బావిలో శవాలు - చెన్నూరి సుదర్శన్

Corpses in the well

కాజీపేట పోలీసు స్టేషన్లో అడుగు పెడ్తున్న ఖడ్గపతి ఎస్సై, తన టేబులు మీద ఫోన్ మోగుతుండడంతో.. అడుగుల వేగం పెంచి ఫోన్ ఎత్తాడు.

“హలో సార్.. నేను పసిడికొండ ‘పవిత్ర పేపర్ ­బ్యాగ్స్’ ఆఫీసు నుండి పద్మాకర్­ను మాట్లాడు తున్నాను. మా కంపెనీ వెనకాల ఉన్న పాడుబడ్డ బావిలో ఎవరిదో శవం ఉన్నది సర్” అంటుంటే అతని లోని భయాందోళనలు పసిగట్టాడు ఖడ్గపతి.

“నేను వస్తున్నాను.. నువ్వు అక్కడే ఉండు” అంటూ వ్యాన్ డ్రైవర్­ను అప్రమత్తం చేశాడు ఖడ్గపతి. తనకు సహాయకుడైన సహదేవ్, మరో కానిస్టేబుల్ కనకయ్యను తీసుకొని వ్యానులో బయలు దేరాడు. దారిలో సహదేవ్­ను అగ్నిమాపక కేంద్రానికి, క్లూస్ టీమ్­కు ఫోన్ చెయ్యమన్నాడు.

అది కాజీపేట శివారు ప్రాంతం.. పసిడికొండలో ‘ప్లాస్టిక్ సంచులు వద్దు.. పేపర్ సంచులు ముద్దు’ అనే నినాదంతో నడుస్తున్న ఒక కుటీర పరిశ్రమ. అందులో ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారితో కలుపుకుని.. దాదాపు వంద మంది దాకా ఆడా, మగా కలిసి పని చేస్తుంటారు.

పోలీసు వ్యాను పెద్ద శబ్దం చేసుకుంటూ రావడంతో.. బావి చుట్టూ కూడిన జనంలో అలజడి మొదలయ్యింది. అంతా తప్పుకొని పోలీసు బృందానికి దారి ఇచ్చారు. ఖడ్గపతిని చూడగానే పద్మాకర్ పరుగు, పరుగున వచ్చి నమస్కరిస్తూ..

“నేనే సర్ ఫోన్ చేసింది. నేను పవిత్ర పేపర్ బ్యాగ్స్ ఆఫీసు అకౌంటెంటుని. మా ఆఫీసు డాబా మీద బ్రష్ చేసుకుంటూ ఉమ్మి వేద్దామని కిందకు వంగేసరికి బావిలో శవం కనబడింది. వెంటనే మీకు ఫోన్ చేశాను” అంటూ తాను నిలబడ్డ డాబా చూపించాడు.

అది బావికి ఆనుకొని ఉన్న రెండంతఃస్తుల పురాతన బంగళా. ఖడ్గపతి తలెత్తి డాబా వంక చూస్తూ.. బావి వద్దకు వెళ్ళాడు. బావి విశాలంగా శిథిల రూపంలో ఉంది. అందులోనుండి నీళ్ళు తోడుకోడానికి సౌకర్యమూ లేదు. బావి లోపలి అంచు సాంతం ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో ఆవరించి, బావిలో నీళ్ళు ఉన్నాయో! లేదో! గూడా సరిగ్గా తెలియడం లేదు. బాగా ముందుకు వంగి చూశాడు. అందులో ఎవరో ఒక ఆడమనిషి పడిపోయినట్లుగా కనబడుతోంది.

ఇంతలో అగ్నిమాపక శకటం వచ్చింది. ఖడ్గపతి విషయం చెప్పాడు. వెంటనే తమ వద్ద ఉన్న పరికరాలను ఉపయోగిస్తూ.. శవాన్ని తీసే ప్రయత్నంలో మునిగి పోయింది అగ్నిమాక బృందం. కనుకయ్య జనమెవ్వరూ దగ్గరికి రాకుండా కాపలా ఉన్నాడు. సమాచారం తెలుసుకుని వస్తున్న కాశిబుగ్గ సర్పంచ్ కాశయ్యను చూపిస్తూ ఖడ్గపతికి చెప్పాడు సహదేవ్. పిలిపిద్దామనుకున్న మనిషి.. తనే వస్తూండడంతో మంచిదే అన్నట్టు తలాడించాడు ఖడ్గపతి.

ఒక శవం తీసే సరికి మరొక శవం.. దాన్ని తీసే సరికి మరొక శవం నీళ్ళపై తేలసాగింది. అలా, అలా తొమ్మిది శవాలు బయటకు తీశారు.

“సర్.. వీళ్ళంతా మా పరిశ్రమలో పనిచేసే వాళ్ళే” ఆశ్చర్యంగా అన్నాడు పద్మాకర్.

“ముగ్గురు తప్ప అంతా ఒకే కుటుంబంవాళ్ళు సర్.. నాకు తెలుసు” బాగా పరిశీలిస్తూ అన్నాడు కాశయ్య. వివరాలు చెప్పసాగాడు “వీళ్లిద్దరు దంపతులు. వీళ్లిద్దరు వారి కొడుకులు. ఈవిడ వారి కూతురు”

“ఈ చిన్న పిల్లవాని శవం అమ్మాయి కొడుకుదే సర్.. ఈ ముగ్గురిలో ఇద్దరు మా సారు అనుమతి తీసుకొని డాబా పైన పెంట్­హౌజ్­లో తాత్కాలికంగా ఉంటున్నారు. మరొకడు ఎవరో తెలియదు సర్” అన్నాడు పద్మాకర్. సహదేవ్ చిన్న నోట్­బుక్­లో విషయాలన్నీ రికార్డు చెయ్యసాగాడు.

బహుశః కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. మరి ఈ ముగ్గురు ఎందుకు బావిలో పడ్డట్టు.. అని ఆలోచిస్తున్న ఖడ్గపతి ఆలోచనలను భగ్నం చేస్తూ.. క్లూస్ టీమ్ దిగింది. ఖడ్గపతి సూచనల మేరకు అంతా తమ పనిలో మునిగి పోయారు. మరో ప్రక్క కాశయ్య సాయంతో పంచనామా తదితర పనులలో మునిగి పోయాడు ఖడ్గపతి. ఆతరువాత శవాలను పాస్ట్ మార్టంకు పంపించి.. తన అనుచరులతో తిరిగి స్టేషన్­కు బయలుదేరాడు.

***

మరునాడు ఉదయం ఖడ్గపతి స్టేషన్­కు వచ్చేసరికి తొమ్మిది శవాల తాలూకు ఫోటోలు.. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ టేబుల్ మీద రడీగా ఉన్నాయి.

కుర్చీలో కూర్చుంటూ క్యాప్ టేబుల్ మీద పెట్టాడు. ఫైల్ తెరచి రిపోర్ట్స్ చూశాడు. ఆశ్చర్యమేసింది. అందరూ అధిక మోతాదులో నిద్ర మాత్రలు సేవించడం మూలాన చనిపోయారని, ఆ తరువాతనే నీట మునిగారని ఉంది. ఫోటోలు పరీక్షిస్తుంటే.. అనుమానమేసింది. గత నెలలో కాజీపేట, హాసన్­పర్తి రోడ్ రైల్వే స్టేషన్ల మధ్య ఒడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ఒక ఆడమనిషి ట్రైన్ నుండి కింద పడి చనిపోయినట్టు బినామీ పేరుతో ఒక కేసు బుక్ చేశారు రైల్వే పోలీసులు. దాని తాలూకు ఫోటోలు పంపారు. ఆ ఫైల్ తెరిచాడు ఖడ్గపతి. అందులో ఉన్న ఫోటోలోని రూపు రేఖలు బావిలో పడి చనిపోయిన ఆడవాళ్ళ పోలికలలో కొన్ని సరిపోతున్నాయి. సహదేవ్­ను పిలిచి వెంటనే పవిత్ర పేపర్ బ్యాగ్ ఆఫీసుకు వెళ్లి పద్మాకర్­ను పట్టుకురమ్మన్నాడు.

తొమ్మిది మంది చనిపోడానికి నిద్రమాత్రలు ఎక్కువ మొత్తంలో కావాలి. అన్ని మాత్రలు ఒకే సారి ఏ షాపు వాడూ అమ్మడానికి వీలు లేదు. దానికీ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే కాజీపేటలో ఒక పెద్ద హోల్­సేల్ షాపు మీద చాలా ఫిర్యాదులున్నాయని మదిలోకి రాగానే వెంటనే లేచి కార్యోన్ముఖుడయ్యాడు ఖడ్గపతి.

తన టూ వీలర్ మీద నేరుగా మెయిన్ రోడ్డులో ఉన్న భవాని మెడికల్ స్టోర్­కు వెళ్ళాడు ఖడ్గపతి. తాను వచ్చిన పని చెపుతూ.. సేల్స్ మేనేజరుకు సెల్­ఫోన్ ఇచ్చాడు. అది తీసుకును వెళ్లి పావుగంటలో తిరిగి రాగానే తన ఫోన్ తీసుకుని చెక్ చేసుకుని.. స్టేషన్­కు బయలుదేరాడు ఖడ్గపతి.

స్టేషన్­లో పద్మాకర్­ను చూడగానే లోనికి రమ్మంటూ పిలిచాడు ఖడ్గపతి. పద్మాకర్ అభివాదము తెలుపుకుంటూ అతని వెనుకాలే వెళ్ళాడు. ఖడ్గపతి ఫైల్ లోని ఆడవాళ్ళ ఫోటోలు చూపించాడు. పద్మాకర్ వాటిని చూడగానే గుర్తుపట్టాడు. తన వెంట తెచ్చుకున్న ఆఫీసు ఫైల్ ఓపెన్ చేసి నిర్థారించాడు.

“సర్ వీళ్ళు ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు. నిన్న బావిలో పడి చనిపోయినావిడ పేరు సోనూబాయి. ట్రైన్ కింద పడి చని పోయిందంటున్నారే.. ఆమె పేరు హీరాబాయి. ఈవిడ గూడా మా పరిశ్రమలోనే పని చేసేది. ఇంకా క్యాటరింగ్ కూడా చేసేది. ఫాతిమానగర్­లో తన కూతురుతో బాటు ఉంటుందని తెలుసు. దాదాపు నెల రోజులుగా రావడం లేదు” అంటూ హాజరు పట్టిక తీసి చూపించాడు పద్మాకర్.

“సోనూబాయి వాళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళు” అంటూ ఆరాతీశాడు ఖడ్గపతి.

“సర్ వాళ్ళు రాఘవేంద్ర కాలనీలో వారిది ఒక పెద్ద ఇండి పెండెంట్ ఇల్లు. ఆ శవాలబావికి దగ్గరలోనే” అంటూ రిజిస్టర్ చూసి ఇద్దరి ఇంటి చిరునామాలు చెప్పాడు.

“ఒకే.. పద్మాకర్.. థాంక్ యూ ..” అంటూ పద్మాకర్­ను పంపించాడు ఖడ్గపతి.

సహదేవ్­ను, కనుకయ్యలను పిలిచి ఇంటి చిరునామాలు ఇస్తూ.. ఇద్దరినీ చెరొక ఇంటికి వెళ్లి వాళ్ల జీవన విధానమంతా సేకరించుకు రమ్మన్నాడు.

మరికొంత సమాచారం సేకరిద్దామని పవిత్ర పేపర్ బ్యాగ్స్ పరిశ్రమ వైపు బయలుదేరాడు ఖడ్గపతి.

***

మరునాడు ఉదయానికల్లా హీరాబాయి, సోనూబాయి కుటుంబ వివరాలన్నీ ఖడ్గపతికి అందజేశాడు సహదేవ్, కనుకయ్యలు.

ముగ్గురు కలిసి కాసేపు సమావేశమయ్యారు. ఖడ్గపతి కేసును ఒక సవాలుగా తీసుకుని నిర్విరామంగా పరిశోధిస్తూ.. సేకరించిన సి.సి. కెమెరాదృశ్యాలు క్షుణ్ణంగా చూడసాగారు. ఒకటి భవాని మెడికల్ షాపు నుండి. రెండవది.. కాశయ్యసాయంతో పవిత్ర పేపర్ బ్యాగ్స్ పరిశ్రమకెదురుగా గ్రామ సచివాలయం నుండి.. మరొకటి కాజీపేట బ్రిడ్జి దిగి ఫాతిమానగర్ వెళ్తుంటే, మూల మలుపులో ఉన్న ఎస్.బి.ఐ. బ్యాంకు నుండి.

“సర్ ఇతనే సైకిలు మీద వెళ్ళే వాడు ఫాతిమానగర్­లో హీరాబాయి క్యాటరింగ్­లో తింటూ దగ్గరై సహజీవనం చేసే భూక్యానాయాక్” అని నిర్థారిస్తూ.. హీరాబాయి పెద్ద కూతురు జయంతి చెప్పిన విషయం గుర్తు చేశాడు కనుకయ్య. అదే భూక్యానాయక్ సైకిలును రోడ్డు మీద పార్కు చేసి భవాని మెడికల్ షాపులో నిద్రమాత్రలు కొన్నాడు. పవిత్రపేపర్ బ్యాగ్ పరిశ్రమకు సైకిలుపై వచ్చే ఒకే ఒక వ్యక్తి భూక్యానాయకే. అతణ్ణి పట్టుకొచ్చి విచారిస్తే గాని హత్యలకు సంబంధించిన కూపీ లాగవచ్చని మనసులో ధృఢ పడగానే సహదేవ్, కనుకయ్యలకు ఆపని అప్పగించాడు ఖడ్గపతి.

సహదేవ్, కనుకయ్యలు అందించిన సమగ్ర సమాచారాన్నంతా ఒక సరళరేఖలో పెట్టుకునేసరికి విషయం కాస్త అవగాహనమయ్యింది. భూక్యానాయక్­ను ఎలా ఇంటరాగెట్ చేస్తే వలలో పడ్తాడా..! అని మనసులో ప్రణాళికలు రచించుకోసాగాడు ఖడ్గపతి.

ఒక గంటలో భూక్యానాయక్­ను తీసుకొచ్చాడు సహదేవ్. ఖడ్గపతి సంకేతాలందుకుని లాకప్ లోకి గెంటేశాడు. అలా సీన్ క్రియేట్ చెయ్యందే మనిషిలో వణకు పుట్టదని చెప్పే పోలీసు ప్రాథమిక సూత్రం. నిజంగా తప్పు చేసిన వాడైతే ఆ నిముషంలోనే తెలిసి పోతుందని నేరస్తుల సైకాలజీ తెలిసిన ఖడ్గపతి నమ్మకం. తానూహించినట్టుగానే భూక్యానాయాక్­లో నేరానికి సంబంధించిన బెదురు ప్రస్ఫుటమవుతోంది. లాఠీ ఝళిపిస్తూ.. భూక్యానాయాక్ దగ్గరకు వడి, వడిగా అడుగులు వేశాడు. ఉగ్రనరసింహస్వామి రూపంలో వస్తున్నన్న ఖడ్గపతిని చూడగానే భూక్యానాయక్ గుండె జారి పోయింది.

“భూక్యా.. నా లాఠీ నిన్ను చీల్చి చెండాడక ముందే జరిగిందంతా చెప్పు. నీ జాతకమంతా తెలిసి పోయింది. సాక్ష్యాలు ఆధారాలన్నీ సేకరించాను. నువ్వు ఏమాత్రం బద్ధం చెప్పినా నా లాఠీ ఊర్కోదు” అంటూ లాఠీని గాలిలో నాట్యం చేయిస్తూ.. “హీరాబాయిని పెళ్లి చేసుకుంటానని.. మీ ఊరెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి ఎందుకు చంపావ్?” అంటూ గద్దించాడు.

ఊహించని ప్రశ్నతో భూక్యానాయక్ బెదరి పోయాడు. తన వ్యవహారమంతా తెలిసిపోయిందనే భయం ఆవహించింది. మరోమారు ఖడ్గపతి బెదిరించేసరికి..

“సర్.. నేను చంపలేదు. టిఫిన్ బాక్స్ కడుగుదామని వెళ్ళి తూలి కింద పడిపోయింది” అంటూ కన్నీరు పెట్టుకోసాగాడు.

వెంటనే లాఠీ భూక్యానాయక్ మోకాలి చిప్పను ముద్దాడింది. గావు కేక పెట్టాడు భూక్యానాయక్. నా గేలానికి చేప పడిందనుకున్నాడు ఖడ్గపతి.

“మరి ఈ విషయం సోనూబాయి వాళ్లకు, జయంతికి ఎందుకు చెప్పలేదు. నేను ముందే చెప్పాను. అబద్ధమాడొద్దు. లాఠీకి పని చెప్పొద్దని. నేను నమ్మినా నా లాఠీ నమ్మొద్దూ..! హీరాబాయికి కూల్ డ్రింకులో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చావు. ఆమె నిద్రలోకి జారుకోగానే చున్నీ మెడకు చుట్టి చంపేశావు. చనిపోయిందని నిర్థారణ కాగానే ఆమెను ట్రైన్ లోనుండి కిందకు తోసేశావు. నువ్వు అబద్ధమాడినా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అబద్ధమాడవుగదా..”అంటూ లాఠీ పైకెత్తాడు ఖడ్గపతి.

భూక్యానాయక్ గజ, గజ వణకి పోతూ.. అమాంతం ఖడ్గపతి కాళ్ళమీద పడి భోరు మన్నాడు.

“హీరాబాయిని నిద్రమాత్రలతో అడ్డు తొలగించుకుని దాదాపు నెల రోజులు కావస్తున్నా ఎవరూ నిన్ను అనుమానించక పోయేసరికి ఆ పద్ధతే నీకు బాగా నచ్చింది. అందుకే భవాని మెడికల్ స్టోర్స్­లో ఎక్కువ మొత్తంలో నిద్రమాత్రలు కొన్నావు. సోనూబాయి కుటుంబాన్ని లేపెయ్యాలని”

“నేను కొనలేదు సర్. వాళ్ళను నేనెందుకు చంపుతాను.. నేను చంపలేదు సార్” అంటూ బుకాయిస్తూనే బిక్కముఖం పెట్టాడు భూక్యానాయక్. అది గూడా అరువు తెచ్చుకున్నదేనని ఇట్టే పసిగట్టాడు ఖడ్గపతి.

అప్పుడే కొమురయ్య తీసుకు వచ్చిన భవాని మెడికల్ స్టోర్ సేల్స్ మేనేజర్ భూక్యానాయక్­ను చూస్తూనే “వీడే సర్.. నిద్రమాత్రలు కొన్నది” అంటూ ఆవేశంగా చూపుడు వేలుతో చూపించాడు. “పోయిన నెల పది మాత్రలు, నాలుగు రోజుల క్రితం ఎనభై మాత్రలు కొన్నాడు. అంత మొత్తంలో ఇవ్వమని చెప్పినా.. ఊరెళ్తున్నానని, అక్కడ దొరకవని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. పొరబాటయ్యింది సర్.. సారీ సర్” అంటూ రెండు చేతులా దండం పెట్టసాగాడు. సేల్స్ మేనేజరును వెళ్లిపొమ్మన్నట్లుగా ఇషారా చేశాడు ఖడ్గపతి.

“భూక్యానాయక్.. ఇప్పుడేమంటావ్? నువ్వు చేసిన పాపపు పనులకు అన్నీ రుజువులున్నాయి. ఇక వాళ్ళను ఎందుకు చంపాల్సి వచ్చిందో చెబుతాను” అంటూ లాఠీతో భూక్యానాయక్ ముఖమెత్తి తీక్షణంగా కళ్ళల్లోకి చూస్తూ.. “హీరాబాయి కనబడక పోవడంతో సోనూబాయి ఆమె కుటుంబ సభ్యులు నిన్ను ప్రతీరోజూ నిలదీస్తుండే వారు. వాళ్ళనందరినీ మూకుమ్మడిగా లేపెయ్యాలని పథకం వేశావు” అన్నాడు ఖడ్గపతి. “లేదు సర్.. నేను చంప లేదు” అంటూ మళ్ళీ మొదటికి వచ్చాడు భూక్యానాయక్. దీనికి రుజువులేవీ దొరకవు.. సాక్షులు లేకుండా ఉన్న ఇద్దరినీ గూడా బావిలో తోసేశాననే ధీమాతో..

“ఇటు చూడు భూక్యానాయక్.. సోనూబాయి ఇంట్లో వంటపాత్రల్లో మిగిలిన పదార్థాలలో నిద్రమాత్రల పౌడర్ కలిపిన రిపోర్ట్స్, వాళ్ళు చనిపోయాకనే బావిలో పడేసినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు కావాల్సింది. బావిలో అన్ని శవాలను వేయడం ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. నీకు సహకరించిన వాళ్ళు ఎందరు? ఎవరు వారు? అనే విషయం తేలాలి. నువ్వు పని ముగించుకొని తెల్లవారు ఝామున సైకిలు మీద ఇంటికి వెళ్తున్న సి.సి. కెమెరా దృశ్యాలు గూడా ఉన్నాయి. నువ్వు బుకాయించి లాభం లేదు. అయినా ఇలా ముద్దు, ముద్దుగా అడిగితే చెప్పే రకానివి కాదని అర్థమయ్యింది. కనుకయ్యా..” అంటూ పిలిచాడు. “వీణ్ణి తలకిందులుగా వేళ్ళాడదీయండి. అరికాళ్ళు ఆరగ దీస్తే గాని వీడు నిజం చెప్పడు” అంటూ గద్దించాడు ఖడ్గపతి.

“సార్.. వద్దు సార్ నిజం చెబుతాను” అంటూ నోరు విప్పాడు భూక్యానాయక్. సహదేవ్ రికార్డు చెయ్యసాగాడు.

“నేను ఒక్కడినే ఈ పని చేశాను సర్. నాకు మరెవ్వరూ సాయం చెయ్య లేదు” అనే సరికి ఖడ్గపతి నివ్వెరపోయాడు. “మొన్న సోనూబాయి మనుమని పుట్టిన రోజు సర్. నన్ను పిలువకున్నా పథకం ప్రకారం వెళ్లాను. వాళ్ళ వంటకాలలో నిద్రమాత్రల పౌడర్ కలిపాను” అంటూ నిద్రలోకి జారుకున్న వారిని ఒక్కొక్కరిగా గోనె సంచిలో వేసుకుని లాక్కొచ్చి బావిలో పడవేసినవైనం కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు. డాబా మీద ఉన్న ఇద్దరిని, వారి దోస్త్­ను కూడా గవాయి లేకుండా చంపి బావిలో వేశానని వివరించాడు. “సార్ ఒక్కణ్ణి చంపినా పదిమందిని చంపినా నాకు శిక్ష తప్పదు. దయచేసి ఒకసారి జయంతితో మాట్లాడనివ్వండి సార్” అంటూ ప్రాధేయపడసాగాడు.

“ఇంకా ఎందుకురా భూక్యా.. ఏం మాట్లాడుతావ్? అది చెయ్యబట్టే కదరా.. నువ్వు ఇన్ని నేరాలు చెయ్యాల్సి వచ్చింది. దాని మీద కన్నేశావు, అది పసిగట్టి హీరాబాయి నీకు అడ్డుపడి పెళ్లి విషయం ఒత్తిడి చేసింది. ఆమెను లేపేశావు. హీరాబాయి కనబడ్డం లేదని నువ్వు తీసుకు వెళ్ళావని తెలిసిన సోనూబాయి పోలీసులకు చెబుతానని బెదిరించింది. అందరినీ లేపేస్తే సమస్య తీరేపోతుందనుకున్నావు. పాపం ముగ్గురు అమాయకులు కూడా బలయ్యారు. మన ఇంట్లోని విషయాలు మన కంటే మన పక్కింట్లో వాళ్లకే ఎక్కువ తెలుస్తాయన్న దిశలో మా వాళ్ళతో పరిశోధన చేయించాను” అంటూండగా పత్రికా విలేకర్లు రావడం గమనించాడు ఖడ్గపతి.

వారికి సమగ్ర సమాచారమిచ్చి ఇలాంటి నేరాలకు తలపడకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని విలేకరులతో సమావేశానికై ఏర్పాట్లు చేయుమని సహదేవ్ కు సూచనలిచ్చాడు ఖడ్గపతి. *

-చెన్నూరి సుదర్శన్.

చరవాణి:94405 58748

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి