అసిరయ్య - భవ్య

asirayya

అసిరయ్య, మా నాన్నమ్మ వాళ్ళ , ఇంట్లో ఒక పని వాడు, వాడిది ఆ ఊరు కాదు ,పక్కనే ఉన్న నర్సింగపూర్ అనే ఊరు వాడిది, చూడడానికి వింతగా ఉండే వాడు ,ముతక ధోతి, లోపల మామూలు అంగీ , పైన కోటు వేసుకుని వచ్చేవాడు.. అప్పుడు మేము చాలా చిన్న వాళ్ళం.

అందుకే మేము వాడిని వింతగా చూసేవాళ్లం , ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడు, వాడి కళ్ళు కూడా నవ్వేవి , ఏ మాట మాట్లాడినా నవ్వుతూనే మాట్లాడే వాడు, మా తాత దగ్గర చరనా అడిగి బీడీలు తెచ్చుకుని తాగే వాడు ,

మా తాత వాడిని సిగరెట్లు తెమ్మని డబ్బు ఇస్తే , బీడీల కి ఇత్తవా అని అడిగే వాడు , ఆ చరనా లో ఎంత మిగిలిన తెచ్చి ఇచ్చేవాడు, అయిదు కొత్త లు ఇయ్యవా ( అప్పుడు డబ్బును కొత్త లు అని పిలిచేవారు, చరణ కొత్త , ఆటనా కొత్త , అయిదు కొత్త లు ) అని అడిగి తీసుకుని , బీడీలు తాగేవాడు, అది మా తాత చాటుగా తాగే వాడు,

ఒక్కోసారి మేము పొలం కి వెళ్తాము ,అంటే మమ్మల్ని తీసుకొని , భుజాల మీద ఎక్కించుకొని , మరి పొలం దిక్కు తీసుకు వెళ్ళేవాడు, కిందకు దించేవాడు కాదు , మేము నడుస్తాము అని అన్న కూడా , ముళ్ళు గుచ్చుకుంటాయి చిన్న దొరసాని , వద్దు అని , తీసుకు వెళ్ళేవాడు,

మా తాత కి చాటుగా కోడిని తెచ్చి ఇచ్చేవాడు, మా నానమ్మ చూస్తే తిడుతుంది అని , ఇక వాడు కోడి ని తెచ్చిన రోజు , మా తాతని ఇంట్లోకి రానిచ్చేది కాదు! మా నాన్నమ్మ , మారి మేము కరణలం , పూజలు ,మడి, ఆచారం అన్ని పాటించేవాళ్ళం కదా! , మరి మా తాత కి ఎలా అలవాటు అయ్యిందో? కానీ తినడం, తాగడం అలవాటు అయ్యింది.

అవి తేవాలి అంటే అసిరయ్య రావాలి , ఎందుకంటే ఉన్న ఊర్లో వారికి తెలియదు కదా, తినాలి , తాగాలి అని అనిపించి నప్పుడు అసిరయ్య గుర్తుకు వచ్చేవాడు... అందుకే వాడికి కబురు పెట్టె వారు ,

వాడు ఈ సంగతి తెలియగానే ఒక కోడి పెట్ట, ఒక లొట్టి కల్లు తీసుకొని , చెప్పిన మూడు రోజులకి, తెచ్చేవాడు, అది కూడా మబ్బున 3 గంటలకి వచ్చేవాడు, వాడు వచ్చేది చూసి మా నానమ్మ తాత ను తిడుతూనే ఓ రెండు గిన్నెలు పారేసేది బయట, దాంతో పాటు నూనె, ఉప్పు ,కారం, అన్ని ఇచ్చేది , ఎవరూ లేవకముందే దాన్ని శుభ్రం చేసి , రాళ్లు పెట్టి వండేవాడు,

వాడు వండిన తర్వాత మా తాత పొలం కి వెళ్ళేవాడు , అది చూసి అసిరయ్య ఆ గిన్నెలు అన్ని తీసుకొని వెనకే వెళ్ళేవాడు, ఇక అక్కడే తిని , రాత్రి వరకు ఉండి వచ్చేవారు.రాగానే ఆ గిన్నెలు గూట్లో పెట్టి,మా తాత చన్నీళ్ల స్నానం చేసి, ఇంట్లోకి వచ్చేవారు , అది ఏ కాలం లో అయినా ఇలాగే జరిగేది..

ఇంక మాములు రోజుల్లో , పండగలు, దసరా, బతుకమ్మ పండగలకి వాడు మా ఇంట్లోనే ఉండే వాడు , బతుకమ్మ కి పువ్వులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చే వాడు, ఆ ఊర్లో మేము చేసేదే పెద్ద బతుకమ్మ అయ్యేది , అంతగా పువ్వు తెచ్చేవాడు, గునుగు , బంతి , కట్ల , తంగేడు ,

ఇంకా పేరు తెలియని, రకరకాల పువ్వులు తెచ్చి, ఇచ్చేవాడు, అదే కాకుండా బతుకమ్మ పేర్చే సమయంలో , మా నాన్నమ్మ సగం పేర్చి ,వాడికి మిగిలింది ఇచ్చేది, మీరు తయారుకoడమ్మా అని, మిగతాది వాడు పేర్చే వాడు, మేము ఆడినంత సేపు చూస్తూ కూర్చుని , మా బతుకమ్మ ని చెరువు వరకు తల మీద పెట్టుకొని , తీసుకువచ్చేవాడు...

ఎప్పుడైనా మా తాత బట్టలు ఇస్తే , అపురూపంగా తీసుకునే వాడు , అయ్యా బట్టలు , అని దాచుకొని వాళ్ళ పండక్కి కట్టుకుని ఇంటికి వచ్చేవాడు. ఇంతకీ అసిరయ్య కులం ఏంటో తెలుసా , పకిరయ్యా లు ,అంటే ముస్లిమ్ లోనే ఒక తెగ అన్నమాట...,

వాడిని. తిట్టిన, మెచ్చుకున్నా, నవ్వుతూనే ఉండేవాడు, అది చూసిన మేము నవ్వుకునే వాళ్ళం, ఎరా తాత తిడుతుంటే నీకు నవ్వు ఎలా వస్తుంది ,? అంటే అమ్మా పెట్టినా వాళ్ళే, తిట్టినా మీరే కదమ్మా అని అనేవాడు నవ్వుతూనే,...

వాడు వచ్చినప్పుడు మా నాన్నమ్మ చాలా పనులు చెప్పేది వాడికి కట్టెలు కొట్టడం, పిండి పట్టించుకు రావడం , వడ్లు ఎండబోయ్యడం, సకినాల పిండి దoచడం, బొగ్గులు తేవడం, కూరగాయలు తెంపడం,ఇలా చాలా చెప్పేది,

వాడు రాగానే ఇంట్లో మిగిలిన అన్నం ఒక విస్తారు నిండా పెట్టి ,దానిమీద ఏ కూర ఉంటే ఆ కూర వేసి ,వాడి ముందు పెట్టి ,ముందు తినమనేది, వాడు తిన్నాక , ఆ స్థలం ని , నీళ్లు చల్లి శుద్ధి చేసేది, ఆ తర్వాత అన్ని పనులు చెప్పేది, పని ఎక్కువ ఉంటే రేపు వచ్చి చేయమని చెప్పి , 5 గంటల వరకు ,

మళ్ళీ ఒక రెండు విస్తర్లో అన్నం ,కూరలు పెట్టి ఇచ్చేది, వాడు అవి ముల్లె లాగా కట్టుకొని , ఇక్కడ తిని ,ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు..విచిత్రం ఏంటంటే ఎంత అన్నం పెట్టినా వద్దు అని అనకుండా, చాలు అనకుండా తినేవాడు, మాకు చాలా వింతగా ఉండేది అది, ఎందుకంటే వాడు ఎంత అన్నం తిన్నా , వాడి పొట్ట కడుపుకు అంటుకుని ఉండేది మరి , ఆ చిన్న పొట్టలో అంత అన్నము ఎలా పట్టేదో , మాకు అర్థం అయ్యేది కాదు...

ఎవరూ ఏ పని చెప్పినా ,చేయను అని అనకుండా అందరికి ,అన్ని పనులు చేసి పెట్టేవాడు, ఎవరు తిట్టినా పడేవాడు,

పాపం అసిరయ్య, కి ఎనిమిది మంది పిల్లలు, పెద్ద సంసారం, ఒక ఎకరం పొలం ఉండేది ,భార్య కి ఎదో జబ్బు ఉండేది, ఆ ఎనిమిది మంది పిల్లల్లో నలుగురు ఆడపిల్లలు , నలుగురు మగపిల్లలు, మా అత్తయ్య బట్టలు , మా బాబాయిల బట్టలు, మా నాన్నమ్మ చీరలు పాతవి ఇచ్చేది, మా అమ్మ చీరలు కూడా అప్పుడప్పుడు ఇచ్చేది..

మా ఒక్క ఇంట్లో నే వాడు పని చేసేవాడు..ఇంకా వేరే ఏ ఇంట్లో చేసేవాడు కాదు. అంతా పని చేయించుకుని మా నాన్నమ్మ ఎదో పదో, పరకో చేతిలో పెట్టేది, అదేంటి అంత తక్కువ ఇచ్చావు అని అడిగితే , ,
నీకేం తెలిదు , ఉరుకో అని కసిరేది నన్ను,...

కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి అంటే నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడు కూడా అలాగే అడిగితే మా నాన్నమ్మ చెప్పిన జీవిత సత్యం ఏంటంటే ఇప్పుడే అన్ని డబ్బులు ఇస్తే వాడు తాగడానికి ఖర్చు పెడతాడు,

అందుకే అన్నం, కూరలు, బట్టలు ఇచ్చి పదో,పరకో ఇస్తే ఇంట్లోకి మందులో, లేదా ఇంకేదైనా తీసుకుని వెళ్తాడు,
అందుకే తక్కువ ఇచ్చాను , అని చెప్పింది.

ఇంకొరోజు ఏమైంది అంటే మధ్యాహ్నం పూట ,ఎండాకాలం లో, ఎవరో ఒకావిడ బురఖా వేసుకుని వచ్చింది, నేను నడిమిల్లు లో పడుకున్నా, వాళ్ళ మాటలకి నాకు మెలుకువ వచ్చి వెళ్లి చూసాను , ఆమె చాలా అందంగా ఉంది,కానీ నీరసంగా ఉంది, ఎవరు నాన్నమ్మ అని అడిగాను నేను ,ఈమె మన అసిరయ్య భార్య పతిమా అని చెప్పి,

ఇంట్లోకి వెళ్లి ఒక చెక్కుడు సంచి లాంటిది తెచ్చి , ఆమెకి ఇచ్చింది, ఆమె అది తెరిచి చూసుకుంటూ అందులో ఉన్న డబ్బు బయటకు తీసింది, లెక్కబెట్టు అంది నానమ్మ, ఆమె ఎందుకు దొరసాని లెక్కబెట్టుడు, మీరు ఇంత నన్న చేస్తుండ్రు, నాకు ఇంకెవరూ చేయరు ఇట్లా అనగానే ,లేదు లెక్క బెట్టుకో అంది నన్నమ్మ, ఆమె సరే అని లెక్కబెట్టింది. మొత్తం 2000 వేల రూపాయలు ఉన్నాయి, అవి . అప్పట్లో రెండు వేలు అంటే ఇప్పుడు రెండు లక్షల్లో ఉంటాయి. ఆమె అవి తీసుకుని , నాన్నమ్మ కి మొక్కి , వెళ్ళిపోయింది..


ఏంటి నాన్నమ్మ ఇది అనగానే నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని , అసిరయ్య మనకి పని చేస్తాడు కదా, దానికి మనం డబ్బు ఇవ్వాలి కదా , ఆ డబ్బు అతనికి ఇవ్వకుండా ,ఇలా దాచి , వాడి భార్య ని పిలిపించి , ఆ డబ్బు ఇస్తాను ,అని చెప్పింది, అలా ఎందుకు నాన్నమ్మ అని అడిగాను నేను అమాయకంగా,

దానికి నానమ్మ అసిరయ్య కొంచం తాగుబోతు, ఈ డబ్బు వాడికి ఇస్తే , నాలుగు రోజులు తాగి ,డబ్బు ఖర్చు చేస్తాడు, వాడికి నలుగురు కుతుర్లు ఉన్నారు, ఇప్పుడు నేను ఇచ్చిన రెండు వేల తో ఒక అమ్మాయి పెళ్లి చేస్తారు, అందుకే వాడికి ఇవ్వకుండా ,వాడి భార్యకి ఇచ్చాను, వాడి కూతురి పెళ్లి కుదిరింది,

ఇప్పుడు ఇచ్చిన రెండు వేలు కట్నం కిదకి పోతే , మనం బట్టలు, సామాను ఇప్పిస్తున్నాము. వాటితో వాడి ఒక బిడ్డ పెళ్లి అయిపోతుంది, అందుకే వాడు వచ్చినప్పుడు కొంచం డబ్బే ఇచ్చి , మిగతాది ఇలా ఈ సంచి లో దాస్తాను ,అని గొప్ప నీతి సూత్రం చెప్పింది మా నాన్నమ్మ..

ఆ తర్వాత వాడు ఎప్పుడూ వచ్చినా ,ఎక్కువ పని చేయించుకుని,తక్కువ డబ్బు ఇచ్చేది, అంతకు ముందు నేను మా నాన్నమ్మ ని తిట్టుకున్నాను,ఇంత పని చేయించుకుని ,అంత తక్కువ ఇస్తుంది, పిసినారి అని ,కానీ దాని వెనక ఇంత కథ ఉందని తెలియదు నాకు,..

వాడు చేసే కష్టం అయినా పనికి ఎంత తిన్నా ఇట్టే అరిగిపొయేది, అందుకే ఎంత పెట్టినా తినేవాడు, కూరలు ఎండాకాలం లో కాస్త వాసన వచ్చిన , ఏమి అనకుండా తినేసేవాడు, ఇప్పుడు అర్థం అవుతుంది వాడు అన్నం కి ఇచ్చిన విలువ, రెక్కల కష్టం ఎంత గొప్పదో, ...

వాడు చేసిన కష్టానికి ప్రతిఫలంగా మా బాబాయి ,తాత నాన్నమ్మ వాళ్ళు వాడి కుతుర్ల పెళ్ళిళ్ళు జరిపించారు. వాడి కొడుకుల్ని చదివించారు.

వాడి కొడుకు చదువుకుని , దుబాయి వెళ్ళాడు, బాగా సంపాదించాడు. సొంత ఇల్లు కట్టించాడు, బంగారం కొన్నాడు, తముళ్ళని బాగా చదివించి, తనతో పాటు దుబాయి కి తీసుకుని వెళ్ళాడు..ఇప్పుడు అసిరయ్య కొడుకులు అంటే ఆ ఊర్లో తెలియని వారు లేరు..కానీ

ఇప్పటికి అసిరయ్య అలాగే ఉన్నాడు, అవే ముతక పంచ, అంగీ ,కోటూ వేసుకొని ,నవ్వుతూ ఉంటాడు, ఇప్పటికీ ఏ పని చెప్పినా ,విసుక్కోకుండా చేస్తాడు. మా బాబాయి చనిపోయినప్పుడు బాగా ఏడ్చాడు వాడు.


ఏంటి అసిరయ్య, నీ కొడుకులు బాగా సంపాదించారు, కదా? హాయిగా ఇంటి పట్టున ఉండక, ఇంకా ఎందుకు పని చేస్తావ్, అని నేను అడిగితే , వాడు అన్న మాట నా మనసులో ఉండిపోయింది అది ఏంటీ అంటే , అసిరయ్య కొడుకులు గొప్ప వాళ్లు అయ్యారు అని చెప్పుకోవాలి కానీ , పలానా వాడి తండ్రీ అసిరయ్య అని చేప్పుకోవడం నాకు ఇష్టం లేదు ..

నాకు రెక్కలు ఉన్నంత వరకు, నేను పని చేసి ,నా భార్యను పోషించుకుంటాను, నా కడుపులో పుట్టిన పిల్లల దయ నాకు అవసరం లేదు , నా ఊపిరి ఆగేoత
వరకు , నేను పని చేస్తా అమ్మ, అని అన్నాడు ,అతను , అతని మంచి మనసుకు , అతని డైర్యానికి నేను ఆశ్చర్య పోయాను... చూసారా ? ఇప్పటి వరకు వాడు ,వాడు అని పిలిచిన నేను, ఇప్పుడు అతను అని గౌరవంగా పిలుస్తున్నా ,అంటే అసిరయ్య ఎంత గొప్పోడో ! మీకూ అర్థం అయ్యింది కదా !

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి