ఇదీ సహాయమే - వై.ఎస్.ఆర్. లక్ష్మి

This is helpful
“అమ్మా”వంటింట్లో పని చేసుకుంటున్న నాకు సన్నగా వినిపించింది.ఎవరోలే అనుకున్నా.
మరలా”అమ్మగారూ”అని గట్టిగా వినిపించింది.చేతిలో పనిలో బిజీగా వుండటంతో గదిలో ఆడుకుంటున్న పిల్లల తో “రాజూ! ఎవరో పిలుస్తున్నారు చూడండి”
అన్నా.రాజు వెళ్ళి చూసి “శాంతమ్మ వచ్చిందమ్మా నిన్ను పిలుస్తోంది”అని చెప్పి వాడి పని అయిపోయినట్లు గదిలోకి వెళ్ళిపోయాడు.
ఎందుకు వచ్చిందో కరోనా తగ్గే వరకు పనికి రావద్దని చెప్పానే అనుకుంటూ స్టౌ కట్టేసి విషయం కనుక్కుందామని బయటకు వచ్చాను.అక్కడ గోడకు ఆనుకుని
నీరసంగా నిల్చొనివున్నది శాంతమ్మ.
“ఏమిటి శాంతమ్మా!ఈ మహమ్మారి తగ్గేవరకు పనికి రావద్దన్నాను కదా! ఇప్పుడు ఎందుకు వచ్చావు?”
“అది కాదమ్మా! మీతో చిన్న పనివుండి వచ్చాను.”అంది నసుగుతూ.
“నాతో పనా”అన్నాను ఆశ్చర్యంగా
“మరమ్మా.....” చెప్పడానికి బిడియపడుతూ చేతులు నలుపుకుంటూ నిల్చుంది.దాని వాలకం చూస్తే ఏదో అడగాలని వచ్చి అడగడానికి మొహమాటపడుతున్న
ట్లు అనిపించింది.
“ఏమి పనో చెప్పు .నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది.తొందరగా చెప్పు అవతల నాకు వంటకు లేట్ అయిపోతుంది.పిల్లలు అయ్యగారు భోజనానికి వచ్చే
వేళయింది.”
“మీరేమనుకోనంటే ఓ మాటమ్మా కూసిన్ని బియ్యంయిప్పించడమ్మా మా ముసల్దానికి పిల్లలకి కాసిని గంజినీళ్ళన్నా కాసి పోస్తాను.నిన్నటేల నుంచి పస్తుండారు.
వేలాడిపోతున్న వారిని చూడలేక ఇటుపడి వచ్చాను.”అంది దీనంగా.
“అంతయిబ్బంది ఏమొచ్చింది మీ ఆయన పనికి పోతాడుగా!ప్రభుత్వం రేషన్ యిస్తుంది.ఇంకేమిటి?”
“ఏడమ్మా!వాడి కంపెనీ మూసేసిండు.తెరిచినప్పుడు కబురెడతామన్నారు.మా కీడ తెల్లకార్డు లేదు.ముసల్దానికిచ్చిన బియ్యం తోడితే ఈడ వరకు లాగాను.ఈ
మాయదారి రోగంతో నాలుగింటోల్లూ ఒకతూరే పని మానిపిండ్రు.పని కొస్తే ఏఅమ్మో ఇంతో అంతో మిగిలిన కూరో కూడో అట్టుకెళితే వేన్నీలకు చన్నీళ్ళ లా గడిచి
పోయేది.ఇప్పుడు అదీ లేదు.రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మాయి.అందరూ ఇంట్లో కూసొని తినాలంటే ఏడవుద్దమ్మా! అభిమానం చంపుకుని మీ
కాడ కొచ్చాను.మీకు పుణ్యముంటాది. కాసిని బియ్యం యిప్పించండి .రెండ్రోజులు గడిచిపోద్ది.దయవుచండి.”
ఒక్కక్షణం ఏం మాట్లాడాలో తోచలేదు.వెంటనే కర్తవ్యం గుర్తువచ్చి లోపలికి వెళ్ళి కాసిని బియ్యము సంచిలో పోసి వూరగాయపచ్చడి కాస్త గిన్నెలో పెట్టి రెండు
రోజులు వుంటాయిలే అని సాంబారు పెట్టాను అవి కాసిని డబ్బాలో పోసి తెచ్చియిచ్చాను.వాటిని చూసి మొహంలో జీవం వచ్చింది.
“చచ్చి మీకడుపున పుడతానమ్మగోరు”అని కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
“చాల్లే .ముందు వెళ్ళి వాళ్ళకు వండిపెట్టు.”అని పంపించాను కాని నా మనసు కలచివేసినట్లు అయింది.ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్నిరకాలుగా
ఇబ్బంది పడుతున్నారో!క్రితం నెలలో అది పనిచేసే నాలుగిళ్ళ వాళ్ళము మాన్పించాము.పిల్లలు వినోద్ ఇంట్లోనే వుండటంతో రోజంతా పనితోనే సరిపోతోంది
మరో ఆలోచనే మనసులోకి రాలేదు. వాళ్ళు మేమిచ్చే జీతాలతోనే బతుకుతారన్న సత్యం మరచిపోయాను.ఇవ్వాళ వచ్చి శాంతమ్మ తన పరిస్థితి చెప్పేదాక
తెలియలేదు.వినోద్ తో మాట్లాడి వాళ్ళకేదన్నా దారి చూపించాలి.ఆఫీసువర్క్ లో పలకరిస్తే విసుక్కుంటాడు.
ఆ రాత్రి భోజనాలయ్యాక టి.వి చూస్తూ కూర్చొన్న వినోద్ తో సంభాషణ కుపక్రమించాను.
“మీతో మాట్లాడాలి.”
“ఏంటో చెప్పు”టి.వి చానల్స్ మారుస్తూ ఏ మాత్రం ఆసక్తి కనబరచకుండా అన్నాడు.
“ఉదయం శాంతమ్మ వచ్చిందండి”అన్నా ఉపోద్ఘాతంగా.
“వస్తే.నువ్వు వద్దన్నావుగా !మరి ఎందుకు వచ్చింది .”
“అదే చెబుతున్నా.తన గురించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి.సీరియస్ గా ఆలోచించాలి.”
“ఆమెను గురించి మనమేం నిర్ణయాలు తీసుకుంటాము?నీకు ఖాళీగా కూర్చుంటే ఏం తోచడంలేదా?నా బుర్ర తింటావు.ఇప్పటి దాకా వర్క్ చేసి కాస్త రిలాక్స్
గా కూర్చుంటే ఏం కబుర్లు లేనట్లు పనమ్మాయి గురించి చర్చలవసరమా?”
“అది కాదండి .పనమ్మాయే కాని మనింట్లో ఎప్పట్నించో నమ్మకంగా చేస్తుంది.నాకు బాగోకపోయినా బంధువులు వచ్చినా ఎంతపనున్నా విసుక్కోకుండా
చేసేది.నా అంతట నేను యిస్తేతప్ప ఎప్పుడూ అదనంగా అడిగేది కాదు.అభిమానంగా వుంటుంది.అలాంటిది ఉదయం వచ్చి బియ్యం అడిగి పట్టుకెళ్ళింది
ఎంత కష్టంలో వుందో?ఆ కాసిని బియ్యంతో వాళ్ళ కష్టం తీరదు.ఏమన్నా చెయ్యాలి.”
“ఏమన్నా అంటే ?ఏం చెయ్యాలని నీ వుద్దేశం?”
“రెండు మూడు నెలలకు సరిపోను నిత్యావసర సరుకులు యిస్తే బాగుంటుందని నా ఆలోచన.శాంతమ్మకే కాక మన పిల్లల్ని తీసుకు వెళ్ళే ఆటో శ్రీనుకు
మనకు అప్పుడప్పుడు పనికి వచ్చే పంబ్లర్ చంటికి కూడ యిస్తే బాగుంటుంది.”
“పెద్ద దేశోద్దారకురాలు బయలుదేరింది.పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో.వాళ్ళను ఆదుకోడానికి ప్రభుత్వాలున్నాయి.అందరికీ సహాయం చేయడానికినువ్వేమి
టాటా బిర్లావి కాదు.జీతాలతో బతికే వాళ్ళం.నేల విడిచి సాము చెయ్యకు.ఈ ప్రసంగం ఇక్కడితో ఆపెయ్యి.”అన్నాడు సంభాషణ తుంచుతూ.
“ ప్లీజ్ నామాట కాదనకండి.ఇద్దరు ముగ్గురికి సహాయం చేయడానికి టాటా బిర్లాలు కానక్కరలేదు.నేనేదో దేశాన్నో సమాజాన్నో వుద్దరిస్తాననడంలేదు. రోజూ
వార్తలు చూస్తున్నారు.పిల్లా జెల్లాతో ఎంతమంది అవస్తలు పడుతున్నారో!అందరికీ మనం చేయలేము.కనీసం మన మీదఆధారపడిన వాళ్ళనన్నాఆదుకోవాలి
కదా!ఇప్పటి వరకు మనపనులు చేసిపెట్టిన వారికి ఆ మాత్రం చేయడం మానవతా దృక్పథమే కాని సమాజోద్దరణన్న పెద్ద మాటలు దీనికి పెట్టనవసరంలేదు.
మీరు సరుకులు తెచ్చే కిరాణా కొట్టు వాడికి ఫోన్ చేసి వాళ్ళ ముగ్గురికి రెండునెలలకు సరిపడే సరుకులు తెప్పించండి.రేపు కబురు చేసి వాళ్ళకు యిద్దాము.
సంతోషిస్తారు.”
“సరే.నువ్వు అంతగట్టిగా చెబుతుంటే నేను కాదనేదేముంది.రేపు వెంకటయ్యకు సరుకులు పంపమని చెబుతాను.ఇంకా నీ కరుణాహృదయం ఎవరి మీద
ప్రసరించిందో రేపు చెప్పు అందరికీ ఒకసారే యిద్దాము.మళ్ళామళ్ళా అంటే నా వల్ల కాదు.”
“మీకంత ఎగతాళి అక్కర లేదు.మన శక్తి మేరకు అంతవరకు యిస్తే చాలు.అందరూ ఇలా ఆలోచించి ఎవరి పరిధి లో వాళ్ళ మీద ఆధారపడిన వారికి
సహాయం చేస్తే కొంతవరకు ఆకలి సమస్యలు తగ్గుతాయేమో నండి.
“నిజమేనేమో”అన్నాడు సాలోచనగా వినోద్.

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి