అమ్మ చేతి వంట - డాక్టర్ చివుకుల పద్మజ

cooking by mom

"భోజనం వడ్డించేసా రండి" ప్రేమ గా పిల్చింది భార్య సరోజ భర్త రాఘవను.

"వూ.." అన్నాడే కానీ కదల్లేదు రాఘవ.

"రండి. ఏంటి ఆలస్యం. మీకిష్టమైన వంకాయ ఇవ్వాళ" హెచ్చరించింది సరోజ.

'ఈ లాక్డౌన్ కాదు కానీ నా ప్రాణానికి వచ్చింది'.. ఇది వందో సారి అనుకోవటం రాఘవ తనలో తాను.

కంచం లోని కూర అనబడే ఐటెం కేసి చూసాడు. పొడవు వంకాయ మధ్యలో ఎదో స్టఫ్ కుక్కి వుంది. ముద్ద నోట్లో పెట్టుకున్నాడు, అంతే నిన్న తిన్నవాటి తో సహా బయటికి వచ్చినంత పనైంది. పరమ చేదు. వంకాయ పచ్చి పచ్చి గా వుంది. మధ్యలోని పదార్ధం మాడి ఇంకా చేదు గా వుంది. ఆ కుక్కబడిన లేహ్యం టమాటా, ఉల్లిపాయ పేస్ట్ ట.

తలెత్తి చూసాడు, నువ్వుతున్న సరోజ, తన పరిస్థితి లోనే వున్న తల్లి కమలమ్మ, పక్కనే బిక్క చచ్చిపోయిన కొడుకు బాబీ.

నోట్లో పెట్టుకునే సరికి సరోజ క్కూడా విషయం అర్ధం ఐంది. కానీ, అహం అడ్డం వచ్చింది వొప్పుకునేందుకు.

"ఇంకా కొద్దిగానే ఉడకాలిలెండి. ఉదయం టిఫిన్ కూడా చెయ్యలేదు మీరు, లేట్ అయిందని త్వరగా దింపేసాలే" సమర్ధించుకుంది.

***

సరోజ పెళ్లి నాటికే వుద్యోగం చేస్తోంది. ఆఫీస్ లో పని చేసి చేసి వస్తుంది, వంట నేను చేస్తాలేరా అని తల్లి ఆ బాధ్యత నెత్తిన వేసుకుంది. పొద్దున్న, సాయంత్రం రెండు పూటలా తల్లే వంట చేస్తుంది. సరోజ రాఘవ కు, బాబీ కి కావాల్సినవి చూసి, తాను కుడా రెడీ అయ్యి అత్తగారు అందించిన బాక్స్ తీసుకుని ఆఫీస్ కు వెళ్తుంది.

బాబీ తొమ్మిదో క్లాస్ చదువుతున్నాడు. ఒక్కడే నలుసు. పొద్దున్న 8 కి వెళ్తే సాయంత్రం 7 గంటలకు వస్తాడు. ఇంత త్వరగా చెయ్యటం సరోజ కి కష్టమని తన కూతురి దగ్గర క్కూడా ఎప్పుడో మరీ అవసరం అయితే కానీ వెళ్ళదు కమలమ్మ.

పెళ్లి కాక ముందు చదువు తోను, పెళ్లి అయ్యాక అత్తగారి సపోర్ట్ తోను సరోజ కి వంట జోలికి వెళ్లే అవసరమే రాలేదు.

అనుకోకుండా వచ్చిన ఈ లాక్డౌన్ అందరి రొటీన్ నీ మార్చేసింది. ఆఫీస్ హడావిడి, స్కూల్ హడావిడి లేవు. పనిమనిషిని మానిపించారు. ఇంటి పని సరోజ, వంట పని అత్తగారు, బజారు కు వెళ్ళ వలిస్తే రాఘవ. ఎంత చేసినా మధ్యాహ్నానికి ఫ్రీ ఐపోతున్నారు. తీరుబడి గా కూర్చుని వాట్సాప్ లు, వీడియో లు సినిమా లు.

ఈ ఖాళీ రోజుల్లో ఒక రోజు.. "పెద్దమ్మ ఎన్నో వెరైటీ వంటలు చేసి వాట్సాప్ పెడుతుంది, నువ్వూ అలాగా చెయ్యచ్చుగా బామ్మా" గారం గా అడిగాడు బాబీ కూర్చుని తీరిగ్గా వత్తులు చేసుకుంటున్న కమలమ్మని.

సరోజ అక్క అమెరికా లో ఉంటుంది. వాళ్ళక్కూడా లాక్ డౌన్ కారణం గా ఇంట్లోనే ఉంటున్నామని రోజుకొక వెరైటీ ఫుడ్ చేసి వాట్సాప్ పెడుతూ ఉంటుంది.

ఆవిడ చిన్నగా నవ్వి "నాకు అవ్వన్నీ రావురా. ఈ రోజువారి వంటలు, పచ్చళ్ళు తప్ప ఆ కొత్త కొత్తవి నాకేం తెలుసు" మనవడిని దగ్గరికి తీసుకుంటూ అంది.

"అయితే నువ్వన్నా చెయ్యమ్మా" అన్నాడు బాబీ సరోజ తో రాబోయే ఉపద్రవం ఊహించలేక.

***

కొడుకు ఫై ప్రేమ, వాట్సాప్ లో తాను కూడా వెరైటీ లు చేసి పెట్టాలనే తపన సరోజ ను వంటగది కి మళ్లించాయి.

మర్నాడు పొద్దున్నే ఈ రోజు నుంచి వంట బాధ్యత నాది అత్తయ్యా" పాలు కాస్తున్న కమలమ్మ కు అడ్డం పడింది.

"నీకు అలవాటు లేదుగా" ఆశ్చర్య పడింది కమలమ్మ.

పెళ్లి ఐన తర్వాత రాఘవ చాల సార్లు హెచ్చరించాడు సరోజ ను ఒక పూట అన్నా వంట చెయ్యమని. సరోజా లొంగలేదు, కమలమ్మా వదల్లేదు.

"అలవాటు దేముంది. ఈ లాక్ డౌన్ సెలవులు చాలు" తేలిగ్గా అనేసింది సరోజ.

"మరి నేనేం చెయ్యను" అయోమయం గా అడిగింది కమలమ్మ.

"ఇంటి పని మీరు చూడండి. కాస్త నాకు చెయ్యి ఖాళీ లేకపోతే గిన్నెలు కడుగుదురు కానీ"

అన్నంత వేగం తో డికాక్షన్ వేసి కాఫీ కలిపి కప్పుల్లో పోసేసరికి రాఘవ లేచి వచ్చాడు వంటింట్లోకి "ఏమిటి దేవి గారు ఇవ్వాళ వంటగది లో దర్శనం ఇచ్చారు" అంటూ.

"ఈ రోజు నుంచి డ్యూటీ నాదే. రోజు ఇక్కడే దర్శించుకోవచ్చు" వేడి కాఫీ అందిస్తూ చెప్పింది సరోజ.

ఒక్క గుటక వేసేసరికి అర్ధం అయిపోయింది రాఘవ కి, అమ్మ చేతి కాఫీ కి భార్య చేతి కాఫీ కి తేడా. మొదటి రోజు కదా అని సరిపెట్టుకున్నాడు.

ఆ రోజు నుంచి వంటగది జైత్రయాత్ర మొదలు పెట్టింది సరోజ.

***

రోజూ యేవో వెరైటీ లు చెయ్యడం, వాట్సాప్ లో ఫోటో లు పెట్టడం నిత్యకృత్యమై పోయింది.

ఒక రోజు సమోసా. తిందామని చేతిలోకి తీసుకుంటే మడత సందుల్లోనించి పావు లీటర్ నూనె కారింది.

మరో రోజు పిజ్జా. పై భాగం బబుల్ గమ్ కి పెద్దన్న, కింద భాగం గుండ్రాయికి చిన్న చెల్లి. సగం స్వంత తెలివి తేటలు, సగం యూట్యూబ్ నాలెడ్జీను.

ఇంకొక రోజు పాలకాయలు అని మొదలు పెట్టింది. చిన్నప్పుడు మా అమ్మ చేస్తే ఎంతో ఇష్టం గా తినేవాళ్ళం అని పెద్ద బేసిన్ కి పిండి కలిపింది. అది కాస్త జారుడు జారుడు గా తయారైంది. కమలమ్మ చొరవ చేసుకుని మరి కాస్త పిండి కలిపి దాన్ని బాగు చేసేసరికి బ్రహ్మాండం అంత పిండి అయ్యి కూర్చుంది. ఇంకేముంది కుటీర పరిశ్రమ అనుకుంటూ అందరిని చిన్న చిన్న ఉండలు చెయ్యమని అజ్ఞ్యాపించింది సరోజ. పొద్దున్న మొదలు పెట్టారు, మధ్యాహ్నం ఐంది, మొదలు బాబీ వికెట్ పడింది, తర్వాత అత్తా కోడళ్ళిద్దరిది. ఇవ్వన్నీ వేయించాలి ఎలాగు, ఈ లోపు రెస్ట్ తీసుకుంటా అని మంచం ఎక్కింది సరోజ. మిగిలిన పిండి అంతా చేసేసరికి సూర్యుడు పొద్దు దిగాడు, నడ్డి విరిగిపోయింది రాఘవ కి.

పాతకాలం పిండి వంటలైన కజ్జికాయలు, బూరెలు, మణుగుబూర్లు నించి కొత్తరకం వంటలైన పీజ్జాలు, బుర్జర్లు, బ్రెడ్లు వేటినీ వదల్లేదు సరోజ.

వీటిక్కావాల్సిన ఐటమ్స్ తెచ్చేందుకు రాఘవ పాట్లు చెప్పక్కర్లేదు. తెల్లవారుఝామున మాస్క్ లు కట్టుకుని, సూపర్ మార్కెట్ దగ్గర క్యూ లో ఒక గంట పాటు నుంచుని, లోపల అన్ని హడావిడి గా వెతుక్కుంటే దొరికాయా సరే సరి. లేదా మళ్ళీ ఈ ప్రహసనం రిపీట్ వేరే షాప్ దగ్గర.

మరో రోజు, పాలకోవా చేస్తా, పాలకోవా చేస్తా అని వున్న పాలన్నీ విరక్కొట్టింది. తినాల్సిన కోవా స్పూన్ తో తాగాల్సి వచ్చింది. పైగా పాలు లేక, సాయంత్రం టీ సున్నా. మర్నాడు పొద్దున్న దాకా పాలు దొరకవు. టీ తాగక రాఘవ తల పగిలి పోవటమే తక్కువ.

ఒక్కక్క సారి అన్నీ శనగపిండి వంటలు, ఆ రోజు కడుపు నెప్పి తో దొర్లవలసిందే ఇంటిల్లిపాది.

ఈ నూనె బాండీ లు, రక రకాల గిన్నెలు తోమే సరికి కమలమ్మ నీరసించి పోయింది. వంటింటి సింక్ చిన్నదని, గిన్నెలు సందు లో పంపు దగ్గర తోముతారు. అసలే ఎండాకాలం, పొద్దున్న, సాయంత్రం ఎండ కు కూర్చుని తోమి తోమి కమలమ్మకు నీరసం వచ్చింది.

"ఇంక ఇంత వంటలు పెట్టకు, గిన్నెలు ఎక్కువ అయిపోతున్నాయి. అసలే పెద్దది, అమ్మకి ఏదన్నా ఎండదెబ్బ కొడితే కష్టం, డాక్టర్స్ కూడా లేరు అందుబాటు లో" నచ్చచెప్ప పోయాడు రాఘవ.

అంతే.."చూడండి అత్తయ్యకి వడ దెబ్బ తగలకుండా, ఏమి చేస్తానో" చిటిక వేసి వంటగది కేసి కదిలింది సరోజ.

ఆ రోజల్లా రక రకాల పానీయాలు, కషాయాలు, అల్లం కొత్తిమీర దంచి వేసిన మజ్జిగలూ.. ఆపకుండా పట్టించింది అందరికి. మర్నాడు అందరూ టాయిలెట్ కి పరిగెత్తటమే. తెంపు ఉంటే ఒట్టు.

జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మి వద్దన్నా సంగీతం నేర్చుకుంటా అని చావగొడుతుంది. ఇది చూసినప్పుడల్లా రాఘవ నవ్వి నవ్వి ఇలాంటి వాళ్ళు వుంటారా అసలు అనుకునేవాడు. కానీ ఇప్పుడు అర్ధం అవుతోంది అవ్వన్నీ నిజ జీవితం నుండి వచ్చిన కారక్టర్సే అని.

"అమ్మా. మళ్ళీ ఆఫీస్ తెరిస్తే నీకు తీరిక ఉండదు. కాస్త రెస్ట్ తీసుకోమ్మా, బామ్మ చేస్తుంది లే వంట. నాకేం కొత్తకొత్తవి కి తినాలని లేదు" బాబీ ని ప్రయోగించాడు రాఘవ ఇలాగైనా సరోజ వింటుందేమోనని.

వూహూ. పప్పులు ఉడకలేదు.

'కరోనా పేషెంట్లు అవకుండా ఇంట్లో ఉండి సరోజా పేషెంట్లు అవుతున్నాం' వాపోతున్నాడు రాఘవ.

రాఘవ, బాబీ పైకి అనగల్గినా, కమలమ్మ లోపల ఉడికి పోవటం తప్ప పైకి అనలేదు.

"ఇవ్వాళా సండే కదా, సాయంత్రం స్పెషల్ ఏమి చెయ్యను" రాగం తీసింది సరోజా.

'నా బొంద.. రోజూ సండే నే గా, ఈ రోజూ కొత్తేముంది' లోపల గొణుక్కుని, "నీ ఇష్టం" అన్నాడు నిర్లిప్తం గా రాఘవ.

"అయితే మంచురియా చేస్తా" ఉత్సాహం గా కదిలింది.

క్యాబేజీ సన్నగా తిరుగుతుంటే చెయ్యి కాస్తా కట్ ఐంది. అయినా లెక్క చెయ్యకుండా, బ్యాండ్ ఎయిడ్ వేసి మరీ ప్రాజెక్ట్ పూర్తి చేసింది. తింటుంటే పైపళ్ళు కిందపళ్ళు అంటుకుపోయి నమలడం కష్టం ఐంది రాఘవ కి, బాబీ కి. వెల్లుల్లిపాయ తినదు కాబట్టి కమలమ్మ బతికి పోయింది. రాత్రి కి భోజనం ఎగ్గొట్టి పడుకున్నారు తండ్రీ కొడుకులు.

**

ఉదయం 8 గంటలైంది. రాఘవ ఎంతకీ లేవట్లేదు. "నాన్నా లే. త్వరగా. ఆకలేస్తోంది. లేస్తే ఇద్దరం టిఫిన్ తిందాం" తట్టి తట్టి లేపుతున్నాడు బాబీ.

"తిండి సంగతి చెప్పకురా" విసుగ్గా అని దుప్పటి మళ్ళీ మొహం మీదకి లాక్కున్నాడు రాఘవ.

"అబ్బా. మా అమ్మ చేతి వంట కాదు.. మీ అమ్మ చేతి వంట" చెవుల్లో అమృతం కురుసినట్లయి "ఏమిటీ?" కళ్ళు తెరిచాడు రాఘవ.

"అవును. నిన్న అమ్మ చేతి కి గాయం అయిందిగా, ఇవ్వాళ బాగా నెప్పి చేసిందిట, బామ్మే చేస్తోంది టిఫిన్" ముసిముసి గా నవ్వుతున్నాడు బాబీ.

ఆ రోజు ఉదయం తన జీవితంలోకి ఒక అద్భుతం తెచ్చినట్లు గా, బాబీ గాడు దేవదూత గా, తల్లి చేతి వంట అమృతంగా అనిపించి ఉత్సాహంగా మంచం దిగాడు రాఘవ.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి