మంచి మర(వ)క - బుద్ధవరపు కామేశ్వరరావు

Good stain

"బాబూ, ఆటో ఇలా రా బిడ్డా, అర్జంటు నాయనా" అంటూ ఓ ఏభై ఏళ్ళ స్త్రీ తనని ఉద్దేశించి చేతులూపుతూ అరవడం, ఆమె పక్కనే ఓ గర్భిణి పురిటి నొప్పులుతో మెలికలు తిరగుతూఉండడం, అన్యమన స్కంగా ఆటో నడుపుతున్న సురేష్ కంటికి కనపడింది. ఓ పావుగంట క్రితం జరిగిన సంఘటనతో, ఈ రోజుకు కిరాయి మానేసి, ఇంటికి పోదామనుకున్న సురేష్ కు, 'ఆపదలో ఉన్న వాళ్ళకు, గర్భిణీ స్త్రీలకు అవసర మైతే ఉచితంగానైనా సరే ఆటో తోలమని' తన తండ్రి చివరి రోజుల్లో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఆటో తీసుకుని వచ్చి వాళ్ళముందు నిలిపాడు. "నాయనా, చిన్నోడివైనా నీకు దణ్ణంరా. పిల్ల బాధతో మెలికలు తిరిగి పోతోంది. నెలలు పూర్తిగా నిండలేదు. అనుకోకుండా నెప్పులు మొదలయ్యాయి. అంబులెన్స్ ఫోన్ చేసిన. వస్తామన్నారు. ఎన్ని ఆటోలు ఆపినా ఎవరూ ఆపడం లేదు " చెప్పుకు పోతోంది పెద్దామె. "సరే పెద్దమ్మా, ముందు అక్కను సీట్లో కూర్చోబెట్టు" అంటూ వాళ్ళని ఆటోలో కూర్చోబెట్టి, ఆటో చుట్టూ నీలం టార్పాలిన్ గుడ్డ కట్టి, హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. హాస్పిటల్ చేరిన తరువాత ఆమెను గదిలోకి తీసుకుని వెళ్ళిన తరువాత, డబ్బులు ఇవ్వబోతున్న పెద్దమ్మతో "కంగారు లేదు పెద్దమ్మా, డబ్బులు తరువాత తీసుకుంటా. మీ అల్లుడు వచ్చేవరకూ నేను బైట ఆటో స్టాండు లో ఉంటా. అవసరమైతే పిలవండి. ధైర్యంగా ఉండండి" అని చెప్పి ఆటోను స్టాండ్ లో పెట్టేడు సురేష్.

***** ***** ***** *****

ఆటోలో ఆలోచిస్తూ కూర్చున్న సురేష్ , సెల్ మోగడంతో ఈ లోకం లోకి వచ్చి, ఫోన్ ఎత్తేడు. అది తన తల్లి వద్ద నుంచి వచ్చిన ఫోన్. "ఎక్కడున్నావ్ నాయనా, భోజనానికి వస్తున్నావుగా ?" అడిగింది తల్లి. "వస్తానమ్మా,, నా కోసం చూడకు. నువ్వు తినేసెయ్" అని తను హాస్పిటల్ కు గర్భిణీ ని తీసుకుని వచ్చిన సంగతి చెప్పాడు. "చాలా మంచి పని చేసేవు నాయనా. పైనున్న మీ నాన్న నిజంగా సంతోషిస్తాడు, ఈ సంఘటన చూసి." "కానీ, అమ్మా, పొద్దున్నే ఒక గొడవయ్యిందే. ఒకతను నన్ను బెదిరించాడు. అందుకే ఎందుకైనా మంచిదని ఈ హాస్పిటల్ దగ్గరే ఉండిపోయాను" ఆందోళనగా చెప్పేడు సురేష్. "ఏమయ్యింది నాయనా, ఏం జరిగింది ?" భయం భయం గా అడిగింది తల్లి. "చెబుతానమ్మా, మొత్తం జరిగింది చెబుతా. అసలు ఏం జరిగింది అంటే......." చెప్ప సాగేడు సురేష్.

***** ***** ***** *****

జేయన్టీయూ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ ఆకుపచ్చ రంగుకు మారింది. అంతే, ఒక్క సారిగా వాహనాలు అన్నీ వేగం పుంజు కున్నాయి. సురేష్ కూడా తన ఆటోను గేర్ మార్చి స్పీడు పెంచబోయేడు. కానీ, ఈలోగా తన ముందు వెలుతున్న బైక్ అతను, వేగంగా వెళ్తూ చూసుకోకుండా ముందు ఉన్న గోతిలో బండితో సహా పడిపోవడంతో, సురేష్ షడన్ బ్రేక్ వేసి ఆటోను ఆపేడు. ఈ లోగా గోతిలో పడ్డ వ్యక్తి బట్టలుకు అంటుకున్న మట్టి మరకలు దులుపు కుంటూ వచ్చి, సురేష్ కాలర్ పట్టుకుని, "దిగరా, బేవకూఫ్. వెనకనుంచి వచ్చి, నా బండిని గుద్ది ఏమీ ఎరగనట్టు కూర్చున్నవేం. ఆటో తీసి పక్కన పెట్టు. నా సెల్ ఫోను, బండి కూడా పాడయ్యాయి. డేమేజ్ ఎంత అయ్యిందో లెక్క వేసి చెప్తా" అంటూ అతని మీదకు దూసుకువచ్చాడు. "అన్నా, అన్నా , నా ఆటో నీ బండిని తాకలేదన్నా ! కావాలంటే చూడన్నా. ఎంత దూరంలో నా ఆటో ఉందో" వేడుకుంటు న్నాడు సురేష్. ఈ లోగా పక్కనున్న కొంతమంది వచ్చి, సురేష్ తప్పేమీ లేదనీ, బైక్ అతనిదే తప్పని, సురేష్ ని ఆటోతో సహా వేగంగా అక్కడ నుంచి పంపించేసారు. తేరుకున్న ఆ బైక్ వ్యక్తి, వెళ్తున్న సురేష్ వైపు కోపంగా చూస్తూ, "ఒరేయ్, ఇప్పుడు తప్పించుకున్నావ్ గానీ, సాయంత్రం లోగా నీ వ్యవహారం తేల్చకపోతే నా పేరు యాదగిరి కాదు. నీ ఆటో నెంబర్ నోట్ చేసుకున్నా. నా తడాఖా ఏమిటో చూపిస్తా" అంటూ రంకెలేయసాగేడు. ఆటో నడుపుతున్న సురేష్ కు ఈ మాటలు వినగానే, కొంచెం భయం మొదలైంది. ఈ రోజుకు ఆటో నడపడం మానేసి, ఇంటికి వెళ్లి పోవడం మంచిదని నిశ్చయించుకొని, మెయిన్ రోడ్డు మీద నుంచి ఎడమవైపు తిప్పకుని వసంత నగర్ మీదుగా ఇంటికి బయలుదేరేడు.

***** ***** ***** *****

"ఇదమ్మా‌, పొద్దున్న జరిగిన సంఘటన. కానీ ఆ పెద్దావిడ, ఆ గర్భిణి బాధ చూడలేక ఇలా వచ్చానమ్మా !!" "జాగ్రత్త నాయనా, అలా అందరితో గొడవలు పెట్టుకోకు" నచ్చచెప్పబోతున్న తల్లితో, "అమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయ్. ఆ పెద్దావిడ వస్తోంది" అంటూ ఫోన్ కట్టేసిన సురేష్ తో "బాబూ, నీ సహకారం ఎప్పటికీ మరవ లేను. సమయానికి తీసుకుని వచ్చావు. లేకపోతే తల్లి, బిడ్డ కూడా దక్కేవారు కాదట. అమ్మాయికి పండంటి మగబిడ్డ పుట్టేడు. ఇదిగో నాయనా ఈ డబ్బులు తీసుకుని నువ్వు బయలుదేరు బాబూ, ఇప్పటికే చాలా ఆలశ్యమయ్యింది నీకు. ఓ సారి వీలు చూసుకుని మా ఇంటికి రా" అంటూ రెండు చేతులు జోడించి నమస్క రించి, వెనుతిరిగింది పెద్దమ్మ.

***** ***** ***** *****

పెద్దావిడ ఇచ్చిన డబ్బులు తీసుకుని, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ, ఆటో స్టార్ట్ చేయబోతున్న సురేష్ కు తన బైక్ అడ్డం పెట్టాడు ఉదయం గొడవపడ్డ బైక్ వాలా, యాదగిరి. "ఏరా, నేను పట్టుకోలేను అనుకున్నావ్ కదూ ? నీ వ్యవహారం అంతా చెప్పి, ఈ నెంబర్ గల ఆటో ఎక్కడున్నా నాకు చెప్పమని నాకు తెలిసిన ఓ పెద్దాయన ద్వారా ట్రాఫిక్ పోలీసులుకు చెప్పి ఉంచా. నువ్వు ఆటో నెంబర్ కనీకనపడకుండా చుట్టూ నీలం టార్పాలిన్ గుడ్డ కట్టుకుని ఇక్కడికి రావడం మెయిన్ రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరాల లో నోట్ అయ్యింది. నీ వలన బండి పాడవడమే కాదు, నా ఫోన్ కూడా పగిలింది. తియ్యి డబ్బులు. లేదా పోలీసు కంప్లైంట్ ఇస్తా" అంటూ కేకలేయసాగేడు యాదగిరి. "అన్నా, పేదవాడిని అన్నా, నా దగ్గర డబ్బులు ఏమీ లేవన్నా.." బతిమాలాడు సురేష్. "సరే, డబ్బులు లేవా ? ఓ పని చెయ్యి. చిన్న పనిఉందీ, చూసుకుని వస్తా. ఇక్కడే ఉండు" అంటూ ఆటో తాళాలు దౌర్జన్యంగా గుంజుకు పోయాడు యాదగిరి.

***** ***** ***** *****

ఆటోలో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న సురేష్ కు , "ఏం బాబూ, నువ్వింకా వెళ్లలేదా ?" అని అడుగుతున్న పెద్దమ్మ మాటలతో ఉలిక్కిపడ్డాడు. "లేదు, పెద్దమ్మా, ఎవరో ఒకతను నా ఆటో తాళాలు గుంజుకుపోయాడు..." బాధతో చెప్పాడు. "ఎవరు నాయనా, ఎవరతను ? ఏదైనా గొడవా ? ఉండు మా అల్లుడు వస్తున్నాడు. అతనితో చెబుదాం.." అని చెప్పబోతున్న పెద్దమ్మ వద్దకు.. "అత్తా, రా బండి ఎక్కు" అంటూ బైక్ తీసుకుని వచ్చాడు యాదగిరి. "అల్లుడూ, పాపం ఇతని ఆటో తాళాలు ఎవరో రౌడీ గుంజుకు పోయాడుట. ఈ అబ్బాయి చాలా మంచోడు. ఏదైనా సహాయం చేయి బాబూ" వేడుకుంది పెద్దమ్మ. "అత్తా , ఈ ఆటో అబ్బాయి నీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాడు యాదగిరి. "అసలు ఇతనే కనక రాకపోతే, నాకు మా అమ్మాయి, నీకు మీ అబ్బాయి దక్కేవారు కాదు నాయనా ! అంతే కాదు, నువ్వు వచ్చే వరకూ ఇలా పాపం, ఓపికగా కూర్చుని ఉన్నాడు" అంటూ జరిగింది అంతా చెప్పింది పెద్దమ్మ. అంతా విన్న యాదగిరి, "అత్తా, నువ్వు మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్తూ ఉండు. నేనూ, ఇతనూ కలిసి బళ్ళు పక్కన పెట్టి చంటాడిని చూడ్డానికి వస్తాం" అని అత్తను లోపలికి పంపి, సురేష్ ను కౌగలించుకొన్నాడు యాదగిరి. "తమ్మడూ, పొద్దున్న జరిగింది మర్చపో. నన్ను క్షమించు. మా ఆవిడకు, నా బిడ్డకు మరో జన్మ ఇచ్చావు. నాకు కూడా! నీ మేలు ఎప్పటికీ మరవను. లోపలికి రా ! నా వంశోద్ధారకుడిని చూద్దువుగాని" అంటూ భుజం మీద చేతులేసి లోపలికి తీసుకుని వెళ్తూ... "ఔనూ, నీ పేరేమిటి తమ్ముడూ ? " ""సురేష్. ఔనూ ఎందుకు అన్నా ?" "నా బిడ్డకు పెట్టే పేరులో నీ పేరు కూడా కలుపుదామని తమ్మీ" "వద్దన్నా, నేనంత పెద్దవాడిని కాను. కావాలంటే మా నాన్న పేరు పెట్టు. నాకు ఈ సేవా గుణం నేర్పింది ఆయనే. ఆయన పేరు రాములు." చెప్పాడు సురేష్. మంచి లక్షణాలున్న సురేష్ తో, మరక పడిన చొక్కా వేసుకున్న తన తండ్రి కలిసి తన వైపు రావడం చూసి ఆనందంగా నవ్వేడు, ఆ ఉదయమే పుట్టిన చంటాడు.

***** **** సమాప్తం **** *****

మరిన్ని కథలు

thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్
mallamamba
మల్లమాంబ
- నాగమణి తాళ్ళూరి
Millions ... letters
లక్షలు... అక్షరాలు
- మీగడ.వీరభద్రస్వామి
new life
నవజీవనం
- బుద్ధవరవు కామేశ్వరరావు