బావా బావా పన్నీరు.... - గొర్తి.వాణిశ్రీనివాస్

Bawa Bawa rose water

ఏమేవ్ కనకం!ఇహ నా స్నానం అదీ అయ్యింది కానీ భోజనం పెడతావా.. మామిడికాయ పప్పు,ఇంగువ వేసి రోట్లో నూరిన చింతకాయ పచ్చడి,వడియాలు,పచ్చి పులుసు, చెయ్యమన్నానుగా చేసేవా.. జాడీలోంచి ఆవకాయ పచ్చడి రాచిప్పలోకి తీయవే.తిని చాలా రోజులయ్యింది.కరోనా వచ్చినదగ్గర్నుంచీ జాడీల మూతికీ వాసిన కట్టావు..ఇవాళన్నా విప్పు ..వంట పూర్తయిందా ఇహ వచ్చి కూర్చోవచ్చా?" పంపు నీళ్లు కొట్టి బకెట్లో పట్టుకుని తీసుకెళ్లి అరటి చెట్ల మొదట్లో వేసిన పెద్ద రాతి బండమీద నిలబడి స్నానం చేస్తూ,ఇత్తడి చెంబుతో మిగిలిన మొక్కలకి నీళ్లు పోస్తూ పెరడంతా తిరుగుతున్నాడు సీతాపతి. "ఇంకా స్నానం అవలేదా బావా !"అంటూ లోపలికి వచ్చాడు చెలపాయి. "రావయ్యా బామ్మరిదీ!,ఇదేనా రావటం. ఏమేవ్..మీ తమ్ముడు వచ్చాడు చాన్నాళ్ళకి.ఆ చేత్తోనే కాస్త పరవాన్నం,పులిహారా కూడా చెయ్యి." అన్నాడు "అన్నగారూ..మీ ఇంటి వంటల లిస్టు వింటుంటే నాకు నోరూరిపోతోంది.నా భోజనం కూడా ఇవాళ మీ ఇంట్లోనే"అంది పక్కింటి పంకజం గోడ మీదనుంచి తొంగి చూస్తూ. "అదేంభాగ్యం తల్లీ.నువ్వు రావడమే పరమానందం.మా బావ వెధవని కూడా తీసుకురా.ఎంచక్కా అందరం కలిసే భోంచేద్దాం." "మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు.మరో మారు వస్తాం లేండి."అంది "ఏవే అక్కా..!ఆకలి మండిపోతోంది.నేనొచ్చినప్పుడు మా బావ వంటకాల లిస్టు చెపుతుంటే ఆకలి పెరిగుపోయింది.ఊ.. రానీ రానీ అన్నిటినీ ఓ పట్టు పడతాను."అంటూ మఠం వేసుకుని కూర్చున్నాడు చెలపాయి. ఒక అన్నం గిన్నా,ఉప్పూ కారం పూసిన నాలుగు మావిడి కాయ బద్దలు,వేడి పాలు పోసిన ఉగ్గి గిన్నెంత చిన్న గిన్నె.చింతకాయ తొక్కు పెట్టిన రాచిప్ప తప్ప అక్కడ మరేం లేకపోవడంతో వెర్రి మొహం వేసాడు చెలపాయి. మీ తమ్ముడికి వడ్డిస్తూ ఉండు.నేను మరోమారు గురుశంఖ తీర్చుకోస్తా.నిన్న తిన్న గారెలు ఆరిగినట్టు లేవు"అంటూ పెరట్లో పచార్లు చేస్తున్నాడు సీతాపతి. "అఘోరించారు లేండి.ఆ పెరట్లోనే తగలడండి"అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది కనకం "ఇదేవిటే అక్కా..బావగారు ఈ పూట వంటల్లో చెప్పిన మెనూలు కనపడవేమే? బావగారి మాటంటే అంత లెక్క లేదేవిటే నీకు.మొగుడ్ని ఖాతరు చేయక పోవడం మన ఇంటా వంటా అసలు ఉందిటే?. భయం భక్తీ లేకుండా అట్టా తిడుతున్నావేమే?" అన్నాడు చెలపాయి "తిట్టాలా కొట్టాలా కొయ్యాలా.. మీ బావగారు చేసే వెర్రి చేష్టల్ని నేను కాబట్టి గుట్టుగా భరిస్తున్నాను. ఇంకోత్తయితే ఉరిపెట్టుకుని చచ్చేది." అంటూ కొంగుతో కళ్ళొత్తుకుంది. "ఏవైందే అక్కా.ఏం చేసారే.. చెట్టంత ఈ తమ్ముడితో నీకొచ్చిన కష్టవేవిటో చెప్పుకోవే"అన్నాడు చెలపాయి. "చూస్తున్నావుగా.ఇదీ నా సంసారం.పాత చింతకాయ తొక్కు,మావిడికాయ బద్దా. ఆయన పీనాసితనం ఎక్కడ బైట పడుతుందో అని ఊరంతా వినపడేంత గొంతేసుకుని ఇవి చెయ్యి అవి చెయ్యి అని అరుస్తారు. చుట్టుపక్కల వాళ్ళు మేం తెగ వండేసుకుంటున్నాం అని అనుకోవాలని. ఇంట్లో చూస్తే కోటా బియ్యం తప్ప ఏవీ లేవురా తమ్ముడూ..వెధవ బడాయికి మాత్రం తక్కువ లేదు. నువ్వు వచ్చేముందు చూసుంటావ్. ఎండిన చెట్ల పుల్లల్నీ కాకి గూళ్లనీ పోగేస్తున్నారు. ఎందుకంటే మనిద్దర్లో ఎవరు ముందో ఎవరు వెనకో అప్పటికప్పుడు పుల్లలకి ఎక్కడికి పరిగెడతాం అంటారు. పిచ్చుకలు గూట్లో దాచుకున్న కొబ్బరి పీచుని దానికే తెలియకుండా లాఘవంగా లాక్కొచ్చి దాస్తారు. ఎందుకంటే పుల్లలు మండాలంటే కిరసనాయల ఖర్చు దండగట. ఆ పీచైతే సురసురా మండి శవం తొందరగా అంటుకుంటుందిట. ఒకటా రెండా ఏవని చెప్పను. ఎన్నని చెప్పను. నువ్వు దూరదేశంలో ఉన్నావు .నీకివన్నీ ఎందుకని చెప్పలేదు. ఈయన పీనాసి రకం అని తెలిసే ఆ దేవుడు మాకు సంతాన భాగ్యం లేకుండా చేసాడు. "అంటూ తమ్ముడితో బాధని వెళ్లగక్కింది కనకం. "ఊరుకోవే అక్కా..నీ బాధ పక్కింటి వాళ్ళకి కూడా రాకూడదే. ఉండు బావ మనసు నేను మారుస్తాను." అంటూ ఊపు మీద వెళ్లి బావ సీతాపతి ముందు నిలబడ్డాడు. "బావా...మీ పెళ్ళై ఇన్నేళ్లు గడిచినా,మా అక్కకి నేనేమీ ఇవ్వలేదు.అందుకే మీకు ఒక కోటి రూపాయలు ఇద్దామనుకుంటున్నాను. ఇక హాయిగా దర్జాగా గడపండి బావగారూ.ఏమంటారు"అన్నాడు.బావ పీనాసి తనాన్ని ఈ నాటితో వదిలేస్తాడన్న ఆశాభావంతో చూస్తూ. "హమ్మయ్యో ,కోటి రూపాయలే....నీదెంత మంచి మనసు బామ్మరదీ.. ఇక చూస్కో మెమెంత దర్జాగా బతుకుతామో.. ఏమేవ్..మన పెళ్లికి మీ నాన్న పెట్టిన రెండు కొత్త పంచలూ,నీ చీరా ఇటు తీసుకురా అక్కడక్కడా తూట్లు పడ్డ చోట కాస్త అతుకుల వేయిస్తే చాలు.. ఇహ మన తరం వెళ్ళిపోతుంది.. చాలా సంతోషంగా ఉంది బామ్మరిదీ.. ఇప్పుడే దర్జీ దగ్గరకి వెళ్ళి ,ఆ బట్టల్ని కుట్టించుకొచ్చి నా దర్జా చూపిస్తాగా... నువ్వు కడుపునిండా భోంచేశావా. ఖాళీ అయిన తేనె పట్టులన్నిటినీ కలిపి కుట్టి ఏర్పాటు చేసిన పందిరి కింద తాటి గులకలు పేర్చి చేసిన మంచం మీద భుక్తాయాసం తగ్గేదాకా హాయిగా విశ్రాంతి తీసుకో. నేనిప్పుడే చిటికెలో వచ్చేస్తా.." అంటూ బట్టలకి అతుకుల వేయించటానికి వెళుతున్న బావవంక పిచ్చి పట్టినట్టు చూస్తుండి పోయాడు చెలపాయి. పిసినారితనం నరనరాల్లో జీర్ణించుకుపోయాక జీవుడు వెళ్లాలే కానీ లోభత్వం మాత్రం పోదు. మార్చాలని చూసేవాళ్ళని కూడా పిచ్చివాళ్ళని చేస్తారు .అనుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాడు చెలపాయి. వెళుతూ బావకు తెలీకుండా లక్ష రూపాయలు అక్క చేతిలో పెట్టి "అక్కా!బావకి ఎట్టాగూ సుఖపడేయోగం లేదు.నువ్వైనా కావాల్సింది కొనుక్కుని కడుపునిండా తిను. తెచ్చిన సరుకుల లెక్క బావకు చెప్పకు.బావ గుండాగిపోతుంది.జాగ్రత్త"అని చెప్పి చక్కా వెళ్ళిపోయాడు.

మరిన్ని కథలు

There is something in that story!
ఆ కథలో ఏదో ఉంది!
- గంగాధర్ వడ్లమన్నాటి
this is not a story
ఇది కథ కాదు
- సుస్మితా రమణమూర్తి
bee in the ear
చెవిలో జోరీగ
- మల్లవరపు సీతారాం కుమార్
thief
దొంగ
- బొందల నాగేశ్వరరావు
changed veeranna
మారిన వీరన్న (బాలల కథ)
- డి వి డి ప్రసాద్
Culture
సంస్కారం
- మల్లవరపు సీతాలక్ష్మి
Enough to pass tonight
ఈ రాత్రి గడిస్తే చాలు
- బుద్ధవరపు కామేశ్వరరావు
day star
వేగుచుక్క
- గొర్తి.వాణిశ్రీనివాస్