పక్షి - ఎం బిందుమాధవి

the bird

ఒక రోజు ఉదయమే అమ్మ వాకిట్లో ముగ్గేద్దామని వీధి తలుపు తీసేసరికి సందయ్య గేట్ దగ్గర కూర్చుని ఉన్నాడు. "ఎవరుబాబూ..ఏం కావాలి" అనడిగింది అమ్మ. "మీ గ్యారేజ్ ఖాళీగా ఉంది కదమ్మా! నేను పగలు అక్కడ బట్టలు ఇస్త్రీచేసుకోవచ్చా" అనడిగాడు.

"ఏ ఊరు మీది? మా గ్యారేజ్ ఖాళీగా ఉన్నదని ఎవరు చెప్పారు?" అనడిగింది అమ్మ. "మావోడు ఈ దగ్గరలోఉంటాడమ్మా! రెండు..మూడు సార్లు మీ ఇంటి ముందు నించి వెళుతూ చూసిండంట. ఓ సారి అడగటంలో తప్పు లేదనివచ్చినానమ్మా!" అన్నాడు.

"సాయంత్రం నాలుగు తరువాత కనబడు. అయ్యనడిగి చెబుతానని" పంపించేసిందమ్మ.

"వాడెవరో ఏంటో? ఏ ఊరో? వెనకాల గ్యాంగ్ ఏమైనా ఉందేమో? ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేం! ఇప్పుడు కాపురం ఎక్కడఉంటున్నాడో? అక్కడి నించి ఎందుకు వచ్చేస్తున్నాడో? ఇవన్నీ తెలుసుకోవాలి కదా!" అని నాన్న మనసులో ఉన్న ప్రశ్నలలిస్ట్ బయట పెట్టారు.

" పైగా మన గ్యారేజ్ కి తలుపుల్లేవు. బయటికెళుతూ ఆ బట్టలకి మనని కాపలా ఉండమంటాడేమో? అసలు ఎంతమంది ఉంటారో? 'మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అన్నట్లు ' మనకొచ్చే మునిసిపాలిటీ నీళ్ళే తక్కువ. అందులోఇంతమంది వాడితే సరిపోవద్దూ?" అని ఇంకో ముందడుగేసి.. పుంఖాను పుంఖాలుగా సందేహాలు తన మనసనేఅమ్ములపొదిలోంచి తీస్తూనే ఉన్నారు నాన్న.

గ్యారేజ్ కి వేరే గేట్ ఉన్నా..మా రాకపోకలన్నీ ఇంటిముందు ఉన్న చిన్న గేట్ లోనించే! అంటే బట్టలివ్వటానికి వచ్చిపోయేవారంతా ఇంటి ముందు నించి తిరుగుతుంటే ఇల్లు రైల్వే ప్లాట్ఫార్మ్ లాగా తయారౌతుంది అని మరోసందేహంకూడా వ్యక్తపరిచారు.

"అందుకేగా మిమ్మల్నడిగి చెబుతానన్నది. మీరు వెలిబుచ్చిన సందేహాలన్నిటికీ జవాబు దొరికితే అతన్ని రమ్మందామా?" అనడిగింది అమ్మ.

* * * * * *

అన్నట్టే మధ్యాహ్నం మూడింటికే వచ్చి కూర్చున్నాడు సందయ్య.

"అమ్మగారూ నాకు భార్య లేదు. మాది మహబూబ్ నగర్. నాకు ముగ్గురు బిడ్డలు. కొడుకుల్లేరు. ఇద్దరి బిడ్డలకిలగ్గమయింది. మూడో ఆమె నాతోనే ఉంటాది. నాతోటి మీకు ఏ పేచీ ఉండదు. ఇక్కడ్నే వండుకు తిని, పగలుపనిచేసుకుని రాత్రికి పండుకుంటాను. నా బిడ్డ సైతం నాతోనే ఉంటాది" అన్నాడు.

"గ్యారేజ్ కి తలుపుల్లేవు. ఎండైనా..వానైనా..చలైనా కష్టం. అది అద్దెకిచ్చే పోర్షన్ కాదు..అందుకే బాత్రూం అంటూ లేదు. ఆడపిల్లంటున్నావు..బాత్రూం ..లెట్రిన్ లేకుండా ఎలా?"అని అమ్మ సందేహం వెలిబుచ్చింది.

"నా వరకు ఎట్టోగట్ల సూసుకుంటానమ్మా! నా బిడ్డకి ఆ ఔట్ హౌస్ వాళ్ళతో మాట్లాడి బాత్రూం ఏర్పాటు చెయ్యమ్మా! నీకుపుణ్యముంటాది. తల్లి లేని పిల్ల! నాకూ వేరే ఆధారం లేదు" అని ప్రాధేయపడితే నాన్నని ఒప్పించి అమ్మ సందయ్యని గ్యారేజ్ లో ఉండేటందుకు అనుమతించింది.

అప్పటి నించీ సందయ్య మా ఇంట్లో ఒక సభ్యుడైపోయాడు. సందయ్య వచ్చినప్పటినించీ ఇస్త్రీ బట్టలివ్వటానికి..ఇచ్చినవితీసుకోవటానికి వచ్చే వారితో వాకిట్లో ఎప్పుడూ సందడే! మేమందరం బయటికెళ్ళినప్పుడు ఒక రకంగా ఇది అమ్మకికాలక్షేపంగా ఉండేది. కొన్నాళ్ళకి కాలనీ వాళ్ళందరూ మా ఇంటిని..మా నాన్న గారి పేరుతో కాకుండా చాకలి ఇల్లు అనిపిలవటం మొదలుపెట్టారు.

సందయ్య ఇస్త్రీ ఎంత ప్రత్యేకమంటే...మా ఇంటికొచ్చే బంధువులు కూడా..వస్తూ వస్తూ పట్టు చీరలు, జరీ చీరలు తెచ్చి మాఅమ్మతో కబుర్లు చెప్పే లోపు సందయ్యని ఇస్త్రీ చేసి ఇమ్మనేవారు.

కాలక్రమేణా మా ఇంట్లో పుట్టిన అమ్మ మనవలందరికీ సందయ్యతో మంచి కాలక్షేపం. వచ్చీ రాని మాటలతో సందయ్యనిఅవీ..ఇవీ ప్రశ్నలడుగుతూ ఉండేవారు. సందయ్య కూడా ఇస్త్రీ చేసుకుంటూ ఓపిగ్గా కబుర్లు చెప్పేవాడు. పిల్లలందరూసందయ్య చేసుకునే వంటని ఆసక్తిగా గమనించి ఇంట్లోకొచ్చి మాకు ఆ పులుసే కావాలి..సందయ్య లాగా కూరచేసిపెట్టమని పేచీ పెట్టేవారు.

సందయ్య మాత్రం అమ్మని ఎప్పుడూ తినటానికి ఏమీ అడిగేవాడు కాదు. పండగలు ..పబ్బాలకి అమ్మ తనంతట తనుఏమైనా ఇస్తే తినేవాడు. ఇంట్లో ఏదైనా స్పెషల్ చేస్తే మాత్రం సందయ్యకి కూడా వాటా ఇవ్వటానికి అమ్మ అలవాటుపడిపోయింది. అమ్మ అప్పుడప్పుడు పదార్ధాలు కొంచెం ఎక్కువగా వండి, "సందయ్యా కూర మిగిలిందనో..పులుసు రుచిచూడమనో, పచ్చడి తిను..నోటికి కాస్త హితవుగా ఉంటుందనో" పిల్చి ఇస్తూఉండేది.

సందయ్య పగలంతా కష్టపడి బోలెడు బట్టలు ఇస్త్రీ చేసి, రాత్రయ్యేసరికి అలిసిన దేహానికి విశ్రాంతి అన్నట్టు ఫుల్ గాతాగేసి వచ్చి నిద్ర పోయేవాడు. మరునాడు అమ్మతో క్లాస్! "పిల్ల పెళ్ళి చెయ్యాలి! ఇలా తాగి డబ్బంతా తగలేస్తే పెళ్ళేంపెట్టిచేస్తావ్" అని అరిచేది. "చుప్" ఆ రోజంతా మాట్లాడేవాడుకాదు. మళ్ళీ వంట చేసి తిన్నాడో ..లేదో అనే ఆరాటం అమ్మకే! లోపలికి..బయటికి కాలు కాలిన పిల్లి లాగా తిరిగేది. "బొగ్గులకెళ్ళొస్తానమ్మా" అని సందయ్య కేకేసేసరికి "హమ్మయ్యాలేచాడు" అని అమ్మ స్థిమితంగా లోపలికెళ్ళేది.

ఆ రోజు వాకిట్లో నించి ఒక చావు బృందం వెళుతుంటే..సందయ్య "ఏందో ఎక్కడి జీవుడో..ఎక్కడికి పోతున్నాడో...నడిమి ఈనాటకం" అని మా మూడేళ్ళ అమ్మాయితో వేదాంతం మాట్లాడుతుంటే..మా అమ్మాయి హఠాత్తుగా "సందయ్యనువ్వెప్పుడు చచ్చిపోతావ్" అనడిగింది. "అయ్యో ఈ సందయ్య సిరంజీవమ్మా..సావు లేదు" అన్నాడు.

"తప్పు అలా అనకూడదు" అని కేకలేసి ఇంట్లోకి తీసుకొచ్చాను.

సందయ్య తన మూడో కూతురికి తన బంధువుల్లోనే మంచివాడినొకడిని చూసి పెళ్ళి చేశాడు.

"హమ్మయ్య బాధ్యత తీరిందమ్మా" అన్నాడు అమ్మతో.

* * * * *

సంక్రాంతి పండగ రోజులు!

రోజూ ఉదయమే, ముగ్గు వెయ్యటానికి సిద్ధంగా, వాకిలి చిమ్మి నీళ్ళు జల్లాక ప్రకృతి అవసరాలు తీర్చుకోవటానికి బయటికివెళతాడు. ఆ రోజు "ఇవ్వాళ్ళ సందయ్య ఇంకా లేచినట్టు లేదే" అనుకుంటూ అమ్మ వీధి తలుపు తీసి బయటికొచ్చింది.

గ్యారేజ్ లో సందడి లేదు. "ఒంట్లో బాగాలేదేమో ఇంకా నిద్ర లేవలేదు" అనుకుంటూ అమ్మ "సందయ్యా" అనిపిలుస్తూగ్యారేజ్ దగ్గరకి వెళ్ళింది. ఖాళీగా కనిపించింది. ఎప్పుడైనా రెండు రోజులు ఊరెళ్ళదల్చుకుంటే, ముందు రోజు బట్టలన్నీ ఇస్త్రీచేసిచ్చేసి... మళ్ళీ ఊరినించి వచ్చాక తనే వచ్చి బట్టలు తీసుకుంటానని గ్యారేజ్ ఖాళీగా పెడతాడు.

అలాగే వెళ్ళుంటాడనుకున్న అమ్మ "నిన్న మాట మాత్రం ఊరెళతానని చెప్పలేదే? అంత అర్జెంటేమిటో? పండగ ఇంకాపదిరోజులున్నదే అనుకుంటూ ఇంట్లోకొచ్చి "సందయ్య ఊరెళతానని మీతో ఏమైనా చెప్పాడా? బయట లేడు! గ్యారేజ్కూడా ఖాళీగా ఉన్నది! బట్టలు లేవు. బొగ్గుల బస్తా, కుంపటి మాత్రం ఉన్నాయి. ఇస్త్రీ పెట్టె ముందుగదిలో పెట్టినట్టుచూశారా?" అని గుక్క తిప్పుకోకుండా నాన్నని అడిగింది.

"లేదే! నాకేం చెప్పలేదు" అంటూనే ముందుగదిలోకెళ్ళి చూస్తే ఇస్త్రీ పెట్టె కనిపించలేదు. అమ్మ మనసెందుకో కీడుశంకించింది. ముందు రోజురాత్రి NATIONAL GEOGRAPHY CHANNEL లో పక్షుల గురించి ఒక కధ ప్రసారమయింది. "ఎక్కడ...ఏ తల్లికి పుడతాయో...రెక్కలొచ్చాక ఎగురుకుంటూ వచ్చి, తమకి అనుకూలంగా ఉన్న ప్రదేశం లో ఒక చెట్టునిఎన్నుకుని, దాని మీద గూడు కట్టుకుని అక్కడ నివసిస్తూ పిల్లల్ని పెట్టి పోషిస్తాయి. పక్షులకి అంత్య కాలంసమీపించినప్పుడు ముందుగా తెలుస్తుందిట. అప్పుడు అవి తాము ఉండే సమూహానికి దూరంగా ఎన్నో వందల..వేలమైళ్ళు ప్రయాణించి అక్కడ తమ ప్రాణాలు వదిలేస్తాయిట" అంటూ విన్న విషయం గుర్తొచ్చి.."సందయ్య మనిషై పుట్టినాకూడా ఒక పక్షి లాగా తన అంత్య కాలం ఎవ్వరికీ తెలియనివ్వకుండా హుందాగా అందరికి దూరంగా ఎక్కడికోఎగిరిపోయాడన్నమాట. తనకి కొడుకులు లేరు! తను చనిపోతే దినాలు చేసే బాధ్యత కానీ,ఖర్చు కానీ పిల్లల మీదవెయ్యటం ఇష్టం లేక నిశ్శబ్దంగా ఎవరికీ చెప్పకుండా నిష్క్రమించాడా?" అనుకుంటూ ...అక్షర జ్ఞానం లేకపోయినాజీవితాన్ని ఔపోశన పట్టిన సందయ్య ఆకాశమంతు ఎత్తుగా కనిపించాడు ఆ నిముషంలో అమ్మ కళ్ళకి.

"మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలు నాన్నతో అంటూ సందయ్య లాగా ఆలోచించటానికి ఎంతో స్థిత ప్రజ్ఞతకావాలి కదండీ! మనకీ అతనికీ..ఏ జన్మ ఋణమో! అతను మన గ్యారేజ్ లో చేరేటప్పుడు ఎన్ని రకాలుగాసందేహించామో? అతనితో మన సాహచర్యం ఎంత విచిత్రమో ... అతని నిష్క్రమణ అంత ప్రశాంతంగా జరిగి మనలోజ్ఞాపకాలని మిగిల్చింది" అన్నది అమ్మ.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి