అసిధారా వ్రతం - పద్మావతి దివాకర్ల

Asidhara vratham

చిట్టిబాబుకి మా చెడ్డ చిక్కొచ్చిపడింది బాస్‌తో. ఆ ఆఫీస్‌లో బాస్ జంబులింగమంటే అందరికీ హడలే! ఆఫీస్‌లో ఎవర్నీసరిగ్గా కూర్చోనియ్యడు, పడుక్కోనియ్యడు… సారీ నిలబడనియ్యడు. అతనికి ఎంత సేపూ ఒకటే నామ ఉచ్చారణ, 'పని...పని... పని...' అంటూ, తిరుమల కొండెక్కే భక్తుల గోవిందనామ స్మరణలాగ. గోవిందనామ స్మరణవల్ల మోక్షం దొరుకుతుందేమోగాని, ఈ జంబులింగం వద్ద ఎంతపని చేసినా ఏం లాభంలేదు. అంతే కాకుండా చీటికి మాటికీ వారం వర్జ్యం లేకుండా సమీక్షలు నిర్వహించి తనవద్ద పనిచేసేవారందరికీ చివాట్లు కూడా తినిపిస్తాడు.

అయితే ఆ అఫీస్‌లో ఒకే ఒక్కడున్నాడు, అతనే రాంబాబు! అతని మీద ఇంతవరకూ జంబులింగం నీలినీడ పడలేదు. అంతే కాదు ఆ అఫీస్‌లో జంబులింగం చేత ఎప్పుడు కూడా పల్లెతు మాట కూడా పడలేదు రాంబాబు. అలాగనీ అతనేం 'ఒకే ఒక్కడు ' సినిమాలో అర్జున్‌లాంటి హీరో కాదు, అలాగని రఘువరన్‌లాంటి విలన్ కూడా కాదు. అతనొక్కడే ఆ అఫీస్‌లో పనిచేసినా, మానినా జంబులింగం ఎన్నడూ పట్టించుకోడు. 'ఎమిటబ్బా ఈ చిదంబర రహస్యం?!' అని కొంతమంది తలలు బద్దలు కొట్టుకున్నాక తెలిసిన విషయమేమిటంటే ఆ సదరు రాంబాబు జంబులింగం మేనల్లుడు మాత్రమే కాదు, కాబోయే అల్లుడని కూడా. చిట్టిబాబుకి కూడా ఈ విషయం ఇప్పుడిప్పుడే తెలిసింది.

అయితే ఈ మధ్యన పాపం చిట్టిబాబుకి బాస్ జంబులింగం నుండి వేధింపులు మరికాస్తా ఎక్కువయ్యాయి. చీటికి మాటికి పనున్నా, లేకున్నా తన చాంబర్‌కి పిలిపించుకొని అయినదానికి, కానిదానికి తల వాచేటట్లు చివాట్లు పెట్టసాగాడు జంబులింగం. ప్రతీరోజూలాగే ఈ రోజు కూడా (పాపం, పొద్దున్న టిఫిన్ చేయలేదని కాబోలు) బాస్ చేత కడుపు నిండా చీవాట్లు తిని తన సీట్‌వద్దకు వచ్చి రెండు చేతులతోనూ జుట్టు పీక్కో బోయాడు చిట్టిబాబు. అప్పటికే రోజూ జుట్టు పీక్కొని పీక్కొని ఇక అర ఎకరం మాత్రమే మిగిలిందన్న సంగతి గుర్తుకువచ్చి, హఠాత్తుగా ఇంకా తనకి పెళ్ళికూడా కాలేదన్న సంగతి కూడా గుర్తుకువచ్చి వెంటనే చేయబోయే పని ఆపి చేతులు కిందకి దించేసాడు.

చిట్టిబాబు అవస్థ గమనించిన తోటి ఉద్యోగి సూరిబాబు, "ఎంటోయ్! పాపం! పొద్దున్నే బాస్ బాగా తలంటినట్లున్నాడు." అంటూ పరామర్శించాడు.

సూరిబాబు ఇలా పలకరించేసరికి కరిగిపోయాడు చిట్టిబాబు. "ఈ బాస్ దగ్గర మరి పని చేయలేనురా! రోజూ పనంతా సరిగ్గా చేసినా, ఎందుకు తిడుతున్నాడో తెలియదు. ఈ మధ్యన నా మీదే ఎందుకో ఎక్కువ మండిపడుతున్నాడురా! ఏం చెయ్యాలో తోచటంలేదు. బతికుంటే బస్‌స్టాండ్‌లో బజ్జీలు అమ్ముకొని బతకవచ్చు, ఈ ఆఫీస్‌లో పనిచేసేకంటే. పోనీ, ఈ ఆఫీస్‌లో ఈ బాస్ దగ్గర పనిచేసేకన్నా ఏ అండమాన్ దీవులకో లేక ఏ శంకరిగిరిమాన్యాలకో బదిలీ మీద వెళిపోతే బాగుండునురా!" భోరుమన్నాడు చిట్టిబాబు. పాపం ఏడుపొక్కటే తక్కువ.

"ఓహ్! అయితే నీకింకా తెలియదా ఈ విషయం! ప్రమోషన్లో సీనియారిటీలో నువ్వు మన బాస్ కాబోయే అల్లుడికి అడ్డు వస్తున్నావని నీ మీద గుర్రుగా ఉన్నాడతను. నువ్వెంత బాగా పని చేసినా అందులో తప్పులెతికి నీకు మెమోలిచ్చి తన అల్లుడి దారి నుండి నిన్ను తప్పిద్దామని ప్లాన్. నా కూ ఈ విషయం నిన్నే మన స్టెనో స్టీపెన్‌నుండి తెలిసింది." అన్నాడు.

"అయితే మరి నా గతి ఏమిటిరా? ఈ ప్రమోషన్ పద్మవ్యూహంలో బలైపోయి ఉద్యోగానికి నీళ్ళొదులుకోవలసిందేనా? నువ్వే నాకేదో ఒక దారి చూపించు." అని బతిమాలాడు చిట్టిబాబు దీనంగా.

అతని దీనస్థితికి కరిగిపోయి ఓ బ్రహ్మాండమైన ఉపాయం చెవిలో చెప్పాడు సూరిబాబు.

"చాలా థాంక్స్‌రా! మంచి ఉపాయం చెప్పావు, నీ మేలు మర్చిపోనురా!" అన్నాడు చిట్టిబాబు ఆనందంగా.

"ఆఁ ...నా మేలు త్వరగా మర్చిపో, కాకపోతే నాకు మంచి పార్టీ ఇచ్చిమాత్రం." అన్నాడు సూరిబాబు.

"అలాగేలేరా! అంతేకాదు, ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం ఇంతకు మించి పార్టీ ఇస్తానులే." భరోసా ఇచ్చేసాడు చిట్టిబాబు.

సూరిబాబు ఇచ్చిన సలహా ప్రకారం, అతని సహకారం తీసుకొని హెడ్ఆఫీస్‌వాళ్ళనీ, తన యూనియన్‌వాళ్లనీ పట్టుకొని ఓ పదిరోజుల్లో పక్కజిల్లాకి బదిలీ అయేట్లు ఆర్డర్స్ తెచ్చుకున్నాడు చిట్టిబాబు.

అక్కడ్నుంచి రిలీవ్అయ్యి కొత్త ఆఫీస్‌లో జాయినయ్యి ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు చిట్టిబాబు. ఇక్కడ కొత్త బాస్ రామారావు చాలా మంచివాడే కాక మర్యాదస్తుడు కూడా. అందులోనూ బాగా పనిచేసేవారంటే అమిత గౌరవం అతనికి. ఎలాగూ చిట్టిబాబు ఆఫీస్‌పనిలో ఎప్పుడూ లోపం ఉండకపోవడంతో కొద్దిరోజులలోనే బాస్‌కి అత్యంత ప్రీతిపాత్రుడైనాడు కూడా. ఇక్కడికొచ్చిన రెండేళ్ళలో చాలా విశేషాలు జరిగాయి. అందులో చిట్టిబాబు పెళ్ళికూడా ఒకటి. రావలసిన ప్రమోషన్ కూడా వచ్చింది. సుఖంగా కాలం గడిచి ఓ రెండేళ్ళు పూర్తైనాక బాస్ రామారావుకి బదిలీ అయింది. రామారావుకి బదిలీ అయి వెళ్ళిపోతున్నప్పుడు అతనికి అందరూ కన్నీటితో వీడ్కోలు పలికారు, ఎందుకంటే అంత మంచి బాస్‌ని ఇంతకు మునుపు ఎరుగరు వాళ్ళు. చిట్టిబాబైతే ఇంకా ఎక్కువ బాధపడ్డాడు.

రాబోయే కొత్తబాస్‌కోసం ఎదురుచూస్తున్నారందరూ. చూస్తూండగానే ఆ శుభ(?)ఘడియ వచ్చేసింది. కొత్తబాస్ జాయినవ్వగానే పరిచయ కార్యక్రమం మొదలైంది. తన సీట్‌వద్దకి సూపర్నెంట్‌తో వచ్చిన కొత్తబాస్‌ని చూడగానే గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి చిట్టిబాబుకి. కళ్ళుతిరిగి పడబోయి నిలదొక్కుకున్నాడు. కొత్తగా వచ్చిన బాస్ ఇంకెవరో కాదు. తను ఎవరినుండి తప్పించుకొని ఈ ఊరు వచ్చి బతికిపోయానని ఇన్నాళ్ళు సంబరపడ్డాడో ఆ పాత బాసే అంటే, జంబులింగమే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి కూడా దాపురించాడు తన ప్రాణానికి. ఏడ్వలేక నవ్వుతూ నమస్కారం పెట్టి జంబులింగానికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అయితే తనని చూసి జంబులింగం వంకర నవ్వు నవ్వడం గమనించక పోలేదు చిట్టిబాబు. ఇక తనని హరిహరాదులు కూడా కాపడలేరని బెంగపెట్టుకున్నాడు చిట్టిబాబు. చిట్టిబాబు అనుకున్నట్లుగానే వెంటనే జంబులింగం ద్వారా చికాకులు చుట్టుముట్టాయి.

ఆపద వచ్చినప్పుడు భక్తుడికి భగవంతుడు గుర్తుకువచ్చినట్లు, చిట్టిబాబుకి వెంటనే సూరిబాబు గుర్తుకు వచ్చాడు. వెంటనే సూరిబాబుకి ఫోన్‌చేసి తన గోడు వెళ్ళబోసుకున్నాడు.

"ఏం చేస్తాం చిట్టిబాబూ, ఇలాంటప్పుడే కాస్త ధైర్యంగా ఉండాలి. నువ్వు అక్కడికివెళ్ళి రెండేళ్ళే అయింది. అక్కడ్నుంచి మళ్ళీ బదిలీపై రావడం కష్టం. దురదృష్టం నీవెన్నంటే వస్తోంది. కొంచెం ఆలోచించి చెపుతానులే!" అన్నాడు సూరిబాబు.

"అలాకాదు, సూరిబాబు!... అసలే జంబులింగం శాడిస్టు . నా మీద కోపం ఇంకా తీరనట్లుంది, ఇక్కడకూడా రాచిరంపాన పెడుతున్నాడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి నువ్వే నన్నికణ్ణుంచి బయటపడెయ్యాలి. నీ మేలు జన్మలో మరిచిపోను సుమా!" అన్నాడు దినాతి దీనంగా చిట్టిబాబు.

సూరిబాబు కొంచెం ఆలోచించి, "చూడు చిట్టిబాబూ, మామూలుగా అయితే నీ ట్రాన్స్‌ఫర్ కష్టం. నీ ఎరికలో ఎవరైనా మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్‌కి ఉన్నారేమో చూడు. అలాగే నేను కూడా చూస్తాను. ఆ ఊరివాళ్ళెవరైనా అక్కడికి రావడానికి ఆశక్తి చూపించవచ్చు. అలాగే కొత్తగా ప్రమోషన్ వచ్చిన వాళ్ళెవరైనా కూడా అక్కడకి వెళ్ళడానికి వీలుంది. నీ స్థానంలో వెళ్ళడానికి ఎవరైనా ఓ బకరాని ఒప్పిస్తే నువ్వూ అక్కడనుండి తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఒకటి మాత్రం నిజం, అక్కడ జంబులింగం బాస్‌గా ఉన్నాడని తెలిస్తే మాత్రం ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడక పోవచ్చు, ఎందుకంటే అతని ఖ్యాతి ఈ మధ్య ఖండాంతరాలకి కూడా వ్యాపించింది. ఈ విషయం వచ్చేవాళ్ళకు తెలియకుండా నువ్వు మ్యానేజ్ చెయ్యాలి సుమా!" అన్నాడు.

ఆ తర్వాత నుంచి తన బదులుగా అక్కడికి బదిలీమీద వచ్చే బకరా కోసం తనవంతు వేట ఆరంభించాడు చిట్టిబాబు.

ఇలా బకరావేట సాగిస్తూ ఉండగా అదే ఊరికి చెందిన బలరాం అనే కోలీగ్ కూడా అక్కడికి బదిలీమీద రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు హెడ్ఆఫీస్‌లో ఉన్న తన స్నేహితులద్వారా తెలిసింది. అయితే అక్కడ వేకెన్సీ లేని కారణాన అతని బదిలీ కార్యరూపం దాల్చలేదు. ఆ విషయం తెల్సుకొని, బలరాం ఫోన్ నెంబర్ వెంటనే సేకరించి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు చిట్టిబాబు. మ్యూచువల్ ట్రన్స్‌ఫర్‌పై బలరాంని ఇక్కడకి రప్పించి తను ఇక్కడ్నుండి తప్పుకోవాలని చిట్టిబాబు ప్లాన్. బాస్ గురించి చెప్పకుండా, "ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది. మీరున్న ఊరు మా మావగారి వూరు కాబట్టే నేనక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, అంతేకాక మా మావగారికి ఈ మధ్య ఒంట్లో కూడా బాగా ఉండటంలేదు. లేకపోతేనా, నేనీ ఊరు వదిలే వాడినే కాదు. ఇక్కడ ఆఫీస్‌లో పనికూడా తక్కువే. మీరిక్కడికి బదిలీమీద వస్తే హాయిగా స్వంత ఊళ్ళోనే ఉండొచ్చు." అని ఉన్నవి లేనివి చెప్పి ఊదరగొట్టేసాడు చిట్టిబాబు. బలరాంకి జంబులింగం సంగతి తెలియకపోవడంవల్ల రాంబాబు పని సులభమైంది.

ఆ తర్వాత ఇంకేముంది, ఓ నెల రోజుల్లో బలరాం అక్కడికి వచ్చి చిట్టిబాబు సీట్లో జాయినవ్వడం, చిట్టిబాబు మళ్ళీ జంబులింగం కబంధహస్తాలనుండి తప్పించుకోవడం చకచకా జరిగిపోయాయి.

మళ్ళీ చిట్టిబాబు కొత్త ఊరికి భార్యతోసహా వెళ్ళి కొత్త ఆఫీస్‌లో జాయినయ్యి హాయిగా ఉపిరిపీల్చుకున్నాడు. రెండోసారి మళ్ళీ జంబులింగంనుండి తప్పించుకున్నదుకు రిలీఫ్‌గా ఉంది.

ఇలా ఉండగా ఒకరోజు, తనజాగాలో బదిలీపై వెళ్ళిన బలరాం ఫోన్ చేసాడు.

"చిట్టిబాబుగారూ, మీరు నాకు చాలా అన్యాయం చేసారు సార్! ఈ విషయమై నాకెందుకు నిజం చెప్పి హెచ్చరించలేదు?" అని నిలదీసాడు.

"ఏ విషయం అడుగుతున్నారు? అంతా బాగానే ఉందికాదా! స్వంత ఊళ్ళో ఉంటూ హాయిగానే ఉన్నారుకదా, ఏమిటి ప్రోబ్లెం మీకు?" అన్నాడు చిట్టిబాబు బుకాయిస్తూ.

"నన్ను బకరాని చేసి ఇక్కడకి పంపించి, మీరు చల్లగా తప్పించుకున్నారు. చండశాశనుడు, కర్కోటకుడు అయిన బాస్ జంబులింగం గురించి నాకు మాటమాత్రమైనా చెప్పలేదెందుకు? ఇప్పుడు నేనేం చేయాలి? స్వంత ఊరికి బదిలిపై వచ్చానన్న సంతోషం కూడా మిగలలేదు. రోజూ నన్ను వేపుకు తింటున్నాడు." అని లబలబ లాడేడు పాపం బలరాం.

బలరాం పరిస్థితికి జాలి వేసింది చిట్టిబాబుకి. అయితే అతనిమీద ముందే జాలిపడి ఉంటే తను అక్కడనుండి తప్పించుకునేవాడా మరి! తను అక్కడ ఉండగా చేసిన అసిధారా వ్రతం అదును చూసుకొని బలరాంకి బదిలీ చేసాడు. బలరాంకి మళ్ళీ అక్కడ నుండి మోక్షం కలగాలంటే మళ్ళీ ఇంకో బకరాని చూసుకొని అసిధారా చక్రం ఇంకోళ్ళకి బదిలీ చేయడం తప్పితే మరే మార్గం లేదు. అదే బలరాంకి చెప్పాడు చిట్టిబాబు.

"జంబులింగం దగ్గర పనిచేయడమంటే అసిధారా వ్రతం పట్టడం వంటిది. మళ్ళీ మీరు ఆ అసిధారా చక్రం ఇంకే బకరానైనా చూసి బదిలీ చేసేంతవరకు మీకది తప్పదు. ఇకనుండి మీరు ఆ ప్రయత్నంలోనే ఉండండి. బెష్టాఫ్ లక్!" అని ఫోన్ పెట్టేసాడు చిట్టిబాబు.

ఆ తర్వాత మరెన్నడూ బలరాం ఫోన్ చేసినా మరెత్తలేదు చిట్టిబాబు. పాపం బలరాం ఆ సాలెగూడులో చిక్కిపోయి మరో బకరా కోసం వేట మొదలెట్టాడు అసిధారా చక్రం ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి