నిజమైన గురువు - శింగరాజు శ్రీనివాసరావు

the real teacher


నిజమైన గురువు
--------------------------
విశ్వవిద్యాలయపు ఆడిటోరియమంతా విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో నిండిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ రోజు కాన్వొకేషన్. పట్టాలతో పాటు మెడల్స్ సాధించిన వారు కూడ ఉన్నారు విద్యార్థులలో. అందరూ చాలా హడావుడిగా ఉన్నారు. ప్రొఫెసర్ ఆనందరావు అన్నిటినీ పర్యవేక్షిస్తున్నారు. ఆయనే ఈ రోజు కార్యక్రమానికి ఇన్ ఛార్జ్. అతని చేతిలో విద్యార్థుల జాబితా ఉంది. వచ్చిన వారందరినీ ఆహ్వాన కమిటీ ఆహ్వానించి వారిని కుర్చీలలో కూర్చోబెడుతున్నది. ఆనందరావు కూడ ఉదయం నుంచి ఎవరైనా తనకు ఎదురై ఫలానా విద్యార్థి రూమ్ ఎక్కడ అని అడుగుతుంటే ఓపికగా వారికి అర్థమయ్యేలా చెప్పి పంపుతున్నాడు. ఆ సమయంలోనే ఆ సంవత్సరం బంగారు పతక విజేత మాణిక్యాలరావు తండ్రిని కూడ కలిశాడు. మాణిక్యాలరావు వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పిన వివరాలకు, ఇతని వాలకానికి పొంతన కుదరలేదు. చూద్దాంలే అని వదిలేశాడు. ఇంతలో డీన్ పిలుస్తున్నారనడంతో ఆయన గది వైపుకు వెళ్ళిపోయాడు.

********
" అసలు నిన్నెవరు రమ్మన్నారు. పాండుగాడు చెబితే పరిగెత్తుకు వచ్చేయడమేనా. ఇక్కడ నిన్నెవరైనా చూస్తే నాకు ఎంత తలవంపులు. నీకు పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాకపోయినా, నా తెలివితేటలతో చదువుకుని ఇప్పుడు బంగారు పతకాన్ని తెచ్చుకున్నాను. ఇదంతా మా పెదనాన్న చలవ. ఆయన పెద్ద ఉద్యోగస్తుడు కాబట్టి, నన్ను చక్కగా గైడ్ చేశాడు. అంత తిండికి పంపడం తప్ప, నువ్వు వెలగబెట్టిందేముంది నాకు. నువ్వు నా తండ్రివని చెప్పుకుంటే నాకు చిన్నతనంగా ఉంది" కసకసలాడాడు మాణిక్యం.

"అదికాదురా అయ్యా. పాండుగాడు ఫోను చేసి 'నువ్వు తప్పకుండా రావాలి పెద్దయ్యా అన్నయ్యకు పెద్ద బహుమతి వచ్చింది. అది తీసుకుంటుంటే నువ్వు కళ్ళారా చూడాలి' అని చెబితే వచ్చానయ్యా. అంతే"
నొచ్చుకున్నాడు మత్తయ్య.

" వచ్చి చచ్చావుగా. చేసేదేముంది. ఆడిటోరియంలోకి వచ్చి ఒక మూలన కూర్చుని చావు. ఎవరికీ మన సంగతి చెప్పకు. పెదనాన్నను రమ్మన్నాను. ఆయనకు కనబడకుండా కూర్చో. అదృష్టవశాత్తు ఆ పాండుగాడు రాలేదు ఈరోజు. వాడు వచ్చివుంటే నీవెంట, నా పరువు గంగలో కలిసిపోయేది. చదువురాని వాడి కడుపున పుట్టడం నా ఖర్మ" విసుక్కుంటూ వెళ్ళిపోయాడు మాణిక్యం.

మనసు చివుక్కుమంది మత్తయ్యకు. ఇలా జరుగుతుందని సుబ్బులు చెప్పింది.' వద్దయ్యా ఆడు నిన్ను సిన్న సూపు సూత్తాడు. ఆడికి మన డబ్బేగాని మనం అక్కరలేదని'. అయినా తండ్రి ప్రాణం, కొడుకు ప్రయోజకుడయితే సంతోషపడకుండా ఉండగలదా. అందుకే వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కాని మనసు మొరాయించింది. తన కొడుకు వైభవం చూడాలని ఆరాటపడింది.

******

కార్యక్రమాన్ని విద్యాశాఖామంత్రి గారు ప్రారంభించి వెళ్ళిపోయారు. వేదిక మీద అందరి ఉపన్యాసాలు ముగిశాక విద్యార్థులకు కాన్వొకేషన్ ప్రారంభమయింది. ఆ కార్యక్రమం ముగిశాక బంగారు పతక విజేత ప్రకటన చేశాడు ఆనందరావు.

" ఈ సంవత్సరం మన విశ్వవిద్యాలయపు బంగారు పతక విజేత మాణిక్యాల రావు. అటు అకడమిక్ లోను, ఇటు స్పోర్ట్స్ లోను, అంతేకాక యన్. సి. సి లో బెస్ట్ క్యాడెట్ గా గణతంత్ర్య దినోత్సవ ఉత్సవంలో పాల్గొని మన విశ్వవిద్యాలయానికి వన్నె తెచ్చినందుకు గాను బంగారు పతకానికి అతనిని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు సదరు విద్యార్థిని అతని తల్లిదండ్రులతో సహా వేదిక మీదకు రావలసినదిగా కోరుతున్నాను" అని పిలిచాడు.

మాణిక్యాలరావు ఒక్కడే వేదిక మీదకు వచ్చాడు. అతని వెంట ఎవరూ రాలేదు. ఆనందరావు కళ్ళు ఉదయం తనను చిరునామా అడిగిన వ్యక్తికోసం వెదికాయి.

గర్వం తొణికిసలాడుతుంటే హుందాగా వెళ్ళి అవార్డును అందుకున్నాడు మాణిక్యాలరావు, అందరి కరతాళధ్వనుల మధ్య.

స్పందన తెలియజేయమంటూ మైకు మాణిక్యానికిచ్చి కిందికి దిగాడు ఆనందరావు. వెంటనే ఆఫీసుకు ఫోను చేశాడు.

" ఈ సంవత్సరం బంగారు పతక విజేతగా నన్ను ఎంపిక చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. మా నాన్న గారు వస్తారని, ఆయన సమక్షంలో ఈ పతకాన్ని అందుకోవాలని ఎంతో ఆశపడ్డాను. అనివార్య కారణాల వలన రాలేకపోతున్నానని చెప్పారు. అది నాకు కొంచెం నిరాశను మిగిల్చింది. ఆయన ప్రోత్సాహం, ప్రోద్బలం వలనే నేను ఈ స్థితికి వచ్చాను. ఏ నిరక్ష్యరాసుడి కడుపునో పుట్టి ఉంటే ఇంతటి స్థితి నాకు వచ్చేది కాదు. మా నాన్న గారు సబ్ కలెక్టరు కావడం వలన పనుల ఒత్తిడితో రాలేకపోతున్నానని చెప్పారు. ఈ సందర్భముగా మన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను" అని తన కృతజ్ఞతలు తెలిపి వేదిక దిగబోతున్న మాణిక్యాలరావు ఎదురుపడ్డ దృశ్యాన్ని చూసి స్థాణువైపోయాడు.

ఎదురుగా మత్తయ్యను తోడ్కొని వస్తూ ఆనందరావు.

" ఒక్క నిముషం మాణిక్యాలరావు" అంటూ అతని చేతిలోని మైకును తీసుకున్నాడు ఆనందరావు.

" దయచేసి అందరూ నన్ను క్షమించాలి. అతిగా జోక్యం చేసుకుంటున్నానని నన్ను తప్పు పట్టకండి. బిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి. అదే విద్యార్థి తప్పుచేస్తే గురువులు సరిదిద్దాలి. నేను అదే పని చేస్తున్నాను. ఇదిగో ఈ పల్లెటూరు చదువురాని మత్తయ్య ఎవరో మీకు తెలుసా? సాక్షాత్తు ఈ మాణిక్యాలరావు కన్నతండ్రి. పొలంలో పంటలు పండించే రైతన్న. పదిమందికి సహాయపడటమే తప్ప తన మేలు తను చూసుకోను చేతగాని పేదరైతు. ఇతను నాకు ఉదయం కనిపించాడు. కొడుకు చిరునామా కోసం వాకింగ్ లో వున్న నన్నే అడిగాడు. కాని మాణిక్యాలరావు చెప్పిన తండ్రి పేరు ఇది ఒకటి కాదు. అప్పుడే అనుమానమొచ్చింది. చూద్దాంలే అని చిరునామా చెప్పి పంపాను. ఇప్పుడు మాణిక్యాలరావు మాటలలో ఎందుకో నాకు నిజాయితీ కనిపించలేదు. మోసపోవడం తప్ప మోసం చేయడం చేతగాని వాడు రైతుబిడ్డ. అందుకే వెంటనే ఆఫీసుకు ఫోను చేసి మాణిక్యాలరావు ఇంటి చిరునామా సేకరించాను. అప్పుడు నిర్ధారణ అయింది అబద్ధం చెప్పేది మాణిక్యాలరావు గాని, మత్తయ్య కాదని. సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం నాకు కూడ పరుగు పందెంలో బంగారు పతకం వచ్చింది. ఆ రోజు నా ఆనందాన్ని చూసి నా తండ్రి ఎంత పొంగిపోయాడో నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది. నాతో పాటు ఆయనను కూడా వేదిక మీదకు పిలిచి సత్కరిస్తుంటే ఆయన ఆనందం వర్ణనాతీతం. ఆయన ఏ కలెక్టరో, డాక్టరో కాదు. హోటలులో పనిచేసే సర్వర్. ఆయన నా తండ్రి. ఈ భూమి మీద నా ఉనికికి కారణమైన మహానుభావుడు. ఈ రోజు ఈ స్థితిలో మనమున్నామంటే కారణం తల్లి ఇచ్చిన జన్మ, తండ్రి పెంచిన కండ. తన రెక్కలు ముక్కలు చేసుకుని మనకు బ్రతుకునిచ్చిన తండ్రిని, అంతస్థులేదని తండ్రి కాదని చెప్పడమంత కుసంస్కారం నాకు తెలిసి ఏదీ ఉండదు. మాణిక్యాలరావు చాలా వివేకవంతుడు, కానీ సంస్కారహీనుడు. పది మందిలో అతని పరువు తీయాలనికాదు. అలాగని ఎవరైనా అనుకున్నా, కన్నతండ్రి గుండెను నిలువునా చీల్చిన అతని నేరం కంటే ఎక్కువేమీ కాదు నా చర్య" ఆవేశంతో ఊగిపోతున్నాడు ఆనందరావు, వదిలేస్తే మాణిక్యాలరావు గొంతు పిసికి చంపేస్తాడేమో అని అనిపించింది చూసేవారికి.

మాణిక్యాలరావు గొంతు తడారిపోయింది. ఏది జరుగకూడదనుకున్నాడో అదే జరిగింది. గురువు గారి మాటలు గునపాలలా గుండెను పొడిచాయి. కంటిముందు కప్పుకున్న అభిజాత్యపు పొరలు తొలగిపోయాయి. అక్కడే కుప్పలా ఆనందరావు పాదాలమీద పడిపోయాడు.

ఆనందరావులో ఆవేశం తగ్గింది. మాణిక్యాలరావును లేవదీశాడు. మత్తయ్య వైపుకు నడిపించాడు. కళ్ళనీళ్ళ పర్యంతమవుతున్న బిడ్డను దగ్గరికి తీసుకున్నాడు.

" నన్ను క్షమించు నాన్నా. తప్పు చేశాను. తండ్రి చదువులేని వాడని తెలిస్తే నలుగురిలో నవ్వుల పాలవుతాననుకున్నాను గాని, తండ్రినే కాదనుకుంటే సంస్కారహీనుడనవుతానని తెలుసుకోలేక పోయాను" అని వెక్కి వెక్కి ఏడుస్తున్న అతనిని ఓదార్చి, తన చేతిలోని మైకును మత్తయ్య చేతికిచ్చి మాట్లాడమని సైగ చేశాడు ఆనందరావు.

" అందరికీ దండాలయ్యా. మా అబ్బాయికి చిన్నప్పటాలనుంచి మా పెద్దయ్య కొడుకంటే శానా ఇట్టం. ఆడు బాగా సదువుకున్నోడు. అందుకే గామోసు నా కొడుకు ఆడినే అయ్యగా మీకు సెప్పాడు. నాకు సదువు అబ్బేదో లేదో తెలవదు గాని, నాకు సిన్నప్పటినుంచి యెవసాయమంటే పేనంగా ఉండేది. నా సేతి మీదగా పదిమందికి గింజలు పంచుతుంటే తెగ సంబరపడిపోయేవాడిని. కానీ ఊల్లో అంతా మా పెద్దయ్య కొడుకును పైకెత్తేవోల్లే గాని, మా ఊసు ఎత్తేటోల్లుగాదు. అందుకే నాకు అబ్బని సదువు నాబిడ్డ సదవాలని ఆశపడి నాకు కట్టమైనా, అప్పుసేసి సదివించాను. ఆ కాడికి నేనేదో సేశానని కాదు. అయ్యగా నేను సెయ్యాల్సిన పని అది. అందుకని ఇశ్వాసంగా ఉండమని అడగటం లేదయ్యా. ఎవురైనా మీ అయ్య ఎవురని అడిగితే, మా అయ్య సచ్చిపోయినాడని సెప్పకుండా మా పేరు సెప్పండి సాలు. మీకు మేం అడ్డమేమి రాము. పిల్లలూ మీ కెవురికైనా నాలాటి సదువురాని అయ్యలు వుంటే ఆల్లని మీరు నెత్తినెట్టుకోనక్కరలేదు. ఈడే మా అయ్య అని నలుగురికి సెప్పండి. ఆ సంతోసంతోనే మేము సనిపోతాం. సదువులేనోల్లమని బతికుండగానే మమ్మల్ని సంపేయకండి" మత్తయ్య ఒక్కొక్క మాట మాణిక్యాన్నే కాదు అక్కడవున్న అందరి గుండెలను కలచివేసింది.

"అందరూ నన్ను మన్నించాలి. మంచి మూడ్ లో ఉన్న మిమ్మల్నందరినీ విషాదంలోకి నెట్టాను. కానీ తప్పలేదు. ఇది గురువుగా నా కర్తవ్యం. ఈ సంఘటన నాకు తెలిసింది కాబట్టి సరిదిద్దగలిగాను. నాకు తెలియకుండా నా విద్యార్థులు ఇంకెవరైనా ఇలాటి తప్పు చేస్తూ ఉండి ఉంటే వారికి కూడ కనువిప్పు కావాలనే దీన్ని బహిరంగం చేశాను. ఈ ప్రపంచంలో దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుదేమో గాని తల్లిదండ్రులకు మాత్రం ఉండదు. వారి స్థానాన్ని ఎవ్వరూ భర్తీచేయలేరు." అని మత్తయ్యను, మాణిక్యాలరావును కలిపి సన్మానించవలసినదిగా ముఖ్య అతిథిని కోరాడు ఆనందరావు. నిజమైన గురువుకు నిర్వచనం అతడే మరి.

******* అయిపోయింది *********

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం