కనువిప్పు - నంద త్రినాథ రావు

Find out

ఒక ఆసామి ఒక గొర్రె , పిల్లి, కోడి, కుక్కను పెంచుకొంటున్నాడు. ఆ పెంపుడు జంతువులన్నీ ఎంతో స్నేహంగా ఉండేవి. వాటికి మంచి ఆహారం పెట్టి ఆ యజమాని వాటిని ఎంతో ప్రేమగా చూసుకునే వాడు. పిల్లి, కోడి, కుక్క ఎంతో ఆనందంగా ఉండేవి. కానీ గొర్రె మాత్రం ఎప్పుడూ దిగులుగా ఉండేది. దానికి తన నేస్తాలని చూస్తే చాలా ఈర్ష్యగా ఉండేది. వాటికి అందమైన రూపం ఉంది. కానీ గొర్రె తనని అద్దంలో చూసుకొని ఎంతో బాధపడేది. తను బాధ పడటానికి కారణం ఉంది. మొదటిది తాను అందంగా లేదు. దానికి తోడు తన ఒంటి నిండా బొచ్చు(ఉన్ని) కూడా ఉంది. తనకి తన బొచ్చంటే ఎంత మాత్రం ఇష్టంలేదు. తన నేస్తాల్లాగే తనకి కూడా బొచ్చు లేకుండా శరీరం అందంగా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుని బాధపడేది. ఒకసారి ఒక స్వామిజీ ఆ యజమాని ఇంటికి వచ్చాడు. అప్పుడా గొర్రె ఆ స్వామిజీ కి నమస్కరించి - ”స్వామీ.. నేనేం పాపం చేశాను. నాకు కూడా నా నేస్తాల్లాగ అందమైన రూపం, శరీరం ఎందుకు లేవు?.. కోడి రంగు రంగుల ఈకలతో ఎంతో అందంగా ఉంటుంది. అలాగే పిల్లిని చూస్తుంటే నాకు ఎంతో ముచ్చట వేస్తుంది. అదే విధంగా బుజ్జి కుక్కని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ నన్ను నేను అద్దంలో చూసుకుంటే మాత్రం వంటి నిండా బొచ్చుతో అసహ్యంగా కనిపిస్తుంది. బొచ్చు లేకుండా నేను కూడా నా నేస్తాల్లాగ అందంగా నాజూకుగా వుండేలా ఏదైనా వరం ఇవ్వు స్వామి.. మీకు పుణ్యం ఉంటుంది” అని వేడుకొంది. ఆ స్వామిజీ ఆ గొర్రె యొక్క బాధని అర్ధం చేసుకున్నాడు. ఒక మంత్రం జపించాడు. అంతే! ఆ గొర్రె కూడా వంటి మీద ఎంత మాత్రం బొచ్చు లేకుండా ఎంతో అందంగా నాజూకుగా మారిపోయింది. దాని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఆ గొర్రె కూడా తన నేస్తాలైన పిల్లి, కుక్క, కోడి లాగే ఎంతో అందంగా మారినందుకు ఆ స్వామిజీకి ధన్యవాదాలు తెలుపుకుంది. ఆ స్వామిజీ నవ్వి వెళ్ళిపోయాడు. ఇంతలో ఎండాకాలం, వర్షాకాలం వచ్చి వెళ్లాయి . తనకి ఏ బాధా లేదు. కానీ చలికాలం వచ్చింది. అక్కడి నుంచి ఆ గొర్రెకి అసలు బాధ మొదలైంది. ఇంతకు ముందు తనకి ఏ చలిబాధా ఉండేది కాదు. తన వంటి నిండా బొచ్చు ఉండేది కాబట్టి తనకి చలి అంటే తెలిసేది కాదు. అప్పుడు పిల్లి, కుక్క, కోడి చలిని తట్టుకోలేక తనని చూసి ఈర్ష్య పడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తన వంటి మీద బొచ్చు లేకపోవడం వలన తను ఇప్పుడు చలికి గజగజా వణికి పోసాగింది. చలిని తట్టుకోవడం తన వల్ల కావటం లేదు. తను అందంగా తయారైతే అయ్యింది కానీ ఇప్పుడు తనకి చలిబాధ ఎక్కువైంది. తను చలిని అస్సలు తట్టు కోలేక పోతోంది. ప్రాణం పోతుందేమో అనిపిస్తుది. తన బాధని చూసి తన నేస్తాలైన పిల్లి, కోడి, కుక్క, నవ్వుకోసాగాయి. మెల్లగా గొర్రెకు తనెంత తప్పు చేసిందో అర్ధం అయ్యింది. దాంతో వెంటనే స్వామీజీ వద్దకు పరిగెత్తుకు వెళ్లి, అయన కాళ్లపై పడి తన తప్పుని క్షమించి తనకి తన పూర్వరూపం ఇవ్వవలిసిందిగా వేడుకొంది. దాంతో స్వామీజీ నవ్వి - “సృష్టిలో ఏ జంతువుకి ఏ రూపం ఇవ్వాలో సృష్టికర్తకి తెలుసు. నువ్వు అందమే కావాలనుకున్నావు. ఇప్పుడు అర్థమైందా అందం కంటే నీ శరీరానికి బొచ్చు ఎంత ఉపయోగపడుతుందో” అని చెప్పి తిరిగి మంత్రాన్ని జపించాడు. దాంతో పూర్వరూపం తిరిగి వచ్చింది ఆ గొర్రెకి. ఆ స్వామీజీకి ధన్యవాదాలు తెలిపిన ఆ గొర్రెకి కనువిప్పు కలిగింది. ఆ తర్వాత అది ఎప్పుడూ తన రూపాన్ని ఏ ఇతర జంతువులతోనూ పోల్చుకొని బాధ పడలేదు.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి