కలిసొచ్చిన వరం - పద్మావతి దివాకర్ల

The blessing of being together

రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక గృహస్థు ఉండేవాడు. అతను తన తండ్రినుండి సంక్రమించిన కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ సుఖంగా జీవించేవాడు. సహజంగా పరోపకార గుణంకల రామయ్య ఇతరులకు సహాయపడుతూ ఆ ఉళ్ళో మంచివాడనిపించుకున్నాడు. రామయ్యకి దైవభక్తికూడా మెండుగా ఉంది. అతిథులను, సాధుసన్యాసులను ఆదరించడం అతని దినచర్యలో ఓ భాగమైపోయింది. అతని భార్య సీతమ్మ కూడా అతనికి తగ్గ ఇల్లాలే. అతనికి ప్రతీ విషయంలో ఆమె తన సహాయ సహకారాలను అందించేది. పాఠశాలలో చదువుకునే రామయ్య కూతురు లక్ష్మి బాగా తెలివైనది.

అయితే రామయ్యకి ఓ కోరిక ఉండేది. తన అసలు వృత్తి అయిన వ్యవసాయం చేపడుతూనే, తీరిక సమయాల్లో తనకున్న సహజ ప్రతిభవల్ల కవితలు, కావ్యాలూ అల్లి ఆ ఊళ్ళోవాళ్ళకి వినిపిస్తూండేవాడు. తన కావ్యాలవల్ల తన పేరు ప్రతిష్ఠలు రాజధానీ నగరంవరకూ వ్యాపించి తద్వారా మహారాజు సన్మానం పోందాలని రామయ్య చిరకాల వాంఛ.

ఒకరోజు రామయ్య ఇంటికి తపస్సంపన్నుడైన విద్యానందుడనే ఒక సాధువు అతిథిగా వచ్చాడు. రామయ్య ఆ సాధువుని సాదరంగా ఆహ్వానించి తనకు వీలైనంతలో అతిథి సత్కారాలు చేసాడు. రామయ్య అతిథి సత్కారాలకు విద్యానందుడు చాలా సంతోషించాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో విశ్రమించి ఆ తర్వాత రోజు పయనమవుతూ రామయ్యని ఓ వరం కోరుకోమన్నాడు. అయితే ఎప్పుడూ నిస్వార్థంగా అతిథులకు సేవచేసే రామయ్యకి ఏం వరం కోరుకోవాలో వెంటనే స్పురించలేదు.

రామయ్య వెంటనే ఏ నిర్ణయానికి రాలేకపోవటం వల్ల విద్యానందుడు చిన్నగా నవ్వి, "నెమ్మదిగా ఆలోచించి నీ కోరిక తెలియజేస్తే వరం ప్రసాదిస్తాను. కావాలంటే నీ భార్య, కుమార్తె అభిప్రాయాలు కూడా తెలుసుకో!" అన్నాడు.

అలాగేనని ఇంటిలోపలికి వెళ్ళి భార్య, కుమార్తెకీ విషయం చెప్పిన రామయ్య తన మనసులోని మాట బయట పెట్టాడు.

"నాకేమో కవిగా బాగా కీర్తి, పేరు ప్రతిష్టలు రావాలని వరం ప్రసాదించమని కోరాలని ఉంది." అన్నాడు.

"ఏమండీ! కీర్తి వల్ల ఏం లాభం? అదేమీ మనకి కూడు పెట్టదు కదా! అందుకే మనకి ధనం, ఐశ్వర్యం అనుగ్రహించమని కోరండి." అంది భార్య సీతమ్మ.

వీళ్ళిద్దరి మాటలు వింటూ మౌనంగా ఉన్న కూతురు లక్ష్మిని చూసి రామయ్య అడిగాడు, "మా ఇద్దరి కోరికల్లో ఏది సమంజసమైన కోరికో నువ్వే చెప్పు? నువ్వు బాగా తెలివైనదానివి కదా, దేనివల్ల మనకి బాగా ప్రయోజనం ఉంటుంది?"

"మీ ఇద్దరి కోరికలు వల్ల కూడా మనం ప్రయోజనం పొందలేము." అన్న ఆమె వైపు ఆశ్చర్యంగా చూసారు వాళ్ళిద్దరూ.

"అయితే ఏ వరం కోరుకుంటే బాగుంటుంది?" అని అడిగాడు రామయ్య.

"నాన్నగారూ! నా మాటవిని అదృష్టాన్ని వరంగా కోరండి, దానివల్ల మనకి అన్ని ప్రయోజనాలు కలుగుతాయి." అందామె.

కూతురి తెలివిమీద, మాటలమీద అమిత నమ్మకం గల రామయ్య ఆ విధంగానే కోరుకోవడానికి ఒప్పుకున్నాడు. భార్య కూడా అందుకు సరేనన్నది.

విద్యానందుడి వద్దకు వచ్చి రెండు చేతులూ జోడించి తనకి అదృష్టాన్ని వరంగా ప్రసాదించమని కోరాడు రామయ్య వినమ్రంగా.

విద్యానందుడు నవ్వి, "తథాస్తు! చాలా తెలివైన కోరిక కోరావు. నీ కోరిక తప్పక సిద్ధిస్తుంది ." అని అక్కణ్ణుంచి బయలుదేరాడు.

ఆ తర్వాత రామయ్యకి అన్నింట్లో అదృష్టం బాగా కలసివచ్చింది. ఆ ఏడు పంటలు విపరీతంగా పండి అతనికి బాగా లాభం చేకూరింది. ధాన్యం అమ్మిన డబ్బులతో ఓ కొబ్బరితోట కొన్నాడు. ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాడు. ఓ రోజు సాయంకాలం వేళ ఆ రాజ్యం మహారాజు మారువేషంలో రామాపురంలో సంచారం చేస్తూండగా ఆ గ్రామ ప్రజలమధ్య కవితా గోష్టి నిర్వహిస్తున్నరామయ్య అతని కంట్లో పడ్డాడు. రామయ్య ప్రతిభకి ఆయన అచ్చెరువొంది తన వద్దకు రప్పించుకున్నాడు. అక్కడ మహారాజుకి తన కావ్యాలు వినిపించి సన్మాన సత్కారాలు పొందాడు. మహారాజు వద్దనుండి మంచి బహుమానాలు కూడా పొందాడు. రామయ్యకి కవిగా పేరు ప్రతిష్టలు వచ్చి అతని చిరకాల వాంఛ కూడా నెరవేరింది. ఆ విధంగా కూతురు లక్ష్మి తెలివితేటలవల్ల అదృష్టాన్ని వరంగా పొందిన రామయ్యకి కీర్తిప్రతిష్టలతో పాటు, ధనం ఐశ్వర్యం కూడా లభించాయి. అంతే కాకుండా తన పరోపకారగుణం వల్ల మంచి పేరు కూడా సంపాదించాడు.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి