International Testimonial - గంగాధర్ వడ్లమన్నాటి

అంతర్జాతీయ ప్రశంసాపత్రం

మొబైల్ చూస్తున్న దివాకరం, "యాహూ,నేను సాధించాను. నాకొచ్చేసిందిరో" అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న అతని తండ్రి, ఒక్కసారి తుళ్లి పడి,గుండె పట్టుకుని, "ఎందుకురా దరిద్రుడా అలా రాక్షస బల్లిలా అరుస్తున్నావు"అడిగాడు బిత్తర చూపులు చూస్తూ. "నేను సాధించాను నాన్నా.సాధించాను.నాకు అంతర్జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రశంసా పత్రం వచ్చింది తెలుసా" చెప్పాడు గర్వంగా. "ఆ, ఆ! నిజంగానా? నీకు మాసిన జుట్టుకు నూనె రాయడమే రాదనుకున్నాను. అలాంటిది, కవిత రాసి ప్రశంసా పత్రం గెలుచుకున్నావా.అంత గొప్ప విషయం ఇంత నెమ్మదిగా చెప్తావ్ ఏవిట్రా" అంటూ కొడుకు దివాకర్ భుజాలు పట్టుకు కుదిపేసి, "ఏవోయ్ ఓ సారి ఇటు రా. నీ కొడుకు చూడు ఎంత ఘనకార్యం సాధించాడో. అంతర్జాతీయ కవితల పోటీలో ప్రశంసాపత్రం పొందాడట" అని చెప్తుండగానే, లక్ష్మమ్మ వంటగది నుంచి మూడు గెంతుల్లో వచ్చేసి, "ఏమిటి మీరు చెప్పింది నిజమా" అంటూ తెగ సంతోషపడిపోయి, మా నాన్నే, నా బంగారవే,నా వెండి కొండే, ఇదిగో నోరు తీపి చేసుకో" అంటూ బుస్ మని చాక్లెట్ ఫ్లేవర్ బాడీ స్ప్రే నోట్లో కొట్టింది. "ఇదేవిటే అమ్మా...నోట్లో స్ప్రే కొట్టావ్". అంటూ బొక్కుమ్,బొక్కుమ్ అని దగ్గాడు. "ఇంట్లో చక్కర నిండుకుందిరా.బెల్లం కూడా లేదు.ఇంత సాధించిన నీ నోరు తీపి చేయాలనే తొందరలో, చాక్లెట్ ఫ్లేవర్ బాడీ స్ప్రే నీ నోట్లో కొట్టానురా,కొట్టాను".అంటూ తలని రెండుసార్లు గోడకి కొట్టుకుని కళ్ళొత్తుకుందామె. "అదంతా విన్న దివాకరం చెల్లెలు, ఏది అన్నయ్య, ఒకసారి నీ మొబైల్ ఇవ్వు చూద్దాం.ఆ ప్రశంసా పత్రం కూడా చదివి వినిపిస్తాను" అని అతని మొబైల్ అడిగి తీసుకుంది. చూస్తూనే కళ్ళు పెద్దవి చేస్తూ,"ఇదేమిటి! పాల్గొన్నందుకు గాను ఇస్తున్నామని ఉంది" అడిగిందామె ఆశ్చర్యంగా. ఆమె మాటలకి దివాకర్ నీళ్ళు నములుతూ, "అంత తేలిగ్గా తీసేసావ్ ఏమిటి? అది ప్రత్యేక ప్రశంసా పత్రం. దీనిని మా సమూహంలో కూడా పెట్టాను.ఎంత మంది అభినందించారో తెలుసా.చివరికి నేనే పెద్ద మనసు చేసుకుని,అభినందనలు వద్దు అనేప్పటికీ అభినందనల వెల్లువ ఆగింది తెలుసా.నువ్వు కూడా నాలాంటి ఓ కవిత రాసి పంపిస్తే తెలుస్తుంది కష్టం". చెప్పాడు అసహనంగా. ఆ మాటలకు ఆమె చిన్నగా నవ్వి,"నీది ఓ కవిత, కిళ్ళీ తింటే నోరు పండుతుంది.కొందరిని చూస్తే ఒళ్లు మండుతుంది. మిర్చీ తింటే నోరు మండుతుంది.కుర్చీ తంతే నడ్డి విరుగుతుంది. నీరు తాగక పోతే నోరు ఎండుతుంది.కారు కూతలు కూస్తే మూతి పగులుతుంది. పిచ్చాపాటి మాట్లాడితే నోరు పీకుతుంది. పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే బట్టతల మిగులుతుంది.అని చదివి,ఇదేం కవితరా ఇలా ఉంది.మళ్ళీ ఈ కవితకు నీ బిల్డప్ ఒకటి" చెప్పిందామె తేలికగా. "ఓహో అలా అనేదానివి ...నువ్వూ ఓ కవిత వ్రాసి అంతర్జాతీయ ప్రశంసా పత్రం తెచ్చుకో చూద్దాం"చెప్పాడు దివాకర్ ఆవదం ముఖంతో. "అయితే ఉండు,నేనూ ఓ కవిత రాసి నీ గుండు పగలగొడతాను" అని చకచకా ఏదో టైప్ చేసి పంపించింది. కొద్దిసేపటికి ఆమె కూడా "యాహూ నాకూ వచ్చేసింది" అని గట్టిగా అరిచింది. ఆ అరుపు విన్న సుబ్బారావు గారు, "మళ్ళీ గుండె పట్టుకుంటూ, నీకేం వచ్చిందే దరిద్రప్పీనుగా,నువ్వు కూడా అలా అరిచావు".అడిగాడాయన పళ్ళు నూరుతూ. "నాకు కూడా,అంతర్జాతీయ పింజారి పిల్ల ఆటలు సాహితీ సంస్థ వారి నుంచి, కవి బాకు అనే బిరుదు బహుకరిస్తూ ప్రశంసా పత్రం వచ్చింది నాన్న". చెప్పింది గర్వంగా. "అలాగా నీకూ కవితలు రాయడం వచ్చా. ఏది నువ్వు పంపిన కవిత కూడా చదువు విందాం".అడిగాడాయన. ఆమె గొంతు కొంచెం సవరించుకుని,"చెంప పిన్ను, కట్టుడు పన్ను,రాసుకునే పెన్ను,ముల్తానీ మన్ను,తినే బన్ను, తీపి జున్ను ,అన్నీ అవసరమే అవునవును. కాదంటే జీవితం ఏం అవును" అని చదివి, "ఎలా ఉంది నాన్నా నా కవిత" అడిగిందామె. "శ్రీ.శ్రీ కవితలు విన్న చెవులతో మీ కవితలు వింటుంటే,ఛీ, ఛీ అనాలనిపిస్తోంది.కానీ కొన్ని తప్పవు అని ఏదో తట్టినట్టు,ఉండండి ఓ మారు నేను ఒక కవిత పంపిస్తాను" అని అతను కూడా తన మొబైల్ తీసుకుని, చకచకా ఏదో టైప్ చేస్తున్నాడు. "నువ్ కూడా కవిత రాస్తున్నవా నాన్న"అడిగాడు దివాకర్. "కవితా పాడా.ఏది రాసినా ప్రశంసా పత్రం పంపేస్తున్నారని నా గట్టి అనుమానం.అందుకే నిర్ధారణ కోసం,సరుకులు,కూరల లిస్టు వ్రాస్తున్నాను.వినండి. పాత బెల్లం, కొత్త అల్లం,ఉల్లి ,వెల్లుల్లి,ఆవాలు ,ఆలుగడ్డలు, బీరకాయ, ఆకాకరకాయ అన్నీ తింటే ఆరోగ్యం.లేకపోతే అనారోగ్యం" అని వ్రాసి పంపించాడు ఆ సంస్థకి. కొద్దిసేపటికి, "అరే నాకు కూడా, కవి తామర అనే బిరుదుని ప్రధానం చేస్తూ ప్రశంసా పత్రం వచ్చింది" అన్నాడు ఆశ్చర్యంగా. అప్పుడే వచ్చి,గుమ్మం దగ్గర నిలబడి అదంతా విన్న పక్కింటి కవి పరంధామయ్యగారు, "వారి సాహితీ సంస్థల పబ్లిసిటీ కోసం, ఏది పడితే అది వ్రాసే వారందరికీ వేలంవెర్రిగా ప్రశంసాపత్రాలు ఇచ్చి కవితల్ని ఈ స్థాయికి దిగజార్చారు" అనుకుంటూ వెనుదిరిగాడాయిన.

మరిన్ని కథలు

thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి
Millions ... letters
లక్షలు... అక్షరాలు
- మీగడ.వీరభద్రస్వామి
new life
నవజీవనం
- బుద్ధవరవు కామేశ్వరరావు