నేను సైతం...... - శ్రీమతి దినవహి సత్యవతి

నేను సైతం......

ఆదివారం హడావిడి వంటనుంచి నాకు విశ్రాంతి దొరికే ఒకే ఒక్క రోజు. ఆ ఒక్కరోజూ నేను కొంచం ఆలస్యంగా లేస్తానని తెలుసు సుధీర్ కి. అందుకని తానే ముందు లేచి తయారై కాఫీ తాగేసి నాకు టీ కలిపి ఉంచి పేపర్ చదువుకుంటూ కూర్చుంటారు.

ఈ రోజు ఆదివారం. సమయం ఏడున్నర అవుతుండగా లేచి ముఖం కడుక్కుని , టీ తెచ్చుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాను. సుధీర్ ఎలాగూ మొత్తం పేపరంతా అ నించి అః వరకు చదివేదాకా వదలరు. అంతేకాదు మధ్య మధ్యలో ఆసక్తికరమైన విషయాలు, వార్తలూ ఉంటే ‘ఏమోయ్ ఇది విను’ అంటూ చదివి వినిపిస్తారు. అప్పటిదాకా నా కాలక్షేపం కోసం టి.వి. ఆన్ చేసాను.

గగన్, మా ఎనిమిదేళ్ళ పుత్రరత్నం కూడా సుధీర్ తోపాటే లేచి పాలు త్రాగేసి, సోఫా ప్రక్కనే క్రింద కూర్చుని , ఈ మధ్యనే వాడికి కొనిచ్చిన క్రాఫ్ట్ మెటీరియల్ తో ఏదో తయారు చేస్తున్నాడు. నేను టి.వి.పెట్టగానే తన పని చేసుకుంటూనే మధ్య మధ్యలో తలెత్తి చూస్తున్నాడు.

“అమ్మా అదేమిటీ చూపిస్తున్నారూ?” ఉన్నట్లుండి అడిగాడు.

టి.వి.లో ‘ఈ నగరానికేమైంది......’ అనే ప్రకటన వస్తోంది.

“అదీ కాన్సర్ కు సంబంధించిన ప్రకటన”

“కాన్సర్ అంటే?”

“అది ఒక జబ్బు. సిగరెట్టు అవీ త్రాగితే వస్తుంది”

“అయితే మరి కరణ్ బాబాయ్ కీ వస్తుందా?”

కరణ్, సుధీర్ తమ్ముడు. అతను సిగరెట్టు త్రాగడం చూసాడు గగన్.

‘రాదు అని చెప్పాలా? వస్తుందీ అని చెప్పాలా? ఎలా చెప్తే వాడి చిన్ని బుర్రకి అర్థమవుతుంది?’ ఆలోచనలో పడ్డాను.

పేపరు చదువుతూనే సుధీర్ మా సంభాషణ అంతా ఆలకిస్తున్నారు. నేను ఎంతకీ సమాధానం చెప్పకపోయేటప్పటికి తలెత్తి నావైపు చూసాడు గగన్.

నా ఇబ్బంది గ్రహించారేమో ‘సరళా ఈ వార్త విన్నావా?’ అన్నారు సుధీర్ సంభాషణ మారుస్తూ .

తన సందేహానికి నానించి ఇంక సమాధానం రాదనుకున్నాడో ఏమో తిరిగి క్రాఫ్ట్ పనిలో నిమగ్నమయ్యాడు గగన్.

“కాన్సర్ బాధితులకి సహాయం చేయాలనుకుంటే చెక్కు ద్వారా కానీ డ్రాఫ్టు ద్వారా కానీ కాన్సర్ హెల్ప్ ఫౌండేషన్ కి డబ్బులు పంపవచ్చు అని రాసారోయ్” అన్నారు సుధీర్.

“అయితే తప్పక ఎంతో కొంత పంపిద్దాము. అసలు ఆ కాన్సర్ హెల్ప్ ఫౌండేషన్ కి ఎంతిచ్చినా తక్కువే అలాగని మన శక్తికి మించి ఇవ్వలేముగా” అన్నాను.

“అవునోయ్ నేనూ అదే అనుకుంటున్నాను” అన్నారు.

ఇంతలో ఉన్నట్టుండి “అమ్మా! హెల్ప్ ఫౌండేషన్ అంటే ఏమిటి?” అడిగాడు గగన్.

“అంటే మనం ఎవరికైనా హెల్ప్ చెయ్యాలనుకుంటే వాళ్లకి డబ్బులు ఇచ్చే ఒక సంస్థ అన్నమాట”

“ఇప్పుడు హెల్ప్ ఎవరికీ?” అంది .

“ఇందాక అడిగావే కాన్సర్ అనీ ఆ జబ్బు, అది వస్తే తొందరగా తగ్గదు. హాస్పిటల్ లో చేరాల్సి వస్తుందీ, బోలెడంత డబ్బు ఖర్చవుతుందీ... ఇలా చాలా బాధలు ఉంటాయి”

“ఓహో......అంటే చరణ్ వాళ్ళ డాడీ లాగానా?”

గగన్ తరగతిలో ఈ మధ్యనే చరణ్ అనే అబ్బాయి తండ్రి కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది. అది విని అందరమూ ఎంతో బాధపడ్డాము.

“అవునమ్మా” అన్నాను ఆ విషయం గుర్తొచ్చి.

“ఊ......” అని ఊరుకున్నాడు మరేమీ ప్రశ్నించకుండా.

టిఫిన్ ఏర్పాట్లు చేద్దామని నేనిలా లేచానో లేదో అలా గగన్ కూడా లేచి లోపలికి పరిగెత్తాడు తుర్రుమని....

“గగన్ నెమ్మదిగా వెళ్ళూ ఎందుకా పరుగు?” అంటూ కదిలాను.

ఎంత వేగంగా అయితే లోపలికి వెళ్ళాడో అంత వేగంగానూ వచ్చి, గబగబా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి "డాడీ ఇది చూడండి” అన్నాడు ముఖం గంభీరంగా పెట్టి సుధీర్ చేతికి ఏదో వస్తువు ఇస్తూ.

అది చూసి వంటింట్లోకి వెళ్ళడం విరమించుకుని తిరిగొచ్చి అదేమిటా అని చూసాను. ఆ వస్తువు చిన్న బాక్స్ లా ఉంది. పై భాగంలో చిన్న చతురస్రపు కన్నం ఉంది. చెప్పాలంటే కొంచం చిన్న సైజు కిడ్డీ బ్యాంకులా ఉంది.

“ఏమిటిరా ఇది?” అడిగారు సుధీర్.

“ఇది నేను తయారు చేసాను మనీ దాచుకోవడానికి” అన్నాడు ప్రక్కనే ఉన్న క్రాఫ్ట్ వస్తువులు చూపిస్తూ.

‘అయితే ఇందాకటినుంచీ గగన్ చేస్తున్న పని ఇదన్న మాట’ అనుకున్నాను.

‘అబ్బో భలే బాగుందే’ గగన్ బుగ్గలు పుణికి మెచ్చుకున్నారు సుధీర్.

నాక్కూడా చూపిస్తూ “అమ్మా...ఇందులో ఫిఫ్టి రుపీస్ ఉన్నాయి తెలుసా?” అన్నాడు గర్వంగా ముఖం పెట్టి.

“ఓహో ...గుడ్” అన్నాను. బందువులూ ఆత్మీయులెవరైనా ముద్దు కొద్దీ డబ్బులు చేతిలో పెడితే అవన్నీ తన దగ్గర ఉన్న చిన్న అట్ట పెట్టేలో పెట్టి నాకు చూపిస్తాడు. ఇవ్వాళ ఆ డబ్బంతా దాచడానికనుకుంటా ఇలా ప్రత్యేకంగా బాక్స్ తయారుచేసాడు.

“డాడీ ఇది తీసుకోండి” అని సుధీర్ చేతిలో పెట్టాడు ఆ కిడ్డీ బ్యాంక్ ని.

“ఎందుకురా ?” ప్రశ్నార్థకంగా చూసారు.

“కాన్సర్ తగ్గాలంటే హాస్పిటల్ లో బోలెడంత మనీ కావాలి అందిగా అమ్మ. నా ఫిఫ్టి రుపీస్ కాన్సర్ హెల్ప్ కి ఇవ్వండి” అన్నాడు.

ఇందాక నాకూ సుధీర్ కీ మధ్య జరిగిన సంభాషణ విన్నప్పుడు తానూ ఇలా ఇవ్వచ్చు అన్న ఆలోచన కలిగిందేమో! అందుకే "నేను సైతం......" అంటూ తన కిడ్డీ బ్యాంకు లోని డబ్బుని కాన్సర్ హెల్ప్ ఫౌండేషన్ కి ఇవ్వమని అంటున్నాడు!

“గుడ్ థాట్. తప్పకుండా ఇస్తానురా’ అని గగన్ ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు సుధీర్.

చిన్నవాడైన గగన్ గొప్ప ఆలోచనకి ఎంతో ఆనందం కలిగింది మాకు.

*****************

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి