కృషితో నాస్తి దుర్బిక్షం - యు.విజయశేఖర రెడ్డి

krushito nasti durbhiksham

రాఘవాపురం గ్రామంలో వర్షాలు సరిగా లేక పోవడం అది రెండవ సంవత్సరం. ఒకటి రెండు వర్షాలు కురవగానే ఎరువాక సాగించారు తరువాత వర్షాలు లేక పంటలు ఎండిపోయి భూములు బీడులు పడడంతో సన్నకారు రైతులతో పాటు మోతుబరి రైతులు కూడా వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు అయిందని కన్నీరు మున్నీరై నగరానికి పోయి కూలి చేసుకునే పరిస్థితికి వచ్చారు.

ప్రభాకరానికి పది ఎకరాల భూమి ఉంది.భార్య సీతమ్మ వీరి కొడుకు మహేష్ ఇంటర్లో ఉన్నప్పుడే సుజలాం...సుఫలాం.. పేరుతో తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశాడు. ప్రతి వాన చినుకు బయటకు పోకుండా తమ స్థలంలోనే ఇంకి పోయేలా చర్యలు తీసుకున్నాడు.

ఇంట్లో వాడే ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా ఆ నీరు కూరగాయల మొక్కలకు అందేలా చేశాడు. పశువుల దొడ్డిలో పశువులకు పుష్కలంగా నీరు అందే ఏర్పాట్లు చేసి వాటిని అన్ని కాలాలలో సంరక్షించుకుంటున్నాడు.

అంతే కాదు వేసవి కాలంలో ఆ గ్రామంలో ఉన్న యాభై ఇళ్లకు త్రాగు నీరు వీరి ఇంటి బోరు బావి నుండే సమకూరుతోంది.

మహేష్ ఇప్పుడు అగ్రికల్చర్ బియస్సీ పూర్తి చేసుకొని పట్టణం నుండి గ్రామానికి వచ్చాడు.

భూములు బీడులవ్వడంతో సగానికి సగం మంది గ్రామాన్ని విడిచి వెళ్లారని తండ్రి చెప్పడంతో మహేష్ చాలా బాధ పడ్డాడు.

చదువుకున్న దానికి సార్థకత చేకూర్చాలని నిర్ణయానికి వచ్చాడు. ఉన్న పొలంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ పన్నెండు అడుగుల లోతు త్రవించి నీటి కుంటను ఏర్పాటు చేశాడు వర్షాలు వచిన్నప్పుడు ప్రతి నీటి చుక్క అందులో నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నాడు.

వాన దేవుడి కరుణ అనుకోవాలి వర్షాలు బాగా కురిసాయి వర్షాకాలం అయ్యేలోగా నీటి కుంట నిండింది. అందులో నుండి మిగతా భూమి తడిసేలా పైపులు అమర్చి మోటారు ద్వారా భూమికి నీరు అందించి సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నాడు ఇప్పుడు.

నీటి కుంటలు నిలువ చేసుకునే వీలులేని తక్కువ పొలం ఉన్న వారికి పంట సాగుకోసం నీటిని అందిస్తూ మంచిపేరును తెచ్చుకున్నాడు.

అంతే కాదు కరెంటుకు బదులు సౌర శక్తి ఫలకాలను అమర్చాడు.

మహేష్ బాటలోకి ఇప్పుడు ఒక్కొక్కరు రాసాగారు. వారికి పూర్తి సహకారాన్ని మహేష్ అందిస్తున్నాడు.

ప్రభుత్వం మహేష్‌ను ఆదర్శ రైతుగా గుర్తించి “జలరత్న,కర్షకరత్న” అన్న అవార్డులను అందించింది.

మరిన్ని కథలు

Korukunna mogudu
కోరుకున్న మొగుడు
- కొడాలి సీతారామా రావు
Inquiry
ఇంక్వైరీ
- DR BOKKA SRINIVASA RAO
Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి
Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి
Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి