కరోనా దిద్దిన కాపురం - మంత్రిప్రగడ రామకృష్ణ శర్మ

కరోనా దిద్దిన కాపురం

సుబ్బారావు ఇంటి నుంచి ఆఫీసు పని చేస్తున్నాడు.
స్వతహాగా సుబ్బారావుకు పరిసరాలు శుభ్రంగా వుండాలి. స్వయం నియంత్రణలో వుంటాడు. శరీర శుద్ధి మానసిక సిద్ధి నిస్తుందని నమ్మకం.
మామూలుగా రోజుకు రెండు సార్లు స్నానం చేస్తాడు. ఇప్పుడు కరోనా సందర్భంలో అరగంట కొకసారి చేతులు కడుగుతున్నాడు. రోజుకు నాలుగు సార్లు స్నానం చేస్తున్నాడు.


సుబ్బారావు ధర్మపత్ని సుబ్బలక్ష్మి. అమె కూడా
ఇంటి నుంచి అమెరికా కంపనీలో అంతర్జాలంలో పనిచేస్తుంది. కొన్నాళ్ళు అమేరికా లోనే పనిచేసింది.
ప్రస్తుతం కంపనీ అనుమతి తీసుకొని మన దేశంలో
పనిచేస్తుంది. జీతం డాలర్లో. ఆమెది మొదటి నుంచి ఇంటి నుండి పని. దానికి ఆమె బాగా అలవాటైంది.


సుబ్బారావు కరోనా కనికరంతో ఇంటినుంచి ఆఫీసు పని చేస్తున్నాడు. ఈ ప్రక్రియ అతనికి కొత్త.
దీంతో సతమతమవుతున్నాడు. మామూలుగా చిన్న చిన్న విషయాలకే చికాకు పడ్తాడు. ఇంటి పనుల్లో సహాయం చేయడానికి ఇష్టపడ్డు.


సుబ్బారావు మరియు సుబ్బలక్ష్మి దంపతులకు
ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి డాక్టర్. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుంది. రెండో అమ్మాయి వైద్య విద్యార్ధిని . మాడవ అమ్మాయి
ఇంటర్ రెండవ సంవత్సరం . బి. పి. సి. తీసుకుంది. అంటే మూడో డాక్టర్ వాళ్ళింట్లో తయారవుతుంది. వాళ్ళది డాక్టర్లు కుటుంబమని అందరూ కొనియాడతారు.


మూడవ అమ్మాయికి ఇంటర్ పరీక్షలు ముగిశాయి.
వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశ పరీక్షలకు సన్నాహమవుతుంది. రెండో అమ్మాయి వైద్య శాస్త్రంలో పి. జి. చేస్తుంది. కరోనా వచ్చినప్పటి
నుంచి పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి ఇంటికి రావటం లేదు. రోజూ పన్నెండు గంటల పని చేసి
మిగిలిన పన్నెండు గంటలు క్వారంట్వైన్ లో బస చేస్తున్నవారు. వైద్యుల నిబద్ధతకి వాళ్ళ మీద పుష్ప
వర్షం కూడా కురిపించారు.


అమ్మాయిల డ్యూటీ విషయంలో సుబ్బారావు చాలా ఆందోళన పడ్డాడు . కానీ సుబ్బలక్ష్మి ధైర్యం చెప్పింది.


కరోనా వచ్చినప్పటి నుండి సుబ్బలక్ష్మికి ఇంట్లో పని
ఎక్కువైంది .పనివాళ్ళు రావటం లేదు. ఇంటి పని, వంట పని, బట్టల పని, తోట పని తనే చూడాలి.
చిన్న అమ్మాయికి ప్రవేశ పరీక్షలు .దానికి పని చెప్పలేదు. మిగిలిన ఇద్దరమ్మాయిలు ఇంట్లో లేరు. వాళ్ళ సహాయం లేదు. సుబ్బారావు మామూలుగా అంతంత మాత్రమే ఉపయోగం. దానికి తోడు ఇంటి నుండి పనితో సతమతమవుతున్నాడు. మామూలు రోజుల్లో కూడా ఇంటి విషయాలు ఎక్కువ పట్టించుకోడు.


నిత్యావసరాలు బజారు నుండి తీసుకురావటానికి అటహసం చేస్తాడు. ముఖ కవచం, చేతిరక్షణ తొడుగులు అందించాలి. కారు కీస్ తీసి ఇవ్వాలి. ఏమైనా అంటే నేను పెద్ద ఆఫీసర్ అంటాడు. నా కింద బోలెడు మంది పనిచేస్తారంటాడు.


' మీ అధికారం ఆఫీస్ లో చూపించండి ఇంట్లో కాదు. ఇంట్లో వున్నది మీ భార్య, పిల్లలు. కుటుంబ సభ్యుల పైన మమకారం వుండాలి కానీ అధికారం కాదు'. అని ఎన్నో సార్లు చెప్పి చూసింది పాపం ఆ ఇల్లాలు. కానీ పురుష అహంకారంతో ఊగిసలాడే
సుబ్బారావుకు మంచి మాటలు చెవికెక్కవు. కొన్ని సార్లు హాస్యంగా ' నా సంపాదన డాలర్లలో ' , అని చమత్కారం చేసేది. రక్తమంతా అహంకారంతో నిండిపోయిన సుబ్బారావుకు ఈ చమత్కార బాణాలు గుచ్చుకోవు.


రోజూ ఉదయం సుబ్బలక్ష్మి కాఫీ పెట్టి ఇస్తే అయ్యగారు శబ్ధం చేస్తూ గుటకలు వేసి, తాను కాఫీ తాగటం ఆమెకు ఉద్ధరింపు లాగా చూస్తాడు.


ఒక రోజు సుబ్బలక్ష్మి ఉదయం ఏడు గంటలైనా నిద్ర లేవలేదు. ఇంకా సుబ్బలక్ష్మి అలికిడి కాకపోతే గదిలోకి వెళ్ళి చూసాడు . ఆమె పడుకునే వున్నది. దగ్గరగా వెళ్ళి నుదుటి మీద చేయి వేసాడు. జ్వరలక్షణాలు కనిపించాయి. ధర్మామీటర్ తో చూసాడు. నూట రెండు డిగ్రీలు వుంది . కొంచం జలుబు దగ్గు వున్నది.


సుబ్బారావుకు జీవితంలో మొదటి సారి చెమటలు పట్టాయి. కొంపదీసి కరోనా కాదు కదా అని కంగారు పడ్డాడు. పెద్ద అమ్మాయితో మాట్లాడి విషయం చెప్పాడు. వెంటనే హుటాహుటిన తన ఆసుపత్రి నుంచి వైద్య బృందాన్ని పంపించింది పెద్ద అమ్మాయి. పరీక్షలు చేసి కరోనా లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించారు. వారం తర్వాత ఇంకో సారి పరీక్ష చేయాలన్నారు. ఎందుకైనా మంచిది అమ్మని ఇంట్లో ఐసోలేషన్ లో పెట్టాలని పెద్ద అమ్మాయి చెప్పింది.


ఇప్పుడు ఇంటి పని వంట పని సుబ్బారావు మీద
పడింది. గత్యంతరం లేని పరిస్థితిలో అయిష్టం గానే చేస్తున్నాడు.


సుబ్బారావు తండ్రి చిన్నతనంలోనే కాలం చేసాడు.
తల్లి ఉద్యోగం చేసేది. అటువంటి పరిస్థితుల్లో సుబ్బారావు ఇంటి పనుల్లో అమ్మకి సహాయం చేసేవాడు. కాలం కలిసొచ్చింది. చదువబ్బింది.
మంచి ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నడిమంత్రపు సిరి అనుభవిస్తున్నాడు. భేషజం ఎక్కువైంది. సొంత
పనులు చేయటం నామోషీగా భావిస్తున్నాడు.


రెండు రోజులు అంట్లు తోమగానే సుబ్బారావుకు ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. ' డిష్ వాషర్' కొంటే ఎలా వుంటుందని. వెంటనే బజారు వెళ్ళి యాభై వేలకు పైగా ఖర్చు పెట్టి 'డిష్ వాషర్ ' కొన్నాడు. ఇరవై నాలుగు గంటల్లో ఇంటికి తీసుకొస్తామని దుకాణం లో చెప్పారు.


మూడు రోజులైనా ' డిష్ వాషర్ ' ఇంటికి రాలేదు. సుబ్బారావు వాకబు చేస్తే 'డిష్ వాషర్ ' గోడౌన్ లో వుంది, తీసుకురావటానికి కూలీలు లేరు , లాక్ డౌన్ లో కూలీలు ఊరు వెళ్ళారని చెప్పారు.


మొత్తానికి వారం తర్వాత డిష్ వాషర్ ఇంటికి వచ్చింది. సుబ్బారావు కొన్ని విషయాల్లో చాలా అమాయకుడు. ఇన్స్టంటు కాఫీ పౌడర్ లాగా వెంటనే వాడొచ్చనుకున్నాడు. కంపనీ ఇంజనీర్ వచ్చి చెప్పాక వాడాలన్నారు .ఇంతలో మరో రెండు రోజులు గడిచాయి. ఇంజనీర్ వచ్చాడు. విడిగా నీళ్ళ కనెక్షన్, కరంటు కనెక్షన్ కావాలన్నాడు.
ఆ రెండు సదుపాయాలు లేవు. లాక్ డౌన్ లో పనివాళ్ళు దొరకటం కష్టం. ఈ మిషతో ఇంకో రెండు రోజులు పట్టింది. మొత్తానికి సుబ్బారావు డిష్ వాషర్ వాడటం మొదలు పెట్టాడు.


సుబ్బారావు మంచి వాడే. భార్య మీద ప్రేమున్నది. పిల్లల మీద మమకారమున్నది. కానీ చాలామంది
లాగా ఇంటి ధర్మానికి ఆఫీస్ ధర్మానికి తేడా తెలీదు.
ఆఫీసులో మనమంతా ఒక కుటుంబంలా పని చేయాలంటాడు .ఇంట్లో ఆఫీస్ లో లాగా క్రమశిక్షణ కావాలంటాడు. ఇదొక మానసిక స్థితి . కొద్దిగా ఆలోచన మారిస్తే వ్యక్తి అందరి మన్ననలు
పొందగలడు.


సుబ్బలక్ష్మి అనారోగ్యం ఆమెకు మంచే చేసింది.
సుబ్బారావులో చాలా మార్పు వచ్చింది. భార్యను బాగా చూసుకుంటున్నాడు. అన్ని రకాల సేవలు చేస్తున్నాడు. ఇదివరకటి అహంకార మిప్పుడు
లేదు . ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవటానికి
అమ్మవారికి మొక్కుకొన్నాడు .


తల్లికి అనారోగ్యం గా వుందని పెద్ద పిల్లలిద్దరూ సెలవు పెట్టి వచ్చారు. ఇప్పుడు ఇల్లంతా
కళకళలాడుతొంది. పెద్ద అమ్మాయి తల్లికి మళ్ళీ వైద్య పరీక్షలు చేసింది. అంతా సవ్యంగా వుంది.
సుబ్బలక్ష్మి ఆరోగ్యం కుదుట పడింది.


లాక్ డౌన్ కి కొన్ని వెసులుబాట్లు కల్పించారు.
పనివాళ్ళు వస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు.


సుబ్బారావుకు బాగా జ్ఞానోదయమైంది.
ఇప్పుడు వద్దన్నా భార్యకు అన్ని పనుల్లో
సహకరించడం మొదలు పెట్టాడు. భార్యతో
కలసి మెలసి ఉంటే ఇంతటి ఆనందం పొందవచ్చని
ఇన్నాళ్ళూ తెలుసుకో లేనందుకు విచారిస్తున్నాడు.


కరోనా పుణ్యమా అని సుబ్బారావు మరియు సుబ్బలక్ష్మి చాలా ఆనందంగా కాపురం చేస్తున్నారు.


సుబ్బలక్ష్మి తన స్నేహితులతో ఫోన్లో చెప్తుంది
'మాది కరోనా దిద్దిన కాపురం ' అని.


రచన:
మంత్రిప్రగడ రామకృష్ణ శర్మ
🙏🙏🙏

మరిన్ని కథలు

Cow and Tigers
ఆవు - పులులు
- యు.విజయశేఖర రెడ్డి
Trikala Vedi - Bhojaraju Kathalu
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
laziness is a sin
సోమరితనం అరిష్టం
- సరికొండ శ్రీనివాసరాజు‌
Toy Stories - Sadgunavathi
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- బెల్లంకొండ నాగేశ్వరరావు.
Laughing Club
నవ్వుల లోకం
- భాస్కర్ కాంటేకార్
Toy Stories - Rudra Bhavani
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Lost Words
చివరి మాటలు
- దార్ల బుజ్జిబాబు