జబ్బులెవరికీ ఊరికే రావు! - పద్మావతి దివాకర్ల

Don't just come to the sick!

"ఒరే!  ఆనందరావు ఇటే వస్తున్నాడురా!  అసలే జిడ్డుగాడు, పట్టుకుంటే వదలడు!  ఇలా మనల్నిచూసాడంటే క్లాస్ పీకుతాడు, పద అటువైపు వెళ్దాం!" అన్నాడు సిగరెట్ తాగుతున్న క్రిష్ణమూర్తి ఒక్క ఉదుటున కిళ్ళీ కొట్టు చాటుకు వెళ్తూ.  అతను అలా హెచ్చరించేసరికి ధూమ్రపానంతో తదాత్మ్యం పొందుతున్న అప్పారావు ఉలికిపడి, "వామ్మో! ఇలా ఆనందరావు కంటబడటమే?! ఇంకేమైనా ఉందా?!" అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే క్రిష్ణమూర్తిని అనుసరించాడు పరుగులాంటి నడకతో.

మధ్యాహ్నం లంచ్ అవర్లో టిఫిన్ చేసినతర్వాత ఆఫీస్ పక్కనేగల కిళ్ళీ కొట్టుకి వెళ్ళి కిళ్ళీ బిగించి సిగరెట్‌ని ఓ పట్టుపట్టకపోతే తోచదిద్దరికీ.

అయితే ఆనందరావoటే వాళ్ళిద్దరూ భయపడటానికి తగిన కారణమే ఉంది.  ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే గుణం ఆనందరావుది.  ఆనందరావు తాను ఆరోగ్యసూత్రాలు పూర్తిగా ఆకళింపు చేసుకున్నానని నమ్మి ఇతరులకు కూడా అవే బోధిస్తూంటాడు.  ఆరోగ్యసూత్రాల మీద గంటలతరబడి మాట్లాడగలడు.  తన ఎదురుగా ఎవరైనా ఆరోగ్య సూత్రాలు పాటించికపోయినా, చెడు అలవాట్లకు బానిసైనా అతను చూస్తూ ఊరుకోడు.  తన ఉపదేశాలతో వాళ్ళని విసుగెత్తిస్తాడు.  అప్పారావుని, క్రిష్ణమూర్తీని అలా చూసాడంటే, పొగ తాగటం, వాటి వల్ల కలిగే అనర్థాలు మీద టివిలో సినిమా ముందు వచ్చే హెచ్చరికను మించి గంటల తరబడి ఏకధాటిగా, అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగల స్తోమత కలవాడు ఆనందరావు.   గ్రహణానికైనా పట్టువిడుపులుంటాయి గానీ ఆనందరావు ఉపన్యాసానికి అవేవీ ఉండవు మరి!  అందుకే అతనికి ఎదురుపడాలంటే అందరికీ హడలే!  అంతకన్నా పెద్దపులికి ఎదురుపడటం నయం అని అనుకుంటారందరూ.

అయితే వాళ్ళ ఖర్మ కాలి  ఆనందరావు వాళ్ళిద్దరినీ చూడనే చూసాడు. 

"ఎంటి!  మీరిద్దరూ ఇక్కడేంటి చేస్తున్నారు?  అక్కడ బాస్ మీ ఇద్దరిగురించీ వెతుకుతున్నాడు.  అయ్యో!  సిగరెట్ తాగుతున్నారా!  పొగతాగడమెంత అనర్ధదాయకమో తెలియదా మీకు?  ఉపిరితిత్తులు చెడిపోతాయి.  ఆస్త్మా లాంటి, టిబి, క్యాన్సర్‌వంటి  రోగాలు కూడా రావచ్చు!  పొగతాగిన వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల గాలి పీల్చిన వారు కూడా ఇలాంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం పోగతాగిన వాళ్ళల్లో ఎనభై సాతం మంది వివిధ రోగాల బారిన పడుతున్నారు.  అందుకే అన్నారు 'జబ్బులేవరికీ ఊరికే రావు!' అని.  ఇకనుండైనా సిగరెట్ తాగడం మానండి."  అని కొంచెం ఆగాడు.

ఇంకొంచెంసేపు అక్కడే ఉంటే అతని వాగ్ధాటివరదకి సాయంకాలం వరకూ  ఆనకట్టపడదని  జడిసి, "బాస్ పిలుస్తున్నారని అన్నావు కదా! పద తొందరగా!" అని క్రిష్ణమూర్తి అనేసరికి తన ఉపన్యాసం తాత్కాలికంగా వాయిదా వేసాడు ఆనందరావు.  'బ్రతుకుజీవుడా!' అనుకొని ఆ గండంనుండి గట్టెక్కారు ఆ సిగరెట్  మిత్రద్వయం.

ఇక్కడ ఆనందరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఆరోగ్య పరిరక్షణమీద రాయబడిన పుస్తకమల్లా  ఎగబడి కొనడమే కాక సామజిక మాధ్యమాల్లో చక్కెర్లు కోట్టే అన్ని ఆరోగ్య సూత్రాలు బాగా ఆకళింపు చేసుకొని తన కుటుంబంలో వారి మీద రుద్దడమే కాక తనకు తెలిసిన, తెలీన వారిని కూడా ప్రభావితం చేయాలని తాపత్రయ పడ్తాడు.  తను చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో ఉదాహరణలతో చెప్తూ అందరూ వాటిని తుచ తప్పకుండా పాటించాలంటాడు. ఉప్పుతో ముప్పు తప్పదని, పంచదారతో పైకిపోయే ప్రమాదముందని, ఆనక తీరిగ్గా విచారిస్తే ఫలితముండదని హెచ్చరిస్తాడు. పంచదార అసలు తినకూడదని, ఉప్పు పూర్తిగా మాని చప్పిడి కూరలే తినాలని, పచ్చి కాయకూరలు, ఆకు కూరలు పచ్చివి తినాలని - ఇలా చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు.  ఆరోగ్యసూత్రాలు పాటించకపోవడం వల్లే జబ్బులువస్తున్నాయని అతని వాదన.  'జబ్బులెవరికీ ఊరికే రావు !' అన్నది ఆనందరావు  ఊతపదం.  

ఒకరోజు ఆ ఉళ్ళో రామిరెడ్డిని పోలిఉండే సోమిరెడ్డి అనే పేరుమోసిన రౌడీ మందుకొడ్తూ మన ఆనందరావు కంటబడ్డాడు.  అంతే! సోమిరెడ్డి రౌడీ అనే విషయం మరిచి ఆనందరావు తన సహజమైన ధోరణిలో, "చూడు! బ్రదర్!  మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికి తెలియచేప్పేందుకు ప్రతీ సినిమాలోను హెచ్చరికలు చూపిస్తూనే ఉంటారు. అసలు మద్యపానం వల్ల లివర్ చెడిపోతుంది.  మనిషికి కిడ్నీలైతే రెండుటాయి కాబట్టి ఒకటి చెడిపోతే ఇంకోటి స్పేర్ ఉంటుంది.  కాని లివర్ అలాకాదే!  మనిషికి ఉండేది ఒకటే లివర్.  అదికాస్తా చెడిపోతే మన వికెట్ పడిపోతుంది.  అనవసరంగా మద్యపానం చేసి పీకలమీదకి తెచ్చుకోవడమెందుకు?  అలా లివర్ జబ్బులు రాకుండా ఉండాలంటే మద్యం మానాలి. జబ్బులెవరికీ ఊరికే రావు తెలుసా?". అన్నాడు.

ఆనందరావు ఇలా అన్నాడోలేదో సోమిరెడ్డి రెచ్చిపోయాడు.  అసలే నిషామీద ఉన్నాడేమో తూలుతూ వచ్చి ఆనందరావు పీక దొరకబుచ్చుకున్నాడు.

"నువ్వెవడివిబే  నాకు నీతులు చెప్పడానికి?  నేను మందు తాగుతే నీకేంటిట?  ఏమిటీ,  జబ్బులు ఊరికే రావా?  దెబ్బలు కూడా ఊరికే పడవు తెలుసా!" అని గలాటా చేసేసరికి అక్కడే ఉన్న నలుగురైదుగురు కలుగజేసుకోబట్టి బతికిపోయాడు పాపం ఆనందరావు!

వీధిలోనే కాదు ఇంట్లో కూడా తన ప్రతాపం చూపించేవాడు ఆనందరావు.  వారనికోకసారి తప్పనిసరిగా ఇంటిల్లపాదీ ఉపవాసం ఉండాలని తను మాత్రం వాళ్ళందరి మెదడు తినేస్తాడు.  ఉపవాసం ఉండడంవల్ల పొట్ట క్లీన్అయ్యి జబ్బులు రావని వాదిస్తాడు.  అయితే ఉపవాసాలు ఉండడానికి వెనకంజ  వేసిన అతని భార్య కాంతం ఆ తర్వాత  ఆనందరావు దంచిన ఉపన్యాసానికి  తలవాచిపోయి అతనితో వాదించేకన్న ఉపవాసం ఉండడమే ఉత్తమమని భావించింది. భార్య కాంతంకి ఆనందరావు విషయం కాపురానికి వచ్చిన కొత్తలోనే తెలిసిపోయింది.  కొన్నాళ్ళు ఆమె ఆనందరావుని సరి చేయడానికి ప్రయత్నించి విఫలమై తను కూడా అతని అడుగుజాడలలోనే నడవడం ఆరంభించింది.  అయితే కాంతంకి కూడా మనసులో లేకపోలేదు, ఎప్పుడైనా మరీ విసిగిపోతే, 'విడాకులు ఎవరికీ ఊరికే రావు తెలుసా!' అని బెదిరిద్దామనుకుంది. కానీ, ఇంతవరకూ ఆ ధైర్యం చేయలేకపోయింది.  కాలమే ఎప్పటికైనా ఆనందరావుని మార్చదా అని ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది.

ఇంకోసారి అతని ఆఫీస్‌కి బదిలీ మీద కొత్త బాస్ అంబుజరావు వచ్చాడు.  అంబుజరావు చూడడానికి ఓ చిన్నసైజు గున్న ఏనుగులా ఉంటాడు.  భారీపోట్టతో నడవడానికే ఆపసోపాలు పడుతూ ఉంటాడు.  మొదటిరోజే అతన్ని చూసిన ఆనందరావు కిసుక్కన నవ్వబోయి ఆ తర్వాత ఆ నవ్వు నలభైవిధాల చేటని గ్రహించి అతి  కష్టంమీద తమాయించుకున్నాడు.  అయితే తన సహజగుణం వదలలేక ఆ సాయంకాలం బాస్ వద్దకి వెళ్ళాడు తనకి తెలిసిన విద్య ప్రదర్శించడానికి.

"సార్!  మీరేమీ అనుకోకుంటే మీకో మాట చెప్పదలచాను." అన్నాడు వినయంగా ఏనుగు ముందు ఎలుక నిలబడినట్లు.

ఏమిటన్నట్లు తలెత్తిచూసాడు అంబుజరావు.

"సార్! చూడబోతే మీకు నిండా ముఫ్ఫై ఏళ్ళుకూడా ఉన్నట్లు లేవు", అన్న ఆనందరావు వైపు ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆనందంగా చూసాడు ఏందుకంటే ఇప్పటి వరకూ ఎవరూ అతన్నిలా పొగడలేదు.   దానితో అతని చాతీ ఇంకో రెండంగుళాలు పెరిగి ఇంకొంచెం బరువెక్కాడు.  దాంతో అతను కూర్చున్న కుర్చీ 'కిర్రు ' మని కుయ్యోమొర్రో అంది.

"కూర్చో!  అనందరావూ!  నువ్వు చెప్పదలచుకున్నదేమిటో చెప్పు!" అన్నాడు ప్రసన్నంగా  చేస్తున్న పని ఆపి.

"సార్!  మీ వయసు తక్కువైనా మీకున్న బానపొట్టవల్ల మీరు యాభైదాటిన వారిలాగా కనిపిస్తున్నారు.  మీ పొట్టవల్ల మీకు రకరకాల సమస్యలు రావొచ్చు. కొలస్ట్రాల్ పెరిగిపోతుంది.  ఊబకాయంవల్ల మీకు షుగరూ, బీపీ కూడా మున్ముందు రావొచ్చు." తన వైపు కొరకొరా చూస్తున్న అంబుజరావుని పట్టించుకోకుండా తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు ఆనందరావు.

"సార్!  అందుకే  రోజూ ఉదయమే లేచి ఓ పది కిలోమీటర్లు పరుగెట్టాలి.   రోజు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. వేపుళ్ళు, నూని వంటకాలూ బాగా తగ్గించాలి.  కేవలం ఉడికించిన కూరలు, పచ్చి ఆకుకూరలు మాత్రమే తినాలి. అంతే కాదు రోజూ పొద్దున్నే కనీసం ఓ గంటైనా యోగా చేయాలి.   అలా అయితేనే మీ పొట్ట తగ్గుతుంది, లేకపోతే నానా రకాల జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుంది.  అందుకే అన్నారు, జబ్బులెవరికీ ఊరికే రావని!" ఏకబిగిన అని అంబుజరావు వైపు చూస్తూనే నివ్వెరపోయాడు ఆనందరావు.

బాస్ అంబుజరావు కళ్ళు ఎరుపెక్కి ముఖం జేవురించింది కోపంతో.  కుర్చీలోంచి లేచి నిలబడి కంపించిపోతున్నాడు.

అయితే ఇవేవి గ్రహించే స్థితిలో లేడు ఆనందరావు.  ఎర్రబడ్డ మొహంతో అంబుజరావు అలా లేవడం చూస్తూనే, "చూసారా సార్!  మీ కళ్ళు, మొహం ఎంతలా ఎరుపెక్కాయో?  కాళ్ళు చేతులూ ఎలా వణుకుతున్నాయో?  ఇవన్నీ కచ్చితంగా వ్యాధి లక్షణాలే!  మీరు వెంటనే సరి అయిన ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే మాత్రం ఇక అంతే!  జబ్బులెవరికీ ఉరికే రావు." అన్నాడు.

"ఆనందరావ్!..." గట్టిగా అరిచాడు అంబుజరావు.  బాస్ రూంలోనుండి వచ్చే ఆ కెవ్వు కేకకి ఆఫీసులో ఉన్నవారంతా ఒక్కసారిగా హడలిపోయి బాస్‌రూంలోకి తొంగిచూసారు. అక్కడ వాళ్ళందరికీ పులిలాంటి బాస్ ఎదురుగా పిల్లిలా నిలబడ్డ ఆనందరావు కనిపించాడు.

'పాపం అనందరావు!  మనందరికీ చెప్పినట్లే బాస్‌దగ్గర కూడా ఆరోగ్యసూత్రాలు వల్లించిఉంటాడు. అదికాస్తా బెడిసికొట్టింది.  ఆనందరావు ధైరం కాకపోతే, అయినా ఎవరైనా తెలిసితెలిసి చీమలపుట్టలో చేతులు పెడ్తారా?   కొత్త బాస్‌వచ్చిన మొదటిరోజే ఆనందరావుకి మూడింది ' అనుకున్నారు.

అయితే తను బాస్ మంచికి చెప్తే అతనికెందుకు కోపం వచ్చిందో గ్రహించలేకపోయాడు పాపం అనందరావు.

"ఆనందరావ్!  ఏంటయ్యా నీ సోది? నాది బాన కడుపా?  నీకెన్ని గుండెలు అలా చెప్పడానికి? నాకు నీ ఆరోగ్య సూత్రాలూ, నీతి వాక్యాలు చెప్తావా?  నీకు శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే అప్పుడు చూడు!  ఏమిటీ! జబ్బులెవరికీ ఊరికే రావా,  బదిలీలు కూడా ఎవరికీ వూరికే రావు తెలుసా, అదీ శంకరగిరిమాన్యాలకి" అన్నాడు అంబుజరావు హుంకరిస్తూ. 

అప్పటికిగానీ బాస్‌కి కోపం వచ్చిందని గ్రహించలేదు ఆనందారావు.  శంకరగిరిమన్యాల పేరు వినేసరికి ముచ్చెమటలు పట్టాయి.  ఇప్పుడు ఆరోగ్యసూత్రాలు పట్టుకువెళ్ళాడితే తను రేపొద్దున్న అరణ్యాలు పట్టకతప్పదు లాగుంది అనుకొని రాజీబాట పట్టాడు. ఇంక బాసాసురుడి శరణుజొచ్చక తప్పదని గ్రహించి  హఠాత్తుగా అంబుజరావు కాళ్ళమీద పడ్డాడు.  దాంతో కాస్త మెత్తబడ్డాడు అంబుజరావు.

"చాలు చాలు! ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు ఇకముందు వెయ్యకు!  ఇంక నీ సీటుకెళ్ళి పని చూసుకో!  పని మాత్రం సరిగ్గా చేయకపోతే తెలుసుకదా, జీతం కూడా ఊరికే రాదన్న సంగతి కూడా  బాగా గుర్తుంచుకో?"  అని అనందరావు పాఠం అతనికే తిరిగి అప్పచెప్పాడు.

'బతుకుజీవుడా!' అని బాస్ గదిలోంచి బయటపడ్డాడు ఆనందరావు.

మరోసారి ఆనందరావు భార్యతో ఓ దూరపు బంధువుల ఇంటికి పెళ్ళికివెళ్ళాడు.  అనందరావుని చూడగానే అందరూ గతుక్కుమన్నారు.  పెళ్ళిలో ఏం మాట్లాడి ఏం రసాభాస చేస్తాడోనని ఓ వంక కాంతంకి కూడా బెంగగానే ఉంది,  గానీ తప్పదన్నట్లు పిల్లిని చంకలో పెట్టుకొచ్చినట్లు పెళ్ళికి వచ్చిందామె.  ఆ రోజంతా ఆనందరావు ఏమీ హడావుడి చేయకపోవడంతో కొద్దిగా ఉపిరితీసుకుందామె.  అయితే ఆవిడ సంబరం ఎక్కువసేపు నిలబడలేదు.  రాత్రిపూట వంటవాళ్ళు వండుతున్న చోటకెళ్ళి బైఠాయించాడు.

అప్పుడే సాంబారులో ఓ ఉప్పు పేకట్లోంచి గుప్పెడు ఉప్పు గుమ్మరించాడు వంటతను అప్పలరాజు.  అదిచూసి చిందులేసాడు ఆనందరావు.

"అమ్మో!  అంత ఉప్పే?! ఈ సాంబారు తింటే ఇంకేమైనా ఉందా?  పెళ్ళికొచ్చిన పెద్దమనుషుల బీపీలు ఏమి కాను!  ఒకేళ బీపీ పెరిగి పెళ్ళిలో గొడవలొస్తే ఎలాగా? ఇందులో ఒక చెంచాడు ఉప్పు మాత్రమే వేయాలి!  అలాగే ఓ రెండు పచ్చిమిర్చి మాత్రమే వేయాలి, చూడు ఇందులో ఎన్నిమిరపకాయలు వేసావో? ఇవన్నీ తింటే జబ్బులు రావా?  జబ్బులు ఊరికే రావు తెలుసా?" అన్నాడు ఆనందరావు ఒంటికాలుమీద నిలబడి.

"అంత ఉప్పుకారం వెయ్యకపోతే రుచెలా వస్తుందండీ సాంబారుకి?  రుచీపచీ లేకపోతే ఈ వంటెవరు చేసారని నన్ను నిలదీస్తారు, ఆనక నన్ను మరింకెవరూ పిలవరు. ఆ తర్వాత నేనెలా బతకాలి?" అంటూ ఆనందరావు చూస్తూండగానే సాంబారులో ఇంకో చారెడు ఉప్పు పోసాడు అప్పలరాజు. 

అది చూస్తూనే ఆనందరావు కోపంతో, "ఓ చెంచా కాకపోతే ఇంకో చెంచా వెయ్యాలి, అంతే కాని ఇలా ఉప్పు గుమ్మరించి మమ్మల్నందరినీ ఆస్పత్రి పాలు చేయాలని కంకణం కట్టుకున్నట్లుంది నీ వాలకం చూస్తే.  ఈ సాంబారు పారబోసి మళ్ళీ ఫ్రెష్‌గా చెయ్! జబ్బులెవరికీ ఊరికే రావు తెలుసా!" అన్నాడు.

దాంతో ఉప్పుపేకట్‌ని చేత్తో పట్టుకున్నందునే అమాంతం బీపీ పెరిగిపోయింది అప్పలరాజుకి. అంతే! వెంటనే పెళ్ళిపెద్ద దగ్గరికి వెళ్ళి, "బాబూ!  మీకో దండం!  నేనిక వెళ్తా! నేనింక వంట చేయలేను.  అతన్నే వంటచేయమనండి.  ఊరికే ఎవరికీ కోపం రాదు తెలుసా!" అన్నాడు కోపంగా.

ఆనందరావు చేసిన నిర్వాకానికి కోపం వచ్చినా తమాయించుకొని వాళ్ళిద్దరికీ నచ్చచెప్పేసరికి తాతలు దిగివచ్చారు ఆ పెళ్ళిపెద్దకి.

ఇలా అనందరావు లీలలకి అతన్ని ఎరిగిన జనమంతా తెగ జడిసిపోయారు.  ఆఖరికి అతన్ని బంధువులు, స్నేహితులు ఎవరూ కూడా తమ ఇంటికి పిలిచేవారు కాదు, కోరుండి కొరివితో బుర్ర గోక్కోవడమెందుకని భయపడి.  ఇలా తన ఆరోగ్యసూత్రాల మీద మక్కువతో క్రమంగా జనజీవనస్రవంతికి దూరమవసాగాడు ఆనందరావు.

అలాంటి ఆనందరావు ఉన్నట్లుండి ఓ రోజు ఉదయం ఇంట్లో మొహం తిరిగిపడిపోతే కాంతం లబోదిబోమని చుట్టుపక్కలవాళ్ళని పిల్చింది.  అప్పటికే ఆనందరావు నిర్వాకంవల్ల  చుట్టుపక్కల వాళ్ళందరూ మొహం చాటేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆనందరావు మొహం తిరిగిపడిపోయాడని తెలిసి జాలిపడి అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. అరోగ్యసూత్రాలన్నీ తుచ  తప్పకుండా పాటించే ఆనందరావుకెందుకు అనారోగ్యం వచ్చిందో వాళ్ళకేమాత్రం అంతుబట్టలేదు.  అదో కోటి రూపాయల ప్రశ్నై కూర్చుంది అందరికీ.

డాక్టర్ పరమశివం అనందరావుకి తన బావమరిది పరమేశంకి చెందిన డైగ్నోస్‌సెంటర్‌లో అందుబాటులో ఉన్న అన్ని పరీక్షలూ చేయించాడు.  ఆ టెస్ట్‌లన్నిటికీ దగ్గర దగ్గర అక్షరాలా ఓ లక్ష రూపాయలు ఖర్చైంది. వచ్చిన రిపోర్టులన్నీ చూసి, ఆ తర్వాత బెడ్‌పై నీరసంగా పడుకున్న ఆనందరావు వైపోసారి చూసి కాంతంతో, "పేషంట్‌కి బీపీ బాగా తగ్గింది, అలానే షుగర్ లెవెల్ తగ్గింది.  వంట్లో రక్తం కూడా తగ్గింది.   అసలు తగ్గనిదేది? ఒంట్లో అన్నీ తగ్గాయి!” అని అంటూ, 'ఇక మీ దగ్గర డబ్బులే తగ్గాలి’ అని మనసులో అనుకొని, “అసలీ పరిస్థితి ఎందుకొచ్చిందంటే సరిగ్గా భోజనం చేయకపోవటం వల్ల.  ఉప్పు కారం శరీరానికి కావలసినంత తినకపోవడం వల్లా, పిండి పదర్థాలు, చక్కెర సరిగ్గా తీసుకోకపోవడంవల్ల.  అతిగా అన్నీ తినడమెలా అనర్ధదాయకమో, అసలు తినకపోవడం కూడా అంతే అనర్ధదాయకం.  రక్తంలో చక్కెర, బీపి తగ్గడం, రక్తంలో హెమోగ్లోబిన్ తగ్గడంవల్ల ఈ పరిస్థితి దాపురించింది.  అతిగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఇలాగే అవుతుంది.  దీనికి మందూ మాకు ఏం అక్కరలేదు.  అన్నీ సరిగ్గా తింటే చాలు." అన్నాడు పరమశివం తన ఫీజ్‌కి, హాస్పిటల్‌లో రూం అద్దెకీ కలపి మరో లక్షరూపాయలకి బిల్లు వేస్తూ.

అన్ని టెస్టులు చేసి అంత గుంజి, మళ్ళీ ఫీస్‌కింద కూడా బాగా గుంజి చివరికి డాక్టర్ చెప్పిన మాట విన్న ఆనందరావు నీరసంగా నవ్వాడు. ‘జబ్బులెవరికీ ఊరికే రావు!’ అని తను అనుకున్నాడు కాని ఇప్పుడు ‘డబ్బులెవరికీ ఊరికే పోవనీ!’ డాక్టర్ని చూసి తెలుసుకున్నాడు పాపం మన ఆనందరావు!

ఆ తర్వాత ఆనందరావు ఆరోగ్యసూత్రాలు వల్లించడం మరి ఎవరికంటా పడలేదు.  కాగలకార్యం వైద్యుడే తీర్చాడని ముచ్చటగా చెప్పుకున్నారు అతన్ని ఎరిగిన వారు.

 

-పద్మావతి దివాకర్ల

                                                             ……………………….

మరిన్ని కథలు

thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి
Millions ... letters
లక్షలు... అక్షరాలు
- మీగడ.వీరభద్రస్వామి
new life
నవజీవనం
- బుద్ధవరవు కామేశ్వరరావు