గుప్తధనం - పద్మావతి దివాకర్ల

hidden money

ఒక ఊళ్ళో వైద్యనాధుడనే పేరుపొందిన వైద్యుడు ఒకడు ఉండేవాడు. చుట్టుపక్కల పాతిక గ్రామాలకీ అతనొక్కడే వైద్యుడు. ఎలాంటి రోగాన్నైనా చిటికెలో తన వైద్యంతో స్వస్థత చేకూర్చగలడని వైద్యనాధుడికి మంచి పేరు ఉంది. వైద్యనాధుడు తనవద్దకు వచ్చే పేదసాదలకు ఉచితంగా వైద్యం చేసేవాడు. మిగతా రోగులవద్ద కూడా వాళ్ళు ఇచ్చుకోగలిగనంత మాత్రమే ధనం తీసుకునేవాడు. అందుకే వైద్య వృత్తితో పెద్దగా ధనం కూడబెట్టలేక పోయాడు.

వైద్యనాధుడికి రామనాధుడు ఒక్కడే కొడుకు. అందువల్ల గారాబం ఎక్కువై చదువు సరిగ్గా అబ్బలేదు రామనాధుడికి. కొడుకుని కూడా తనంత వాణ్ణి చేయాలనుకున్న వైద్యనాధుడి కోరిక నెరవేరలేదు. అంతేకాకుండా ఏ పనిలోనూ ఏకాగ్రత లేని రామనాధుడు భవిష్యత్తులో ఎలా బతుకుతాడోనని బెంగగా ఉండేది. తన తర్వాత ఊళ్ళో వైద్యుడి కొరత ఎలా తీరుతుందన్నచింత కూడా ఉండేది.

అయితే వైద్య వృత్తిలో కొద్దిగానైనా మెళుకువలు నేర్పాలని ప్రయత్నించి కొడుకుని మూలికలు అందించమనేవాడు, లేహ్యం తయారు చేసే పని కూడా అప్పుడప్పుడు అప్పచెప్పేవాడు. తండ్రి చెప్పే పనులు అయిష్టంగా, విసుక్కొని చేసేవాడు రామనాధుడు.

కొన్నేళ్ళకి ఓ రాత్రి వైద్యనాధుడు కాలం తీరి చనిపోయేముందు కొడుకుని పిలిచి, "నువ్వు బాగా చదువుకొని వైద్య వృత్తి స్వీకరించి నా తదనంతరం మన ఊరి వారికి వైద్యుడి కొరత తీరుస్తావని ఆశించాను. కానీ అలా జరగలేదు. ఇంకేపని కూడా నీకు చేతకాలేదు. అందుకే నీ కోసం మన దేవుడి గది అటక మీద గుప్తధనం దాచి ఉంచాను. నీకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు." అని చెప్పి కన్నుమూసాడు. అయితే ఈ మాటలు వైద్యనాధుడు కొడుకుతో చెపుతున్నప్పుడు ఎవరింట్లోనో దొంగతనం చేస్తూ ఆ దారంటే వెళుతున్న ఓ ఇద్దరు దొంగల చెవినపడ్డాయి. అదును చూసి ఆ గుప్తధనం చేజిక్కించుకోవాలని వాళ్ళిద్దరూ కూడబలుక్కున్నారు.

అంతకుముందే తల్లిపోయిన రామనాధుడు ఇప్పుడు తండ్రికూడా పోవడంతో ఒంటరివాడయ్యాడు. తండ్రిపోయిన తర్వాత చేతిలో ఉన్న ధనంతో కొన్ని రోజులు గడిపాడు రామనాధుడు. వేరే సంపాదన లేని రామనాధుడు నెల రోజులయ్యేసరికి చేతిలో ఉన్న ధనమంతా ఖర్చుపెట్టేశాడు. చేతిలో డబ్బులు అయిపోవడంతో తండ్రి తనకోసం దాచిన గుప్తధనం ఆ రోజు బయటకి తీసి ఖర్చు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి అటకెక్కి అక్కడ దాచబడిన ఇనపపెట్టి కిందకి దింపేసరికి ఆ అదును కోసం వేచిఉన్న ఆ ఇద్దరు దొంగలు ఇంట్లో ప్రవేశించారు.

కత్తి చూపించి రామనాధుడ్ని బెదిరించాడు ఆ దొంగల్లో ఒకడు, "ఆ ఇనపపెట్టి మాకు అప్పగించు, లేదా నీ ప్రాణాలు దక్కవు." కరుకుగా అన్నాడు.

హఠాత్తుగా దొంగల్ని చూడగానే భయంతో రామనాధుడికి పైప్రాణాలు పైనే పోయి గజగజ వణకసాగాడు. 'అయినా తండ్రి తనకోసం దాచిన ఈ ధనం దొంగలపాలు చేస్తే ఏ పని చేతకాని తను బతికేదెలా?' అన్న ఆలోచన కలుగగా, కొద్దిగా ధైర్యం తెచ్చుకొని, "ఇందులోని ధనం నా తండ్రి తన సంపాదనలో దాచి నా కొరకు ఉంచాడు. అది మీ పరం చేస్తే నా గతేమిటి?" అని చెప్పాడు.

"మేము కూడా ఆ ధనం దోచుకోవడం కోసమే వచ్చాం. మాకు ఇవ్వకుండా తప్పించుకోలేవు, ఆ ఇనప్పెట్టి ఇవ్వకపోతే నీ ప్రాణాలు తీస్తాం." అని రామనాధం చేతుల్లోంచి ఆ పెట్టి లాక్కున్నాడు రెండో దొంగ. ఇద్దరూ కలసి ఆ పెట్టి పట్టుకొని బయటకు పరుగు తీసారు. తండ్రి ఎంతో కష్టపడి సంపాదించి తనకోసం దాచిన ధనం ఆ విధంగా దొంగలపాలవడం వల్ల కుమిలిపోయాడు రామనాధుడు. ఏం చేయాలో తోచలేదు రామనాధుడికి.

చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంవల్ల ఆ తర్వాత రోజు ఊళ్ళోకి వెళ్ళి పనేదైనా ఇప్పించమని తెలిసినవాళ్ళని ప్రాధేయపడ్డాడు. తండ్రి వైద్యనాధుడి మంచితనం వల్ల అతనికి ఆ ఊళ్ళోవాళ్ళు పని ఇచ్చి, భోజనం పెట్టి ఆదుకున్నారు. అలిసిపోయి రాత్రికి ఇంటికివచ్చి విశ్రాంతి తీసుకుంటుండగా తలుపు చప్పుడైంది. ఇంత రాత్రివేళ వచ్చిందెవరా అని ఆలోచిస్తూ తలుపు తీసిన రామనాధుడు ఎదురుగా కనపడ్డ ఆ ఇద్దరు దొంగలనూ చూసి భయంతో వణికిపోయాడు.

వాళ్ళిద్దరూ రామనాధుడ్ని లోపలికి నెట్టి ఇంట్లోకి ప్రవేశించారు. క్రితం రాత్రి పట్టుకెళ్ళిన పెట్టిని కింద పడవేసి, "ఇందులో ధనమేమీ లేదు, వట్టి చిత్తు కాగితాలు, తాళపత్రాలు మాత్రమే ఉన్నాయి. నిజం చెప్పు, ఇందులో మీ నాన్న ఉంచిన ధనం ఇంకెక్కడో దాచి ఉంచి, దీన్ని చిత్తుకాగితాలతో నింపావా లేదా?" అని అడిగాడు ఒక దొంగ.

"నాకేం తెలియదు, నేను నిజమే చెబుతున్నాను. నేను సరిగ్గా ఆ పెట్టె తీసే సమయానికే మీరు వచ్చి అది లాక్కున్నారు. అందులో ఏముందో నాకేమాత్రమూ తెలియదు." బిక్క మొహం వేసుకు చెప్పాడు రామనాధుడు.

అయితే ఆ దొంగలిద్దరు వాడి మాట నమ్మక ఇల్లంతా వెదికారు. ఆ పై పెరడు, ఇంటి అటకమీద అన్నిచోట్లా వెదికారుగానీ వారికి ఏమీ దొరకలేదు. ఆ ఇంట్లో వాళ్ళకి చిల్లిగవ్వ కూడా లభించలేదు. ఇల్లంతా ధనంకోసం క్షుణ్ణంగా వెదికి నిరాశ చెందారు దొంగలు.

"ఇంట్లో ఎక్కడా ఏమీ దొరకలేదు. మీ నాన్న చెప్పిన అబద్ధం నమ్మిన మాకు ఉత్తినే బోలేడంత సమయం వృధా అయింది." అని కోపంగా రామనాధుడికి రెండు దెబ్బలేసి అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు.

ధనం దొరకలేదు సరికదా, దొంగల చేతుల్లో దెబ్బలు కూడా తిన్న రామనాధుడు మిక్కిలి విచారించాడు. ఇదంతా తన అసమర్థత వల్లే వచ్చిందని దుఃఖించాడు. తనకి సరిగ్గా చదువు వంటబట్టకపోవడమే కాక, తండ్రి నుంచి వైద్యవృత్తిపై తగిన శ్రద్ధ పెట్టి అభ్యసించనందుకు చాలా చింతించి ఆ పెట్టిలో ఉన్న చిత్తుకాగితాలేమిటో అని అందులోకి చూసాడు. తనకున్న కొద్దిపాటి పరిఙానంతో చూసిన రామనాధుడికి అవి తన తండ్రి తనకోసం దాచిన వైద్య గ్రంథాలుగా గుర్తించాడు. ఆ తాళపత్రాలు కూడా తన పూర్వీకులనుండి వారసత్వంగా వస్తోన్న వైద్య గ్రంథాలని తెలుసుకున్నాడు. ధనమాశించిన దొంగలకళ్ళకి ఆ అపూర్వ గ్రంధాలు చిత్తికాగితాలవలే కనిపించాయి మరి! అప్పుడు తన తండ్రి అంతరార్థం గ్రహించగలిగాడు రామనాధుడు. గుప్తధనంగా తండ్రి తనకు అవే ఇవ్వదలిచాడని తెలిసి, ఊరివాళ్ళ సహాయంతో కొన్నాళ్ళు గురుకులంలో ప్రాథమిక విద్య, ఆ తర్వాత ఇంకో గురువు వద్ద వైద్యవృత్తి అభ్యసించాడు. తర్వాత తన తండ్రి వదిలివెళ్ళిన వైద్యగ్రంథాలు పూర్తిగా ఆకళింపు చేసుకొని వైద్యుడిగా అందరికీ వైద్య సేవలందించి అచిరకాలంలోనే తండ్రిని మించిన తనయుడని అనిపించుకున్నాడు రామనాధుడు.

మరిన్ని కథలు

wife sri lakshmi
సతీ శ్రీలక్ష్మి (కామెడీ కథ)
- సరికొండ శ్రీనివాసరాజు‌
devadattudu Fairy tales told by dolls
బొమ్మలు చెప్పినీ కమ్మనికథలు
- బెల్లంకొండ నాగేశ్వరరావు.
singing donkey
గాన గంధర్వ ఈ గార్ధభం
- కందర్ప మూర్తి
ratnashekharudu(Fairy tales told by dolls)
బొమ్మలు చెప్పిన కమ్మనికథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Waves of life
జీవన తరంగాలు
- కందర్ప మూర్తి
jeemoota trayamu(Delicious stories told by toys)
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
rakrudu(Delicious stories told by dolls.)
బొమ్మలుచెప్పిన కమ్మని కథలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Surge
ఉప్పెన!
- రాము కోలా