కొత్త సినిమా - పద్మావతి దివాకర్ల

new movie

కరోనా కారణంగా విధించబడిన లాక్‌డౌన్‌వల్ల అన్నింటితో పాటు సినిమా హాళ్ళు కూడా మూతపడ్డాయి. ఏకంగా సినిమా షూటింగులే బందయ్యాయి మరి. ఎంతటి హీరో అయినా కరోనా ముందు జీరోయే కదా!

ఈ లాక్‌డౌన్ వేళ టివీలో అవే సినిమాలు మళ్ళీ మళ్ళీ చూసి బోర్ కొట్టింది మాలతికి. సీరియల్స్‌తో అడ్జస్ట్ అవుదామన్నా అవి కూడా ఈ కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ అయిపోయాయి. పోనీ ఎక్కడికైనా షికారు వెళ్దామన్నా రెస్టారెంట్లూ, మాల్స్ అన్నీ కూడా మూసేసి ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు కొత్త సినిమా షూటింగ్‌లు మొదలై విడుదలవుతాయో అని ఎదురు చూస్తోంది మాలతి. ఈ కరోనా ఎప్పుడు అంతమవుతుందో, ఎప్పుడు మళ్ళీ కొత్త చిత్రాలు వస్తాయో అని సినిమావాళ్లకంటే కూడా ఎక్కువ బెంగ పెట్టుకుంది ఆమె. అవును మరి, ప్రస్తుతం కరోనాయే చాలా చిత్రాలు చూపుతోంది అందరికీ. ఇంక కొత్త చిత్రాలెక్కడనుంచి వస్తాయి? మాలతికి సినిమాలంటే మా చెడ్డ పిచ్చి. సినిమా చూడటం అంటే చాలా ఇష్టం, అదీ థియేటర్‌కి వెళ్ళి చూడటమంటే ఆ మజాయే వేరని ఆమె అభిప్రాయం. హాల్‌కి వచ్చిన కొత్తలోనే ప్రతీ సినిమా తప్పనిసరిగా చూసే అలవాటుంది ఆమెకి. థియేటర్‌లో సినిమా చూస్తూ పాప్‌కార్న్ తినడమంటే మా చెడ్డ సరదా. ఆమె పాప్‌కార్న్ తినడం కోసం సినిమా హాల్‌కి వెళ్తుందో, లేక సినిమా చూడటం కోసమే పాప్‌కార్న్ తింటుందో ఇప్పటికీ సందేహమే మాలతి భర్త మారుతికి. అటు సినిమా ఖర్చుకే కాక పాప్‌కార్న్ కోసం కూడా జేబుకి చిల్లులు పడుతుంటాయి పాపం మారుతికి.

వీలైతే భర్తతో, లేకపోతే ఏ ఇరుగింటి పొరుగింటి ఆవిడతోనో సినిమాకి వెళ్ళడం ఆమె అలవాటు. చాలా రోజులనుండి సినిమా చూడకపోవడంతో, ఎప్పుడు ఈ కరోనా పోతుందా, మళ్ళీ సినిమాహాళ్ళు తెరుస్తారా అని ఆత్రంగా ఎదురు చూస్తోందామె. అయితే ఎప్పుడైతే ఈ కరోనాతో సహజీవనం చేయాలని వార్త వచ్చిందో అప్పుడే ఆమెలో నిరుత్సాహం పెరిగిపోయింది. అసలు జన్మలో మరి సినిమా చూస్తానా అని కూడా బెంగ ఎక్కువైందామెకు.

అయితే, ఐదోవిడత లాక్‌డౌన్ తర్వాత ఆమెకో శుభవార్త చేరింది. మళ్ళీ సినిమా షూటింగ్‌లు త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు విందామె. అంతేకాక సినిమా హాళ్ళు కూడా త్వరలో తెరుచుకోబోతున్నట్లు విందామె. ఈ వార్త వినగానే, నిర్మాతలకన్నా, దర్శకులకన్నా, నటీనటులకన్నా కూడా మాలతి ఎక్కువ సంతోషించింది. తన అభిమాన హీరోల సినిమాలు పట్టాలెక్కబోతున్నట్లు వినగానే సంతోషంతో మాలతి మైమరచిపోయింది.

అలా సగంలో ఉన్న సినిమాలే కాక, కొత్త సినిమాలు కూడా రిలీజయ్యే రోజు వచ్చేవరకూ ఓపిక పట్టింది మాలతి. అలా మూడునెలల వ్యవధి తర్వాత మాలతి అభిమాన నటుడు నటించిన సినిమా రిలీజైంది ఆ రోజే. ఇంకేముంది!... మాలతి మనసు సంతోషంతో గంతులేసింది. ఆమె కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ శుభఘడియ రానే వచ్చింది. మొదటిరోజు మొదటి ఆటకి వెళ్దామని పట్టుబడితే, అతి కష్టం మీద మారుతి సెకండ్ షోకి టికెట్లు సంపాదించాడు.

ఆ రోజు ఉదయం నుండే మాలతి హడావుడి మొదలైంది. మారుతి అఫీసు అప్పటికే తెరవడంతో, అతను వెళ్తున్నప్పుడు సినిమా సంగతి మరీమరీ గుర్తు చేసింది మాలతి ఆఫీస్ పనిలో పడి ఎక్కడ మరిచిపోతాడోనని. ఆ ధ్యాసతోనే రోజంతా గడిపి, సాయంకాలం మారుతి రాక కోసం ఎదురుచూస్తూ సోఫాలో కూర్చుంది.

**** **** **** ****

ముఖానికి మ్యాచింగ్ మాస్క్ కట్టుకొని, సినిమా హాల్‌కి మారుతితో చేరుకున్న మాలతి అక్కడ సందడి చూసి ఆశ్చర్యపోయింది. సాధారణంగా ఏ సినిమా రిలీజైనా ఆ హీరోల అభిమనులు చాలా హడావుడి చేస్తారు. అయితే, అక్కడ చాలా రోజుల తర్వాత కొత్త సినిమా వచ్చిన సందర్భంగా అభిమానానికి అతీతంగా ఆ ప్రదేశమంతా ఓ తిరనాళ్ళలా ఉంది. ముఖానికి మాస్కులతో వచ్చిన ప్రేక్షకులంతా ఏదో వింత గ్రహాలనుండి ఊడిపడ్డ వింతజీవుల్లా విచిత్రంగా ఉన్నారు. చాలా రోజులతర్వాత సినిమా చూస్తున్న అనందంతో భౌతిక దూరాన్ని కూడా మరిచారు అందరూ.

గేట్‌కీపర్‌కి టికెట్ చూపించి అతను చేతిలో స్ప్రే చేసిన సానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకొని హాల్ లోపలకి ప్రవేశించారు వాళ్ళిద్దరూ. హాల్ లోపల కూడా చాలా సందడిగా ఉంది. తమ సీట్లో కూర్చొన్నారు మాలతి, మారుతి. కొన్ని వాణిజ్య ప్రకటనలు, ట్రైలర్లు చూపించిన తర్వాత మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్న సినిమా 'మాస్క్ రాజా' మొదలైంది.

ఎప్పటిలాగే సినిమాలో హీరోకీ, హీరోయిన్ పరిచయం మొదటో చిన్నపాటి గొడవతో మొదలై ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కాకపోతే ప్రభుత్వ నిబంధన కారణంగా కరోనా సోకకుండా సినిమాలో అందరూ మాస్కులు ధరించారు. విచిత్రంగా సినిమా పేరు కూడా 'మాస్క్ రాజా'. ఆ తర్వాత ఇద్దరూ చాలా ప్రదేశాలు తిరిగి ఓ పాటేసుకుంటారు. ఇంతవరకూ ఫర్వాలేదు. మధ్యలో అప్పుడే విలన్ సీన్లోకి ప్రవేశిస్తాడు. అప్పటినుండే అసలు గందరగోళం మొదలవుతుంది. సినిమాలో హీరో, హీరోయిన్, విలన్, మిగతా పాత్రధారులందరూ కూడా కరోనా కారణంగా మొహానికి మాస్క్ తగిలించుకోవడంతో ఎవరు హీరోవో, ఎవరు విలనో పోల్చుకోవటం కష్టంగా ఉంది. మధ్యలో మరో డ్యూయెట్‌. ‘విలన్‌తో ఏమిటి హీరోయిన్ కలిసి అంత సరదాగా పాడుతోంది’ అనుకొని తీరా చూసేసరికి అతను హీరో, విలన్ కాదు! అలాగే ఎవరితో ఎవరికి ఫైటింగ్ అవుతోందో తెలుసుకోవటం కష్టంగా ఉంది ముఖానికి పెట్టుకున్న మాస్కులు కారణంగా. ఇంతలో హీరో హీరోయిన్‌తో దురుసుగా ప్రవర్తించడం చూసి అశ్చర్యపోయింది మాలతి. ఇంతా చూస్తే అతను విలన్! మిగతా పాత్రలతో అయితే మరీ కష్టంగా ఉంది, ఎవరు ఎవరో ఒక్క గొంతు బట్టి పోల్చుకోవలసిందే! మాస్క్ చాటున నటుల హావభావాలు అసలు తెలియడం లేదు. 'అసలు అందులో ఎవరికి డూప్ పెట్టినా కనుక్కోవడం కష్టమే! హీరో బదులుగా మధ్య మధ్యలో ఎవర్ని మార్చినా ఎవరూ కూడా తెలుసుకోలేరు.' అని మనసులో అనుకున్నాడు మారుతి. ఇంతలో ఐటం సాంగ్, అందులో నృత్యంచేసే తారకి వస్త్రాలు ఎలా ఉన్నా మొహానికి మాత్రం భారీ మాస్క్ పెట్టింది. అది చూసి మారుతి విరగబడి నవ్వితే, హాల్లో అందరూ కోపంగా అతనివైపు చూసారు. వెంటనే మాలతి భర్త చెయ్యగిల్లి, "ఉష్! ఊర్కోండి. చూడండి, అందరూ మనల్నే ఎలా చూస్తున్నారో?" అనేసరికి చప్పున నోరు మూసుకున్నాడు. మొత్తం మీద సినమా ఇలా గందరగోళంగానే సాగుతోంది. ఇంటర్వెల్ కాకుండానే మాలతికి బాగా తలనొప్పి వచ్చేసింది. మారుతి సంగతి సరే సరి. సినిమాలో డైలాగులు తప్పితే ఎవరు ఏమిటో కూడా అర్థం కావడం లేదు అతనికి. ఇక కథ అర్థమైతే ఒట్టు.

ఇంటర్వెల్‌లో మాలతితో అన్నాడు, "ఇదేం సినిమా బాబోయ్! నా చిన్నప్పుడు మా తాతగారు చెబుతూ ఉండేవారు, వాళ్ళ సమయంలో ‘మూకీ’ సినిమాలు ఉండేవట, అంటే ఇప్పటిలా డైలాగులు ఉండేవి కాదుట. తెర పక్కన ఒక మనిషి నిలబడి వాళ్ళు మాట్లాడుకునేవి వివరిస్తూ ఉండేవాడట. అయితే, ప్రస్తుతం ఈ సినిమా కూడా అలాగే ఉంది. డైలాగులు మాత్రమే వినబడుతున్నాయి తప్పితే, ఎవరు ఏమిటో తెలిసి చావడంలేదు. పాత్రధారులంతా కూడా మాస్కుధారులే. పూర్వకాలంలోలా ఇప్పుడు కూడా వెండి తెరవద్ద ఎవరైనా నిలబడి, ఫలానావాడు హీరో, ఫలానావాడు విలన్, ఫలానావాడు హీరో తండ్రి అని మనకి ప్రతీ సీన్‌లోనూ వివరిస్తే బాగుండును. ఈ సినిమా చూడటం ఇక నావల్ల కాదు బాబోయ్!" అన్నాడు.

మాలతికి కూడా ఈ వ్యవహారం తలనొప్పిగానే ఉంది. "అలాగే! పదండి, నాకు కూడా తలనొప్పిగా ఉంది." అంది బయటకి నడుస్తూ.

**** **** **** ****

"మాలతీ! మాలతీ! ఏమిటి నిద్రపోయావా? సినిమాకి వెళ్దామని చెప్పి, సాయంకాలం త్వరగా రమ్మని చెప్పి నువ్వేమో పడుకున్నావా? లే, లేచి త్వరగా తయారవ్వు. భోజనం చేసి త్వరగా వెళ్దాం." అని లేపాడు మారుతి సోఫాలో ఓ నిద్ర తీస్తున్న మాలతిని.

ఉలిక్కిపడి నిద్రనుండి మేల్కొన్న మాలతి కళ్ళు నులుముకొని భర్తవైపు విభ్రాంతిగా చూసింది, 'ఇప్పుడు తను కల కన్నదా, నిజంగా సినిమా కాదా?' అని అనుకొని.

'ఏమో? ఇప్పుడు నిజంగా సినిమా కూడా తను కన్న కలలా అంతా మాస్కు మయంగా ఉంటుందేమో మరి!' అని మనసులో అనుకొని, "వద్దండి! ఈవాళ మరి సినిమా ప్రోగ్రాం మానేద్దాం." అందామె భయంగా.

అదివిన్న మారుతి తన చెవులని తానే నమ్మలేక పోయాడు. అది ఎనిమిదో వింతగా తోచింది.

'మాలతి సినిమా వద్దనడమేమిటి?' అని ఆమెని నిలదీయడంతో తను కన్న కల గురించి చెప్పింది. అది వింటూనే ఫక్కుమని నవ్వాడు మారుతి.

"ఈ కరోనా గురించి, మాస్కుల గురించి ఆలోచించి, ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకున్నావుగాని, అలాంటిదేమీ ఉండదు. ఇప్పటికే సినిమాకి 'పాజిటివ్' టాక్ వచ్చింది. ఇదిగో, 'పాజిటివ్' టాక్ అంటే మళ్ళీ అపార్థం చేసుకుంటావు. అంటే సినిమా బాగుందని అందరూ అంటున్నారు. త్వరగా తయారవ్వు, వెళ్దాం" అని ఆమె మనసులో భయం పోగొట్టాడు.

భర్త అభయం ఇచ్చేసరికి ఉత్సాహంగా సోఫాలోంచి లేచింది. అరగంటలో తయారయ్యి భర్తవెంట హుషారుగా సినిమాకి బయలుదేరింది మాలతి.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు