దోపిడి - పద్మావతి దివాకర్ల

robbery

"మన భారతదేశం ఒకప్పుడు ఎనలేని సిరిసంపదలతో, అంతులేని ఐశ్వర్యంతో తులతూగుతూ ఉండేది. మన సంస్కృతి మహోన్నతమైనదీ, సనాతనమైనదీను. పూర్వకాలంలోమన దేశంలో రత్నాలు రాశులుపోసి అమ్మేవారు. అలాంటి రత్నగర్భ అయిన మనదేశం చాలాసార్లు దోపిడీలకి గురయింది. విదేశీయులు మనదేశాన్ని బాగా దోచారు. ప్రజల మానప్రాణాలతో ఆడుకున్నారు. గజనీ సుల్తాను ఇరవైఒక్కసార్లు భారతదేశంపై దండెత్తి చివరికి మనదేశాన్ని దోచాడు. గ్రీకులు, తురష్కులు, ఆగ్లేయులు, డచ్‌వాళ్ళు, ఫ్రెంచ్‌వాళ్ళు ఇలా ప్రతీ ఒక్కరు మన భారతదేశం మీద ఆధిపత్యం చెలాయించారు. ఆ సమయంలో మన దేశం పరిపాలించే రాజులమధ్య అనైక్యత కూడా వాళ్ళకి బాగా తోడ్పడింది. గ్రీకులు, తురష్కులు, ఆగ్లేయులు, డచ్‌వాళ్ళు, ఫ్రెంచ్‌వాళ్ళు ఇలా ప్రతీ ఒక్కరు మన భారతదేశం మీద ఆధిపత్యం చెలాయించారు. ఆ సమయంలో మన దేశం పరిపాలించే రాజులమధ్య అనైక్యత కూడా వాళ్ళకి తైముర్‌లంగ్, నాదిర్‌షా లాంటి విదేశీయులు భారతదేశాన్ని నిలువునా దోపిడీ చేసారు. ఆ తర్వాత వ్యాపారనిమిత్తం వచ్చిన ఆంగ్లేయులు మెల్లమెల్లగా మన దేశాన్ని ఆక్రమించుకుని విఛ్ఛలవిడిగా దోపీడికి గురి చేసారు. అంతులేని మన సంపదను కొల్లగొట్టారు. వాళ్ళ దోపిడీని అరికట్టడానికి మనదేశ నాయకులు ఎంతో కష్టపడవలసి వచ్చింది. గాంధిజీలాంటి ఎందరో మహానుభావుల ఆకుంఠిత దీక్ష, దేశభక్తి, స్వతంత్ర పోరాటంవల్ల మనదేశానికి స్వాతంత్రం సిద్ధించి విదేశీయులు దోపిడీకి అడ్డకట్ట పడింది." అంటూ చెప్తున్న చరిత్ర మాష్టరు రామారావు మాటలు శ్రద్ధగా వింటున్నారు విద్యార్థులు. క్లాస్‌బెల్ కొట్టేంతవరకూ మైమరిచిపోయి పాఠం లో లీనమైపోయారు వాళ్ళు.

విద్యార్థులకి ఏ పాఠం చెప్పినా అదో పాఠంలాకాక కళ్ళకి కట్టినట్లు, మనసుకు హత్తుకున్నట్లు చెప్పడం రామారావు మాష్టరుగారి ప్రత్యేకత. అలాగే పాఠంవింటున్న విద్యార్థులు కూడా మాష్టరుగారు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వినేవాళ్ళు. తన పాఠాలద్వారా వాళ్ళను వందల ఏళ్ళు వెనక్కి తీసుకుపోయి అందులో లీనమైపోయేలాగా చేయగల ప్రతిభ కలవాడు రామారావు మాష్టరు.

"రామారావుగారూ, ఈవాళ మీ క్లాస్‌రూం పక్కనుండి వస్తూంటే మీ పాఠం విన్నాను. మీలాగా విద్యార్థులని ఆకట్టుకోవడం మాకెవరికీ కుదరడం లేదు. మీరు అంతలా లీనమైపోయి పిల్లలికి పాఠం చెప్తారు, అదే మీ ప్రతిభ మరి!" అన్నాడు మాథ్స్ టీచర్ మాధవరావు కామన్ రూంలోకి అడుగుపెట్టిన రామారావుని.

“కళ్ళకి కట్టినట్లు చరిత్ర పాఠాలు చెప్పడంలో మీకు మీరే సాటి మాష్టరుగారూ. ఇవాళ మీరు చెప్పినది నేనూ విన్నాను. విదేశీయుల దౌర్జన్యం, దోపిడీ గురించి తలచుకుంటూంటే మనసుకు చాలా బాధ కలుగుతోంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దోపిడీ ఏమాత్రం తగ్గలేదన్నది నిజం. కాకపోతే నాడు దోచినది విదేశీయులైతే, నేడు మనల్ని మన స్వదేశీయులే దోస్తున్నారు. మామూలు చిల్లర దొంగలనుండి ఘరానా మనుష్యులుగా చలామణీ అవుతున్న పెద్దవాళ్ళవరకూ అందరూ దోపిడీ దొంగలే, కాదంటారా?" అని అడిగాడు సైన్సు టీచర్ రంగనాధం.

"అవును. ఇది ముమ్మాటికీ నిజం. ఎవరికి తోచినట్లు వాళ్ళూ ఇతరులని దోపిడీకి గురి చేస్తున్నారు." వంత పాడాడు డ్రాయింగ్ మాష్టరు క్రిష్ణమూర్తి.

“మన సంపదను విదేశీయులు దోచగలిగారేమో కానీ మన మేధోసంపత్తిని ఎవరూ దోచలేరుగదా! ఇప్పుడు మనదేశం అత్యధిక మానవసంపద, మేధోసంపత్తిగల దేశంగా గుర్తింపు పొందింది.. ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాల్లోనూ మనవాళ్ళు బాగా గుర్తింపు పొందారు.” అన్నాడు రంగారావు మాష్టరు.

ఇదే సమయంలో ఎంతో ఆనందంగా అడుగుపెట్టాడు ఆ గదిలోకి నారాయణరావు మాష్టరు. అతన్ని మొహం సంతోషంతో వెలిగిపోవడం చూసిన మాధవరావు, "ఏమిటండీ నారాయణరావుగారూ, ఏమైనా సంతోషకరమైన వార్త ఉంటే మాతో పంచుకుంటే మేము కూడా అనందిస్తాము కదా!" అన్నాడు.

"మా అబ్బాయి మధు మీకు తెలుసుకదా! ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వాడికిప్పుడు అమెరికాలో మంచి ఆఫర్ వచ్చింది. ఇక్కడ దొరికే జీతానికి అయిదింతలు ఎక్కువ. మా వాడు అమెరికాలో ఉద్యోగం చెయ్యాలన్నమా చిరకాల వాంఛ నెరవేరింది. ఇదిగో, వీసా కూడా వచ్చేసిందట. వచ్చే వారమే వాడి ప్రయాణం." అన్నాడు పుత్రోత్సాహంతో నారాయణరావు.

"చాలా సంతోషం. ఇంకేం మీ కలలు, మీ వాడి కలలు సాకారమయ్యావన్నమాట. చాలా మంచి శుభవార్త చెప్పారు." అన్నాడు రంగనాధం తను కూడా సంతోషిస్తూ.

"అసలు ఇప్పుడు యువకులందరి చూపు అమెరికా వైపే ఉంది. విదేశాల్లో, అదీ ముఖ్యంగా అమెరికాలో మన యువత ప్రతిభకి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ మనదేశంలో ప్రతిభకి సరైన అదరణే లేదు. ఏది ఏమైనా మీ వాడు ముందునుండి బాగా తెలివైనవాడు. చాలా మంచి అవకాశం వచ్చింది. సంతోషం." అని తన మనసులో మాట వెలిబుచ్చాడు మాధవరావు.

"ఈ శుభసందర్భంలో మంచి పార్టీ ఇవ్వాలి నారాయణరావుగారూ!" అన్నాడు క్రిష్ణమూర్తి.

"ఓ తప్పకుండా! వచ్చే ఆదివారమే మంచి పార్టీ ఇస్తానందరికీ." అని హడావుడిగా తన క్లాస్‌రూం వైపు నడిచాడు నారాయణరావు.

అందరూ నారయణరావు అదృష్టాన్ని కొనియాడుతున్నారు.

"రామారావుగారూ, మీ అబ్బాయి కూడా ఇప్పుడు స్టేట్స్‌లోనే ఉన్నాడు కదా! వెళ్ళి అప్పుడే అయిదారేళ్ళైందేమో కదా! చాలా ఏళ్ళైంది రాలేదేమో కూడా కదా! అక్కడే స్థిరపడిపోతాడా ఏమిటి?" ఆరా తీసాడు క్రిష్ణమూర్తి.

ఆ మాటలు వింటూనే పెద్దగా నిట్టూర్చాడు రామారావు.

రామారావు కొడుకు భాస్కర్ కూడా తన చదువు పూర్తైన తర్వాత అమెరికా వెళ్ళాడు. భాస్కర్ని చదివించడానికి రామారావు అష్టకష్టాలు పడ్డాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే తండ్రి పోవడంతో ఇంటి బాధ్యతలన్నీ రామారావు మీద పడ్డాయి. చెల్లిళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముడ్ని చదివించడానికి అప్పుచేసాడు. చేసిన అప్పులు తీర్చేసరికి ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఈ లోపున ఎదిగివచ్చిన కొడుకు చదువుకోసం మళ్ళీ కొత్త అప్పులు చేయక తప్పలేదు అతనికి. మొత్తానికి భాస్కర్ ఉద్యోగం చేసి తన చేతికి అందివస్తాడనుకొనేసరికి రెక్కలు వచ్చిన పక్షిలా ఎగిరిపోయాడు.

"మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మా అబ్బాయికూడా అమెరికా మోజుతో మమ్మల్ని వదిలివెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు మాత్రమే మాతో ఫోన్‌లోనైనా మాట్లాడుతుండేవాడు. ఇప్పుడేమో చాలా రోజులైంది వాడితో మేము మాట్లాడి. డబ్బుమీద మోజుతో పూర్తిగా సంపాదనలో పడిపోయాడు. అక్కడే తనకి నచ్చిన అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నాడు." చిన్నగా నిట్టూర్చి చెప్పాడు రామారావు.

"అలాగా!" అని సానుభూతిగా రామారావువైపు చూసాడు క్రిష్ణమూర్తి.

అక్కడున్న వారందరూ రామారావువైపు జాలిగా చూసారు.

"పూర్వం విదేశీయులు మన భారతదేశంపై దండెత్తి మన ధనసంపదను దోచుకున్నారు. మరి ఇప్పుడు? మన దేశం ప్రపంచ దేశాల్లో మేధోసంపత్తిలో అగ్రగామిగా ఉంది. మన దేశానికి చెందిన డాక్టర్లు విదేశాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. మన దేశానికి చెందిన ఇంజినీర్లు, సైంటిస్టులు చాలా దేశాల్లో ప్రఖ్యాతి గాంచారు. ఆ దేశాల్లో జరిగే అభివృద్ధికి అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు మన దేశాన్ని విదేశీయులు దోస్తే, మన ఇప్పుడు మన మేధస్సుని ఇతర దేశాలకి దోచిపెడుతున్నాం." నిట్టూర్చుతూ అన్నారు రామారావు మాష్టరుగారు.

'అవును! రామారావుగారు చెప్పినదానిలో నిజం లేకపోలేదు.' అనుకొని అక్కడున్నవారందరూ ఆలోచనలో పడ్డారు.

అవును మరి! దోపిడిలో మార్పే లేదు, అప్పటికి ఇప్పటికి. అప్పుడు మన సిరిసంపదలు వాళ్ళు దోపిడి చేస్తే, ఇప్పుడు మనం మన మేధస్సు వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళ అభివృద్ధికి కారకులమవుతున్నాం మరి.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి