అపోహ - పద్మావతి దివాకర్ల

APOHA

చాలారోజుల తర్వాత ఆ సాయంకాలం రాఘవరావుని వాళ్ళింటో కలిసాడు రంగారావు. ఇద్దరూ చిన్నప్పటినుండీ స్నేహితులు, అయితే ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేసి స్వంత ఊరికి తిరిగివచ్చి స్థిరపడ్డారు. చాలా రోజులనుండి రాఘవరావుని కలవాలని అనుకున్నాడు కాని వీలుపడలేదు. ఈ మధ్యనే రాఘవరావు ఫోన్ నంబర్ సంపాదించి ముందుగా వస్తున్నానని కబురు చేసి బయలుదేరాడు రంగారావు.

రాఘవరావు తన ఇంటిగుర్తులు సరిగ్గా చెప్పడంతో చాలా సులభంగానే ఇల్లు కనుక్కున్నాడు రంగారావు. చాలా రోజుల తర్వాత స్నేహితుణ్ణి చూసిన రాఘవరావు చాలా ఆనందం చెందాడు. అలాగే రంగారావు కూడా! రాఘవరావు భార్య సీతమ్మ వచ్చి రంగారావుని పలకరించి ఇద్దరికీ కాఫీలు అందించింది. ఇద్దరూ కాఫీ తాగి పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు. ఆ కబుర్లలో చిన్నప్పటి విషయాలు చాలా దొర్లాయి. ఆ తర్వాత వాళ్ళ మాటలు కుటుంబ విషయాలపైకి మళ్ళాయి.

"చాలా రోజులైందిరా నీ పిల్లల్ని చూసి. ఇంతకీ నీ పిల్లలు ఏం చేస్తున్నారు?" అని అడిగాడు రాఘవరావు.

"పెద్దవాడు హైదరాబాద్‌లోను, రెండోవాడు బెంగుళూరులోనూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లగా ఉన్నారురా! మరి నీ పిల్లలేం చేస్తున్నారు?" అడిగాడు రంగారావు.

"పెద్దవాడు అటు అమెరికాలోనూ, రెండవవాడు ఇటు ఆస్ట్రేలియాలోనూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు..."అని ఆగాడు రాఘవరావు.

"ఆహా, అలాగా! పెద్దవాళ్ళిద్దరూ బాగానే వృద్ధిలోకి వచ్చారన్నమాట, సంతోషం! మరి మూడో వాడో?" అడిగాడు రంగారావు.

"మూడోవాడికి పెద్ద ఉద్యోగంలేదురా! ఈ ఊళ్ళోనే జైల్లో ఉన్నాడు." చెప్పాడు రాఘవరావు.

పెద్దకొడుకిలిద్దరూ మంచి ఉద్యోగం చేస్తూంటే రాఘవరావు చిన్నకొడుకు మాత్రం జైలుపాలవడం బాధకలిగించింది రంగారావుకి. రాఘవరావు ఎంత ఉత్తముడో తెలుసు రంగారావుకి. అతని తండ్రిగురించి, మొత్తం కుటుంబం గురించి పూర్తిగా తెలుసు. అలాంటి ఉన్నత కుటుంబంలో పెరిగి ఆ కుటుంబానికి మచ్చ తెచ్చి, ఆ ఇంటి పరువుప్రతిష్ఠ మంటగలిపినందుకు రాఘవరావు చిన్నకొడుకు చంద్రంపై విపరీతమైన కోపం వచ్చింది రంగారావు.

"అయ్యో పాపం! ఏం చేసాడేమిటి?" అన్నాడు రంగారావు రాఘవరావువైపు సానుభూతిగా చూస్తూ.

"వాడు డిగ్రీ పూర్తి చేసాడులే." చెప్పాడు రాఘవరావు.

"అయ్యో! అంత చదువు చదివి ఆఖరికి అలా అయ్యాడన్నమాట!" విచారం వెలిబుచ్చాడు రంగారావు మనసు బాధతో నిండిపోగా.

సరిగ్గా అదే సమయంలో రాఘవరావు చిన్నకొడుకు చంద్రం ఇంట్లోకి వచ్చాడు. చంద్రంని రంగారావుకి పరిచయం చేసాడు రాఘవరావు.

'అదేంటి! జైల్లో ఉన్నవాడు ఇంతలోనే ఇంటికి ఎలా వచ్చాడు.' అనుకొని విస్మయంగా చూసాడు రంగారావు చంద్రం వైపు.

"ఇదిగో, వీడే మా మూడోవాడు చంద్రం. మమ్మల్ని ఈ వయసులో వదిలిపెట్టి బయటకి వెళ్ళడం ఇష్టంలేక బియే చదివి మన ఉళ్ళోనే జైలర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకవేళ బదిలీ అయితే ఉద్యోగం మానేసి వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు." చెప్పాడు రాఘవరావు.

అంతవరకూ రాఘవరావు చిన్నకొడుకు ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళాడని ఏదేదో ఊహించి అపోహ పడ్డ రంగారావు చంద్రం జైలర్‌గా పని చేస్తున్నాడని తెలిసుకుని తన ఆలోచనకి సిగ్గుపడ్డాడు. తర్వాత తల్లితండ్రులను వృధ్యాప్యంలో వదిలి వెళ్ళకుండా స్వంత ఊళ్ళోనే ఉద్యోగంలో చేరిన చంద్రంని మనస్పూర్తిగా అభినందించాడు రంగారావు.

-పద్మావతి దివాకర్ల

మరిన్ని కథలు

Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి
Amalina prema
అమలిన ప్రేమ
- పోరండ్ల సుధాకర్
Day care
డే కేర్
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Dhaniyalu raju heart story
ధనియాలు రాజు హార్ట్ స్టొరీ
- కలం పేరు: బామాశ్రీ రచయిత పేరు: మామిడిశెట్టి బాలాజీ
Rushabhudu Dwividudu
బుషబుడు - ద్వివిధుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Karu chouka
కారుచౌక
- కర్లపాలెం హనుమంతరావు
Palletooru ammavodi
పల్లెటూరు అమ్మఒడి
- లక్ష్మీ కుమారి.సి