పరివర్తన - రాచమడుగు కృష్ణచైతన్య

the change

            బందిపోట్లు ఎక్కువగా ఉన్న అడవి లాంటి ఆ ప్రదేశంలో, అగర్వాల్ భవనం ఆ చుట్టుపక్కల గ్రామాలలోనే పెద్దది. ఆ బిల్డింగుకు మొత్తం ముగ్గురు సెక్యూరిటి ఉద్యోగులు, ఆ భవనానికి కాపలాగా ఉండడం చాలా గొప్పగా చెప్పుకుంటారు సెక్యూరిటీ ఉద్యోగులు, పెద్ద ఇంద్ర భవనం లాంటి ఆ ఇంట్లో ఉండేది మాత్రం ఇద్దరే, ఒకరు ఆ ఇంటి యజమాని పంకజ్ అగర్వాల్, ఇంకొకరు అతని దత్తపుత్రుడు అనిల్ అగర్వాల్. అగర్వాల్ కుటుంబం చేస్తున్నది వజ్రాల వ్యాపారం, ఆ ఊరికి దూరాన ఉన్న పాట్నాలో కొన్ని కోట్ల విలువ చేసే వ్యాపారాలు ఉన్నాయి.  ఆ భవనానికి కొద్ది దూరంలో ఉన్న గ్రామం బందిపోట్లకు బాగా ప్రసిద్ధి చెందింది, పగలు భయం లేకుండా తిరగగలిగిన జనసందోహం, చాలా క్రూరమైన బందిపోట్లు ఉన్న ఆ దారిలో చీకటి పడితే ఆ దారి వెంబడి రావడమే మానేస్తారు. ఆ బందిపోట్లు ఎంతో మందిని దోచుకున్నా, అగర్వాల్ భవనం వైపు మాత్రం చూడకపొయేవారు, కారణమేంటంటే, ఆ భవనం లో దొంగతనం చేయడానికి వెళ్ళిన వారు మాయం అయిపోతారని ఓ అపోహ. దీనికి రుజువు లేకపోలేదు, ఆ భవనం, అందులో డబ్బుకోసం ఆశపడి దొంగతనం చేయడానికి వెళ్ళిన వారు కనపడకపోవడమే, మాయమయిపోతున్నారు అన్న అపోహకు గట్టి రుజువు. అందుకే ఎవరి దగ్గర దోచుకున్నా, ఆ అగర్వాల్ భవనం వైపు మాత్రం వెళ్ళే సాహసం చెయ్యరు.  ఆ గ్రామంలో ఒక బందిపోటు అయిన మాలంగి ఇంట్లో బుల్లెట్ గాయంతో చావుబతుకుల్లో పడి ఉన్నాడు, నిన్న రాత్రి మాలంగి గుంపు పోలీసుల మీద దాడి చేయడంతో, ఆత్మరక్షణ లో భాగంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో, బృందం మొత్తం చనిపోగా మాలంగి మాత్రమే బుల్లెట్ గాయంతో పారిపోయి ఇంట్లో తల దాచుకున్నాడు, కొనఊపిరితో ఉన్న మాలంగిని చూస్తూ అతని భార్య, కొడుకు ఏడుస్తున్నారు.

            తనకు ఇక చావు తప్పదు అని తెలుసుకున్న మాలంగి తన కొడుకు అయిన మల్కన్ ను దగ్గరకు రమ్మని సైగ చేస్తూ, తన చివరి కోరిక తీరుస్తావా అని అడుగగా, అమాయకుడైన మల్కన్ తన తల్లి వైపు చూసాడు. మల్కన్ తల్లి అయిన జవేరి తీరుస్తానని చెప్పు అని మల్కన్ కు సైగ చేసింది. చివరి కోరిక ఏమిటి అని తండ్రిని మల్కన్ అడుగగా, "మల్కన్, నేను ఎంతో మందిని దోచుకున్నాను, గొప్ప బందిపోటుగా పేరు పొందాను, కానీ, అగర్వాల్ భవనంలో ఏదో ఒకటి దొంగలించాలని నా కోరిక, అది తీరకుండానే చనిపోతున్నాను, కాబట్టి నా ఈ చివరి కోరికను నువ్వే తీర్చాలి, నా ఆయుధాలు నీకు సరిపోతాయి, నా చివరి కోరిక తీరుస్తావు కదూ?" అంటూ కన్ను మూసాడు మాలంగి.  తండ్రి చివరి కోరిక వినగానే మల్కన్ తన తల్లి వైపు భయంగా చూసాడు, ఆ ఇంట్లో దొంగతనం చెయ్యడానికి వెళ్ళిన వారు, మాయం అయిపొతారని, లేదా ఎవరో చంపేస్తూ ఉంటారని తన తండ్రి మిత్రుల ద్వారా విన్నాడు. భర్తను పోగొట్టుకున్న జవేరి, అగర్వాల్ ఇంటికి పంపి తన కొడుకును దూరం చేసుకోవటానికి ఇష్టపడడం లేదు, అందరూ ఆ ఇంటిని బయటినుంచి చూసిన వారే కానీ, లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు లేరు. అందుకే జవేరి తన కొడుకును ఆ ఇంటికి పంపడానికి భయపడుతోంది. నువ్వు ఆ ఇంటిలో దొంగతనం చేయడానికి వీల్లేదంటూ తన నిర్ణయాన్ని కొడుకు మల్కన్ కు చెప్పగా, మల్కన్ మాత్రం, తండ్రి చివరి కోరికను తీర్చడం కొడుకుగా తన బాధ్యత అంటూ సూర్యాస్తమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. కొడుకు ఒక్కడినే పంపడం ఇష్టం లేక మల్కన్ వెనుక తల్లి జవేరి కూడా బయల్దేరింది.

            తండ్రి మిత్రుడైన భగవాన్ ను అడిగి ఆ భవనానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాడు మల్కన్, భగవాన్ చెప్పిన దాని ప్రకారం, రోజూ తెల్లవారుజామున రెండు గంటలకు, కాపలా సిబ్బంది మొత్తం టీ తాగడానికి కొద్ది దూరంలో ఉన్న బస్టాండుకు వెళ్ళి మళ్ళీ అరగంటలో తిరిగి వస్తారని చెప్పాడు. భగవాన్ చెప్పిన సమయం ఆ ఇంట్లోకి వెళ్ళడానికి సరైన సమయం అనుకుంటూ సరిగ్గా తెల్లవారుజామున ఒకటిన్నర గంటలకు భవనం వద్దకు చేరుకున్నారు, చుట్టూరా ఉన్న చెట్లు, ఆకుల మధ్య నక్కి కూర్చున్నారు. సమయం రెండు గంటలు సమీపిస్తుండగా కాపలా సిబ్బంది మొత్తం టీ తాగడానికి వెళ్లారు, అయితే వెళ్ళేముందు, ఆ ఇంట్లో కట్టేసి ఉన్న కుక్కను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కాపలా సిబ్బంది కన్నా ఆ కుక్కను చూడగానే ఎక్కువ భయపడ్డాడు మల్కన్, కుక్కను తప్పించడానికి, ఓ పెద్ద రాయిని తీసుకుని కొద్దిగా దూరంలో ఉన్న పొదల్లోకి వేసాడు. ఆ శబ్దం వినపడగానే, గట్టిగా మొరుగుతూ శబ్దం వచ్చిన వైపుకు పరిగెత్తింది కుక్క, ఆ శబ్దానికి వెళ్ళిన కాపలా సిబ్బంది మొత్తం వెనక్కి వచ్చారు, క్షుణ్ణంగా పరిశీలించాకా మళ్ళీ టీ తాగడానికి వెళ్ళారు,వారు వెళ్ళిపోయాకా, మళ్ళీ పొదల్లోకి రాయి విసిరాడు మల్కన్, ఈసారి మల్కన్, జవేరీలు ఆలస్యం చేయలేదు, వెంటనే ఆ ఇంటి గేటు ఎక్కి భవనం లోపలికి చొరబడ్డారు. గేటు దాటారు కానీ, అటు నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు మల్కన్, జవేరిలకు. తల్లిని అక్కడే ఒక చెట్టు వెనుక కూర్చోమని, లోపలికి వెళ్ళే మార్గం కోసం చూడసాగాడు మల్కన్. టీ కోసం వెళ్ళిన కాపలా సిబ్బంది వచ్చేలోపు వీళ్ళిద్దరూ బిల్డింగు లోపలికి వెళ్ళిపోవాలి, లేకపోతే గేటు దగ్గరే దొరికిపోతారు, అప్పుడు తండ్రి చివరి కోరిక తీర్చడం సాధ్యం కాదు.

            అలా చొరబడడానికి దారి వెతుకుతుండగా, ఓ పైపు, దానికి దగ్గరలో తెరిచి ఉన్న కిటికీ కనబడ్డాయి, ఇంకేం, లోపలికి పోవడానికి దారి దొరికింది అని తల్లికి చెప్పి, ఇద్దరూ మెల్లగా పైపు పట్టుకుని, జాగ్రత్తగా లోపలికి దూకారు. ఆ గది మొత్తం చీకటిగా ఉండడం వలన, తన దగ్గర ఉన్న లైటరును వెలిగించాడు మల్కన్. ఆ చిన్న వెలుతురులో ఆ గది తలుపు మూసి ఉండడం గమనించాడు, ఎటు వెళ్ళాలో, ఎలా దొంగతనం చెయ్యాలో అనే భయంతో మల్కన్, జవేరికి వణుకు మొదలైంది. మల్కన్ తలుపు తీయడానికి ప్రయత్నించాడు, రాకపోవడంతో ఏదైతే అది అవుతుంది అని లోపలి నుంచి గట్టిగా లాగడంతో తలుపు తెరుచుకోకపోగా వెనక ఉన్న కిటికి మూతబడింది. ఏదైనా జరిగితే తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం కిటికీ కూడా లాక్ అయిపోవడంతో, భయంతో వణికిపోసాగారు ఇద్దరూ. ఇక చేసేదేం లేక ఓ మూల నక్కి కూర్చున్నారు, కొన్ని గంటల తరువాత, తలుపు తీస్తున్న చప్పుడు అవడంతో, భయంతో మూసుకున్న కళ్ళను తలుపు వైపు తిప్పాడు మల్కన్, తన ఎదురుగా ఏదో భారీకాయం నిలబడి ఉంది, చీకటిలో సరిగ్గా కనపడడం లేదు, ఆ భారీకాయుడు ఆ ఇద్దరినీ లాక్కెళ్ళి, తన యజమాని అగర్వాల్ ముందు పడవేసి, "అయ్యా, నిన్న రాత్రి బోనులో ఒక మగ ఎలుక, ఒక ఆడ ఎలుక పడ్డాయి, ఏం చేయమంటారు?" అంటూ మల్కన్ ను, జవేరిని చూపిస్తూ అడిగాడు. "ఇప్పటివరకు మన బోనులో పడ్డ ఎలుకలను ఏం చేసామో, వీటిని కూడా అదే చెయ్యండి" అని అగర్వాల్ అంటుండగా, జవేరి వెళ్ళి అగర్వాల్ కాళ్ళ మీద పడి, "అయ్యా, నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, నా కొడుకు అమాయకుడు, వాడిని వదిలేయండి, మీకు దండం పెడతాను, ఇంకెప్పుడూ దొంగతనానికి వెళ్ళం" అంటూ వేడుకున్నా అగర్వాల్ కరుణించలేదు. ఆ భారీకాయుడు ఇద్దరి నోటికి ప్లాస్టర్ వేసి, ముఖాలకు గుడ్డలు కప్పి ఓ వ్యానులో ఎక్కించాడు. ఆ వ్యాను ఎక్కడికి వెళ్తుందో డ్రైవరుకు, ఆ భారీకాయుడుకు తప్ప ఎవరికీ తెలీదు.

            దాదాపు చీకటి పడే సమయానికి వ్యాను ఆగిన శబ్దం వచ్చింది, ఎక్కడికి తీసుకువచ్చారో, ఏం చేస్తారో తెలియక మల్కన్, జవేరి ఇద్దరూ భయపడుతూ కిందకు దిగారు. ఆ భారీకాయుడు వీళ్ళిద్దరి ముఖాలకు ఉన్న గుడ్డలు తీసేసి, ఓ గదిలోకి తోశాడు. వీళ్ళిద్దరూ కళ్ళు నులుముకుని చుట్టూ చూస్తుండగా, ఆ భారీకాయుడు ఆ గదికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వచ్చారో  తెలియదు, ఒక్క మనిషి కూడా కనబడలేదు, కానీ పక్క గది నుంచి అరుపులు మాత్రం వినపడుతున్నాయి, ఆ అరుపులు కూడా తమలాంటి దొరికిపోయిన దొంగలవేమో అని అనుకున్నారు ఇద్దరూ, తండ్రి చివరి కోరిక అంటూ వచ్చిన కొడుకు మల్కన్ ను చూసి తన భర్త మీద కోపం వచ్చింది జవేరికి, మొగుడు చనిపోతే ఆ ఊరి నుంచి వలస వెళ్ళి, ఏదో ఒక పని చేస్తూ కొడుకును చదివించుకుని, ప్రయోజకుడిని చేద్దాం అనుకుంది జవేరి, కానీ తన భర్త చివరి కోరిక ఇలా తామిద్దరినీ జైలులో కూర్చోబెడుతుంది అని ఊహించలేదు, బిక్కుబిక్కుమంటూ అలాగే నిద్రలోకి జారుకున్నారు ఇద్దరూ. నిద్రలో ఉన్న మల్కన్ ను ఎవరో కాలితో తన్నినట్టు అనిపించి, ఉలిక్కిపడి నిద్ర లేచాడు. గార్డులాగా ఉన్న వ్యక్తి వచ్చి ఇద్దరినీ ఓ పెద్ద గదిలోకి తీసుకెళ్ళాడు, అక్కడ చాలా మంది లైనులో నిలబడ్డారు, గార్డు మల్కన్ ను మగవారు నిలబడ్డ లైనులోకి, జవేరిని ఆడవారు నిలబడ్డ లైనులోకి పంపించారు, అక్కడ ఇద్దరి వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే అక్కడ వివరాలు నమోదు చేసుకుంటున్న వ్యక్తిని జవేరి ఎక్కడో చూసినట్టు అనిపించింది. చిన్నప్పుడు చూసిన బాంబే మామయ్యలా ఉన్నాడు, ఆ పొట్టి రూపం తను ఇంకా మర్చిపోలేదు. అతని దగ్గరికి వెళ్ళి, "మీరు మా బాంబే మామయ్య కదూ!!!???" అని అడిగింది. ఆ వివరాలు నమోదు చేసుకుంటున్న వ్యక్తి ఆశ్చర్యంగా తల పైకి ఎత్తి చూసాడు, ఎప్పుడో తను బందిపోటుగా ఉన్నప్పుడు తన మేనకోడలు జవేరి అలా పిలిచేది, కళ్ళద్దాలు సరి చేసుకుని పరికించి చూడగా తన కళ్ళ ముందు ఉన్నది జవేరి అని తెలుసుకోడానికి ఎక్కువ సమయం పట్టలేదు. "అమ్మా జవేరి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, అంటే నువ్వు కూడా అగర్వాల్ భవనంలోకి దొంగతనం చేయడానికి వెళ్ళావా??" అంటూ బాంబే మామయ్య అడిగిన ప్రశ్నకు, మాలంగి ఎలా చనిపోయింది, తన చివరి కోరిక తీర్చడానికి భవనంలోకి వెళ్ళింది అంతా పూసగుచ్చినట్టు చెప్పి, తన కొడుకు మల్కన్ ను చూపెట్టింది. తన అక్క మనవడైన మల్కన్ ను ప్రేమగా దగ్గరికి తీసుకుని, పక్కనే ఉన్న గార్డును పిలిపించి, వీరిద్దరినీ క్యాంటీన్లో కూర్చోబెట్టు అని పురమాయించి, తను అందరి వివరాలు నమోదు చేసుకుని వస్తాను అని చెప్పి మల్కన్ ను, జవేరిని పంపించాడు బాంబే మామయ్య. ఆ గార్డు వారిద్దరినీ క్యాంటీన్లో కూర్చోపెట్టి తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. ఓ గంట తర్వాత, అందరి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, క్యాంటీన్లోకి వచ్చాడు బాంబే మామయ్యా. కుశల ప్రశ్నలు అడిగాడు, మాలంగి చనిపోయాడు అని తెలుసుకుని బాధపడ్డాడు. "తాతయ్య, అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?" అంటూ తన సందేహాన్ని బయటపెట్టాడు మల్కన్. "మీరు ఇద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారో నేను కూడా అలానే వచ్చాను!!" అంటూ జవాబు ఇచ్చాడు మామయ్య. "అంటే మీరు కూడా ఆ భవనంలోకి దొంగతనం చేయడానికి వెళ్ళారా?" అని మల్కన్ అడుగగా, "అవును రా మనవడా, నేను కూడా ఆ భవనంలోకి దొంగతనానికి వెళ్ళి దొరికిపోతే ఇక్కడికి తీసుకొచ్చారు" అంటూ మల్కన్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు మామయ్య. "మరి మీకు శిక్ష ఏం వెయ్యలేదా, అయితే దొంగతనం చేసి పట్టుబడిన మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారు, అంటే మేము మా ఊరిలో విన్నదంతా అబద్ధమా?, కొంచెం వివరంగా చెప్పు తాతయ్య" అంటూ మల్కన్ అడిగాడు. దానికి మామయ్య "ఆ భవనంలోకి దొంగతనం చేయడానికి వెళ్ళిన వారు మాయం అవుతారన్నది నిజం, అలా అక్కడ మాయం అయిన వారందరూ, ఇక్కడ ప్రత్యక్షం అవుతారు అన్నది కూడా నిజం. ఇప్పుడు ఆ ఇంటి యజమాని అయిన పంకజ్ అగర్వాల్ తాతగారు అంటే రాయ్ అగర్వాల్ గారు మన ఊరు నచ్చి, ఆ ఆహ్లాదమైన ప్రదేశంలో భవనం కట్టుకుని, తన ఫ్యాక్టరీకి ఆ భవనం నుంచి రోజూ వెళ్ళి వచ్చేవాడు. ఆ ఊరికి వచ్చిన మొదటి రోజే అతనికి బందిపోట్ల గురించి తెలిసింది, రక్షణ కోసం తుపాకి దగ్గర పెట్టుకున్నాడు, అక్కడున్న బందిపోట్లు నగదు దోచుకుంటారు తప్ప, ప్రాణాలు తీసేవారు కాదు, అది గమనించిన రాయ్, వీరిలో మార్పు తేవాలి అనుకున్నాడు, అందులో భాగంగా తన భవనానికి దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలు, బందిపోట్లను వేరే జిల్లాలో ఉన్న తన ఫ్యాక్టరీకి తీసుకొచ్చి పని చేయించేవాడు, అయితే ఆ క్రమంలో కొంతమంది అక్కడ్నుంచి పారిపోయేవారు, వాళ్ళు పారిపోకుండా వారి భార్యా పిల్లలను కూడా ఇక్కడకు తీసుకొచ్చేవాడు, వారిని తీసుకొచ్చి, ఆడవారికి చేతివృత్తులు నేర్పించి, చిన్నపిల్లలకు చదువు నేర్పించేవాడు. మొదట ఆ దొంగలు కష్టపడి పనిచేయడానికి ఒప్పుకోలేదు, దాంతో వారిని మార్చాలి అన్న ఆశయాన్ని వారికి చెప్పి, వారిలో మార్పును తీసుకొచ్చాడు రాయ్. ఆ భవనంలోకి వెళ్ళిన వారు తిరిగిరాకపోవడంతో ఊరిలో భయం మొదలయ్యింది, ఎవరిదగ్గర దోచుకున్నా, ఆ బిల్డింగు వైపు మాత్రం పోయేవారు కాదు ఆ బందిపోట్లు. ఆ భయంతో దాదాపు దొంగతనాలు తగ్గిపోయి వేరే పనులు చేసుకుంటున్నారు. ఆ భయాన్ని కూడా లెక్కచేయకుండా భవనంలో దొంగతనం చేయడానికి వచ్చిన వారిని ఇదిగో ఇలా తీసుకొచ్చి పడేస్తారు, చదువుకోవలసిన వారు చదువుకుంటారు, పని చేయడం ఇష్టమైతే కూలి పని చేసుకుంటారు” అని వివరించాడు తాతయ్య. "రాయ్ గారు ఎంత మంచివారు, అక్కడ క్రూరత్వం ఉన్న మనుషులుగా మాయం చేసి ఇక్కడ మానవత్వం ఉన్న మనుషులుగా మారుస్తునాడన్నమాట రాయ్ గారు, అయితే నాకు కూడా చదువు చెప్తారా తాతయ్యా?" అంటూ మల్కన్ అడుగగా, "నీకు ఉద్యోగం వచ్చేంత వరకు చదువు చెప్తారు రా మనవడా, నువ్వు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుని అమ్మను బాగా చూసుకోవాలి" అంటూ సమాధానం ఇచ్చాడు తాతయ్య.  

******కథ సమాప్తం******

మరిన్ని కథలు

unknown persons
అపరిచితులు
- పద్మావతి దివాకర్ల
diary solved families
డైరీ దిద్దిన కాపురాలు
- మీగడ.వీరభద్రస్వామి
great artist
గొప్ప చిత్రకారిణి
- భాగ్యలక్ష్మి అప్పికొండ
perfect decision
సరైన నిర్ణయం
- పద్మావతి దివాకర్ల
name and fame
పేరు ప్రతిష్ఠలు (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
story told by time
*కాలం చెక్కిన కథ*
- భాగవతుల భారతి
health is wealth
ఆరోగ్యమే మహా భాగ్యం
- బొందల నాగేశ్వరరావు