దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా - శ్రీనివాస్ మంత్రిప్రగడ

the son of an aggressive aristocrat

సాయంత్రమయ్యింది...కోవిడ్ మూలంగా కొంచం తక్కువగా హడావిడి పడుతున్న నగరం ఇంకొంచం సద్దుమణుగుతోంది...

నిర్బంధం నుంచి స్వేచ్ఛ దొరికింది కదా అని ఊరికే తిరిగేద్దామా లేక ఇంట్లో కూర్చుని ఎదో పని చేస్తూ కలం గడుపుదామా అనే ఆలోచనలు తెగక కొట్టు మిట్టాడుతున్న వాళ్లందరికీ ఇంట్లో ఉండడం అనే జవాబు దొరికి కొంచం కుదుట పడ్డారు...

ఆసక్తి ఉన్నవాళ్లు వంటగదిలో ప్రయోగాలు ప్రారంభిస్తున్నారు..

ప్రభుత్వ ఖజానాకు ఎక్సయిజ్ ద్వారా విరాళాలిచ్చే దాతలు..బార్ లో కూర్చుని తరవాత భార్యల చేత లేక తల్లుల చేత తిట్లు తిందామా లేక ఇంట్లోనే కూర్చుని తిట్లు తింటూ తాగుదామా అనే ఆలోచన తెగక అవస్థ పడుతున్నారు

ఈ రెండు కోవలకి చెందని వీర్రాజు ఇంట్లో కుదురుగా కూర్చుని పాటలు వింటున్నాడు

మధ్యాహ్నమే రాత్రికుడా సరిపడా వండేసుకోవడంతో తిండి సమస్య వేధించటంలేదు

ఆరోజే వాళ్ళ పినతండ్రి మోహన్ గారు పంపిన లలిత గీతాలు పెట్టాడు...బాల సరస్వతి గారి “నల్లని వాడా”...రాజేశ్వర రావు గారి “పాట పాడుమా” ..ఆలా వింటూ వింటూ విషాద గీతాలలోకి వెళ్ళాడు ...శ్రీరంగం గోపాలరాట్నం గారి “కనుపించు నా గతము” వింటూ కళ్ళు తుడుచుకున్నాడు...ఇంతటి అద్భుతమైన పాటలు వదిలి మనం గజళ్ళు అంటూ పాకులాడతాం అనుకున్నాడు

మెల్లిగా తనకెంతో ఇష్టమైన మదన్ భయ్యా పాటలు పెట్టాడు...”ఫిర్ ఆప్ కె నసీబ్ మీ ఏ రాత్ హో న హో” ..అబ్బా అద్భుతం అనుకున్నాడు..వీళ్ళందరూ గంధర్వులే... వీళ్ళెంతగా మన మనసులమీద ప్రభావం చుపిస్తారంటే మనకేమి వియోగ బాధలేమి లేకపోయినా దుఃఖం వచ్చేస్తుంది అనుకున్నాడు..ఎప్పుడు దిగులుగా ఉండే ముళ్ళపూడి వారి దిలీప్ త్రీ గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు

ఈ పరస్పర విరుద్ధ భావాలతో సతమతమౌతుండగా ఫోన్లో మెహిదీ హాసన్ గారి “రంజిష్ హి సహి”..ఫరీదా ఖానుం గారి “ఆజ్ జానే కి జిద్ నా కరో” వచ్చాయి ...ఇవికూడా కృష్ణుడి మీద మధుర భక్తి థీమ్ కు సరిపోతాయి అనుకున్నాడు

పాకిస్తాన్ కళాకారుల్ని మనం ఇష్ట పడొచ్చా?...మీడియా నుంచి ఇంకా వీర దేశ భక్తుల నుంచి వచ్చే భావాల్ని నమ్మితే మనకి పాకిస్తాన్ అంతా ఒక పెద్ద బందిపోటుల గుహలా ఉంటుందని.. అందరు నల్లగా..పెద్ద పెద్ద బొజ్జలతో మీసాలతో జిడ్డు ఓడుతూ ఉంటారని అనిపిస్తుంది ...ఆ భూమి నుంచి ఇలాంటి మధురమైన భావాలూ ఎలా వస్తున్నాయో?...ఆలోచనలో పడ్డాడు వీర్రాజు

అసలు వాళ్ళు కూడా మన ప్రజలే కదా...మతం పేరుతొ మంట పెట్టిన వాళ్ళ మీద కోపం వచ్చింది

ఫైజాన్ ముస్తఫా గారు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు...స్వాతంత్య్రానికి ముందు ఎవ్వరికి చివరకు జిన్నగారిక్కూడా మతం రాజకీయాలు కలపడం ఇష్టం లేదని...

మరి ఈ వేరే దేశం అనే ఆలోచన ఎలా ఎవరికీ వచ్చిందో అనుకున్నాడు

తలా విదిల్చాడు...ప్రస్తుత సాంప్రదాయ వాదుల్లా జరిగిన విషయాలని తవ్వి తీసి రంగులేసే ఆసక్తి గాని సమయం గాని లేవు అతని దగ్గర...చారిత్రక సంఘటలని ఇప్పటి కళ్ళద్దాలతో చుస్తే వేరే రకంగా కనిపిస్తాయి..వాటిని అలానే వదిలి ఇప్పుడీ ఈ ప్రపంచాన్ని అందరకి ఉపయోగ పడేలా చెయ్యడం ఎలా అనేదే అతనికి నచ్చిన పని...”హీల్ ది వరల్డ్...మాక్ ఇట్ ఏ బెటర్ ప్లేస్” అనే మైఖేల్ జాక్సన్ పాట అతనికి చాల ఇష్టం

ఈ విచారం నుంచి బయటపడానికి లేచి లైట్ వేసాడు...కొంచం తాజాగా అనిపించింది ...మళ్ళీ మాములు ప్రపంచం లోకి వచ్చినట్టు అనిపించింది...

తిండి తందామనుకున్న వీర్రాజుకి ఎదో అనుమానం వచ్చింది...లోపల్నించి బరువు తూచే బల్ల లాంటి త్రాసు తీసి బరువు చూసుకున్నాడు ...ఈ రెండు నెలల్లో ఆరు కేజీలు పెరిగాడు...గుండె గుభేలు మంది...

ఈ లెక్కన కరోనా సమస్య తీరే టప్పడికి ఏమౌతుందో...”నావికా ఎచటికోయి నీ పయనం అనుకున్నాడు”...ఘంటసాల వారి సిన్సియర్ గొంతు గుర్తొచ్చి ముచ్చటేసింది

అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చి రామరాజుకి ఫోన్ చేసాడు "ఒరేయ్ ఈ మధ్య బరువు చూసుకున్నావా?" అడిగాడు

"ఇప్పుడా బరువు ముచ్చటెందుకు గుర్తుకొచ్చింది? భోజనాల టైము కూడానూ" అన్నాడు రామరాజు నవ్వుతూ

"నేనో ఆరు కేజీలు పెరిగాను...తిండి తగ్గించడం మన వల్ల అయ్యే పని కాదు...అందుకని రేపట్నుంచి పొద్దున్నే వాకింగ్ చేద్దామనుకుంటున్నాను....నీ నుంచి ఏమైనా ప్రేరణ దొరుకుందేమో అని" అన్నాడు వీర్రాజు తాను కూడా నవ్వుతూ

"సరే, పొద్దున్న ఏడు నుంచి ఎనిమిది వరకు చేద్దాం...ఓ పని చేస్తాను...శాంతారాం కూడా వస్తాడేమో అడుగుతాను..బావుంటుంది" అన్నాడు రామరాజు

ఫోన్ పెట్టేసి భోజనం చేసి పడుకున్నాడు వీర్రాజు తరవాత రోజు ప్రారంభించబోయే వాకింగ్ గురించి ఉత్సాహ పడుతూ...ఈ కరోనా జీవితంలో అంతకన్నా ఆసక్తి కరమైన విషయాలేమి లేవు అనుకున్నాడు

తరువాత రోజు పొద్దున్నే లేచి వెళ్ళేటప్పడికి రామరాజు లేచి మేడమీద కుర్చీ వేసుక్కూచుని పేపర్ చదువు కుంటూ నవ్వు కుంటున్నాడు

"ఈ మధ్య వార్తలు హాస్య కదలకేమి తీసి పోవటంలేదు...ఇవాళ్టి కథ ఏమిటి?" అడిగాడు వీర్రాజు ముసుగు కొంచం వదులు చేసుకుంటూ

"సినిమా వార్తల్లే...కూచో" అన్నాడు రామరాజు పక్క కుర్చీ చూపిస్తూ "శాంతారాం రాగానే బయల్దేరుదాం" అన్నాడు

"దాదాపుగా రాజకీయాలే అనుకో..మరీ అంత ఇది కాకపోయినా వట తరువాత పెద్ద జూదం గందరగోళం సినిమాయే" అనే ముళ్లపూడి వారి డైలాగు గుర్తు చేసుకున్నాడు వీర్రాజు

అదివిని రామరాజు కూడా పగల బడి నవ్వాడు "తర తరాలుగా నొప్పించక తానొవ్వక అనే పధ్ధతి పాటించడానికి వాళ్ళు ఒక త్రిశంకు స్వర్గంలో వేళ్ళాడుతూ ఉన్నారు" అన్నాడు

"అంటే?" అడిగాడు వీర్రాజు...ఈ ఉపమానాలు అతని తలా పైనుంచి పోతున్నాయి

"సినిమా కళా వ్యాపారమా అనే విషయం తేల్చ కుండా కొన్ని తరాలు గడిచి పోయాయి....అందువల్ల ఒక స్థిరమైన ఆలోచన పధ్ధతి లేకుండా పోయింది" అన్నాడు రామరాజు

"వర్మ గారికి కాస్త కనిపిస్తున్నట్టుంది...ఇది తప్పనిసరిగా వ్యాపారమే అంటున్నాడాయన" అన్నాడు వీర్రాజు

"ఆయనది విజ్ఞాన వాదం వల్ల కలిగిన నైతిక అహం" అన్నాడు రామరాజు

"ఏమిటో రా...ఈ మాటల కన్నా వర్మ గార్ని అర్ధం చేసుకోవడమే సులభమేమో" అన్నాడు వీర్రాజు

"సర్లే...అయన వ్యాపారం అని ఖరారు చేసాడు కదా...అయన మనికిప్పుడు అవసరమైన సరుకు కాదు...అందుచేత ఆవిషయం వదిలి ముందుకి వెళ్దాం...ఆయనలాగే మన పని మనం చేసుకుంటూ పోదాం" అన్నాడు రామరాజు

"ఇంతకీ ఇవాళ్టి హాస్యం ఏమిటి?" అడిగాడు వీర్రాజు.."అంటే నా ఉద్దేశ్యం జోక్ ఆఫ్ డి డే ఏమిటి అని" ...తన తెలుగు మీద ధైర్యం లేక ఇంగ్లిష్ లో చెప్పాడు

"ఒక గొప్ప కదా నాయకుడికి అతని భార్య అయిన ఒక గొప్ప నాయిక వల్ల పుట్టిన పిల్లవాడికి దొరుకుతున్నంత ప్రచారం కూడా తనకు వార్తల్లో రావటల్లేదని వాపోతోంది ఒక వర్ధమాన నటి" అన్నాడు రామరాజు

"ఆ గొప్ప నాయిక నాయకులకు సొంత పత్రికలున్నాయేమో" అన్నాడు వీర్రాజు

"లేవు...అందుకే ఆ వర్ధమాన నటి ఎందుకు ఆలా వాపోతోందో అర్ధం కావటం లేదు" అన్నాడు రామరాజు

"ఆ బుల్లివాడికి ప్రచారం ఇవ్వడం వల్ల ఆ పత్రికలకు లేదా చానళ్లకు ఏమైనా లాభం దొరుకుండా వాళ్ళ నుంచి" అడిగాడు వీర్రాజు

"అలాంటిదేమి ఉన్నట్టు లేదు..ఒక ఛానల్ వాళ్ళామధ్య చాల బాధ పడ్డారు...మేము ఆ చిన్నవాడికి వారమంతా ప్రచారం చేసాం...కానీ ఆ నాయిక మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించింది... మా ఛానల్ అంత ప్రచారం ఉన్నది కాదని...చాలా మంది చూడరని అందుకే ఇవ్వనని అంది" అన్నాడు రామరాజు

"అలాంటప్పుడు ఆ చిన్నవాడి కి అంత ప్రచారం ఎందుకు?" అడిగాడు వీర్రాజు

"దాని వల్ల పత్రికలు ఎక్కువ అమ్ముడౌతాయని, టీవీ చాన్నాళ్లకు రేటింగ్లు పెరుగుతాయని వాళ్ళ నమ్మకం ...అందుకనే" అన్నాడు రామరాజు

"అది ఆ పత్రికలు , ఛానెళ్ల సమస్య...దీన్లో ఆ నాయకి నాయకుల తప్పేంటి? ఈ వర్ధమాన నటి కొచ్చిన కష్టం ఏమిటి? ఆవిడకు కేటాయించని పేజీలు వాడికి పోతున్నాయనా " అడిగాడు వీర్రాజు

"పత్రికలూ ఛానళ్ళు కూడా వ్యాపారాలే...వాళ్ళకేది ఎక్కువ అమ్ముడౌతుందో అదే చూపిస్తారు...ఇక్కడ నాకు చాలా ప్రతిభ ఉంది అనడం వల్ల ఏమీ లాభం లేదు" అన్నాడు రామరాజు

"అంతే కదా...వాళ్ళు వ్యాపారం చేసేదే టైం ఒక వస్తువుగా చేసి...ప్రతిభ కోసమో లేక పొగడ్తల కోసమో వాళ్ళేమీ చెయ్యరు" అన్నాడు వీర్రాజు

"రాజకీయాల్లో కూడా అదే తంతుట...ఈ మధ్య దేశమంతా చిన్నబాబులే కదా..పెద్ద బాబులని సంతోష పెట్ట డానికి ఈ చిన్న బాబుల బూట్లు తుడిచినా ...అవకాశాలు మాత్రం బాగా చదివింపులిచిన వాళ్ళకి...గెలుపు గుర్రాలకే ట...ఈ బూట్ల గాళ్ళు అటు చదివింపులూ చెయ్యలేక...బూట్ల భ్రమలో ప్రజా మద్దతు సమకూర్చుకో లేక రెండిటికి చెడ్డ రేవడిలా అయ్యారు " అన్నాడు రామరాజు

"తెలుగు న్యూస్ చూడడం తగ్గించు...నీ మాటలు కొన్ని గోడ మీద గోళ్ళతో గీకుతూన్న భావన కలిగిస్తున్నాయి " అన్నాడు వీర్రాజు

నవ్వాడు రామరాజు."సారీ...తక్కువ మాటల్లో చెప్పాలని ప్రయత్నం...పుస్తకాలూ చదవడం తగ్గించాం...ఇళ్లల్లో మాటల్లో చాలా ఇతర భాషా పదాలు వాడేస్తున్నాం..ఇంకా మన తెలుగు సినిమాల వల్లనో లేక టీవీ ఛానెళ్ల వల్లనో మాత్రమే అభివృద్ధి చేసుకొవాలి" అన్నాడు

"ఇప్పుడు చాలా తెలుగు పుస్తకాలు వినిపించే ఏర్పాట్లు చేస్తున్నారు...మనం ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు వినొచ్చు" అన్నాడు వీర్రాజు

"చూద్దాం...వాటి నాణ్యత ఎలావుంటుందో చూసి గాని ఆవేశ పడదలుచుకో లేదు" అన్నాడు రామరాజు

అవునన్నట్టు తలాడించాడు వీర్రాజు

"ఈ బూట్ల వ్యవహారం ...దానివల్ల భంగ పడటం అన్ని చోట్ల ఉంటుందనుకుంటాను ...ఇంతకు పూర్వం నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసాను కదా...మా ఆఫీసులో ఒకడుండేవాడు...

నా జీవిత లక్ష్యం మీ సేవ చేసుకోవడమే అనే మొహం పెట్టి వల్ల ఆఫిసర్ కి అడ్డమైన చాకిరీ చేసేవాడు...అయన రవాణా..అయన భార్య చేత కూరలు వగైరాలు కొనిపించడం, పిల్లల్ని స్కూల్ కి ట్యూషన్ కి దింపడం లాంటివెన్నో చేసేవాడు...

వాడు చాలా శ్రద్ధ గా ఈ పనులన్నీ ప్లాన్ చేసుకుని చేసేవాడు" అన్నాడు వీర్రాజు

"అవును, అప్పట్లో వాడి శ్రద్ధ చూసి ను ముగ్ధుడవైపోవడం గుర్తుంది" అన్నాడు రామరాజు నవ్వుతూ

"ఇంకా వినూ...ఓసారి ప్రమోషన్లు వచ్చాయి...అందరం వీడికి ప్రమోషన్ తప్పనిసరిగా వస్తుంది అనుకున్నాం...కానీ వాడి పేరైనా ఆ లిస్ట్ లో లేదు...మేమందరం అవాక్కయ్యాం...వాడైతే షాక్ అయిపోయాడు...

ఏమిటా విషయం అని ఆరా తీస్తే తాను అడ్డమైన చాకిరీ చేస్తుంటే వాడుకున్న ఆఫీసర్ గారు వాడికి సంవత్సర సీ ఆర్ లో చాలా తక్కువ రేటింగు ఇచ్చారు...ఇది ఒకటో రెండో ఏళ్ళు కాదు...వరసగా ఆరేళ్ళు అధ్వాన్నపు రేటింగులు ఇచ్చారు..వాడి గుండె బద్దలైపోయింది" అన్నాడు వీర్రాజు

"అది అన్యాయం కదా..ఎలాగూ గవర్నమెంట్ ఆఫీసుల్లో పని కన్నా మంది ఎక్కువ కదా..ఆ పరిస్థితుల్లో కూడా వీడు ఎదో ఒక పనికొచ్చే పని చేసాడు కదా" అన్నాడు రామరాజు

"ఆఫీసర్ తనకు సుఖంగా ఉన్నంత వరకు వీడ్ని సిగ్గులేకుండా వాడేసు కున్నాడు..కొన్ని సార్లు వాడు ఆదివారం కూడా వాళ్ళింటికి వెళ్లి సాయం చేసేవాడు...

కానీ సి ఆర్ రాసేటప్పుడు ఐడియాలిస్టిక్ గా ఆలోచించాడు...వీడు పని చేయడానికి పనికిరాడు అందుకే నా బూట్లు నాకుతున్నాడు అనే భావన ఆఫీసర్ కి" అన్నాడు వీర్రాజు

"బూట్ల దగ్గర నుంచి అవకాశాలు సంపాదించడం చాలా కష్టం...ఆఫీసర్ కి వాడి స్థానం బూట్ల దగ్గిరే అని అనిపిస్తుంది...చులకనైపోతాడు....బూట్లు మనకెంత సేవ చేసిన వాట్లి చోటు వీధి గదిలోనే" అన్నాడు రామరాజు

"అదే జీవిత సత్యం....నేననేది ఏమిటంటే బూట్ల గాళ్ళు చేసే పని సరైనదని కాదు...ఈ ఆఫీసర్లు ముందే వాళ్ళని బూట్ల నుంచి దూరం చెయ్యాలి..

ఏ అవకాశాలైన నీ స్వశక్తి తోనే సంపాదించుకోవాలని చెప్పాలి...వీళ్ళెవరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు...ఎదో ఒక బలహీనమైన క్షణం లో మనో ధైర్యం పోగొట్టుకుంటారు...జ్యేష్ట గారన్నట్టు వాళ్ళక్కొంచం నమ్మకమివ్వాలి" అన్నాడు వీర్రాజు

"ఇదంతా ఆదర్శవాదం....నేను మేనేజర్ అయినా కొత్తలో రోజు ఆఫీస్ గుమ్మం నుంచి నా ఛాంబర్ వరకు వెళ్ళేటప్పుడు అందరు లేచి గుడ్ మార్నింగ్ చెప్పేవారు...ఒక రోజు ఒకడు ఎదో పనిలో ఉంది చూసుకో లేదు...నాకు మనసు చివుక్కు మంది

...అప్పుడర్థమైంది ఎలాటివాళ్ళకైనా కాలు జారవచ్చు అని...నాక్కొంచెం భయం వేసింది ఈ పతనం ఎక్కడికో అని... ఊరికే చాకిరి చేసే వాడిని నాయనా ఇది కాదు నీ పని అనడం చాలా కష్టం" అన్నాడు రామరాజు

"ఇలాంటి పరిస్థితులు సగటు మనుషులు మాత్రమే సృష్టించు కుంటారు...మనలాంటి జ్ఞాన పరిశ్రమల్లో కుదరవు" అన్నాడు వీర్రాజు

"నీ తలకాయ...మన జుట్టు రామ్మోహన్ గాడు ఇలాంటి ప్రయత్నమే చేసి భంగ పడ్డాడు తెలుసా" అన్నాడు రామరాజు

"అవునా...ఇదెప్పుడ్రా" అడిగాడు వీర్రాజు ఆశ్చర్యంగా

"ఇంతకు ముందో కంపెనీలో జుట్టు గాడు ఒక పెద్ద పోసిషన్ లో ఉండే వాడు కదా ...అప్పుడు వాడి తో బాటు ఒక తోకలాంటి వాడుండే వాడు కళ్యాణ్ అని గుర్తున్నాడా?" అనడిగాడు రామరాజు

"మజ్రు అనే వారు వాడే కదా?" అడిగాడు వీర్రాజు

"అవును వాడే...వాడ్ని ఎప్పుడు పొగుడుతూ...మంచి మంచి అవకాశాలు ఇస్తుండే వాడు జుట్టు గాడు" అన్నాడు రామరాజు

"అవును...వాడొక అద్భుతం అనుకునే వాళ్ళం...ఓసారి వాడితో బార్లొ ఒక బీర్ తాగే అవకాశం దొరికింది...అప్పుడు తెలిసింది వాడొక వాసనా గాడని...అయినా జుట్టు మీద గౌరవం తో మనకి తెలియని విద్యలేమైనా ఉన్నాయేమో అనుకున్నాను " అన్నాడు

వీర్రాజు "అయినా వాడ్ని మజ్రు అనేందుకనేవారు...మజ్ను కేమైనా వికృతా అది?" అడిగాడు

"కాదు...మజ్రు సుల్తాన్ పూరి అనే ఒక హిందీ కవి..ఆయనో అద్భుతమైన పాట రాసాడు...బార్ బార్ దేఖో అని ...వీడు ఆఫీసులో తక్కువ బార్లో ఎక్కువ కనిపిస్తాడు కదా...అందుకని ఆ పేరు" అన్నాడు రామరాజు...అంత దుర్భరమైన జోకు చెప్పడం అతనికీ రోత కలిగించింది

"అదే ట్యూన్ తో ఒక పాట తెలుగు లో భలే తమ్ముడు లో ఉంటుంది" అన్నాడు వీర్రాజు

"ఇంతకీ వాడెవడనుకున్నావ్?" అడిగాడు రామరాజు

"ఎవడో మాన్యుడే అయ్యుంటాడు" అన్నాడు వీర్రాజు

"మనకి మొదటి మేనేజర్ కుల శేఖర్ గారుండేవారు కదా...అయన తమ్ముడే వీడు" అన్నాడు రామరాజు

"ఓర్నీ" ఆశ్చర్య పోయాడు వీర్రాజు "అయితే" అనడిగాడు

"మన కులశేఖరుల వారు ఆ కుల శేఖర ఆళ్వార్ లాగ ఎందరి జీవితాలకో పునాది రాయి అయ్యాడు ..దారి చూపించాడు...

మన జుట్టు గాడు కూడా తనకేమైనా సమస్య వస్తే అయన అభయం ఉండడం మంచిది అనుకున్నాడు" అన్నాడు రామరాజు

"అయన వాడి కంటే చాలా సీనియర్ కదా...పైపెచ్చు నమస్కారాలకు పడే మనిషి కూడా కాదు..ఆయనకి నచ్చితే ఎవరికైనా సాయం చేసేస్తారు" అన్నాడు వీర్రాజు ‘

"అవునుకదా...అయినా ఆయనకు కొంచం కొంచం దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యొచ్చు...కానీ జుట్టు గాడి బుర్ర కొంచం వక్రం కదా..ఆయన్ని ఆకట్టుకోవడానికి అయన తమ్ముడ్ని పోషించడం ప్రారంభించాడు...

మరీ బూట్ల వరకు వెళ్ళాక పోయినా...తన స్థాయి నుంచి కొంచం దిగజారాడు" అన్నాడు రామరాజు

"ఆమధ్య జుట్టు గాడేదో సమస్య లో పడి నట్టున్నాడు కదా...అప్పుడు ఈ కులశేఖర పడి సాయం చేసిందా?" అడిగాడు వీర్రాజు

"లేదు...వీడు సాయం అడిగేటప్పడికి అయన దగ్గర ఒక ఉద్యోగం ఉంది కూడా...నాలుగైదు రోజులు ఆ ఉద్యోగం వచ్చేసినట్టు...దాని వల్ల వాడు మనకు సాయం చేస్తున్నట్టు భ్రమించి మాట్లాడే వాడు" అన్నాడు రామరాజు

"అవునురా...నాక్కూడా ఫోన్ చేసాడు...ఈ సారి నీకు కాకుండా శంకర్ కి అవకాశం ఇస్తాను..లాంటి మాటలు చెప్పాడు...వడ్డించే వాడు వాళ్ల వాడే కదా అని నేను కూడా చాలా ఫీల్ అయ్యాను" అన్నాడు వీర్రాజు

తీరా ఆయన్నడిగితే ...వాడి వీపుమీద వడ్డించాడు ...ఆ ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం నీకు లేదు ..నీ పేరు నేను ప్రతిపాదించ లేను అనేశాడు" అన్నాడు రామరాజు

"అయన నిజంగానే కులశేఖరుడు రా" మెచ్చు కోలుగా అన్నాడు వీర్రాజు

"అందుచేత ...మన దారిన మనం ఎదురుగుతూ పోవడమే...ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చోటుకి వెళ్ళడానికి అరగంట పట్టొచ్చు...కానీ ఆ చోటుకి పక్కనే ఉన్న ప్రాంతం వాళ్ళకి అయిదు నిముషాలే పట్టవచ్చు ... దానర్ధం దగ్గర గా ఉన్న వాళ్ళకి లాభం అని కాదు...చేరడం...చేరేక మనమేం చేస్తాం అనేది మన విజయానికి కారణమౌతుంది...మన భవిష్యత్తు దానిమీదే ఆధారపడి ఉంటుంది" అన్నాడు రామరాజు

"మరీ కొందరు అడ్డదారి గాళ్ళు లాభం పొందుతున్నారు కదా" అడిగేది వీర్రాజు

"తసమదీయుల్ని పోషించడానికి చాలా ఊక తయారు చేసారు...ఇది అన్ని రంగాల్లోనూ ఉంటుంది ...ఒక్కసారి నిజమైన గాలి వీస్తే ఎవ్వరు నిజంగా విలువున్నవారో తెలుస్తుంది...

ప్రపంచ వ్యాప్తం గా నాయకత్వ సమస్యలు ఎక్కువయ్యాయి....కానీ నేననుకోవడం అది ఒక తాత్కాలిక పరిస్థితి మాత్రమే...అందుచేత మనం నిరాశ పడకుండా ముందు కెళ్ళి పోవడమే" అన్నాడు రామరాజు

"వీర తాళ్ల కోసం ఎదురు చూడకుండా విలువల కోసం వెతకాలంటావు" అన్నాడు వీర్రాజు

"అవును...ఈ మధ్య సీఎం గా ఎన్నికైన ఒక చినబాబు వాళ్ల వంశం, తండ్రి కీర్తి ఇవేవి వాడుకోకుండా మూడువేల ఆరువందల కిలోమీటర్లు నడిచి...ప్రజల గురించి

తెలుసుకున్నాడు...దాని వల్ల ప్రజలకు కూడా అతని మీద గురి కుదిరింది...అలాగే అతను గెలవగలిగాడు...

ఒక చినబాబు మంత్రిగా ఉంది కూడా ప్రజా క్షేత్రంలో ఓడి పోయాడు ...మరో చిన బాబు పదేళ్లు పైన ప్రజా ప్రతినిధిగా ఉంది కూడా ఇంకా పెద్ద అక్షరాల నుంచి చిన్న అక్షరాలకి రాలేక పోయాడు" అన్నాడు రామరాజు

"ఈ చిన బాబులకు అవకాశాలు సులభంగా వస్తాయి...వాడుకో లేక పోయినా చాలా సమయం వ్యర్ధమైపోతోంది కదా" అన్నాడు వీర్రాజు

"అది తప్పదు...వాళ్లకు ఏ విలువ లేదని మనం కొట్టి పడెయ్యలేం...అవకాశం ఇవ్వాల్సిందే...

కానీ బంధు ప్రీతి వల్లనే అవకాశాలు వస్తాయని...అందుకోసం మనం కూడా ఏర్పాట్లు చేసుకోవాలని అనుకోవడం వల్ల మన స్వాభిమానం తగ్గి పోతుంది...అది చాలా ప్రమాదం...

అలంటి ఆలోచనలు ప్రజా బాహుళ్యంలో వస్తే..ఏంటో ముందుకి వెళ్లాల్సిన దేశం కట్టు బానిసల సామర్జ్యం అయిపోతుంది " అన్నాడు రామరాజు

"నిజమే ...ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు" అన్నాడు వీర్రాజు

"తాత్కాలికంగా తప్పులు జరగొచ్చు...కానీ కొన్ని అయినా సరైన పనులు జరగక పొతే మనం ప్రగతి సాధించలేము...గత ఇరవై ఏళ్ళ లో మనం సాధించిన ప్రగతి మనకేం చెబుతుందంటే ...మనలాంటి ఎందరో చేసిన విలువైన పనుల వల్లే అని" అన్నాడు రామరాజు కుర్చీలోంచి లేస్తూ

శాంతారాం వచ్చాడు...ముగ్గురు వాకింగ్ కి బయల్దేరారు

రేడియోలో "దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా" అనే పంచరత్నం బాలమురళి గారి గాత్రంలో శ్రావ్యంగా వినిపిస్తోంది

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి