లాక్ డౌన్ లో పోతరాజులు - శ్రీనివాస్ మంత్రిప్రగడ

Descendants in the lockdown

ఈ కరోనా వల్ల ఎన్ని సమస్యలొచ్చినా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి...ఒక్కటే ఉరుకుల పరుగుల జీవితం నుంచి ఒక తాత్కాలిక విరామం దొరికింది...జీవితంలో ఏ విషయాన్నీ గురించి భయపడకూడదు ...జస్ట్ అర్ధం చేసుకోవాలంతే...ఆలా అర్ధం చేసుకునేటందుకు ఇప్పుడే సరైన టైము..అనుకున్నాడు రామ్ మేరీ క్యూరీని గుర్తు చేసుకుంటూ

నేను ఇంట్లో పనులు చేసి అవెంత సాధారణమైన విషయాలో కనిపెట్టి సావిత్రి ని ఎదుర్కునే అవకాశం దొరికింది...అనుకున్నాడు...గిన్నెలు కడగడం పూర్తి చేసి చేతులు కడుక్కుంటూ "ఏమోయ్ , ఈ పని అయిపొయిందిగానీ..కింద కెళ్ళి కూరలు పట్టుకొస్తా" అన్నాడు

వంట పనిలో హడావిడిగా ఉన్న సావిత్రి "మంచిది...నీ అంతట నువ్వే కూరలు తేవడానికి ఆసక్తి చూపించడం అద్భుతం" ఓ విసురు విసిరింది "సరే...లిస్ట్ రాసుకో...బంగాళా దుంపలు మెత్తగా ఉండకూడదు ...ఉల్లిపాయాలు మీడియం సైజు లో ఉండాలి...టమాటాలు దేశీ రకమే తీసుకో...ఆకుకూరలు వాడి పోకుండా ఉంటేనే తీసుకో...అరటిపళ్ళు మరీ ఎక్కువగా ముగ్గి పోయి ఉండకూడదు" చదివింది సావిత్రి ప్రతి కూరకి ఒక అదనపు సూచన జోడిస్తూ

ఓర్నాయనోయ్ ...మా కస్టమర్ల డిమాండ్లు..వాళ్ళ కోసం మేము రాసే సాఫ్ట్ వేర్ ప్రోగ్రాములు కూడా ఇంత సంక్లిష్టంగా ఉండవు అనుకుంటూ కూరగాయల దుకాణానికి బయల్దేరాడు రామ్ ...అప్పటికే అతను కూరల పేర్లు తప్ప మిగతా సూచనలన్నీ మర్చిపోయాడు

కూరల దుకాణం దగ్గర అయిదారుగురే ఉన్నా ఒకరి వెనుక ఒకరు కొంచం దూరం దూరంగా నిల్చోడడం వల్ల ఎక్కువ రద్దీ ఉన్నట్లనిపించింది...ఇలాంటి దృశ్యం చూసే అదృష్టం కలిగినందుకు ముచ్చట పడుతూ ఓపిగ్గా వరసలో నిల్చుని కూరలు తీసుకుని ఇంటికొచ్చాడు రామ్ ..ఎదో తెలియని ఉత్సాహం అతన్ని ఆవరించింది...రెండు పనులు విజయవంతంగా చేసేసాము ఇవాళ అనుకున్నాడు

"ఆ కూరలు అక్కడ పరిచి పెట్టు..ఓ మూడు నాలుగు గంటల దాక తాకొద్దు ...చేతులు సబ్బుతో కడుక్కో"అంటూ తక్షణ సలహాలిచ్చింది సావిత్రి

తాను చేసిన అంత అద్భుతమైన సహాయానికి పొగడక పోగా సలహాలు కూడానా ..రామ్ కి అవి అభిజాత్యపు ఆఙ్ఞల్లా అనిపించాయి .."సర్లే నాకు తెలియదా" విసుక్కున్నాడు

"మీవాళ్లందరికి శుభ్రత తక్కువ అందుకనే గుర్తు చెయ్యాల్సి వస్తుంది" అంది సావిత్రి అవకాశం దొరకబుచ్చుకుని

చాల చిరాకేసింది రామ్ కి ఇంత కష్టపడి తనకు అలవాటు లేని పనులు అభ్యాసన రేఖను విజవంతంగా దాటి చేస్తున్న అద్భుతమైన సాయానికి డంగైపోయి మెచ్చు కోవాల్సింది పోయి నన్నే కాక మొత్తం మా వంశాన్నే అవమానం చేస్తోంది...అనుకున్నాడు

"పతులార భ్రష్టులార...బాధ సర్ప ద్రష్టులార" అంటూ శ్రీ శ్రీ గారి కవిత ఆవేశంలో తప్పు గా చదివాడు రామ్

"నీ తలకాయ అది పతులార కాదు పతితులారా...అయినా మొదటి రెండు పదాలు బాగా కుదిరాయి ...మిగతా మూడు పదాలు మాకు వర్తిస్తాయి" అంది సావిత్రి నవ్వాపుకుంటూ

"హు!!!" అని విసురుగా ముందు గదిలోకి నడిచి పుస్తకాల్లో ఎదో తెలియని వస్తువు వెతక నారంభించాడు ...ఒక పావు గంట గడిచే టప్పటికి కొంచం కుదుట పడి టీవీ ముందు చేరాడు

ఇంతలో కిచెన్లోనుంచి సావిత్రి స్వరం వినిపించింది గంభీరంగా...మరేం ములిగిందో అని భయ పడ్డాడు రామ్ ఆమె స్వరం విని

"గిన్నెలకి సబ్బు వదలలేదు...తెచ్చిన వంకాయలన్ని పుచ్చులే...ఎవరైనా అన్ని అరటిపళ్ళు తెచుకుంటారా..అసలు నువ్వు ఆఫిసులో ఇలాగే ఉద్యోగం చేస్తున్నావా?" అంటూ పరస్పరం సంబంధం లేని స్టేట్మెంట్లు రామ్ చేతకాని తనం అనే దారానికి కట్టి వదిలింది సావిత్రి

"గిన్నెలు కడగడంలో నేనేమైన పెద్ద నిపుణుడినా...ఇప్పుడే నేర్చుకుంటున్నాను...తప్పులు జరగొచ్చు ...దానికే అంత రాద్ధాంతం అవసరమా" అనడిగాడు రామ్ విసురుగా

"ఇంగితజ్ఞానం ఉంటే చాలు ...పెద్ద నైపుణ్యం ఏమీ అవసరంలేదు...శ్రద్ధ ఉండాలి...ఎదో మెహెర్బాని చేస్తున్నట్టుగా కాకుండా మన పని అన్నట్టు చేస్తే కుదురుతుంది" అంది సావిత్రి

పాయింటే!!! అనిపించింది రామ్ కి...ఎలా స్పందించాలో అర్ధం కాలేదు...తెలియని ఆవేశం అతన్ని ఆక్రమించుకుంటోంది...

చర చరా బాల్కనీ లోకి వెళ్లి కూర్చుని చెడా మడా పేపర్ చదివే ప్రయత్నం చేసాడు...కోవిడ్ అనే పదం తప్ప ఇంకేమీ అర్ధం కాలేదు...కాసేపు ఫోన్ చూసాడు...రెండు తెలుగు వార్తా విశ్లేషకుల
వీడియోలు చూసాక కొంచం సెటిల్ అయ్యాడు...మనలో లోపమేమి లేదనిపించింది..కొద్ది కొద్ది గా కుంగి పోతున్న అతని విశ్వాసం వెనక్కొస్తున్నట్టనిపించింది.

నిజమే గా నేనొకసారి చేసిన పనిని తాను మళ్ళా చేసుకోవాల్సి వస్తే చిరాకే...అనుకున్నాడు ఆలోంచించి

పొద్దున్న లేవగానే టిఫెన్ ఏమి చెయ్యాలా అనే ఒక పెద్ద నిర్ణయం...అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి మళ్ళీ తన ఆరోగ్య సూత్రాలకు లోబడే ఉండాలి...ఆ గండం గడిచిన వెంటనే మధ్యాహ్న భోజనం లోకి ఏమి వండాలి అనే నిర్ణయం తీసుకుని వంట చెయ్యాలి...భోజనం తరువాత ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోవాలనుకునే లోగానే టీ, స్నాక్ ల టైం...అది ముగిసిన కాసేపటికే రాత్రి భోజనం ఏర్పాట్లూ...

ఈ ఆడవాళ్ళ పనులు ఈజీ అనుకుంటాం కానీ చాల సంక్లిష్టం...మనం జస్ట్ మన టీం లోని ఉద్యోగస్తులనీ, కస్టమర్లనీ బాలన్స్ చేస్తే చాలు ...వీళ్లపని అంతకంటే కష్టం...అయినా కూడా ఏమాత్రం బర్న్ అవుట్ చూపించకుండా నెట్టుకొస్తారు ...ఈ ఆడవాళ్ళ వ్యక్తీకరణ కొంచం కఠినంగా ఉన్నా ముళ్ళపూడి వారన్నట్టు హృదయం ఆశయం మంచివే...మనం కాస్త తగ్గడం మంచిది అనుకున్నాడు రామ్

అటు సావిత్రి కూడా ఒక్క క్షణం ఆలోంచింది...పాపం అనుకుంది రామ్ గురించి ...ఆఫీసుల్లో నిర్మాణాత్మక మైన పనులకి అలవాటు పడిన మగవాళ్ళు ఇంత భిన్నమైన పరిస్థితుల మధ్య నిర్ణయాలు తీసుకుని..పనులు నేర్చుకుని బాగా చెయ్యడానికి టైం పడుతుంది ...కొన్ని తప్పులు భరిస్తే తప్పేం లేదు అనుకుంది

ఇద్దరు కొంచం చల్లబడినా తమ తమ ఆలోచనలు బయట పెడితే ఇతరులకు చులకనై పోతామేమో అనే అనుమానంతో మెదలకుండా కూచున్నారు...

చీకటి పడింది...హాల్ లో లైట్ వేసి సోఫాలో కూర్చున్నాడు రామ్ ...సావిత్రి వంట గది లోకి వెళ్తోంది...రాత్రి భోజనం తయారుచేయడానికి కాబోలు అనుకున్నాడు రామ్. తన కొచ్చిన కొత్త జ్ఞానం వల్ల ఈ సారి జాగర్తగా కనుక్కుని పని చేద్దాం అనుకుని వంట గది లోకి వెళ్ళాడు...తనలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది

"ఈ ఆనపకాయ ముక్కలు తరగనా?" అడిగాడు ..."ముందర తొక్క తియ్యి ..తరవాత చిన్న ముక్కలు చెయ్యి" అని తాను రొట్టెలు చేసే పనిలో పడింది సావిత్రి

ఈ తొక్క తియ్యడం కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కంటే కష్టం లా వుంది..అనుకుంటూ పని ప్రారంభించాడు రామ్...ఒక పావుగంట తరువాత "అయ్యింది" అన్నాడు

"ఒక్క ఆనపకాయ తిరగడానికి ఇంత సేపా" అంటూ అక్కడకొచ్చిన సావిత్రి కెవ్వు మని అరిచింది
తానేమైనా పురుగుని ముక్క అనుకుని తరిగేశానేమో అని భయపడ్డాడు రామ్

"ఈ తొక్కతో బాటు అంత కండ పీకేశావా...తొక్కలోది తొక్క తియ్యడం కూడా చేతకాదా ...ఆ ముక్కలేంటి..ఒక్కోటి ఒక్కొక్క సైజు...ఆలా ఎలా కుదిరింది?" కోపంగా అడిగింది సావిత్రి

ఏం మాట్లాడకుండా చేతులు కడుక్కుని నిష్క్రమించాడు రామ్ తన కొచ్చిన కొత్త జ్ఞానం చూపిస్తూ

రాత్రి రొట్టెలు తినేటప్పుడు కూరలో తన నాసిరకపు నైరూప్య కళ బయట పడుతుందేమో అని భయపడ్డాడు రామ్...కానీ కూర మాములుగానే సొగసుగా, రుచిగా ఉంది.."ఏం చేసావు? ఇంకో ఆనపకాయ తరిగావా?" కొంచం బెదురుగా అడిగాడు

"లేదు...నువ్వు చేసిన భీభత్సాన్ని సరిచేసా" అంది సావిత్రి నవ్వుతూ...రామ్ కూడా కొంచం ఉపశమనం గా నవ్వాడు

టీవీ లో ప్రాంతీయ వార్తలు వస్తున్నాయి..మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమైనట్టున్నాయి ...భక్తులెవ్వర్నీ గుడి లోకి అనుమంతించటం లేదు...అందు వల్ల మాములుగా ఉండే రద్దీ లేదు ....కొందరు పోతరాజులు మాత్రం దూర దూరంగా నిలబడి దయగల తల్లి వమ్మా అంటూ పాడుతూ కొరడాలతో కొట్టుకుంటున్నారు.మొత్తం దృశ్యం రంగురంగుల తో భీభత్సంగానూ మనోహరంగానూ ఉంది...

పోతరాజులకి ముసుగులు అవసరమా? వేసుకుంటే పసుపో ఎరుపో వేసుకోవాలేమో అనుకుంటూ నవ్వుకుంటున్నాడు రామ్

"అక్కడంత నవ్వొచ్చే విషయం ఏముంది?" అడిగింది సావిత్రి

"ఆ పోతరాజుల్ని చూస్తుంటే లాక్ డౌన్ లో మా మగాళ్ల పరిస్థితిలా ఉంది...దయగల తల్లీ అంటూ మేమే పొగడాలి మళ్ళీ మా విశ్వాసం మీద కొరడా దెబ్బలూ మేమే తినాలి" అన్నాడు రామ్ కొంచం మెల్లగా...సావిత్రి ఎలా స్పందిస్తోందో ఊహించలేక

"నువ్వు పోతరాజువా" పగలబడి నవ్వింది సావిత్రి...బహుశా రామ్ ని పోతరాజు వేషం లో ఊహించుకుని ఉంటుంది ...రామ్ కూడా నవ్వాడు

"నువ్వు పోతరాజు వైతే నేను కడక్ లక్ష్మిని...నీకు విముక్తి లేదు" అంది గడుసుగా

అన్యోన్య దాంపత్యం లాక్ డౌన్ సాక్షిగా పదిలంగా సాగుతోంది

మరిన్ని కథలు

Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు