పుట్టినరోజు శుభాకాంక్షలు - పద్మావతి దివాకర్ల

పుట్టినరోజు శుభాకాంక్షలు

లేడికి లేచిందే పరుగు అన్నట్లు, లోకనాధం లేచి లేవగానే చరవాణి చేతిలోకి తీసుకొని వాట్సప్‌లో తనకొచ్చిన సందేశాలు చూడటం మొదలెట్టాడు. తెలిసిన వాళ్ళందరికీ ‘శుభోదయం’ సందేశం పంపించాడు పక్కమీద నుండి లేవకుండానే. ఆ తర్వాత లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానపానాదులు ముగించి సోఫాలో సుఖాసీనుడై ఫోనులో ఈసారి ఫేస్‌బుక్‌పై తన దృష్టి సారించాడు. తను పెట్టిన పోస్టులు లైక్ కొట్టినవారి పోస్టులకి చాలా ఉదారంగా లైక్ కొడుతూ ఓ గంట గడిపాడు. ఆ తర్వాత ఎవరెవరి పుట్టినరోజులున్నాయో చూసుకొని శుభాకాంక్షలు తెలపడానికి ఉద్యుక్తుడైయ్యాడు.

ఆ రోజు తన స్నేహితులిద్దరివి పుట్టినరోజు ఉన్నట్లు తెలుసుకున్నాడు ఫేస్‌బుక్‌లో నోటిఫికేషన్ చూసి. అందులో ఒకడు సుందరంకాగా, రెండోవాడు కైలాసరావు. ముందు సుందరంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సుందరం గతనెల జరిగిన తన పుట్టినరోజున తనకు శుభాకాంక్షలు తెలిపాడు కూడా. ఆ తర్వాత కైలాసరావుకి సంబంధించిన పుట్టినరోజువద్ద కొద్దిగా ఆగి ఆలోచించాడు. క్రితం నెల తన పుట్టినరోజు జరిగినా తనకు ఎలాంటి సందేశం పంపలేదు కైలాసరావు, అంతేకాదు గత నాలుగేళ్ళుగా తను అతని ప్రతీ పుట్టినరోజుకీ శుభాకాంక్షలు పెట్టినా కైలాసరావు మాత్రం కనీస మర్యాద కూడా పాటించలేదు. తనకు ధన్యవాదాలు తెలపలేదు సరికదా, తన పుట్టినరోజున కూడా ఎలాంటి సందేశం పంపలేదు. కైలాసరావుపై విపరీతమైన కోపం వచ్చింది. అతనికి శుభాకాంక్షలు పెడదామాలేదా అని క్షణం ఆలోచించాడు. 'ఏమో పాపం! బహుశా తీరికలేక చూడకపోయి ఉంటాడు. వాడు పెట్టకపోతే మానే, తనెందుకు మానేయాలి? ఈసారి కనపడితే మాత్రం బాగా దులిపేయాలి.' అని మనసులోనే అనుకొని కైలాసరావుకి తన సందేశం పంపాడు, 'ప్రియాతి ప్రియమైన స్నేహితుడు కైలాసరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి.' అని. అయినా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపనందుకు అతనిపై మనసులోనే కొంచెం కినుకు వహించాడు లోకనాధం.

ఆ సాయంకాలం టివి చూస్తూ కూర్చొని ఉండగా స్నేహితుడు శేషాచలం వచ్చాడు. చాలా రోజుల తర్వాత శేషాచలం కనబడటంతో చాలా సాదరంగా అహ్వానించాడు లోకనాధం. "రారా శేషాచలం, చాలరోజుల తర్వాత వచ్చావు. రా కూర్చో!" అన్నాడు.

లోకనాధం మాటలు వినిపించుకోకుండా, "నేను కూర్చోడానికి రాలేదురా! పద! అలా బయటకు వెళ్ళివద్దాం" అన్నాడు శేషాచలం.

అలా కలిసి తిరిగిరావడం ఇద్దరికీ అలవాటే అయినా వచ్చీరాగానే తనని బయలదేరమనేసరికి అతనివైపు విడ్డూరంగా చూసాడు లోకనాధం.

"కొంచెం కూర్చోరా! కాఫీ తాగి వెళ్దాం." అన్నా వినిపించుకోక, "ముందు పద! నీకో విశేషం చూపిస్తాను. తిరిగి వచ్చినతర్వాత తీరిగ్గా కాఫీ తాగుదాములే!" అని బలవంతాన లోకనాధాన్ని బయలదేరదీసాడు శేషాచలం. శేషాచలం బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు.

"ఎక్కడకి వెళ్తున్నాం?" అని లోకనాధం అడిగినా, "చూస్తావుగా!" అని బండిని ముందుకి నడిపాడు శేషాచలం.

పదినిమిషాల్లో ఒక ఇంటివద్ద బండి ఆపాడు శేషాచలం. లోకనాధం బండిదిగి ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. అది కైలాసరావు ఇల్లు.

"ఏమిట్రా! కైలాసరావు ఇంటికి నన్ను ఎందుకు తీసుకువచ్చావు? అవును, ఇవాళ వాడి పుట్టినరోజు కదా పార్టీకిగానీ నీకు ఆహ్వానం పంపాడా? అందుకనే నన్ను కూడా తెచ్చావా? నాలుగేళ్ళనుండీ నేను వాడి ప్రతీ పుట్టినరోజుకీ ఫేస్‌బుక్‌లో విష్ చేస్తున్నానాకు కనీసం ధన్యవాదాలు కూడా తెలపడు. అంతేకాక, నా పుట్టినరోజునాడు విష్ కూడా చెయ్యడు. ఇప్పుడు చూడు, నువ్వంటే వాడికి చాలా ఇష్టం కాబట్టే నిన్ను పార్టీకి పిలిచాడు, కాని నన్ను మాత్రం పిలవలేదు, అలాంటివాడిని ఇప్పుడు నేను కలవడం అంత అవసరమా!" అని నిరసనగా, నిష్టూరంగా అన్నాడు లోకనాధం.

"పద! ముందు ఇంట్లోకి పద! ఆ తర్వాత నువ్వు చెప్పేదేమిటో తీరిగ్గా చెబుదువుగాని." అంటూ కైలాసరావు ఇంట్లోకి దారితీసాడు శేషగిరి. అయిష్టంగా లోకనాధంకూడా శేషగిరి వెనుక ఇంట్లోకి ప్రవేశించాడు.

శేషగిరిని చూసి కైలాశరావు భార్య కమల పలకరించింది, "అన్నయ్యగారూ! రండి, కూర్చోండి." అని.

"ఎలా ఉన్నారమ్మా మీరూ, పిల్లలు?" అని అడుగుతూ సోఫాలో కూర్చున్నాడు శేషగిరి. లోకనాధం కూడా కూర్చొని నేలచూపులు చూస్తూ సోఫాలో అసహనంగా కదలసాగాడు. మనసులో కైలాసరావుపై పీకలదాకా కోపం ఉంది. కైలాసరావు కనపడగానే కడిగేయాలని నిర్ణయించుకొని అతనికోసం ఎదురు చూడసాగాడు. అయితే ఆ ఇంట్లో పుట్టినరోజు హడావుడి ఏమాత్రం కనిపించలేదు లోకనాధంకి. 'ఓహో! నిరాడంబరంగా పుట్టినరోజు వేడుక జరుపుకుంటాడు కాబోలు కైలాసరావు.‘ అని అనుకున్నాడు లోకనాధం.

"బాగానే ఉన్నాం అన్నయ్యగారూ!...ఆయన పోయిన తర్వాత మీరు మాకు సహాయం చేయకపోయి ఉంటే ఈ పాటికి మా బ్రతుకులు ఏమై ఉండేవో తలచుకుంటేనే భయమేస్తోంది. మీ చొరవవల్లే ఆఫీసునుండి రావలసిన డబ్బులు వచ్చాయి. మీరు పూనుకోవడంవల్లే నాకు ఉద్యోగం కూడా వచ్చింది." అందామె కళ్ళు చెమర్చగా.

ఆ మాటలు విన్న లోకనాధం ఉలికిపడి తలెత్తి అమె వైపు చూసాడు.

కుంకుమబొట్టు లేని ఆమె ముఖం కళావిహీనంగా ఉండటం గమనించాడు. ఎదురుగా గోడపైన పువ్వులదండ వేయబడిన కైలాసరావు ఫోటో చూసి నిశ్చేష్టుడై శేషగిరివైపు చూసాడు. 'కైలాసరావు చనిపోయాడా? ఎప్పుడు చనిపోయాడు, తనకు తెలియదే?' అన్నట్లు ఉంది లోకనాధం ముఖంలో భావం. వాస్తవం తెలిసి ఒక్కసారి చలించిపోయాడు లోకనాధం. అతనిలో జరిగిన మార్పు గమనించిన శేషగిరి మృదువుగా లోకనాధం చేతిని తట్టాడు.

"స్నేహితులన్నాకా ఆ మాత్రం సహాయం చెయ్యకపోతే ఎలాగమ్మా?" అంటూ శేషగిరి తన వెంట తీసుకువచ్చిన ఆపిల్‌పళ్ళు ఉన్న సంచీ ఆమె చేతికి అందించాడు.

కైలాసరావు తనకి పుట్టినరోజు విషెస్ చెప్పలేదని కోపం తెచ్చుకున్నలోకనాధం, ఇప్పుడు కైలాసరావే ఈ భూమి మీద లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఓ క్షణం. తన మనసులో ఇదివరకు కలిగిన భావాలకి సిగ్గుపడి విపరీతంగా చలించాడు. అక్కడున్నంతసేపూ లోకనాధం ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చున్నాడు.

అరగంట తర్వాత ఇద్దరూ అక్కడనుండి బయటపడి లోకనాధం ఇంటికి చేరారు. అప్పటివరకు మౌనంగానే ఉన్నారిద్దరూ.

కైలాసరావు ఇక లేడన్న షాక్‌నుండి ఇంకా తేరుకోని లోకనాధం ఏమీ మాట్లాడలేకపోయాడు. "చూసావా లోకనాధం! నువ్వు పాపం ఆ కైలాసరావుపై ఎంత పెద్ద అభాండం మోపావో? వాడు చనిపోయి నాలుగేళ్ళైనా నీకు ఆ విషయం తెలియలేదు. పోనీ ఇంకో ఊళ్ళో ఉన్నాడా అంటే అదీలేదు, మీ ఇంటికి దగ్గరే కూడా! నువ్వు ఇవాళ ఫేస్‌బుక్‌లో కైలాసరావుకి శుభాకాంక్షలు పెట్టినప్పుడే అనుకున్నాను నీకీ విషయం తెలియదని. నీకు వాస్తవం తెలియాలనే వాడింటికి తీసుకువెళ్ళాను. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, నీలాగే ఇంకో పాతికమంది కూడా అతనికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అవును మరి! ప్రస్తుతం జీవితం అంతా యాంత్రికమైపోయింది. వాస్తవాలు మాత్రం గ్రహించడంలేదు. సెల్ లేకపోతే మన జీవితానికి అర్ధమే లేదు అన్నంతగా అది మనతో మమేకమైపోయింది. ఫేస్‌బుక్‌లో విషెష్ చెప్పడమే కాని, అసలు వాళ్ళు ఎలాగున్నారో అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? మనుష్యుల మధ్యకాదు, మనసుల మధ్యకూడా దూరం పెరిగింది. నీ పుట్టినరోజుకిఫేస్‌బుక్‌లో శుభాకాంక్షలు చెప్పలేదని కైలాసరావు మీద కోపం పెంచుకున్నావుగానీ, అతను ఎందుకు అలా పెట్టలేకపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? అతను ఎలా ఉన్నాడో ఒకసారి ఆరా తీసావా?" అడిగాడు శేషగిరి.

శేషగిరి మాటలకి లోకనాధం బిక్కచచ్చిపోయాడు. శేషగిరి మాటలు కటువుగానే ఉన్నా అందులో వాస్తవం ఉందని గ్రహించిన లోకనాధం మౌనం వహించాడు. కొద్ది నిమిషాలు నోటమాట రాక నిరుత్తరుడైనాడు.

"అవును నిజమే! నాలుగేళ్ళై మన స్నేహితుడు పోయినా మనకు తెలియనంతగా మనం ఎలా గిరిగీసుకొని ఉన్నామో ఇప్పుడు అర్ధమైంది. మనుష్యుల మధ్య వారధిగా ఉండాల్సిన ఈ సాంకేతికతే మన మధ్య దూరాన్ని పెంచుతోంది. అయితే మనం ఈ మధ్య చాలాసార్లు కలసుకున్నా మన మధ్య కైలాసరావు ప్రస్తావన రాకపోవడం కూడా విడ్డూరమే!" అన్నాడు లోకనాధం తేరుకొని.

"నేను చెప్పినా నీ సెల్ ధ్యాసలో వినిపించుకునే స్థితిలో లేవు నువ్వు."జవాబిచ్చాడు శేషగిరి.

శేషగిరి మాటలు లోకనాధం హృదయాన్ని బలంగా తాకాయి. మౌనంగా ఆత్మవిమర్శ చేసుకోసాగాడు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి