ఐ హేట్ మై రూమ్మేట్ - గంగాధర్ వడ్లమన్నాటి

i hate my room mate

“హలో,హలో లలితా ఎక్కడున్నావ్”అడిగింది సునంద.

“వచ్చేస్తున్నా,అయిపోయింది పని.ఆఫీస్ గట్టు దిగి నడిచి, ఇపుడే రెస్టారెంట్ మెట్లెక్కుతున్నా” చెప్పి ఫోన్ పెట్టేసింది లలిత.

లలిత రెస్టారెంట్ కి రాగానే, “ఏంటి అప్పుడప్పుడూ నాకీ టార్చర్. మనం ఎంత మరీ పక్క,పక్క ఆఫీసులలో పని చేస్తే మాత్రం,ఎంత మరీ స్నేహితురాళ్ళమైతే మాత్రం,నన్నిలా టెన్నిస్ బంతిలా ఆడుకోవడం బాలేదు. వారంలో కొన్ని సార్లు నువ్వు మీ ఆఫీస్ అయిపోగానే నన్ను ఇలా రెస్టారెంట్ కి రమ్మని ఫోన్ చేయడం.నువ్వొచ్చాక ఇద్దరం కలిసి బోంచేయడం.లేదా ఇద్దరం కలిసి ఏదోటి  మెక్కడం,ఆ తర్వాత కొంతసేపటికి నువ్వు నీ హాస్టల్ కి, నేను మా ఇంటికీ వెళ్లడం. ఏవైనా అంటే మీ హాస్టల్లో ఫుడ్ బాగోదని తల బాదుకుంటావ్. పోనీ ప్యాక్ చేయించుకుని మీ రూమ్ కి వెళ్లి తినొచ్చు కదా అంటే,చచ్చు మొహం పెట్టి,విచ్చలవిడిగా నన్ను తిట్టి , భూమి బద్దలయ్యేట్టు నా మీద విరుచుకు పడిపోతావ్.పోనీ ఏకంగా హాస్టల్ మారిపో తల్లీ  అంటే,మన ఆఫీసుకి దగ్గర ఉన్న ఏకైక హాస్టల్  ఇదొక్కటే ,వేరే హాస్టల్స్ లేవు అంటావ్. నాకు మాత్రం రోజూ నీకీలా చెప్పి,చెప్పి నా గాత్రం పోతోంది. నీ కోసం వెయిట్ చేయడంతో మా కొంపకి వెళ్లడం ఆలస్యం అయిపోతోంది.ఇక నీతో కలిసి తినడంతో, ఇంట్లో సరిగా తినడం లేదని మా అమ్మ నా మొహాన తిట్టేస్తూ ,నెత్తిన మొట్టేస్తోంది. అయినా నాకు తెలియక అడుగుతానూ, ఎంతకాలం నాకీ తిప్పలు . నువ్వు విషయం ఏంటో కూడా క్లియర్ గా చెప్పవు. అసలు ఏవిటి ప్రాబ్లం. నువ్వు హాస్టల్ కి ఫుడ్డు పట్టుకు వెళితే నీ రూమ్మేట్ తిడుతుందా? లేక హాస్టల్ వాళ్ళు చేసిన ఫుడ్ కాదని ఇలా బయటి నుండి తెచ్చుకు తినడం వల్ల మిగతా వాళ్ళు కూడా అలా తయారవుతారు అని మీ హాస్టల్ వాళ్ళు నిన్ను ఏమైనా అంటున్నారా. ఎందుకంటే నువ్వు అప్పుడప్పుడు ఇలా బయట తిని హాస్టల్ కి వెళ్లడం ఏవిటో నాకు అర్ధమై చావడం లేదు. ఏవైనా అంటే నాకిష్టమైనవి అన్నీ బయటే తింటాను, రూమ్ కు మాత్రం తీసుకు వెళ్ళను అని అంటావు. ఈరోజు నాకు అసలు విషయం అంతా క్రికెట్ స్లో మోషన్ రిప్లే అంత స్పష్టంగా తెలియాల్సిందే.” .పట్టుబట్టింది సునంద.

“చెప్తాను సునందా చెప్తాను” అని తల వంచుకుని “ఈ గుండెల్లోని నా బాధ, ఊర పిచ్చుకలు కట్టుకున్న గూడులా అలానే ఉండిపోయింది.ఆ బాదం పప్పంత బాధ కాస్తా పెరిగి పెరిగి పందికొక్కంత అయింది. ఈరోజు అది నీతో పంచుకుంటాను.గ్యాస్ బండంత పెరిగిన నా గుండె బరువుని తల దిండులా తేలిక చేసుకుంటాను”.  అని లలిత మరేదో ఏదో చెప్పేలోపు.

“ ఇలాంటి అర్ధం పర్ధం లేని అనవసర పాత చింతకాయ వర్ణనలు వద్దు.నేరుగా జోరుగా చెప్పు”.విసిగిందామె.

“ సర్లే  కోప్పడకు.సింపుల్గా చెబుతా విను.నా రూమ్మేట్ మంచిదే. కానీ కొంచెం స్వార్థం. నేను ఏదైనా కొని తీసుకుని వెళితే, ఆమే తీసుకుని తినేస్తుంది. మొహమాటం అనే పదం ఆమెకి తెలీదు.పైగా ఆ హాస్టల్ వాళ్ళకి దూరపు బంధువు.అలా అని ఎప్పుడూ ఆమెకీ,నాకు సరిపోయే అంత కొని పట్టుకెళ్లడం అంటే అసాధ్యం కదా. అందుకనే ఇలాంటి ఏ ఇబ్బందీ లేకుండా నాకు నచ్చినవి హాయిగా బయట తినేసి హాస్టల్ రూమ్ కి వెళ్తాను. పోనీ ఆమె తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా నన్ను కనీసం తింటావా అని కూడా అడగదు. అడగడం మాట అటుంచు,కనీసం వాసన కూడా చూడనివ్వదు. పైగా నా ఒక్క దానికే కొని తెచ్చుకున్నాను, ఏమీ అనుకోవద్దూ, నేను నీకు ఇవ్వలేను అని నా ఎదురుగానే లబ,లాబా లైలా తుఫాను బాధితురాల్లా తినేస్తుంది.దాంతో నాలో ఓ హూద్ ,హూద్ తుఫాన్ చెలరేగుతుంది. ఆ తరువాత నా ఒళ్ళు మేలో ఎండల్లా సల సలా మండిపోతుంది. పోనీ ఈ హాస్టల్ రూమ్ లో ఈ ఫుడ్ ఘోస్ట్ తో  ఇబ్బందని కనీసం వేరే రూము తీసుకుందావంటే ,ఆ రూముల్లో  ముగ్గురు నలుగురు అమ్మాయిలు కలిసి ఉంటున్నారు. ఈమె ఆ హాస్టల్ వాళ్ళ బంధువు కావడంతో ఆ రూంలో ఇద్దరినే ఉంచారు.పైగా రూమ్ కూడా కొంత బావుంటుందిలే.అందుకే తప్పక ,తప్పించుకోలేక,ఆమెని ఓ మాట అని నొప్పించే ధైర్యం చేయలేక ఇలా మౌత్ మూసుకుని ఈ మార్గం అనుసరిస్తున్నాను” అని చెప్పి ఓ క్షణం తర్వాత “నా బాధ నీతో పంచుకున్నాక , పనసపండంత బరువుగా ఉన్న నా మనసు... ఇపుడు ఈతపండులా తేలిగ్గా అనిపిస్తోంది.నా మనసు ఇపుడు బూజు దులిపిన గాజు అద్దంలా”  అని లలిత మరేదో చెప్పేంతలో.

“వద్దు మళ్ళీ వద్దు .ఇప్పటికే నీ దిక్కుమాలిన వర్ణనలు విని నా బుర్ర బద్దలైంది. నా సమయం చాలా వ్యర్ధమైంది.నీ బాధా అర్ధమైంది.కానీ నీ ఆలోచన బావుంది.అయితే ఇలా ఎంతకాలం ఇబ్బంది పడతావ్”.అడిగింది సునంద.

“ఎంతే? ఇంకా వన్ మంతే .ఆ తరువాత మా వసంతరావ్ బాబాయి బదిలీ మీద ఈ ఊరే వచ్చేస్తున్నాడు.నన్ను వాళ్లతోనే ఉండమన్నారు కూడా”.చెప్పింది లలిత ఉత్సాహంగా.

“అలాగా? సూపర్” అనేసి ,లలిత చేతిలోని స్వీట్స్, బేకరీ కవర్స్, ప్యాకెట్స్ చూసి,. “ఇదేంటి, ఇప్పటిదాకా హాస్టల్ రూమ్ కి ఏవైనా తీసుకు వెళితే , అన్నీ మీ రూమ్మేట్ తినేస్తుంది అని నా బుర్ర తినేసావు. మళ్లీ ఇప్పుడు ఇలా స్వీట్లు, కేకులు ,బేకరీ ఐటమ్స్ పట్టుకెళుతున్నావు! నాకేం అర్థం కావడంలేదు” అడిగింది సునంద.

“అదా! ఏం లేదు సునందా, ఇందాకనే మా రూమ్మేట్ ఫోన్ చేసింది. ఈరోజు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్లిందట. ఒక పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారట. రెండు మూడు రోజులు లిక్విడ్ డైట్ లోనే ఉండమని చెప్పారట. అందుకే నేను  ఇలా రెండు ,మూడు రోజులు రెచ్చిపోవచ్చు మరి”. చెప్పింది లలిత నవ్వుతూ.

మరిన్ని కథలు

There is something in that story!
ఆ కథలో ఏదో ఉంది!
- గంగాధర్ వడ్లమన్నాటి
this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్