కర్మానుసారం - రాచమడుగు కృష్ణచైతన్య

as our behaviour

ఒక అందమైన ఉదయాన, బాల సూర్యుడు ఉదయిస్తుండగా, ఆ బస్తీలోని ఆడవాళ్ళందరూ నీళ్ళ ట్యాంకర్ కోసం ఎదురుచూస్తున్నారు. అలా గంటకు పైగా ఎదురుచూడగా ఎక్కడో దూరాన నీటి ట్యాంకర్ జాడ కనపడింది, ఇంకేం యుద్దానికి సిద్దం అవుతున్న సైనికులు ఆయుధాలు పట్టుకున్నట్టుగా ఆడవాళ్ళు అందరూ బిందెలు చేతపట్టి ట్యాంకర్ మీద యుద్ధం ప్రకటించడానికి సిద్దమయిపోయారు. ట్యాంకర్ వారి ముందు ఆగగానే, అప్పటివరకు తీరిగ్గా ఒక కుటుంబ సభ్యుల లాగా కబుర్లు చెప్పుకున్న వారు, నేను ముందు అంటే నేను ముందు అంటూ ఒకరినొకరు తోసుకుంటూ, కింద మీదా పడుతూ బిందెలలో నీళ్ళు పట్టుకుని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతున్నారు.

"ఏం సావిత్రీ, ఈరోజు నీళ్ళు పట్టుకోవడానికి రాలేదే?" అడిగింది శకుంతల.

"ఏం లేదు పెద్దమ్మా, మా అబ్బాయి నిన్న కొత్త బండి కొన్నాడు, పూజ కోసం అందరం వెళ్తున్నాం, అందుకే రాలేదు" అంటూ తను రాకపోవడానికి కారణం చెప్పింది సావిత్రి.

"బండి కొన్నారా, మంచిది, మంచిది, అన్నట్టు జాగ్రత్తగా నడపమను, అసలే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, నిన్న మా అక్కయ్య జాగ్రత్తగా రోడ్డు దాటుతున్నా ఎవడో గుద్దేసి వెళ్ళిపొయాడు మాయాదారి సచ్చినోడు, నేను చెప్పానని చెప్పు అమ్మాయ్" అంటూ నిన్న తన అక్కయ్యకు జరిగిన ప్రమాదం గురించి వివరించింది శకుంతల.

"నేను చెప్తానులే పెద్దమ్మా" అంటూ వెళ్ళిపోతున్న శకుంతలకు వినపడేలా చెప్పింది సావిత్రి.

సావిత్రి, సావిత్రి భర్త అశోక్, కొడుకు విష్ణు ముగ్గురు కొత్త బండి పై గుడికి బయలుదేరారు, విష్ణు ఉద్యోగంలోకి చేరిన సంవత్సరానికి పైసా పైసా కూడబెట్టి కొత్త బండి కొనుక్కున్నాడు. తమ బస్తీ పక్కనే ఉన్న గుడి దగ్గర పూజ ముగించుకుని, అమ్మానాన్నలను ఇంటి దగ్గర దించేసి, తను కొనుక్కున కొత్త బండిని బస్తీ మొత్తం చూపించడానికి రయ్ అంటూ బండిని ముందుకు ఉరికించాడు. బస్తీ వీధుల్లో వెళ్తూండగా, ఎక్కడినుంచి వచ్చిందో పడవ లాంటి గొప్పింటి కారు వేగంగా వచ్చి విష్ణు బండిని ఢీ కొట్టింది. బండి నుజ్జు నుజ్జు కాగా, కారు బలంగా ఢీకొట్టడం వలన గాలిలోకి ఎగిరి రోడ్డు మీద పడి తల పగిలి రక్తం ధారగా కారుతూండగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు విష్ణు. వెంటనే విష్ణును ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తూండగా మార్గ మధ్యంలో ఊపిరి వదిలేశాడు విష్ణు. సావిత్రి ఆర్తనాదం మిన్నటింది, ఆ రోదనను ఎవరూ ఆపలేకపోయారు. ఆ కారులోని డ్రైవరు మాట్లాడుతున్న ఫోను కట్ చేసి, దిగి ఆ దృశ్యాన్ని చూసి, పారిపోవడానికి ప్రయత్నించగా, అప్పటికే అక్కడ గుమికూడిన జనం డ్రైవరును పట్టుకుని, చితకబాది చెట్టుకు కట్టేసి పోలీసులకు ఫోన్ చేసారు. పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పొలీసులు వచ్చి ఆ డ్రైవరును అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకెళ్ళారు. విష్ణు తండ్రి అశోక్ అప్పటికే నోట్ చేసుకున్న కారు నంబర్ ఆధారంగా పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చాడు.

మరుసటి రోజు విష్ణు కర్మ కాండకు సిద్దం చేతుండగా అశోక్ ఫోన్ మోగింది,

"హలో, ఎవరూ?" అంటూ అవతలి వారిని అడిగాడు అశోక్.

"హలో, అశోక్, మా సార్ మాట్లాడతారట!!" అంటూ జవాబు ఇచ్చింది అవతలి గొంతు.

"హలో, అశోక్, నా పేరు రితేష్, నిన్న మీ అబ్బాయిని గుద్దిన కారు మా పెద బాబు నడుపుతున్నదే, ఏదో ఫోనులో మాట్లాడుతూ అలా యాక్సిడెంట్ చేసాడు, ఇప్పుడు నా కొడుకును శిక్షించడం వలన పోయిన నీ కొడుకు తిరిగివస్తాడా, మనిద్దరం రాజీకి వస్తే బాగుంటుంది, ఎంత కావాలో చెప్పు, నా పనివాడితో పంపిస్తా, డబ్బు అందిన వెంటనే కంప్లయింటు వెనక్కి తీసుకో, ఏమంటావు??" అంటూ తన కొడుకు చేసింది అసలు తప్పే కాదన్నట్టు మాట్లాడాడు రితేష్.

"అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును చంపినందుకు మీ వాడికి శిక్ష పడవలసిందే, మీరు ఏం చేసినా సరే నేను కంప్లయింట్ వెనక్కి తీసుకోను?" ఖరాఖండిగా చెప్పేసాడు అశోక్.

"సరే మీ ఇష్టం, మీ భవిష్యత్తు మరియు మీ కుటుంబ భవిష్యత్తు మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, తొందర ఏం లేదు, రేపు సాయంకాలం ఐదు గంటలలోపు మీ నిర్ణయం చెప్పండి" బెదిరింపు ధోరణిలో చెప్పి ఫోన్ పెట్టేసాడు రితేష్.

ప్రముఖ వ్యాపారవేత్త మరియు కోటీశ్వరుడు రితేష్ కొడుకు యాక్సిడెంట్ చేయడం వలన ఆ విషయం పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయ్యింది, అందుకే తన కుటుంబ పరువు కాపాడుకోవడాని రితేష్ ఆఖరికి డబ్బుతో కాళ్ళ బేరానికి వచ్చాడు అని అనుకున్న అశోక్, ఏం అయితే అది అయ్యింది కంప్లయింట్ మాత్రం వెనక్కి తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు సాయంకాలం ఐదు దాటినా అశోక్ నుంచి ఫోన్ రాకపోవడంతో మళ్ళీ రితేష్ అశోక్ నంబరుకు కాల్ చేసాడు.

"ఏంటి అశోక్, ఏం నిర్ణయించుకున్నావ్?" తన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు అడిగాడు రితేష్.

"చెప్పాను కదా రితేష్, తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడి తీరాలని, నేను కంప్లయింట్ వెనక్కి తీసుకోను" మళ్ళీ ఖరాఖండిగా చెప్పేసాడు అశోక్.

"సరే అయితే, నీ ఇష్టం" అంటూ ఫోన్ కట్ చేసాడు రితేష్.

రితేష్ ఫోన్ కట్ చేసిన అరగంటకు అశోక్ ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా, తన ఫోన్ మళ్ళీ మోగింది.

"హలో, సార్, నేను వివేక్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ ఆవిడ సావిత్రికి యాక్సిడెంట్ జరిగింది, మీరు వెంటనే రావాలి" అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది నర్స్ సుజాత.

"ఏమిటీ, సావిత్రికి యాక్సిడెంటా? నేను ఇప్పుడే వస్తున్నాను" అంటూ ఎక్కడి ఫైల్స్ అక్కడ పడేసి వివేక్ హాస్పిటలుకు పరిగెత్తాడు అశోక్. హాస్పిటల్లో కాలుకు కట్టిన కట్టుతో విశ్రాంతి తీసుకుంటున్న సావిత్రిని చూసి కంగారు పడ్డాడు అశోక్.

"ఎలా జరిగింది సావిత్రీ?" బాధగా అడిగాడు అశోక్.

"నేను రోడ్డుకు పక్కగా నడుస్తున్నానండీ, ఎలా వచ్చిందో ఓ కారు వచ్చి నన్ను డీకొట్టి వెళ్ళిపోయింది, పక్కనే ఉన్న మట్టి కుప్ప మీద పడిపోయాను, పెద్ద దెబ్బలేమీ తగల్లేదు, చిన్న ఫ్రాక్చర్ అని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పి వెళ్ళారు" ఎలా జరిగిందో వివరించింది సావిత్రి.

తను భార్యతో మాట్లాడుతూండగా, చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో, నంబర్ చూసి కోపోద్రిక్తుడైన అశోక్ ఫోన్ లిఫ్ట్ చేసి, "యూ బాస్టర్డ్, నా భార్యకే యాక్సిడెంట్ చేయిస్తావా, నిన్నేం చేస్తానో చూడు" అంటూ కోపంతో ఊగిపోతున్నాడు అశోక్.

"అరె, భలే కనిపెట్టావే, అయినా నువ్వు నన్నేం చేయలేవు అశోక్, నేను చేసిన, చేస్తున్న, చేయబోతున్న అన్యాయాన్ని నా దగ్గర ఉన్న డబ్బుతో న్యాయంగా మారుస్తా, అన్నట్టు ఇప్పటికీ నేను చెప్పింది వినలేదనుకో, ఈసారి నీ భార్య పాపం, నిజంగా చచ్చిపోతుంది, అప్పటికీ నువ్వు మొండికేస్తే, ఊరిలో ఉన్న మీ అమ్మానాన్న కూడా చనిపోతారు" మరోసారి బెదిరించాడు రితేష్.

"వద్దు, ప్లీజ్, అలా చేయొద్దు, నువ్వేం చెప్తే అది చేస్తాను" భయంతో లొంగిపోయాడు అశోక్.

"అది మంచి వాడి లక్షణం, రేపు కోర్టుకు వచ్చి నీ కొడుకును చంపింది నా కొడుకు కాదని చెప్పాలి, గుర్తుందిగా, నీ చేతిలో మూడు ప్రాణాలు ఉన్నాయి" అంటూ ఫోన్ కట్ చేసాడు రితేష్.

మరుసటి రోజు కోర్టుకు బయలుదేరాడు అశోక్. అశోక్ వాంగ్మూలం ఆధారంగా రితేష్ పెద బాబు అయిన వినీత్ ను నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. తన అసహాయతను తానే నిందించుకుంటున్నాడు, కత్తి తీసుకుని రితేష్ ను, వాడి కొడుకు వినీత్ ను అక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది, కానీ తను ఏం చేయలేని పరిస్థితి. కోర్టు నుండి హాస్పిటలుకు వెళ్ళి తన భార్యను డిస్చార్జి చేయించుకుని ఇంటికొచ్చాడు. కోర్టులో జరిగిన విషయం మొత్తం భార్యకు చెప్పాడు, అంతా విన్న భార్య "నేను నమ్మను, మీరలా అబద్దం చెప్పి ఉండరు" ఏడుస్తూ అంటోంది. కోర్టులో జరిగింది చూపించడానికి టీవి ఆన్ చేసి న్యూస్ చానల్ పెట్టాడు అశోక్, "నిర్దోషిగా విడుదల అయిన రితేష్ కొడుకు వినీత్" అంటూ చూపిస్తున్నారు చానల్లో. అంతలోనే మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అంటూ వస్తున్న హెడ్ లైన్స్ సారాంశాన్ని యాంకర్ చదివి వినిపిస్తోంది, "ఇప్పుడు మనం చూస్తున్నాం బిగ్ బ్రేకింగ్ న్యూస్, రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం, కోర్టు నుంచి తిరిగి వెళ్తుండగా, లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు అయిన రితేష్ మరియు అతని కొడుకు వినీత్".

మరుసటి రోజు న్యూస్ పేపర్లలో వచ్చిన న్యూస్ “లారీ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్ల్యక్షంగా వాహనం నడిపి, రితేష్, వినీత్ ప్రయాణిస్తున్న కారును ఢీకొని వారి చావుకు కారణం అని పొలీసులు తేల్చారు”.

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ