గుణపాఠం నేర్పిన ఛాంపియన్లు - సరికొండ శ్రీనివాసరాజు

lesson by champions

సిరిపురం ఉన్నత పాఠశాలలో రాము, వాసులు 9వ తరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుంచీ వారి తరగతిలో మొదటి ర్యాంక్ వారిద్దరి మధ్య దోబూచులాడుతుంది. నువ్వా నేనా అన్నట్లు పోటీపడి చదివేవారు. అయితే ఈ పోటీ వారిద్దరి మధ్య ఈర్ష్యను పెంచింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఎవరు మొదటి ర్యాంక్ వచ్చినా మరొకరికి మనశ్శాంతి ఉండేది కాదు. ఈర్ష్య మంచిది కాదు అని, ఇద్దరూ కల‌సి చదువుకొని, ఒకరి సందేహాలు మరొకరు నివృతి చేసుకుంటూ స్నేహితులుగా ఉంటే ఇద్దరికీ మార్కులు పెరుగుతాయని ఎంతమంది ఉపాధ్యాయులు చెప్పినా ప్రయోజనం లేదు. నన్ను మించిన తెలివితేటలు గలవారు ఇంకెవ్వరూ ఉండరని ఇద్దరూ విర్రవీగేవారు.

ఇదిలా ఉండగా ఆ పాఠశాలకు రాఘవయ్య అనే తెలుగు ఉపాధ్యాయులు కొత్తగా వచ్చారు. అతనికి వీరిద్దరి సమస్య తెలిసి ఎంతో బాధపడ్డాడు. ఇద్దరిలో మార్పు తీసుకు రావాలని ఎంత ప్రయత్నించినా అది బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంతలో 3 రోజులు సెలవులు వచ్చాయి. రాఘవయ్య మాస్టారు తన ఊరికి వెళ్తూ రాము, వాసులను కూడా వెంట రమ్మన్నాడు. గురువుగారు తమనే ఆహ్వానించడంతో సంతోషంతో గురువుగారి ఊరికి వెళ్ళారు. మార్గ మధ్యంలో మాస్టారు గారు వారి అభిరుచులను తెలుసుకున్నాడు. మరునాడు రాఘవయ్య గారు టి. వి. ఆన్ చేసి, పాత టెన్నిస్ మ్యాచును సీ. డీ. ద్వారా చూపించాడు. అది ఇద్దరు ప్రపంచ ఛాంపియన్స్ మధ్య గ్రాండుస్లామ్ ఫైనల్ పోటీ. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతూ ఆడుతున్నారు. కొద్దిసేపు ఒకటో ర్యాంక్ క్రీడాకారునిది పైచేయి అయితే కొద్దిసేపు రెండో ర్యాంకు ఆటగానిది పైచేయి. ఎవరు గెలిచేదీ చెప్పడం కష్టం అవుతుంది. పాయింట్స్ కోల్పోయిన ప్రతిసారీ ఆ కోల్పోయిన ఆటగాడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వీరిద్దరి తీరు చూస్తే ఆట ముగిసాక గెలిచిన ఆటగాణ్ణి ఓడిపోయిన ఆటగాడు కొట్టడం ఖాయం అనిపించింది. ఆ ఉత్కంఠ పోరులో రెండో ర్యాంక్ ఆటగాడు విజయం సాధించాడు. అప్పుడు ఓడిపోయిన ఆటగాడు విజేతను ఆప్యాయంగా కౌగిలించుకొని,

అభినందించాడు. ఓడిపోయినా హర్షం వ్యక్తం చేశాడు. "ఇది మరచిపోలేని రోజు. నాకు గట్టి ప్రత్యర్థి దొరికాడు. అది నా అదృష్టం. ఇలా గట్టి పోటీ ఉంటేనే గెలుపుకోసం మరింత ఏకాగ్రతతో కఠోర సాధన చేసి, ఆటను మరింత మెరుగుపరచుకొనే అవకాశం లభిస్తుంది. నాకు ఎన్ని విజయాలు లభించాయి, ఎంతో ప్రైజ్ మనీ సంపాదించాను అన్నది ముఖ్యం కాదు. నా ఆటతీరును మరింత మెరుగుపరచుకోవడమే ముఖ్యం. ఇక నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. ఒకరికొకరు గురువులు." అని ఓడిపోయిన ఆటగాడు మాట్లాడాడు. అది చూస్తున్న రాఘవయ్య మాస్టారు రాము, వాసులతో "మీరిద్దరూ తెలివైన విద్యార్థులు అయితే ఏమి గ్రహించారో చెప్పండి." అని అడిగాడు. అప్పుడు రాము, వాసులకు ఆ వీడియో గురువుగారు తమకు ఎందుకు చూపించారో అర్థం అయింది. ఇద్దరి మధ్యా గట్టి పోటీ ఉంటేనే చదువులో మరింత మెరుగవుతారని, అది మంచి భవిష్యత్తుకు దారి తీస్తుందని గ్రహించారు. తమ మధ్యనున్న ఈర్ష్యను, వైరాన్ని వదిలిపెట్టి, రాము, వాసూలు ప్రాణ స్నేహితులు అయ్యారు. మరో రెండు రోజులూ అక్కడే ఉండి సరదాగా తనివి తీరా ఆడుకున్నారు.

మరిన్ని కథలు

Kaliyuga yakshudlu
కలియుగ యక్షుడు
- దినవహి సత్యవతి
Maangalyam tantunaa
మాంగళ్యంతంతునా...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Aavakaya prahasanam
ఆవకాయ ప్రహసనం
- జీడిగుంట నరసింహ మూర్తి
Apaardham
అపార్థం
- బామాశ్రీ
Nijamaina ratnam
నిజమైన రత్నం
- బోగా పురుషోత్తం.
Snehamante Ide
స్నేహమంటే ఇదే
- కందర్ప మూర్తి
Andamaina muddu
అందమైన ముద్దు
- వారణాసి భానుమూర్తి రావు