మన్నించుమా ప్రియతమా! - టి. వి. యెల్. గాయత్రి

Manninchu priyatamaa

"మా ఫ్రెండ్ ప్రజ్ఞకు పెళ్లి కుదిరింది " ఆ రోజు పొద్దున్నే సెల్లుఫోను చూస్తూ తల్లి ప్రమీలతో చెప్పింది లావణ్య. "ఎవరు?నీతో పాటు టెన్త్ దాకా చదివింది ఆ ప్రజ్ఞకేనా? "అవునమ్మా!" .ఏ ఊరు సంబంధం?" "బెంగుళూరులో ఉద్యోగం.. ఫోటో చూడు!బాగున్నాడు కదూ!" చూసింది ప్రమీల. నిజమే!బాగున్నాడు. ప్రజ్ఞా వాళ్ళ నాన్న ఇంజనీరు. కూతుర్ని ఇంజనీరింగు చదివించాడు. తనకు ప్రజ్ఞకు పోలికే లేదు. నిట్టూర్చింది లావణ్య. అది విజయవాడ వన్ టౌనులో ఉండే బ్రాహ్మణవీధి. ఆ వీధిలో ఉండే మూడు గదుల ఇరుకు గదుల పోర్షనులో చక్రధారి కుటుంబం ఉంటుంది. చక్రధారి భార్య ప్రమీల. వాళ్లకు ఇద్దరు పిల్లలు.కొడుకు శ్రీహిత్, కూతురు లావణ్య. శ్రీహిత్ ఊర్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి నెల్లూరులోని ఐసిఐసిఐ బ్యాంకులో క్లర్కు ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీహిత్ బ్యాంకు టెస్టులకు కోచింగ్ తీసుకోవటానికి లక్షన్నర ఫీజు కట్టేసరికి చక్రధారికి తలప్రాణం తోకకు వచ్చింది. చక్రధారి వస్త్రలతలో ఉన్నబట్టల షాపులో గుమస్తా. పొద్దున్న పదింటినుండి రాత్రి తొమ్మిదింటి దాకా కస్టమర్లకు బట్టలు చూపించటమే అతని పని. ఆ షాపులో నలుగురు గుమస్తాలతో పాటు తనూ ఒకడు.తనలాగా కాకుండా పిల్లలు చక్కగా చదువుకొని, మంచి జీవితం గడపాలని తండ్రిగా ఆశపడుతుంటాడు. అందుకే భార్యాభర్తలిద్దరూ ఆహరహమూ కష్టపడుతుంటారు.ప్రమీల పెళ్లిళ్లకు వంట పనిలోకి వెళ్తుంది. పెళ్లిళ్ల సీజన్ అయితే ఆమె ఇంట్లో ఉండేది తక్కువ.వంట మేస్త్రీ పక్కన అసిస్టెంటుగా వంట పనులు చేస్తూ ఉంటుంది. లావణ్య కేబిన్ కాలేజీలో బి. బి. ఎ. చేసింది.కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు.ఇంటర్యూలకు వెళుతోంది వస్తోంది కానీ ఒక్క ఉద్యోగమూ రాలేదు. కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెల్లగా, అందంగా ఉండే లావణ్య తన తాహతుకు మించి ఆలోచిస్తూ ఉంటుంది. తన అందం చూసి, ఏ సినిమా హీరో లాంటి వాడు వలచి వరిస్తాడని ఆశ. ఎప్పుడూ రంగురంగుల కలలు కంటూ ఊహల్లో తేలుతూ ఉండే కూతురికి పెళ్ళి చేద్దామంటే మాత్రం చక్రధారికి కష్టంగానే ఉంది. లావణ్య ఏదైనా ఉద్యోగం చేస్తుంటే కాస్త త్వరగా సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ ఉద్యోగం చేసే అమ్మాయిల్ని ఇష్టపడుతున్నారు. లావణ్యకు కూడా మంచి జీతంతో ఉండే సాఫ్ట్ వేరు ఇంజనీరుని చేసుకోవాలని ఉంది. ఏదీ? కుదిరితే కదా! ఆరోజు పొద్దున్నే కూతురి దగ్గరికి వచ్చాడు చక్రధారి. "ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది చూడు! అబ్బాయి నాన్నకు సొంత ఇల్లు ఉంది.అతడు కూడా ఇంకో ఇల్లు భవానిపురంలో కొన్నాడు. నెలకు ఎంత లేదన్నా డెబ్భయివేల పైనే వస్తుంది... మనకు రెండు వీధుల అవతల ఉంటారు. స్వీట్స్, హాట్స్ చేసి షాపులకు సప్లై చేస్తూ ఉంటారు. మీ అమ్మకు తెలిసిన వంట మేస్త్రి కాశయ్య తీసుకువచ్చాడు ఈ సంబంధం. ఫోటో చూడు!కట్నం అడగటం లేదు! పెళ్లి బాగా చేస్తే చాలు!" ఫోటో చూసింది లావణ్య. కళాకాంతి లేని మొహం.' ఈ సంబంధమా! 'అనిపించేటట్లుగా ఉంది. " కాస్త మంచి సంబంధం తీసుకురా నాన్నా!"అంది లావణ్య విసుగ్గా. "ఇప్పటికి ఇరవై సంబంధాలు తీసుకొచ్చాను!... సగం నీకు నచ్చక.. సగం వాళ్లకు నచ్చక ఊరికే పోయాయి.. ఎన్నాళ్ళని పెళ్లి చేసుకోకుండా ఉంటావు? వాళ్లకు నీ ఫోటో నచ్చింది.మన తాహతుకు సరిపోతుంది. ఎప్పటికో అప్పటికి పెళ్లి అంటూ చేసుకోవాల్సిందే కదా!వాళ్లకు కట్నం మీద ఆశలేదు. పిల్ల సాంప్రదాయంగా ఉంటే చాలట!ఆవిడ కూడా నెమ్మదిగా ఉంది. కష్టం సుఖం తెలిసిన వాళ్ళు...ఈ సంబంధం అయితే లాంఛనాలు పెళ్లి ఖర్చు కలిపి నాలుగైదు లక్షల్లో బయటపడతాం!ఆలోచించు!" కూతురికి నచ్చచెప్పాడు చక్రధారి. ఏమీ తోచడం లేదు లావణ్యకు. ' ఉద్యోగమా రావటం లేదు! పెళ్లి చేసుకొని ఏ హైదరాబాదుకో బెంగళూరుకో వెళదామంటే... అలాంటి సంబంధాలు దరిదాపుల్లో కూడా కనిపించటం లేదు. దిక్కుమాలినట్లుగా ఉన్న ఊర్లోనే సంబంధం!.. పోనీ! పెళ్ళికొడుకు ఏమన్నా అందంగా ఉన్నాడా అంటే అది లేదు....సవాలక్ష మందిలో అతడూ ఒకడు. ఏదో గంతకు తగ్గ బొంతలాగా ఉంది.'లావణ్య ఊహలూ, కలలూ చిందరవందర అవుతున్నాయి. ఆ రోజంతా భార్యాభర్తలిద్దరూ లావణ్య పక్కనే కూర్చొని ఆ సంబంధాన్ని ఆకాశానికి ఎత్తేసి కూతురికి నచ్చచెప్తూనే ఉన్నారు. చివరాఖరుకు "సరే!"అని పెళ్ళికి ఒప్పుకొంది లావణ్య. లక్ష అసంతృప్తులతో శేఖరును పెళ్లి చేసుకొంది లావణ్య.మామగారు రోశయ్య. అత్తగారు కళావతి.వాళ్లకు ఇద్దరు కొడుకులు. శేఖర్ పెద్ద వాడు. శశాంక్ చిన్నవాడు.వాడిని'చిట్టి'అంటారందరు. చక్రధారిది మూడుగదుల అద్దె కొంప అయితే రోశయ్యది ఇంకో గది ఎక్కువ ఉండే సొంత ఇల్లు. ముందు గది తలుపు తెరిస్తే వీధిలోకి అడుగు వెయ్యటమే!. తర్వాత విశాలమైన గది. దాన్నే హాలు అనుకోవాలి. దానికి ఒక వైపు వంటిల్లు. ఇంకో వైపు మరొక గది. కొత్త జంటకు అదే బెడ్ రూమ్. హాలు వెనకాల పెరడు మాత్రం పెద్దది. పెరట్లో బాదం, మామిడి, సపోటా, పనస చెట్లతో పాటు రకరకాల పూల చెట్లు కూడా ఉన్నాయి. ఒక పక్క పాదుల్లో కూరగాయలు పండిస్తాడు రోశయ్య. ఆ చెట్ల కింద రేకుల షెడ్డులో నలుగురు వంటవాళ్లతో కూర్చుని స్వీట్లు, హాట్లు చేస్తుంటాడు రోశయ్య. ఆయనకు చేదోడు వాదోడుగా కొడుకులిద్దరు పని చేస్తుంటే కళావతి ఆయన కనుసన్నల్లో మెలుగుతూ ఉంటుంది. మధ్యాహ్నటికి స్వీట్లు, హాట్లు చెయ్యటం అయిపోతే కొడుకులతో పాటు కళావతి కూర్చుని ప్యాకింగ్ చేస్తుంది. సాయంత్రానికి అన్నదమ్ములిద్దరు సరుకును తీసికొని వెళ్లి షాపులకు సరఫరా చేస్తుంటారు. ఇదీ దినచర్య. అప్పటికి లావణ్య ఆ ఇంటికి వచ్చి నెల దాటింది. అత్తగారు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉండేది. రాత్రికి హాలు పక్కన గదిలో కాపురం. కొంచెం పెద్దగా మాట్లాడితే హాల్లోకి వినిపిస్తుందేమోనని భయం. ఒకరోజు లావణ్యను తీసికొని భవానీపురంలో ఉండే ఇంటిని చూపించాడు శేఖర్. ఆ ఇల్లు పెద్దది. కొత్తది. పైగా మూడు బెడ్ రూములు. వాటికి అటాచుడు బాత్ రూములు.అయితే అందులో అద్దెవాళ్ళున్నారు. "మనం ఇక్కడికెందుకు మారకూడదు?" భర్తను అడిగింది లావణ్య. " బిజినెస్ అంతా పాత ఇంటి దగ్గరే ఉంటుంది.. అందుకని దీన్ని అద్దెకిచ్చాము.మొన్ననే ఇల్లు కొన్నాం కదా!ఇంకో నాలుగేళ్లకు పైన రూములు కాస్త విశాలంగా వేసుకోవచ్చు!అప్పటికి చిట్టిగాడి పెళ్లి కూడా అవుతుంది.మా నాన్న చేతిలో చిల్లిగవ్వ లేకుండా కనిగిరి నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు కట్టారు. మా తాత ఇచ్చిన రెండు గరిటెలు తప్ప చేతిలో ఏమీ లేవు. మొదట్లో నన్ను పెట్టుకొని ఈ వీధి చివర రేకుల షెడ్డులో ఉండేవాళ్ళు. చిట్టి పుట్టేసరికి కాస్త నిలదొక్కుకున్నారు. పైసా పైసా కూడబెట్టి ఇక్కడే నాలుగొందల గజాలు కొన్నారు.నాన్నది పెద్ద విజయమే!" అతడి కళ్ళల్లో తండ్రి పట్ల ఆరాధనా భావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నెలరోజులుగా లావణ్య ఇంట్లో వాళ్ళను గమనిస్తూ ఉంది. ఇంట్లో రోశయ్య ఎంత చెబితే అంత. భార్యను తీసికొని దుర్గ గుడికి వెళ్ళాలన్నా శేఖర్ తండ్రికి ఏమన్నా పని ఉంటుందేమోనని చూస్తాడు.ఆదాయవ్యవహారాలు అన్నీ పూసగుచ్చినట్లు చెప్తూ ఉంటాడు. అతడి దృష్టిలో తండ్రి తర్వాతే ఎవరైనా!.. తల్లితో, తమ్ముడితో కూడా చాలా మెల్లగా మాట్లాడుతాడు. శేఖర్ లేచి కొక్కేనికి తగిలించిన చొక్కాలోంచి డబ్బులు తీసికొచ్చాడు "పొద్దుననగా నాన్న చెప్పారు.. నేనే మర్చిపోయా! నువ్వు వచ్చి నెలయింది. వచ్చే నెలలో నవరాత్రికి నీకు, అమ్మకు కొనిపెట్టమని పట్టుచీరలకు డబ్బులిచ్చారు.ఇప్పుడు గుర్తొచ్చింది. ఖాళీ ఉన్నప్పుడు వెళ్లి తీసికొనిరా!" అంటూ ఆరువేలరూపాయలు చేతిలో పెట్టాడు శేఖర్. అతడు సన్నగా ఉంటాడు. బిరుసుగా ఉండే జుట్టు. కోలముఖం. మాటలో, నడకలో, ఆలోచనలో ఏదో నెమ్మదితనం. అందరి ముందు వినయంగా తలవంచుకొని మాట్లాడే శేఖరును చూస్తే ఏదో తెలియని అసంతృప్తి.... ఇంట్లో బైక్ ఉంది కానీ అది చిట్టిగాడిది.ఖాళీ దొరికితే వాడు తిరుగుతుంటాడు.అదికాక సరుకులు తీసికెళ్లే ట్రాలీ ఆటో ఒకటి ఉంది. తామిద్దరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆటోనే గతి.ఆటోవాళ్ళతో ఐదు పదికి కూడా శేఖర్ బేరమాడుతూ ఉంటే చికాగ్గా ఉంటుంది లావణ్యకు. ఎప్పుడూ డబ్బులకు చూసుకోవటమే! సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయితే ఈ పాటికి కారుండేది. కనీసం మంచి ఫ్లాటులో ఉండేవాళ్ళు.డబ్బులకు లెక్క చూసుకోకుండా ఉండే మొగుడు దొరికితే బాగుండేది. మాల్సుకు తిరగటం.. హాయిగా నచ్చింది తినటం.. ఆ జీవితం లేదిప్పుడు!విడి కాపురం అన్న ఊసే లేదు.ఎన్నేళ్లయినా ఇలాగే గానుగెద్దులాగా.. వీళ్ళతో ఉండి ఉండి తనుకూడా ఉత్సాహం లేకుండా పాతికేళ్ళకే అన్నీ ఉడిగిపోయినదానిలాగా... అబ్బా!బోరు... చీరలు తీసుకొని రావటానికి వెళ్ళింది లావణ్య. మధ్యలో ఫ్యాన్సీషాపు దగ్గర ఆగింది. లావణ్యకు సౌందర్యసాధనాలంటే భలే ఇష్టం! అక్కడకు వెళ్లి పెర్ఫ్యూములు చూసింది. "ఫారిన్ నుంచి వచ్చాయి మేడం కొత్తవి!"అంటూ చూపించాడు షాపువాడు. ఒక్కొకటి పదిహేను వందలకు తక్కువ లేవు. రెండు తీసుకొంది. కాసిని క్రీములు, పేసు ప్యాకులు, లోషన్లు కలిపి వెయ్యిరూపాయలు. 'ఉన్న రెండువేలల్లో తనకు అత్తగారికి ఏ చీరలు వస్తాయి? 'అనుకుంటూ ఇంటికొచ్చింది. "చీరలు తెచ్చుకున్నావా?" మంచం మీద కూర్చుని పద్దులు రాసుకుంటూ అడిగాడు శేఖర్. "ఊహు! సెంట్లు, బాడీలోషన్లు, పేస్ ప్యాకులు తెచ్చుకున్నా!"అంటూ తాను తెచ్చిన వన్నీ భర్తకు చూపించింది లావణ్య. నోరుతెరచి చూస్తున్నాడు శేఖర్. లావణ్య పేద కుటుంబం నుండి వచ్చిందిగా కష్టం సుఖం తెలిసిన పిల్ల అనుకున్నాడు కానీ... "మళ్ళీ డబ్బులు ఇస్తాను!"అంటూ వెళ్లి తల్లిని పిలిచి "అమ్మా!మీరిద్దరూ వెళ్లి చీరలు కొనుక్కుని రండి!"అంటూ తల్లి చేతిలో డబ్బులు పెట్టి మంచం మీద కూర్చుని తనపాటికి తను లెక్కలు వ్రాసుకోసాగాడు. మండిపోయింది లావణ్యకు. అయినా తమాయించుకొంది. 'ఇదంతా తన ఖర్మ!తనకు ఉద్యోగం రాకపోవటం వల్ల ఈ దిక్కుమాలిన సంబంధం వచ్చింది!ఆంతా గ్రహచారం!అనుభవించాలి అంతే!' రాత్రి శేఖరేమన్నా అంటాడేమో తను కూడా గట్టిగా మాట్లాడదామనుకొంది కానీ అతడేమీ అనలేదు. మామూలుగా ఉన్నాడు. మధ్యాహ్నం నుండి ముందుగదిలో కూర్చుని ప్యాకింగ్ చేస్తారందరు. ఒక్క రోశయ్య మాత్రం మామిడిచెట్టు కింద పడుకొని గురక పెడుతుంటాడు. ఆ గదిలో పెద్ద కిటికీ ఉంది. ఆ కిటికీలోంచి చూస్తే ఎదురు వీధిలోని మేడ మొత్తం కనిపిస్తుంది. పెద్ద మేడ. మూడంతస్తులు. ఎదురింటి వైపు పదే పదే చూడటం ఆసక్తిగా మారింది లావణ్యకు. పెద్ద ఇల్లు.. పెద్ద పెద్ద రూములు. ఆ ఇంటినొక స్వర్గంలాగా, ఆ ఇంట్లో ఉండే వాళ్ళను దేవతల్లగా ఊహించుకోవటం అలవాటయిందామెకు. అట్లాంటి ఇంట్లో ఉండే వాళ్లకు ఏది కావాలన్నా క్షణంలో సమకూరుతుంది. చక్కగా ఏ. సి. రూములు... మొజాయిక్ ఫ్లోరులు.. అబ్బ!నడుస్తుంటే ఎంత బాగుంటుంది!.. తమ ఇంటిని చూస్తే డోకొస్తుంది లావణ్యకు. ఎప్పటిదో ఈ కొంప. శ్లాబు అక్కడక్కడా పెచ్చులు ఊడి పోయి ఉంటుంది...దిక్కుమాలిన ఫ్యాను కిర్రు కిర్రు మంటూ తిరుగుతుంది. అత్తగారి మొహం నల్లగా, బిగుసుకు పోయి.. జిడ్డోడుతూ.. ఇక మామగారు సరేసరి!వచ్చి ఇన్ని రోజులయినా ఆయన చొక్కా వేసుకోవటం చూడనేలేదు. ఆ నీరుకావి పంచె కట్టుకొని మధ్యాహ్నం దాకా పొయ్యి దగ్గర గరిటె తిప్పుకుంటూ ఉంటాడు. ఇక మొగుడు....అతడి గురించి చెప్పనక్కర్లేదు!.. జీవితం మీద విరక్తి పుట్టుకొస్తోంది లావణ్యకు. మనసుకు కాస్త ఊరటగా ఉండటం కోసం ఖాళీ దొరికినప్పుడల్లా ఎదురింట్లోకి చూడటం అలవాటు చేసుకొందామె. ఊళ్ళోనే పేరున్న వ్యాపారవేత్త ప్రహ్లాదరావుదా మేడ. హోలుసేలు స్టీలు వ్యాపారం అతడిది.ఆయన భార్య గీత. వాళ్లకు ఒక్కడే కొడుకు ప్రకాష్.అతడికి రెండేళ్ల కిందటే పెళ్లయింది.కోడలు దివ్య. కింద పోర్టికోలో రెండు కార్లు ఉంటాయి. ఆ ఇంట్లో ఉండేది ముగ్గురే అయినా డ్రైవర్, పనివాళ్ళు, వంటమనిషితో కలిపి అరడజనుమంది దాకా పనిచేస్తుంటారు. బట్టలు అరేయటానికి మేడ మీదకు వెళ్లే లావణ్యకు అప్పుడప్పుడూ ఎదురింటి దివ్య కనిపిస్తుంది. ఖరీదైన చీర కట్టుకొని అటూ ఇటూ తిరిగే దివ్యను చూడటం ప్రధానమైన కాలక్షేపమయిందామెకు. తను చొరవ తీసికొని పలకరిద్దామనుకున్నా ఆ దివ్య ఎప్పుడూ చెవిలో సెల్లుఫోనుతోనే కనిపిస్తుందాయె! ఈ రోజు దివ్య ఏ చీర కట్టుకొంది? దాని ఖరీదెంత? ఏ షాపులో చీరలు కొంటుంది? ఆమె తలకు వాడే షాంపూ ఏ బ్రాండుది? ఇలా ఆలోచిస్తూ తనకు కూడా అలా ఉంటే బాగుండని కలలు కనటం అలవాటయింది లావణ్యకు. ప్రహ్లాదరావు తనకు మామగారయితే ఎంత బాగుంటుంది... ఆ ఇల్లు తనదయితే... ఆహా!ఆ ఇంట్లో బోలెడు నగలేసుకొని దివ్యలాగా సెల్లుఫోన్ పట్టుకొని తిరుగుతూ.. అటుపుల్ల ఇటు తీసి పెట్టకుండా.... పనివాళ్లకు పనులు పురమాయిస్తూ... దర్జాగా కాలుమీద కాలేసుకొని.. "లావణ్యా!లావణ్యా!" కీచుమంటూ కళావతి గొంతు వినిపించింది. ...తీతువుపిట్ట అరిచినట్లు ఆ గొంతొకటి.. పిడత మొహం అత్తగారు....అబ్బా! మంచి కలను చెడగొట్టేసింది. విసుగ్గా అత్తగారి దగ్గరకొచ్చింది. "రేపు ఎదురింటి గీతమ్మగారబ్బాయి పుట్టినరోజు. వాళ్ళింట్లో ఏ పండగొచ్చినా మనమే అన్నీ చేసి పంపించాలి!నువ్వు,చిట్టిగాడు వెళ్లి స్వీట్లు, హాట్లు ఇచ్చిరండి!"చెప్పింది కళావతి. "ఏదీ? ఎదురింటి దివ్యావాళ్ళ ఇంటికా?" "అవును!గీతమ్మగారి దగ్గర వినయంగా ఉండాలి!పెద్దవాళ్ళుకదా! జాగ్రత్తగా ఉండు!ఏమన్నా అడిగితే మాత్రమే సమాధానం చెప్పు!" తలూపింది లావణ్య. చాలా సంబరంగా అనిపించిందామెకు. లోపలికి వచ్చి ముఖాన్ని పదిసార్లు తోమింది. మంచి షిఫాన్ చీర కట్టింది. తనకుండే ఒకే ఒక నెక్లెస్ పెట్టుకొంది. అప్పటికే కళావతి రెండుసార్లు కేక పెట్టింది. మొత్తానికి అలంకరణ ముగించి గదిలోంచి బయటకు వచ్చింది లావణ్య. గుడ్లప్పగించి కోడలిని అలాగే చూస్తూ ఉంది కళావతి. 'ఎదురింటికి వెళ్ళటానికి అంత అలంకరణ అవసరమా!'అని ఆమె అభిప్రాయం. 'సరే ఏదో చిన్నపిల్ల!'అనుకుంది. శశాంక్ బుట్టల్లో స్వీట్లు సర్దుతున్నాడు. ఎంతమందిని పిలిచారో! దాదాపు ఒక్కోరకం ఇరవై కేజీల పైన ఆర్డరిచ్చారు. మోయగలిగినన్ని డబ్బాలు పట్టుకొని శశాంక్ వెనకాలే వెళ్ళింది లావణ్య. పెద్దభవనం. గేటు తీసికొని లోపలికి వెళ్లేసరికి అటూ ఇటూ ఉన్న పూల చెట్లు స్వాగతించాయి. ముఖద్వారం మీద అందంగా లతలు చెక్కి ఉన్నాయి. హాల్లో పెద్ద పెద్ద సోఫాలు.ఏసీ ఉండటంతో హాలంతా చల్లగా ఉంది. హాల్లో ఒక పక్కన పెద్ద కంచు గణపతి విగ్రహం. హాలు మధ్యలో కంచుగిన్నె నీళ్లతో ఉంది. దానిలో పూలు వేసి ఉన్నాయి. అంతటా ఖరీదైన ఫర్నిఛర్...ఆ ఐశ్వర్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అనిపించింది లావణ్యకు. సోఫాలో కూర్చుని ఉంది గీతమ్మ.ఆమెకు మోచేతి దాకా బంగారు గాజులు ఉన్నాయి. మెళ్ళో నాలుగైదు వరసల కాశికాయగుళ్లహారం..అదికాక ఇంకో మూడు పేటల చంద్రహారం... ధగధగలాడుతున్న మరో నెక్లెస్సు.. బహుశా రవ్వలేమో!.. ఆవిడ కట్టుకున్న చీర ఖరీదు పాతికవేలకు తక్కువ ఉండదు. 'అబ్బా!'అనిపించింది లావణ్యకు. "ఆ గదిలో పెట్టు శశాంక్!"అని లావణ్యను చూసి "నువ్వేనా కళావతి కోడలివి!నీ పేరేమిటమ్మాయ్?" అడిగింది గీతమ్మ. "లా... లావణ్య.."తడబడుతూ చెప్పింది లావణ్య. ఆ ప్రక్కగది కూడా విశాలంగా ఉంది. ఆ గదిలో అట్ఠపెట్టెలన్నీ సర్ది వచ్చేసరికి అరగంట పట్టింది.హాల్లోకి వచ్చింది లావణ్య. "ఉండు! తాంబూలం తీసుకెళ్ళు!"అంటూ లావణ్యను ఆపింది గీతమ్మ. హాలును పరికిస్తూ నిల్చుంది లావణ్య. అంతలో మేడమీద నుండి వచ్చింది దివ్య. ఆ అమ్మాయి లావణ్యను చూసింది. కానీ పెద్దగా పట్టించుకోనట్లుగా మెల్లగా నడచి ఆ ప్రక్క గదిలోంచి కంప్యూటర్ తీసికొని మళ్ళీ మేడమీదకు వెళ్లిపోయింది. 'ఎలా అయినా దివ్యతో స్నేహం చెయ్యాలి!దివ్య వెంట చెట్టాపట్టాలేసుకొని షాపింగులకు, మాల్సుకు తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది!'అనిపించింది లావణ్యకు. వంటమనిషి వచ్చి లావణ్యకు బొట్టుపెట్టి తాంబూలం ఇచ్చింది. అక్కడి నుండి కదలలేక కదలలేక ఇంటికి తిరిగి వచ్చింది లావణ్య. మానససరోవరం నుండి మురికిగుంటలో పడ్డ హంసలాగా.. ఉక్కిరిబిక్కిరి అయినట్లనిపించిందామెకు. 'పది జన్మలెత్తినా అలాంటి ఇల్లు తనకు రాదు! మహా అయితే ఓ నాలుగైదేళ్లకు ఈ కొంపమీద నాలుగు గదులు వేస్తాడు మొగుడు. పంచవర్ష ప్రణాళిక!.. అప్పటికి పిల్లో, పిల్లవాడో పుట్టి,... ఉచ్చలు దొడ్లు ఎత్తుకుంటూ..అబ్బా!...' రెండోరోజు ఎదురింటిలో పుట్టినరోజు వేడుక. ఇల్లంతా లైట్లు పెట్టారు. గబగబా మేడ మీదకు పరిగెత్తింది లావణ్య. మెరిసిపోతూ ఉంది దివ్య. ఆమె కట్టుకున్న చీర లక్షకు తక్కువ ఉండదు.. వీధిలోకి ఎన్ని కార్లు వచ్చాయో.. ఎన్ని తిరిగి వెళ్ళాయో.. లెక్క పెట్టుకుంటూ కిటికీకి అతుక్కుపోయింది లావణ్య. చివరకు అర్ధరాత్రి దాకా చూసి చూసి 'ఆ వైభోగమంతా చూడటానికే తను పుట్టింది.. అనుభవించటానికి రాత ఉండాలి!'అనుకుంటూ ఉస్సురంటూ గదిలోకి వచ్చింది లావణ్య. ఆ రాత్రి శేఖర్ తన ఒంటి మీద చెయ్యి వేస్తుంటే మనసులో నుంచి దుఃఖం పొంగుకు వచ్చిందామెకు. 'ఎందుకు చేసుకుందీ పెళ్లి. దీన్నుంచి బయటపడలేదు... అలా అని సుఖంగా వుండలేదు.. వచ్చి ఆరునెలలయినా కాస్త బంగారమన్నా కొనిపెట్టాడా? ముష్టి మూడువేల రూపాయల చీరలు తప్ప ఓ పదివేల చీర కొన్నాడా? ఎప్పటికో మోక్షం! అన్నిటికీ పైన ఇల్లు అయ్యాక అంటూ ఊరించటమే!' ఎదురింటి దివ్య గుర్తొచ్చినప్పుడు శేఖర్ మీద అసంతృప్తి ఉంటుంది లావణ్యకు. ఇంకో నెల గడిచింది. ఆ రోజు లావణ్య నిద్రలేచి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు. 'వీళ్లంతా ఎక్కడి కెళ్లారు?' అనుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. కుటుంబసభ్యులందరూ వీధిలోనే ఉన్నారు. "ఏమైంది?" భార్య ప్రశ్న విని ఇంట్లోకి వచ్చాడు శేఖర్. "అందరూ వీధిలో ఏం చూస్తున్నారు?" "ఏముంది? ప్రహ్లాదరావు కొడుకు ప్రకాష్ లేడూ!వాడు రాత్రి క్లబ్బులో చిత్తుగా తాగి ఎవర్నో కొట్టాడట!అవతలివాడు చావు బతుకుల్లో ఉన్నాట్ట.. పోలీసులు పట్టుకెళ్లారు."టూకీగా చెప్పాడతడు. నిర్ఘాంతపోయి నిలుచుంది లావణ్య. అందరూ ఇంట్లోకి వచ్చారు. "వాడు చిన్నప్పటి నుండి అంతే!మొన్నెప్పుడో డ్రగ్స్ తీసుకొంటున్నాడని అరెస్టు చేశారు. వాడిని విడిపించుకొనే సరికి పెద్దాయనకు తలప్రాణం తోకకొచ్చింది.... ఉత్త వెధవ!వాళ్ళనాన్న సంపాదించిందంతా వీడి కేసులకే అయిపోతుంది. ఇప్పటికే సగం ఆస్తి వీడి తిరుగుళ్లకు చెల్లిపోయింది. పాపం దివ్య!వీడిని కట్టుకొని ఏం సుఖం అనుభవించింది కనుక!..." కళావతి వంటింట్లో గిన్నెలు డబడబలాడిస్తూ చెబుతుంటే లావణ్యకు భూమి గిర్రున తిరుగుతున్నట్లుగా ఉంది. నీరసంగా గదిలోకి వచ్చి మంచం మీద కూలబడింది. అలా ఎంతసేపు కూర్చుందో తెలీదు. సెనగపిండి డబ్బా కోసం గదిలోకి వచ్చాడు శేఖర్. నిరామయంగా కూర్చున్న భార్యను చూసి "ఏమైంది లావణ్యా!ఒంట్లో బాగాలేదా!"అంటూ లావణ్య నుదుటి మీద చెయ్యి వేశాడతడు. ఒక్క ఉదుటున లేచి గట్టిగా భర్తని కౌగలించుకుంది లావణ్య. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. ఇన్నాళ్లు తనెంత పొరబాటు చేసింది! శేఖరును విసుక్కుంటూ ఎంత బాధ పెట్టింది!వెక్కిళ్లు పెడుతున్న లావణ్యను పొదివి పట్టుకొని "ఏమైందమ్మా!ఎందుకు?.... చెప్పు!"అంటూ ఆమె వెన్నుమీద చేత్తో తడుతూ బుజ్జగిస్తున్నాడు శేఖర్. "నేను... నేను... నాకేమీ వద్దు!మీరు కావాలి!.. నన్ను మన్నించండి!...నాకు ...మీరు... మీరు... ఇలాగే కావాలి!..." వెక్కిళ్ల మధ్య ఎలాగో తడబడుతూ చెప్తోంది లావణ్య. "ఏమిటిది? రాత్రి ఏమన్నా కల వచ్చిందా!నేను ఎక్కడికి వెళ్తాను? ఏమిటిది?" అతడి ఓదార్పులో, అతడి స్పర్శలో కొండంత నిశ్చింత కలుగుతోంది లావణ్యకు. తలెత్తి అతడి మొహం వైపు చూసింది. అతడు ఆందోళనగా భార్యను చూస్తున్నాడు. ఎప్పటిలాగా అతడి కళ్ళల్లో నుండి లావణ్య పట్ల ప్రేమానురాగాలు వర్షంలా జాలువారుతున్నాయి. శేఖరును ఇంకా గట్టిగా హత్తుకొందామె. ఇప్పుడామె మనసులో ఉన్న కల్మషమంతా కన్నీళ్ల రూపంలో కరిగిపోయింది. ఆమె మనసు స్వచ్ఛంగా ఉంది. దానిలో ప్రియమైన భర్త రూపం చాలా అందంగా ప్రతిఫలిస్తోంది. స్త్రీకి కావాల్సిన అసలైన సంపద ఏమిటో తెలిసి వచ్చింది. 'నాకీ గుణవంతుడైన భర్త చాలు!'అనుకుంటూ భర్త గుండెలో తల పెట్టుకొని తృప్తిగా కళ్ళు మూసుకొంది లావణ్య. (సమాప్తం ) ***********************************

మరిన్ని కథలు

Sookshmam
సూక్ష్మం
- ఐసున్ ఫిన్
Pellipandiri
పెళ్ళీపందిరి
- సి.హెచ్.ప్రతాప్
Samudram lo Kakiretta
సముద్రంలో కాకిరెట్ట.
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Manavatavadulu
మానవతావాదులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Photo teeyadam neramaa
ఫోటో తీయడం నేరమా! (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Paarina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Jeevana deepam
జీవన దీపం
- సి.హెచ్.ప్రతాప్
Aasaraa
ఆసరా!
- రాము కోలా. దెందుకూరు