ఈగ-జోరీగ - యు.విజయశేఖర రెడ్డి

fly-gadfly

చంద్రగిరి నగరంలో భూషణం బియ్యం, పప్పు దినుసులు అమ్మే పెద్ద కొట్టుతో పాటు వడ్డీ వ్యాపారం కూడా నడుపుతున్నాడు. చుట్టు ప్రక్కల గ్రామాలలోని చిన్న,చిన్న అంగళ్ళు నడిపేవారు భూషణం వద్ద కావలిసినవి కొని కొద్ది పాటి లాభంతో అమ్ముతుంటారు.

పార్వతీపురం గ్రామంలో అంగడిని నడిపే రామయ్య కూడా భూషణం వద్ద బియ్యం మొదలైన వస్తువులు కొని వ్యాపారం చేస్తున్నాడు. చుట్టూ ప్రక్కల పది గ్రామాల వారు నగరం పోకుండా రామయ్య వద్దే సరుకులు కొంటారు.

ఒక రోజు రామయ్య కావలసిన సరుకులు కొనుగోలు చేస్తుండగా, ఒక ఈగ భూషణం పదేళ్ల కొడుకు చేతి మీద వాలి ఎంతకూ ఎగిరి పోక పోయేసరికి రామయ్య ఒక దెబ్బ వేయాగానే అది చచ్చింది.

ఆ పిల్లవాడు భోరున ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పాడు.

“ఎంత పని చేశావు రామయ్యా! అది మేము పెంచుకుంటున్న ఈగ.. అది మా వాడి నేస్తం” అన్నాడు భూషణం కోపంగా.

“అయ్యగారూ! ఈగలెక్కడైనా పెంపుడివి ఉంటాయా?” అన్నాడు రామయ్యా.

“అందరూ రక రకాలుగా ఏవేవో పెంచుకుంటారు మేము ఈగను పెంచుకుంటున్నాము తప్పా?” అన్నాడు రామయ్యా.

“ఈగ దేముంది అయ్యగారూ కాస్త బెల్లం ముక్క పెడితే కావలిసిన ఈగలు వస్తాయి”

“ఎన్ని ఈగలైన రానీ పెంపుడు ఈగ, పెంపుడు ఈగే పైగా అది కడుపుతో ఉంది.. బోలెడు ఈగలు పుట్టేవి”

రామయ్యా చేసేది లేక “నన్నేమి చేయమంటారు” అన్నాడు.

“నాకు అదే ఈగ కావాలి మా వాడు చూడు ఏడుపు ఆపడం లేదు... న్యాయం కోసం గ్రామ పెద్ద దగ్గరకు వెళదాము పద” అన్నాడు భూషణం.

భూషణం పట్టుబట్టడానికి అసలు కారణం రామయ్య అంగడి బాగా లాభదాయకంగా సాగడం,ఎలాగూ మాట వినే ఈగను తేలేడని ఆ నెపంతో అంగడిని సొంతం చేసుకోవాలని అతని దురుద్దేశం.

ఇద్దరూ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లారు. భూషణం విషయం చెప్పాడు.

“దీనికి పరిష్కారం మీరే చెప్పాలి అయ్యగారు!” అన్నాడు రామయ్య ఎంతో వినయంగా.

“భూషణం చెప్పినట్లు అదే ఈగ తేవాలంటే కష్టం... దానికి బదులుగా మాట వినే ఈగ లేదా అలాంటిది ఏదైనా తీసుకురా.... లేని పక్షంలో అతను ఎలా చెబితే అలా చెయ్యి...నీకు ఒక వారం రోజులు గడువు ఇస్తున్నాను ఇదే నా తీర్పు” అన్నాడు గ్రామ పెద్ద.

“అలాగే అయ్యగారు!” అని ఎంతో విచారంగా తన గ్రామానికి బయలుదేరాడు రామయ్య.

భూషణం మాత్రం రామయ్య అంగడి, తన సొంతం కాబోతోందని ఇంటికి ఎంతో సంతోషంగా చేరుకున్నాడు.

ఇంటికి వచ్చిన రామయ్య ఎంతో విచారంగా ఉండడం చూసిన భార్య సీత, పన్నెండేండ్ల కొడుకు శివయ్య ఏమయ్యిందని అడిగారు. రామయ్య జరిగింది చెప్పాడు.

“వారం రోజులు గడువు ఉంది కద నాన్న!... కంగారు పడకు” అన్నాడు శివయ్య.

శివయ్య ప్రతి రోజు సాయంత్రం ఇంటికి దగ్గర్లో ఉన్న తోటకు వెళతాడు. అక్కడ అతనికి ఒక చిలుక,పావురం మంచి నేస్తాలు ఉన్నాయి. అలా వెళ్ళి ఒక పెద్ద బండ మీద కూర్చుని తండ్రి గురించి ఆలోచించసాగాడు.

శివయ్య భుజం మీద వాలి “ఏం నేస్తం ఏదో ఆలోచిస్తున్నావు?” అంది చిలుక. కాసేపటికి పావురం కూడా వచ్చింది.

తన తండ్రికి జరిగిందంతా చెప్పాడు రెండు నేస్తాలకు.

“నీవు ఏమీ కంగారు పడకు ఇప్పుడే వస్తానుండు” అని ఎగిరి పోయి ఒక చెట్టు మీద వాలింది.ఆ కొమ్మకు ఒక కన్నం ఉంది చిలుక పిలువగానే అందులో నుండి ఒక జోరీగ బయటకు వచ్చింది.

“ఏంటి ఇలా వచ్చావు అంది జోరీగ”

“నాకు నీ సాయం కావాలి” అని జోరీగ చెవిలో ఏదో చెప్పింది.

“ఓ అలాగే” అంది జోరీగ.

“నేస్తం రేపు నీవు వచ్చేప్పుడు కొద్దిగా వెడల్పు ఉన్న చిన్న కుండను దాని మూతిని కట్టడానికి ఒక గుడ్డను తీసుకురా” అని చెప్పింది చిలుక.

శివయ్య మరుసటి రోజు తోటకు చిన్న కుండతో పాటు ఒక గుడ్డను తీసుకు వెళ్ళాడు. చిలుక చెప్పగానే ఒక పాతిక జోరీగలు ఆ కుండలోకి చేరాయి తరువాత గుడ్డతో కుండ మూతిని కట్టాడు శివయ్య. ఏంచేయాలో శివయ్య చెవిలో చిలుక చెప్పింది.

శివయ్య తండ్రిని తీసుకొని భూషణం కొట్టుకు వెళ్ళాడు.

“ఇదిగోండి అయ్యగారూ! మీ ఈగకు తీసిపోదు ఈ జోరీగా” అని ఒక జోరీగను భూషణం చేతి మీద పెట్టాడు.

“ఏది మా పిల్లాడి మీద వాలు” అన్నాడు భూషణం.

ఈగ వెళ్లి పిల్లాడి మీద వాలింది వాడు దానితో కాసేపు అడ్డుకున్నాడు.

“ఈ జోరీగ బాగానే ఉంది కానీ మా ఈగ బ్రతికుంటే పిల్లలు పెట్టేది మరి దీని సంగతెంటీ?” అన్నాడు భూషణం.

“అయ్యో... అయ్యగారూ! దీనికీ పది పిల్లలు పుట్టాయి పిలుస్తాను” అని బయట దాచిన కుండలో నుండి పది ఈగలను బయటకు వచ్చి తన చేతి మీద వాలమన్నాడు. అవి వచ్చి వాలాయి. వాటిని తీసుకొని ఇవిగోండీ దాని పిల్లలు అని వాటిని కూడా భూషణం చేతి మీద వాలమన్నాడు అవి వాలాయి.

వాటిని కూడా భూషణం, పిల్లవాడి మీద వాలమని చెప్పాడు ఆవి పోయి వాడి మీద వాలాయి.

“ఆ అవి మాట వింటున్నాయి... మీ ఈగకు చెల్లు జరిగింది...ఇక మేము వెళతాము అన్నాడు” శివయ్య.

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని చేసేదిలేక “చెల్లు తీరింది వెళ్ళి రండి!” అన్నాడు భూషణం.

కొడుకు తెలివికి రామయ్య ఎంతగానో మురిసిపోయాడు.

ఇలా ఉండగా ఆ పది జోరీగలు భూషణాన్ని,అతని భార్యను,పిల్లాణ్ణి క్షణం కూడా విడిచి పెట్టకుండా చెవుల వద్దకు చేరి ఒకటే శబ్ధం చేయసాగాయి,తిండి తినకుండా, రాత్రిపూట నిదురపోకుండా చేయసాగాయి. వారం రోజుల్లో వందల కొద్దీ జోరీగలు పుట్టుకొచ్చాయి. పచారీలు కొనేవారిని సైతం కొనకుండా వారి మొఖం చుట్టు తిరగసాగాయి దానితో కొనుగోలుదారులు పూర్తిగా కరువయ్యారు.

భూషణం,రామయ్యకు కబురు పెట్టాడు. అవి నా మాట ఎలా వింటాయి అయ్యగారు... అవి నా పెంపుడు ఈగలు కావు అన్నాడు.

తిండి,నిదుర కరువైతే ప్రాణానికే ముప్పని ఇల్లు అమ్మకానికి పెట్టాడు. జోరీగలతో నిండిన ఆ ఇంటిని ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. సామనుతో భూషణం కుటుంబంతో సహా ఆ ఇల్లుతో పాటు ఆ ఊరును కూడా వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు.***

యు.విజయశేఖర రెడ్డి,99597 36475

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి