్య. అమెరికాలో తనేదో సుఖపడిపోతున్నాననుకునే తల్లికా! తన ఫోను కోసం ఎదురుచూసే పిల్లలకా!
 
 ఇప్పటివరకూ ఫోనులో .. అందరికీ తీయని అబద్దాలే చెప్పుకుంటూ వచ్చింది, గుండె రగిలిపోతూ ఉన్నా. కానీ, ఇంకా .. ఇంకా ఉపేక్షించలేదు.
 
 నోరువిప్పి మాట్లాడదామంటే తనకా భాష రాదు. తెలుగు తెలిసిన వాళ్ళు దరిదాపుల్లో లేరు. తనకేమైనా కష్టం కలిగితే .. తన జీవితానికి రక్షణ ఏది? తనని ఆదుకునేవారు ఎవరు?
 
 అలా.. ఆలోచిస్తూన్న కాత్యాయని ఆలోచనలకి అడ్డుకట్టపడి౦ది .. ఓ రోజు.
 
 అంతే,
 
 మురళికి ఫోన్ చేసింది “ అన్నయ్యా ఎలా ఉన్నావ్” అంటూ.
 
 కాస్సేపు మాట్లాడి, “ఓసారి రవి గాడికి ఫోన్ ఇవ్వు” అంది.
 
 “ పెద్దక్క రా. అమెరికా నుంచి కాల్. నీతో మాట్లాడుతుందట” మెడిసిన్ చదువుతున్న రెండవ కొడుక్కి ఫోన్ ఇచ్చాడు మురళి. పెద్దకొడుకు బెంగుళూరులో ఉంటున్నాడు.
 
 రవి కాస్సేపు మాట్లాడి “ అమ్మా! నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు” అంటూనే ఫ్రిజ్ మీద పెట్టిన తల్లి సెల్ తీసుకుని ..ఓపెన్ చేస్తూ “ మామయ్య ఫోన్ నెంబరు గుర్తుందా నీకు” అడిగాడు.
 
 తల్లికి ఏ నెంబరు గుర్తుండదని తెలుసు అయినా అడిగాడు. ఫారిన్ కాల్ కాబట్టి, గబగబా మాట్లాడాలి అన్నట్లు.
 
 “ మామయ్య ఫోన్ నెంబరుతో పనేమిటి రా. నీకు. అయినా సెల్ లో వుంటుంది కదా ” వంటగది లోంచే చెప్పింది వేదవతి.
 
 “ ఏమో! పెద్దక్క అడిగింది”
 
 “ అక్కడున్న .. పెద్దక్కకు మామయ్య నెంబరుతో పనేంటి? ఏదీ .. నేను మాట్లాడతాను” కొడుకు దగ్గరనుంచి ఫోన్ తీసుకుని వేదవతి.
 
 వేదవతి వెంటనే లైన్లోకి వచ్చేయడంతో “ వదినా! బాగున్నారా. ఆఫీసుకి వెళ్ళే హడావిడిలో ఉంటారని .. డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు అనుకున్నా” 
 
 కాత్యాయని, వేదవతిని ఎప్పుడూ ‘మీరు’ అనే సంభోదించేది. మా అమ్మగారు అలాగే పిలవమంటారు అనేది.
 
 సాయిలక్ష్మి అలాక్కాదు .. నువ్వు అనే అనేది. 
 
 “ రొజూ ఉండే హడావిడే. మా తమ్ముడి ఫోన్ నెంబరుతో పనేమిటి”
 
 కాత్యాయని .. తడబాటుగా “ఒంటరిగా ఇక్కడ ఉండిపోయాను. నాకేదైనా కష్టం కలిగితే .. ప్రోటక్షనుగా ఉంటుందని”
 
 “నీకు ప్రోటక్షనేమిటి? మీ ఆయనతోనే ఉన్నావ్ కదా! .. ఇక్కడ ఉన్న మా ‘సి.ఐ’ తమ్ముడు నీకు ఎలా సహాయపడగలడు?”
 
 ఇక వదిన దగ్గర ఏదీ దాచలేదు కాత్యాయని.
 
 దుఃఖం తన్ను కొస్తుండగా ..అక్కడకు వెళ్ళింది మొదలు అప్పటివరకూ జరిగిన విషయాలు అన్నీ ఏకరువు పెట్టింది. మనసు భారం దిగేలా.
 
 అన్నీ విన్న వేదవతికి గుండె బరువెక్కింది.
 
 “ మీరు కలసి ఉండాల్సిన వయసులో .. దూరంగా ఉంటున్నా .. సంపాదించు కుంటున్నారులే అనుకున్నాం. కానీ, ఇలాంటి కష్టం పడుతున్నావని అనుకోలేదు. గొడవ పడక .. జాగ్రత్తగా ఉండు” అంటూ జాగ్రత్తలు చెప్పి తమ్ముడి ఫోన్ నెంబరు ఇచ్చి౦ది.
 
 విని ఆశ్చర్యపోవడం మురళి వంతైంది.
***
గుండె బరువు వదిన దగ్గర తీర్చేసుకున్న తరువాత మనసు ప్రశాంతం అయ్యింది, కాత్యాయనికి. అప్పటి వరకూ ఉన్న బ్రతుకు భయం అంతటితో తీరిపోయినట్లనిపించింది.
 
 తనకీ ‘ స్వంత దేశం’ తరఫున రక్షణ హస్తం ఉందనిపించింది..
 
 భర్త అలవాట్లలో మార్పులు తేలేకపోయినా .. ఆలీషాను బయటకు పంపింది. 
***
అనసూయమ్మ డెబ్బయ్యో పడిలో .. తనువు చాలించింది.
 
 చివరి రోజుల్లో సాయిలక్ష్మి తల్లి దగ్గరే ఉండి సేవచేసింది. అయిదేళ్ళ తరువాత .. మొట్టమొదటగా తల్లి అంత్యక్రియల కోసం .. ఇండియాకు వచ్చింది కాత్యాయని. పెద్ద కొడుకులిద్దరూ హాస్టల్లో ఇంజనీరింగులు చదువుతున్నారు. 
 
 కూతురు మంజూషని .. సాయిలక్ష్మికి అప్పగించింది.
 
 అనసూయమ్మ పోయిన తరువాత .. తల్లి ఆస్తి కూతుళ్ళదే అని నగలన్నీ కూతుళ్ళు ఇద్దరూ పంచుకున్నారు.
 
 వేదవతి ఏ విషయంలోనూ తలదూర్చదలచుకోలేదు. అత్తగారు ఉండగా ఎప్పుడూ ఓ చీరే అయినా పెట్టలేదు. ఆవిడ పోయిన తరువాత .. దేనికి ఆశ పడాలి. తన ఉద్యోగం తనకి ఉంది. పాతికేళ్ళ సర్వీసుకి .. మంచి జీతంలోనే ఉన్నాను ఈరోజు అనుకుంది.
 
 కాత్యాయని వస్తూ డబ్బుతోపాటు .. నాలుగు బంగారం బిస్కెట్లు కూడా తెచ్చింది. అమ్ముదామనుకుంటే .. ఏ బంగారం షాపు వాళ్ళు కొనలేదు. ఆ మొత్తానికి నగలు ఇస్తామన్నారే గాని, డబ్బు ఇస్తామనలేదు. వాటినెలా డబ్బు చేసుకోవాలో తెలీలేదు.
 
 సాయిలక్ష్మి భర్త ..తన వ్యాపారంలో భాగంగా .. పల్లెటూళ్ళలో అమ్మిపెట్టే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చాడు.
 
 తల్లి దినకర్యాల తరువాత ..
 
 ఇల్లు పాతది అయిపోవడంతో ..అమ్ముతానని ప్రకటించాడు మురళి.
 
 అందులో తమకీ వాటా ఉందన్నారు చెల్లెళ్ళు.
 
 ఇల్లు ఎప్పుడో చనిపోయిన తండ్రి పేరుమీద ఉండిపోయింది గాని, లేకపోతే .. తల్లితో రాయించేసుకునేదే సాయిలక్ష్మి. ఈ విషయంలో కాత్యాయని తో కూడా పొరపొచ్చాలు వచ్చాయి. అందుకు సైలెంటుగా ఉండిపోయింది.
 
 ‘మగపిల్లాడు అయితే మాత్రం .. ఇంట్లో ఉండలేదు కదా! అటువంటపుడు .. ఇల్లు అమ్మకంలో ‘సగ౦ వాటానా’ ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకేం లోటు?’
 
 అదీ సాయిలక్ష్మి వాదన.
 
 మురళికి చెల్లెళ్లకి మాట తేడాలోచ్చాయి .. గొడవ పడ్డారు.
 
 ఆవిషయంలో పెద్దరికం వహించిన దూరపు బంధువైన రాఘవులు “మీ వదిన ఉద్యోగం నిమిత్తం అన్నగారు ఇంటికి దూరంగా ఉన్నా .. వారసుడు వారసుడే. ఇంకా మాట్లాడితే .. మీకు ఇవ్వాల్సింది అంతా పెళ్లిలోనే ఇచ్చింది మీ అమ్మ. కట్నకానుకలు .. ఎవరు ఇచ్చినా, అది మీ ఇంటికి సంబందించిన డబ్బే కాబట్టి, మీ ఇద్దరూ .. ఇంకా కావాలని గొడవ చెయ్యడం మంచిది కాదు. తల్లి పోయిందని, అన్ననీ దూరంచేసుకుంటారా” అంటూ హితవు పలికాడు.
 
 అసలు వాళ్ళ బాధంతా అన్నయ్య పేరుతొ .. తమ తండ్రి కస్టార్జితం అప్పనంగా బయట నుంచి వచ్చిన ‘వదిన’ అనుభవించేస్తుందని.
 
 “పెళ్లి పేరుతొ మీకు అందాల్సినది అంతా అదింది. నాకూ మొన్న మొన్ననే ఉద్యోగం రావడంతో .. జీవితంలో సరిగ్గా నిలదొక్కుకోలేదు. ఈరోజుకీ స్వంత ఇల్లు లేదు. పైగా చిన్నవాడి చదువుకి లక్షల్లో డబ్బు కావాలి. మీరా అన్నీ విధాలా సెటిల్ అయిఉన్నారు. కాబట్టి, నేను సగం వాటా తీసుకుని, మిగిలిన సగం మీ ఇద్దరికీ ఇవ్వాలనుకున్నాను. కాదంటారా .. మీ ఇష్టం”.
 
 “కొడుకుననైనా ఇప్పటివరకూ ఇంటికి సంబంధించి రూపాయి పట్టుకెళ్ళలేదు. ఇది మాత్రం ఎందుకని నా కొడుకుని బ్యాంకు ‘లోను’ పెట్టుకుని చదివించుకుంటాను. ఏ విషయంలోనూ కలగచేసుకోను” చెప్పాడు మురళి.
 
 సాయిలక్ష్మి మాట ఎలా ఉన్నా, బాగా ఆలోచించగా కాత్యాయనికి మాత్రం .. ఏడు సముద్రాల అవతల ఉన్న తనకి .. వదిన ధైర్యం అవసరం అనిపించింది. ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోనట్టే ..తాము మాత్రం విడిపోతారా. 
 
 డబ్బు .. మనిషి వెంట రాదు.
 
 అనుబంధాలే వస్తాయి అనుభవం నేర్పిన పాఠ౦.
 
 మరునాడు ..
 
 “నీ ఇష్టమే మా ఇష్టం అన్నయ్యా! ఆయినా .. డబ్బుకి పరిమితి ఏమిటి .. ఎంతోచ్చినా ఇంకా కావాలన్నట్లే ఉంటుంది. ఎంతకు అంతే. ఏదో తెలియనితనంతో .. ఎవరో అన్న మాటల్ని పట్టుకుని వేలాడాం. నిన్న రాఘవుల మామయ్య చెప్పిన తరువాత మా తెలివితక్కువ తనం ఏమిటో తెలిసి వచ్చింది. ఇవన్నీ మనసులో ఉంచుకోకు” చెప్పింది అప్పటి వరకూ అన్నమాటలకి పశ్చాత్తాప పడుతున్న దానిలా.
 
 సాయిలక్ష్మి కూడా అక్క నిర్ణయానికే కట్టుబడినట్లు నవ్వింది.

