డెస్టిని - శింగరాజు శ్రీనివాసరావు

డెస్టిని

వివేక్ ఆలోచనలన్నీ 'కారణం ఏమయి ఉండవచ్చు' అన్న అంశం వైపు పరుగులు తీస్తున్నాయి. చనిపోయింది ఆషామాషీ వ్యక్తి కాదు. సుప్రసిద్ధ నటుడు విశ్వం. పిరికితనం దరికి చేరని మనిషిగా, ఎటువంటి ఒడుదుడుకులనైనా ధైర్యంగా ఎదుర్కోగల ధీశాలిగా పేరున్న మనిషి. గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా డీలా పడకుండా తనకు దొరికిన పాత్రలతో తృప్తి పడుతున్నాడు. అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పడక దగ్గర ఉన్న లెటర్ పాడ్ మీద "డెస్టిని" అని తన స్వహస్తాలతో వ్రాసిపెట్టాడు. ఆ వ్రాతలో అంతరార్థం ఏమిటి? అన్న ప్రశ్న వివేక్ ను వేదిస్తోంది. పోలీసు అధికారిగా చేరిన తరువాత తనకు అప్పగించబడిన తొలి కేసు ఇది. ఎలాగైనా విషయం ఆరా తీయాలి అని పట్టుదలగా ఉన్నాడు. ముందుగా ఆ ఇంటి పనివాడిని పిలిచాడు. " ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు" " గత పది సంవత్సరాల నుంచి సర్" " అయ్యగారి భార్య, పిల్లలు ఎక్కడ? సర్ ఒక్కరే ఎందుకు ఉంటున్నారు?" " అమ్మగారు కాలం చేసి నాలుగు సంవత్సరాలయింది. అప్పటి నుంచి అయ్యగారు ఒక్కరే ఉంటున్నారు. ఆయనకు ఒక్కరే కొడుకు. అతను అమెరికా లో ఉంటున్నాడు. కార్యక్రమానికని వచ్చారు. ఇప్పుడే పని మీద బయటకు వెళ్ళారు" " అయ్యగారు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ఊహించగలవా? పోనీ అయ్యగారికి, వాళ్ళ అబ్బాయికి మధ్య గొడవలేమైనా ఉన్నాయా" " అయ్యగారు ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదనుకున్నానయ్యా. ఇంతకు ముందు ఇలాగే ఒక నటుడు చనిపోతే అయ్యగారు తెగ బాధపడ్డారు. కష్టమొస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి గాని ఆత్మహత్య చేసుకోకూడదు. అది మహాపాపమని నాతో చెప్పారు. మాకు కూడా ధైర్యం నూరిపోసేవారు. ఆయనే ఇలా చేసుకుంటాడనుకోలేదు సర్. వాళ్ళ అబ్బాయి అమెరికా లోనే వుంటారు. అయ్యగారే ఎప్పుడన్నా వెళ్ళి వస్తుంటారు. ఈ మధ్యన బాకీల వాళ్ళు వచ్చి పోతున్నారు. అంతకుమించి నాకు తెలియదు సర్" అతను నిజమే చెబుతున్నాడని అనిపించింది వివేక్ కు. తను కూడ ఆయన ఇంటర్వ్యూ పేపర్ లో చదివాడు. కానీ బాకీలు అంటున్నాడు. అదే అర్థం కావటం లేదు. " సరే మీరు వెళ్ళండి" అని చెప్పి ఆ గదిని కలయతిరగసాగాడు, ఏదైనా ఆధారం దొరుకుతుందని. అతని కంటికి చిరిగిన పేపర్ ముక్క ఒకటి షోకేసు కింద ఎగురుతూ కనిపించింది. చేతిలోకి తీసుకున్నాడు. అందులో ఏదో వ్రాసి ఉంది. కాని అర్థం కావటం లేదు. అది విశ్వం గారి చేతివ్రాతలా ఉంది. ఏదో అనుమానం వచ్చి పనివాడిని పిలిచి షోకేసు అడుగు భాగమంతా చిమ్మి బయటకు లాగమన్నాడు. ఇంకో మూడు కాగితపు ముక్కలు కనిపించాయి. వాటన్నిటిని దగ్గరగా కలిపి చదవాలంటే కుదరలేదు. ఇంకా కొన్ని ముక్కలు ఎగిరిపోయాయని తెలిసింది. గది మొత్తం చిమ్మించాడు. ఏమీ దొరకలేదు. " డస్ట్ బిన్ లో చెత్త పారబోసేశారా బయట" అడిగాడు పనివాడిని. " లేదు సర్. అయ్యగారు చనిపోయిన ఈ నాలుగు రోజులుగా హడావుడిగా వుందని మునిసిలిటీ అతను రాలేదు. చెత్త అక్కడే ఉంది" చెప్పాడతను. అతడిని తీసుకుని డస్ట్ బిన్ దగ్గరకు వెళ్ళి కాగితపు ముక్కలేమైనా దొరుకుతాయేమో వెతకమన్నాడు. అతను చెత్తను కిందకు దొర్లించి దొరికిన ముక్కలను తెచ్చి ఇచ్చాడు వివేక్ కు. అందులో తనకు కావలసినవి ఏరి తీసుకువెళ్ళి అంతకు ముందున్న వాటితో కలిపి జాగ్రత్తగా అమర్చాడు. అది ఒక రూపాన్ని దిద్దుకుంది. అందులో వ్రాసిన విషయాన్ని చదువసాగాడు వివేక్. " మనిషి జీవితం దూరం నుంచి చూసేవారికి వడ్డించిన విస్తరిలాగ కనిపిస్తుంది. కానీ అనుభవించే వారికే అందులో చిరుగులు కనిపిస్తాయి. నా జీవితమూ అంతే. అందరి దృష్టిలో నేనొక నటుడిని. బాగా సంపాదించి వెనకేశాననుకుంటారు. అప్పు చేసి పప్పుకూడు జీవితం నాది. ఉన్న ఒక్క కొడుకు తన దారి తను చూసుకుని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళినా అక్కడ ఒంటరివాడినే. నా భార్య ఉన్నంత కాలం తన విలువ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తున్నది నాకు తను ఎంత అండో. ఈ నాలుగు సంవత్సరాలు క్షణమొక యుగంగా గడిచింది. ఎంతకాలం ఈ ఒంటరితనం? మనసు తట్టుకోలేకపోతున్నది. వృద్ధాశ్రమాలకు వెళ్ళి తలవంపులు తెచ్చుకోలేను. కొడుకు దగ్గర కాపలా కుక్కలా ఉండలేకపోతున్నాను. ఏ దారీ నాకు తోచడం లేదు. ఆత్మహత్య చేసుకునే వారు పిరికివారని, సమస్యలకు భయపడతారని అనుకున్నాను. కానీ కొన్ని సమస్యలు సమాధానం లేనివి. ఉమ్మడి కుటుంబాలలో ఆర్చేవారు, తీర్చేవారు ఉంటారు. ఈ ఒంటరి కుటుంబాలలో అందరిదీ ఒంటరితనమే. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామమయింది. కానీ నాలాంటి వయసు మళ్ళిన వారికి చోటే కరువయింది. నీచానికంటే మరణం మేలన్నది నిజం. ఒంటరితనం నరకం, వృద్ధాప్యం శాపం. అందుకే చనిపోతే ఎలావుంటుంది అనిపిస్తున్నది. తలవంచి బ్రతకలేను. అదే మేలేమో. ఛ... ఏమిటీ ఆలోచన....తప్పా? ఒప్పా?..." ఆ తరువాత తడిసినట్లయి మసక మసకగా కనిపించాయి. అంటే మానసికంగా వ్యథను అనుభవించి చనిపోయారు విశ్వం. ఆ ఉత్తరంలో ఒక వాక్యం వివేక్ మనసును కలచివేసింది." ఒంటరితనం నరకం, వృద్ధాప్యం శాపం ". ఎంత అనుభవంతో చెప్పాడు. చిన్న కుటుంబాలు ఏర్పడడం మొదలయిన తరువాత స్వార్ధాలు పెరిగి అనుబంధాలు ఆవిరయిపోయాయి. ఆలోచిస్తున్న వివేక్ కు తన తండ్రి గుర్తుకు వచ్చాడు. ఉద్యోగరీత్యా తను పట్టణానికి వస్తూ అతడిని పల్లెలోనే ఉంచి వచ్చాడు. అతడిని అలాగే వదిలేస్తే అతను కూడా ఇతనిలా... ఉలిక్కిపడ్డాడు. తెలిసో, తెలియకో విశ్వం కొడుకు చేసిన తప్పు నేను చెయ్యకూడదు. నా మూలంగా నా తండ్రి ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఒక్క ఉదుటున లేచి బయలుదేరాడు వివేక్. ఆ కాగితాలను చుట్టి జేబులో వేసుకున్నాడు " సార్. మా నాన్న ఎందుకలా చేశారు" ఎదురుగా వచ్చి అడిగాడు విశ్వం కొడుకు. " నీవల్లే" అని అరవబోయి తమాయించుకుని "డెస్టిని". మీ నాన్నగారు వ్రాసిన మాటే నిజం. అంతకు మించి ఆధారాలు దొరకలేదు. కేసు మూసివేస్తున్నాను" అంటూ చక చక కదిలాడు వివేక్. చనిపోయిన వ్యక్తి ఎలాగూ తిరిగిరాడు. బ్రతికున్న వారిని బాధపెట్టడం ఎందుకు? అందుకనే ఆధారాన్ని తనతో పాటే తీసుకువెళ్ళాడు వివేక్. ఇప్పుడతని కర్తవ్యం, తన తండ్రి జీవితాన్ని రక్షించుకోవడం. ********* అయిపోయింది******

మరిన్ని కథలు

Samayaspoorthy
సమయస్ఫూర్తి
- కందర్ప మూర్తి
Bhadrakali
భద్రకాళి
- BHADRIRAJU THATAVARTHI
Daivam manusha rupena
దైవం మానుష రూపేణ
- శింగరాజు శ్రీనివాసరావు
Aadavaalaa majaakaa
ఆడవాళ్ళా.. మజాకా..!
- చెన్నూరి సుదర్శన్
The critical match
ద క్రిటికల్ మ్యాచ్
- చింతపెంట వెంకట సత్య సాయి పుల్లంరాజు,
Yenkatalachimi sana manchidi
"ఎంకటలచ్చిమి   సానా   మంచిది"
- నల్లబాటి రాఘవేంద్రరావు