కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా… - aduri sreenivasarao

kannada rajya lakshmee daya leda

నేను కేంద్ర ప్రభుత్వంలో ఒక బ్యాంక్ ఉద్యోగిని. ఎప్పుడు ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్ ఫర్ వచ్చినా నేను అంగీకరించేవాడ్ని కాదు. ఏదో ఒక కుంటిసాకు చెప్పి తప్పించుకోడం నాకు వెన్నతో పెట్టిన విద్యైపోయింది. ఇలా ఉండగా మాపెద్దలు పోరి నాకు వివాహఘట్టాన్ని కట్టబెట్టారు. మాశ్రీమతి నాది కేంద్రప్రభుత్వ ఉద్యోగం, అని మురిసిపోయి (నా అందచందాలకు కాదు సుమండీ!) ఏదో ఓమోస్తరు మీసమున్న మగాడినే కానీ నవమన్మధుడ్ని కానేకాదు ఖచ్చితంగా. పెళ్ళయ్యాక మాశ్రీమతి మొదటికోరిక "అవకాశం ఉందికనుక ఉద్యోగం వంకతో దేశమంతా తిరిగి చూద్దామండీ!" అని కోరింది. నేను సహజంగా బధ్ధకిష్టును. తెలీని ఊర్లకెళ్ళి అన్నీ చూసుకోడమంటే నాకు సుతరామూ ఇష్టంలేదు, ఏదో ఉండూ(ర్లో) రాష్ట్రంలో అలవాటైనచోట కడుపులో చల్లకదలకుండా గడిపేయవచ్చని నాఆశ. నాశ్రీమతి తనకోరికతో నామతి పోగొట్టింది. కాదంటే ఇహ వంటవార్పూ మానేసి వంటింటి కర్ఫ్యూనో, బందో, లాకవుటో(నాకు వాటి గురించీ అంత నాలెడ్జ్ లేదు కాని కాస్త అర్ధం చేసుకుందురూ...) చేస్తుందని భయమేసి తాత్కాలికంగా "సరే" అని అంగీకరించాను. 'కానీ ట్రాన్స్ ఫర్ వచ్చినప్పుడు కదా చూద్దాంలే' అనుకున్నా కానీ ఆ ‘ఆపద’ ఇంత త్వరగా ముంచు కొస్తుందనుకోలేదు సుమండీ!

ఒక బ్యాడ్ మార్నింగ్ ఆఫీస్ కెళ్ళగానే తెలిసిన వార్త. 'ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్! వెళ్ళితీరవలసిందే!’ అనే విషయం తెలీగానే, నా నవనాడులూ కృంగిపోయాయి. నాధోరణిలో ఎలాగైనా కుంటిసాకు ఒకటిచెప్పి తప్పించుకునే ప్రయత్నంగా ఆలోచించసాగాను. ఐతే నాఖర్మ, మాపక్కపోర్షన్లోనే ఉంటున్న ప్రకాష్ నా పాలిటికి 'క్రాక’రయ్యాడు. అతగాడు ఏదో ములిగిపోయినట్లు వాడింటికి ఫోన్ చేసి లంచ్ అవర్లో చెప్పేశాట్ట, నాట్రాన్స్ ఫర్ గురించీనూ. నేను ఎంత దాద్దామని ప్రయత్నించదలచానో, అది ఇంటికెళ్ళగానే బట్టబయలైపోయింది. మాశ్రీమతి ఆపాటికే అందరికీ ఫోన్లు చేసేసి చెప్పేసింది కూడానుట!

"మేం కర్ణాటక వెళ్ళిపోతున్నాం. మా శ్రీవారికి ఎంతోకాలంగా రాని ప్రమోషన్ వచ్చేసింది, అక్కడ జనమంతా చాలా స్మూత్అట! స్మార్ట్అంట! శ్రీకృష్ణదేవరాయలు పాలించిన ప్రాంతంకదా! ప్రసిధ్ధిగాంచిన హంపి, విరూపాక్ష దేవాలయం, హేమకూట పర్వతం, శ్రీకృష్ణ దేవాలయం, సుగ్రీవుడి గుహ, మైసూర్ మహారాజ ప్యాలెస్, ఇవన్నీనాకెలా తెల్సనుకుంటున్నారా! ఇంటర్నెట్లో చూసి నోట్ చేసుకున్నాను లెండి. "అని నాగుండె బద్దలుకొట్టి, చిచ్చుపెట్టేసింది. నోట మాటరాక నిశ్చేష్టుడినైపోయాను.

నేను ఇంట్లో కాలుపెట్టగానే "ఎప్పుడుప్రయాణం? రిలీవయ్యే వచ్చేశారా?” అంటూ ప్రశ్నించింది పైగానూ. సునామీ తెల్సుకానీ అది మరీ ఇంత చెప్పాపెట్టకుండా, వాతావరణశాఖ హెచ్చరిక లేకుండానే వచ్చేస్తుందని నాకుతెలీదు. సునామీ ఇలా ఇంట్లోకి వచ్చిందేమోనని ఆశ్చర్యపోయాను. “నీకెలా తెల్సూ!" అనగానే నవ్వుతూ అన్నీ చెప్పేసింది. నాకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫరైంది కర్ణాటకలోని ‘చిక్మగళూర్' జిల్లాలోని శృంగేరికి. మాశ్రీమతి ఉత్సాహం చెప్పనలవి కాదు. “ఎంతగొప్ప పుణ్యక్షేత్రమండీ అది! మన పూర్వజన్మ సుకృతం కొద్దీ అక్కడికి ట్రాన్స్ఫరైంది." అంటూ హడావిడిపడింది.నేను "కొత్తచోట ఇబ్బందులు పడతామేమో! ప్రమోషన్ వద్దని రాసివ్వాలనుకుంటున్నాను. "అనగానే తాటి ప్రమాణంలో నాపై ఎగిరింది." ఉద్యోగికి దూరభూమి లేదని విద్యాధికునకెందు వింతలేదని తెలీదామీకు! పైగా ప్రమోషన్ వద్దంటారా? ఇలాగే గుమాస్తా గిరితో రిటైరైపోతారా? సిగ్గులేదుటండీ అలా మాట్లాడటానికి? ఈరోజుల్లో ఆడపిల్లలే ఇతరదేశాలకెళ్తున్నారు ఉద్యోగంకోసం, నాకా అదృష్టం లేనేలేదు, కనీసం ఇతరరాష్ట్రాలకైనా వెళ్ళేరాతలేదా?" అంటూ ముక్కుచీది చివాట్లేశాక, ఇహ తప్పదని రిలీవయ్యాను, దాంతో నాకష్టాలు మొదలయ్యాయి.

సామానంతా ట్రావెల్స్ కు బుక్ చేసి, రైల్లో రిజర్వేషన్ చేయించుకుని బయల్దేరి, బెంగుళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగాం. బయటకొచ్చి మెజిస్టిక్ బస్ స్టేషన్ కెళ్ళాను ఆటోకోసం ఆంగ్లంలోఅడిగాను. ఆటోడ్రైవర్, "ఈక్రింద ఉండే భూమార్గం ద్వారా బయటకు వెళ్ళితే అదే బస్ స్టేషన్” అని చెప్పాడు తెలుగులో!. మాశ్రీమతి ఆనందం పట్టతరం కాలేదు. "ఆహా! ఈకన్నడీగులెంత మంచివారండీ! మోసమన్నది ఇక్కడ లేనట్లుంది. ఇదే మన హైదరాబాదులో ఐతే చుట్టూతా నాల్గుమార్లు తిప్పి ఓవంద ఊడగొట్టేవారు" అంది. మెల్లిగా వెళ్ళి మెజిస్టిక్ బస్ స్టేషన్లో’ ఎంక్వైరీ కౌంటర్లో ‘శృంగేరి వెళ్ళే బస్ ఏనెం. ఫ్లాట్ ఫాంకి వస్తుందో విచారించి ఎక్కాము.

బస్ ఎక్కగానే కండక్టర్ వచ్చాడు, నేను ముందుగానే "శృంగేరికి" అన్నాను. అతగాడు "ఒందా? ఎరడా?" అన్నాడు. నాకేమో అర్ధం కాలేదు. మా శ్రీమతివైపు చూశాను. ఆకండెక్టర్ ఈమారు ఒందా? ఎరడా?" అని కొంచెం బిగ్గరగా అన్నాడు. నాకు కోపంవచ్చింది, అర్ధమయ్యి చస్తేనా చెప్పను. మాశ్రీమతి ముఖంచూశా. నా తెల్లముఖం చూసి అతగాడు మేము తెలుగువాళ్ళమని గమనించినట్లున్నాడు."టికెట్ ఒకటా? రెండాసార్?" అన్నాడు కాస్తనవ్వుతో. ప్రాణం లేచొచ్చింది. ఠక్కున "రెండు" అన్నాను. అతడునవ్వి "కన్నడ బారదా? " అన్నాడు."మేముతెలుగువాళ్ళం" అన్నాను. అతడు జాలిగా నవ్వుకుంటూ ముందుకువెళ్ళాడు. నాకు కోపంవచ్చినా తమాయించుకున్నాను. ప్రయాణభారంతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాము. మెలకువ వచ్చీరానట్లుండగా నన్నుతట్టి "హోగిహోగి" అన్నాడు. 'ఏమిటన్నట్లు’ చూస్తూ నేను అలాగే కూర్చోగా, అతడు గుర్తువచ్చినట్లు"ఓహొ తెలుగు కదా! దిగండి , మీరు దిగవలసిన ఊరు వచ్చింది." అన్నాడు. బ్రతుకుజీవుడా అనుకుని ఇద్దరం బస్ దిగి , ఆటోఎక్కాము."ఎల్లి?” అన్నాడు అటోవాలా. నాకు పిల్లి అని వినిపించి.

"ఏంటీ శుభమాని వస్తుంటే పిల్లి శకునమైందా!" అన్నాను. మాశ్రీమతి నన్నుతట్టి "ఎక్కడికీ అని అడుగుతున్నట్లుంది" అంది రహస్యంగా . ఇహ ఈ గోలెందుకని మా సహోద్యోగి అడ్రస్ ఉన్నకాయితం అతడికిచ్చాను. అతడు భద్రంగా తీసుకెళ్ళి పావుగంటలో ఇంటిముందు ఆపాడు. ఆటో దిగాము."ఎంత"అన్నాను పర్సు బయటకు తీస్తూ.
"హత్తురూపాయ్" అన్నాడు. అర్ధంకాపోయినా మళ్ళీ అడిగాను బేరమాడుదామని, నాచేతిలో ఉన్న నోట్లుచూస్తూ రెండుపదినోట్లు తీసుకుని వెళ్ళిపోయాడు నవ్వుకుంటూనూ. నాకు భాషరాదాయె బేరమాడను 'హతోస్మీ' అనుకుంటూ వెళ్ళి, డోర్ బెల్ మోగించగానే నాసహోద్యోగి వచ్చి తలుపుతీసి చిరునవ్వుతో "రండిరండి" అంటూ ఆహ్వానించాడు.

"రండి, మాశ్రీమతి పుట్టింటికెళ్ళింది, నాకు కాస్తంత తెలుగువచ్చును. ఆమె వచ్చేవరకూ మీరు కాస్త సర్దుకోవాలి.” అన్నాడు. "మీరేం కంగారుపడకండి అన్నయ్యగారూ! అందాకా నేను వంటచేస్తాను, మీకూనూ!" అంది ఎంతో కలుపుగోలుగా. మా సహోద్యోగి, ఎంతోసంతోషపడ్డాడు. "మీ సామానంతా నిన్ననే వచ్చేసింది, లోపల పెట్టించేశాను. ఈపక్క పోర్షనే మీకు తీసిఉంచింది." అంటూ ఇల్లుచూపాడు. ఈలోగా "హాలుబేకా... హాలుబేకా... " అని ఎవరో బయటినుంచీ అరవసాగారు. నాకేమీ అర్ధంకాక మా సహోద్యోగి వైపుచూడగా "హాలంటే పాలు" అన్నాడు. మాశ్రీమతి గిన్నెతీసుకెళ్ళి పాలుపట్టింది. ఇంతలో బహుశా ఆపక్కపోర్షన్ ఆసామీ అనుకుంటా వచ్చి "హాలుఇరకె?" అన్నాడు.

"లేదు లేదండీ హాలు ఇరుగ్గా లేదు, మాకు సరిపోతుంది" అన్నాను. మా సహోద్యోగి నవ్వుతూ "హాలంటే పాలుఅన్నాను కదా! ఆయన అరవ దేశీయుడు ,మన సహోద్యోగే! మీకు పాలుఅవసరమా? అని అడుగుతున్నాడు" అన్నాడు.

నా మతి మరుపుకు నాకే నవ్వువచ్చింది. ఎలాగో తయారై మా సహోద్యోగులతో కల్సి బ్యాంకుకు కెళ్ళాను. అలవాటుగా వారిద్దరూ లోనికెళ్ళారు. నేను లోనికెళ్ళబోతుండగా సెక్యూరిటీ ఆపి, "యారుయారు?, అన్నాడు. నాకు "ఏవూరు" అనిపించి ,నాట్రాన్స్ ఫర్ కాయితం చూపాను. నవ్వాడు. నాకు కోపం నషాళానికంటింది. "రండిసార్" అంటూ నన్నులోనికి తీసుకెళ్ళాడు, మాఅధికారివద్దకు. ఆయన తలవంచుకునే "హెసరుహేళి" అన్నాడు. నాకు కడుపులో పసరు తిప్పినట్లు అనిపించింది. ఆయన తలవంచుకునే,"హెసరుహేళి" అన్నాడు మళ్ళీ. సెక్యూరిటీ కాయితం ఆయన ముందుంచగానే, దాన్ని చదివి, తలెత్తిచూసి "ఓహో మీరా! ఆంధ్రా నుంచీ వచ్చినవారు. రండి. కూతుకోండి "అంటూ కుర్చీచూపాడు గనుక, 'కూర్చో’మంటున్నాడని తలచి కూర్చున్నాను, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి, సంతకంచేసి వెళ్ళి నాసీట్లో కూర్చుని పనిచేయసాగాను.

ఇంతలో ఒక తెలుగు కస్టమర్ వచ్చాడు. నేను తెలుగులో మాట్లాడటం చూసి మహదానందపడ్డాడు. నేనూనూ అంతే! ఇద్దరం కాస్తసేపు తెలుగులో కడుపునిండా మాట్లాడుకున్నాం. నాఆనందం చూసుకుని నాకు మాతృభాషలో ఉండే మాధుర్యం అర్ధమైంది. 'దేశభాషలందు తెలుగు లెస్స!' అన్న శ్రీకృష్ణదేవరాయలు మాటలు గుర్తువచ్చి, ఆయన పాలించిన రాజ్యంలోకే ఉద్యోగంకోసం వచ్చాను గనుక కాస్తంత కన్నడం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆరోజు ఆఫీస్ లో విని నేర్చుకున్న 'ఒందు’ అంటే ఒకటి, అని మనస్సులో అనుకుంటూ ఇంటికెకెళ్ళాను. నాశ్రీమతి ”దోసెచేశాను తేనా?” అని అడగ్గానే నాకన్నడ పాండిత్యంలో "ఒందుకాదు ఎరడు" అన్నాను. నా శ్రీమతికి మండిపోయి "ఒందూలేదూ సందూలేదు, ఎరడూలేదు, పెరడూలేదు, టిఫిన్ కావాలా వద్దా?" అంది. నేను నవ్వుతూ "ఒసే పిచ్చిముఖమా! ఒందు అంటే ఒకటి, ఎరడు అంటే రెండు, తెల్సుకో!" అన్నాను గర్వంగా కన్నడ భాషంతా ఔపోసన పట్టేసినట్లుగా. నాశ్రీమతి '40 రోజుల్లో కన్నడభాష' పుస్తకంచూపి నవ్వింది హృద్యంగా. నా సంకటం చూసి నాకే నవ్వొచ్చింది... "హయ్యో కన్నడ రాజ్యలక్ష్మీ దయలేదా! నేను శ్రీనాధుడన్" అన్నానుపెద్దగా... అన్నట్లు మీకు చెప్పలేదుగా... నాపేరు శ్రీనాధులెండి.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి