ఉదయించే భాస్కరుడు....... - రాచమడుగు కృష్ణచైతన్య

the rising sun

నగరంలోని ప్రముఖ హాస్పిటల్ అయిన వరుణ్ హాస్పిటల్లో ఐసీయులో ఉన్న కొడుకు భాస్కర్ ను చూసి రోదిస్తోంది వసంత, తను భయపడుతూనే వసంతకు ధైర్యం చెప్పసాగాడు భాస్కర్ తండ్రి సుధాకర్. ఐసీయూలో కొడుకుకు ట్రీట్మెంట్ జరుగుతోంది, కేవలం చిన్న మందలింపు కారణంగా భాస్కర్ ఆత్మహత్య చేసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు, ఐసీయూ బయట భాస్కర్ తల్లిదండ్రులతో పాటు భాస్కర్ మిత్రులు, భాస్కర్ చదివే కాలేజీ టీచర్ కూడా వేచి చూస్తున్నారు. ఐసీయూ తలుపు తెరుచుకోవడంతో అందరూ లేచి నిలబడి డాక్టర్ చెప్పే మాట కోసం ఎదురుచూడసాగారు.

"అబ్బాయిని కరెక్టుగా సమయానికి తీసుకొచ్చారు, ఇప్పటికి ప్రాణాపాయం తప్పింది, కానీ మరోసారి ఇలా జరిగితే కాపాడడం కష్టం, ఓ గంట తర్వాత అబ్బాయిని చూడవచ్చు" అంటూ తన రూములోకి వెళ్ళిపోయాడు డాక్టర్.

అదే సమయానికి భాస్కర్ తాతయ్య సత్యనారాయణ, నాయనమ్మ విశాలాక్షి లు కూడా వచ్చారు హాస్పిటలుకు. ఐసీయు బెడ్ పై పైపులు అమర్చుకున్న మనవడిని చూస్తూ విలపించసాగింది విశాలాక్షి. అలా విలపిస్తూనే కొడుకు సుధాకర్ వైపు కోపంగా ఓ చూపు చూసింది.

"ఒరేయ్, ఇది రెండో సారి రా, వాడు ఇలా ఈ స్థితికి రావడం, పిల్లలకు చదువు ఉండాలి కానీ, చదువు ఒక్కటే ముఖ్యం కాదురా, బ్రతకడానికి చాలా దారులు ఉన్నాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి" అంటూ తిట్టసాగింది విశాలాక్షి.

"క్లాసులో అరవై మంది ఉంటే, వీడికి చివరి ర్యాంక్ వచ్చింది, అరవయ్యో ర్యాంక్ అంటే మనకెంత పరువు తక్కువ, చదువులో అత్తెసరు మార్కులు వస్తే వీడు ఏ ఉద్యోగానికి పనికి రాడు, అందుకే నిన్న బాగా కొట్టాను, అంతమాత్రానికే వాడు ఆత్మ హత్య చేసుకోవాలా?" అంటూ కన్నీళ్ళతోనే సమాధానం చెప్పాడు సుధాకర్.

"ఒరేయ్ సుధా, బ్రతకడానికి చదువు ఒక్కటే ముఖ్యం కాదురా, తెలివితేటలు, అదృష్టం ఇలా చాలా కావాలి, భాస్కర్ సున్నిత మనస్కుడు, దేన్నైనా పెద్దగా ఊహించుకుంటాడు, అలాంటప్పుడు వాడికి ఉన్న సమస్య ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అంతే కానీ, కొడితే, తిడితే ప్రయోజనం శూన్యం" అంటూ కొడుకుకు చీవాట్లు పెట్టాడు సత్యనారాయణ.

"మామయ్యా, వాడిని కొద్ది రోజులు మీతో పాటు తీసుకెళ్ళండి, అప్పుడైనా ఈయన తిట్ల నుండి కొంతైనా ఉపశమనం ఉంటుంది" అంటూ ఏడుస్తూ సత్యనారాయణతో చెప్పింది వసంత.

"మంచి సలహా చెప్పావు అమ్మాయి, వాడు ఇక్కడే ఉంటే వీడి తిట్టడాలు, కొట్టడాలతో మళ్ళీ కథ మొదటికి వస్తుంది, డిస్చార్జి అయిన వెంటనే వాడిని ఇటు నుంచి ఇటే మాతో పాటు తీసుకెళ్తాం" అంటూ వసంతతో చెప్పాడు సత్యనారాయణ.

రెండురోజుల ట్రీట్మెంట్ తరువాత భాస్కర్ ను డిస్చార్జి చేయగా, చెప్పినట్టుగానే తమతో పాటు ఊరికి తీసుకెళ్ళిపోయారు సత్యనారాయణ, విశాలాక్షిలు. మొదటిరోజు భాస్కర్ చాలా ముభావంగా ఉన్నాడు, ఇద్దరితోనూ ఏం మాట్లాడలేదు, పని వారితో భోజనం పంపిస్తే తిని పడుకునే వాడు, కొద్దిరోజులు అదేచాలనుకునే వారు ఇద్దరూ. రెండో రోజు దాదాపుగా అలాగే ఉన్నా, కొద్దిగా మాట్లాడడం మొదలుపెట్టినా, అంటీముట్టనట్టు ఉండేవాడు, మూడవరోజు తాతయ్య దగ్గరకు వచ్చి, "సారీ తాతయ్య, ఏదో ఆవేశంలో అలా చేశాను, ఇంకెప్పుడూ అలా చేయను, ప్రామిస్" అంటూ తన చేతిలో చేయి వేసి చెప్తున్న భాస్కర్ ను చూసి సంతోషంగా దగ్గరకు తీసుకున్నాడు సత్యనారాయణ.

"ఒరేయ్ భాస్కర్, మన సమస్యలకు అసలు చావు పరిష్కారం కానే కాదు రా, మనం కొద్దిగా ఆలోచిస్తే చావు కన్నా గొప్ప పరిష్కారం మన మెదడు, మన మనసు అందించడానికి సిద్దంగా ఉంటాయి, నువ్వు కొద్దిరోజులు ఈ విషయం వదిలేసి హాయిగా ఉండు, అదే సర్దుకుంటుంది" అంటూ భాస్కర్ తల పై చేయి వేస్తూ చెప్పాడు సత్యనారాయణ.

"అయ్యో తాతయ్యా, నాకు ఖాళీగా ఉంటే ఏమీ తోచదు, నేను ఇక్కడ ఉన్నన్ని రోజులూ నీతో పాటు మన పొలానికి వస్తాను, మనం ఈరోజు పొలానికి సైకిల్ పై వెళదాం, నేనే నిన్ను తీసుకెళ్తా, రానా??" అంటూ భాస్కర్ అడుగగా,

"మంచి ఆలోచన రా, కొన్ని పనులు నీకు అప్పగిస్తాను" అంటూ తనతో పాటు పొలానికి తీసుకెళ్ళాడు సత్యనారాయణ.

భాస్కర్ సైకిల్ తొక్కుతుండగా, సత్యనారాయణ ముందర ఉన్న కడ్డీపై కూర్చున్నాడు, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, పొలానికి చేరుకున్నారు. అక్కడ, ఆ పచ్చటి పొలాల దగ్గర, పైరు మీదుగా వస్తున్న చల్లగాలి భాస్కర్ అలసటను తీర్చసాగింది, అలా ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూనే, తనకు తెలియకుండానే పాట అందుకున్నాడు భాస్కర్, ఎప్పుడూ లేనిది ఈరోజు పాట వినపడుతుండడంతో పనివారు అందరూ భాస్కర్ వైపు చూడసాగారు, సత్యనారాయణ కూడా భాస్కర్ వైపు అలానే ఆశ్చర్యంగా చూడసాగాడు, తన మనవడు ఇంత శ్రావ్యంగా గానం చేయగలడు అని తను అస్సలు ఊహించలేదు, ఓ ఐదు నిమిషాల తర్వాత, పాట ముగించిన భాస్కర్ చెవులకు పెద్దగా చప్పట్లు వినిపించాయి. సత్యనారాయణ కూడా చప్పట్లు కొడుతూ, భాస్కర్ ను కౌగలించుకుని అభినందనలు తెలిపాడు.

"నారాయణ గారూ, అద్భుతంగా పాడాడు, ఈ పిల్లవాడు మీ మనవడు భాస్కర్ కదా?" అడిగాడు పెద్ద పాలేరు సుబ్బయ్య.

"అవును సుబ్బయ్యా, మా మనవడు భాస్కరే, మన పొలాలన్నింటినీ చూడాలని ఉందంటే తీసుకొచ్చా" అంటూ సంతోషంగా చెప్పాడు సత్యనారాయణ.

అలా పొలంలో ఇద్దరూ ఓ చెట్టు కింద కూర్చుని, భోజన సమయం కావడంతో ఇంటికి తిరిగివచ్చారు, వీళ్ళు ఇంటికి తిరిగి వచ్చేపాటికి విశాలాక్షి భోజనం మొత్తం సిద్దం చేసింది. భాస్కర్ కు ఇష్టమని జున్ను, బెల్లం పానకం ప్రత్యేకంగా తయారు చేసింది. చేతులూ కాళ్ళు శుభ్రం చేసుకుని, భోజనం చేస్తూ ఉండగా,

"ఒరేయ్ మనవడా, నువ్వు ఇంత బాగా పాడగలవని ఎప్పుడూ చెప్పలేదేంట్రా....!!!!" సందేహంగా అడిగాడు సత్యనారాయణ.

"నాకు ఇంత స్వేచ్చగా పాట పాడే అవకాశం రాలేదు తాతయ్యా, ఈరోజు ఆ పచ్చటి పొలాల మీదుగా వస్తోన్న చల్లటి గాలిని ఆస్వాదిస్తోంటే నాకు తెలియకుండానే పాట పాడేశాను" జవాబిచ్చాడు భాస్కర్.

"చాలా బాగా పాడావు రా, అన్నట్టు నాకు రేపు వేరే ఊరిలో పని ఉంది పొలానికి నువ్వు ఒక్కడివే వెళ్ళి అక్కడ పని చూసుకోవాలి, చూసుకోగలవా??" అడిగాడు సత్యనారాయణ.

"ఓ చూసుకోగలను తాతయ్య" అంటూ ఉత్సాహంగా జవాబిచ్చాడు భాస్కర్.

ఇద్దరూ భోజనం ముగించి, భాస్కర్ మధ్యాహ్నం నిద్రకు ఉపక్రమించిన తరువాత కొడుకు సుధాకరుకు ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్ళడానికి బయలుదేరాడు భాస్కర్. భాస్కర్ అటు పొలానికి వెళ్ళగానే, సుధాకర్ ఇలా ఇంట్లోకి అడుగుపెట్టాడు. కుశల ప్రశ్నలు అన్ని అయిపోయాకా

"ఏంటి నాన్నా, అర్జెంటుగా రమ్మన్నారు, ఏంటి విషయం?" ఆందోళనగా అడిగాడు సుధాకర్.

"భాస్కర్ విషయంలో నువ్వేమి ఆలోచించావురా, ఏదైనా జవాబు దొరికిందా??"

"లేదు నాన్నా, కానీ వాడికి ఇష్టం ఉన్నా, లేకపోయినా వాడు కచ్చితంగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవలసిందే!!"

"వాడి విషయంలో ఇంకా కఠినత్వం పోలేదురా నీకు......!!!!!!!"

"మొదట్లో బాగా చదివేవాడు నాన్నా, రాను రానూ చదువు మందగించింది, ఎలా అంటే సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుడిలాగా"

"అస్తమిస్తున్న సూర్యుడా అంటే??"

"అదే నాన్నా, ఉదయం నుంచి వెలుగుతున్న సూర్యుడి వెలుగు, వేడిమి, సాయంకాలానికి తగ్గిపోయినట్టుగా, వీడి మార్కులు, ర్యాంకులు కూడా తగ్గిపోయి, చివరి ర్యాంకుకు చేరుకున్నాడు"

"ఒరేయ్ సుధా, మన ప్రదేశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే వేరే ఇంకొక ప్రదేశంలో ఉదయిస్తున్నాడు అనే కదా అర్థం"

"అవును నాన్నా, అయితే!!??!?!?"

"చదువు విషయంలో అస్తమిస్తున్న మన భాస్కరుడు ఇంకో విషయంలో ఉదయిస్తున్నాడేమోనని నువ్వెప్పుడైనా ఆలోచించావా"

"నాకు అర్థం కాలేదు నాన్నా...!!"

"సరే మనం అలా పొలానికి వెళదాం పద”

ఇద్దరూ పొలానికి బయలుదేరారు, దారి వెంబడి సుధాకర్ సందేహంగానే చూస్తున్నడు తండ్రి వైపు. పొలం దగ్గర కారు దిగిన సుధాకర్ దృష్ఠి అంతా తనకు వినపడుతున్న గానం వైపు పెట్టాడు.

"ఆహా అద్భుతంగా ఉంది ఈ గానం, ఎవరిదో ఈ గొంతు, ఎవరు నాన్నా, పాట పాడుతోంది"

"కాస్త ముందుకెళ్ళి నువ్వే చూడరా" అంటూ సుధాకర్ ను ముందుకు తోశాడు సత్యనారాయణ.

పొలం మధ్యలో గడ్డి వాము పక్కగా ఉన్న మంచం మీద కూర్చుని, కళ్ళు మూసుకుని, గానం చేస్తున్నాడు భాస్కర్. ఈ దృశ్యం చూసిన సుధాకర్ తన కళ్ళను, తానే నమ్మలేకపోయాడు.

"ఒరేయ్ సుధా, చూసావా, మన భాస్కర్ ఎంత అద్భుతంగా పాడుతున్నాడో, వాడు ఉదయిస్తోన్నది ఈ విషయంలోనే రా!!!"

"అవును నాన్నా, వాడు ఇలా అద్భుతంగా పాడగలడని నాకు తెలియదు, కాదు కాదు ఒకటి రెండు సార్లు అడిగాడు, నేనే వాడి మాటలు పట్టించుకోలేదు, పాటల రంగం అయితే డబ్బులు సంపాదించగలడో లేదో అని సందేహపడి నేనే వాడి పాట పాడే గొంతును నిర్లక్ష్యం చేసాను నాన్నా."

"ఒరేయ్ సుధా, చదువు కంటే కళ ఎన్నో రెట్లు గొప్పది, ప్రపంచంలో ఏదో ఒక కళలో నిష్ణాతులు కావడం కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు, అలాంటిది మన భాస్కర్ కు ఓ కళ పుట్టుకతోనే వచ్చినట్టుంది, ఇప్పుడు భాస్కర్ కు ఓ గురువు అవసరం, తనలో ఇమిడి ఉన్న జ్ఞానానికి కొద్దిగా పదును పెడితే వజ్రంలా ప్రకాశిస్తాడు. పైగా ఇప్పుడు కాలం మారిపోయింది, గాయకులకు మంచి ప్రోత్సాహం, గౌరవం, డబ్బు లభిస్తున్నాయి, వాడికి ఇప్పుడు కావలసింది మన ప్రోత్సాహమే "

"ఇన్ని రోజులు నేను ఒక వైపే ఆలోచించాను నాన్నా, రేపే వాడిని మంచి సంగీత గురువు దగ్గర శిక్షణకు పంపిస్తాను"

వీరిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగానే దూరం నుంచి తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని హత్తుకున్నాడు భాస్కర్, ఆ కౌగిలింత ఎందుకో కొత్తగా అనిపించింది తండ్రి సుధాకర్ కు, వీరిద్దరినీ చూసి సంతోషంగా నవ్వుకున్నాడు సత్యనారాయణ.

********కథ సమాప్తం********

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao