a(na)suya - అమ్జద్.

అ(న)సూయ

అసూయ, ఈర్ష్య, అనుమానాల కలగూరగంపయే అనుసూయ అని మా కాలేజీ రోజులలో ఆమె గురించి చెప్పుకునేవాళ్లం.

అనసూయ వ్యక్తిత్వం సామాన్యంగా కొరుకుడు పడదు. ఆమె తో చనువుగా ఉన్నవాళ్లు అది ఆమె స్వభావం అని సరిపుచ్చుకొంటారు. ఆమెలో కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి కాని అవన్ని అనసూయ మహాగడుసరి అనే ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాయి. నిజాన్ని నిప్పులా స్వీకరించగల దిట్ట. తప్పును తప్పుగానే ఒప్పుకొంటుంది. పైగా మంచి మాటలకారి. అరమరికలు లేకుండా మాట్లాడుతుంది. ఒకరి మనసు నొప్పించదు. ఒక్కముక్కలో చెప్పాలంటే అనసూయలో నుంచి అసూయ తీసేస్తే ఆమెలో మంచి మనస్తత్వం గొప్పగా ఉంటుంది. ఆరోగ్యమైన శరీరంతో అందంగా ఉంటుంది. కాలేజీ బ్యూటీ అని ఓ ట్యాగ్ కూడా ఉంది ఆమెకు. మా కాలేజీ మిస్ బ్యూటీ!

మా కాలేజీ లో మరో విధ్యార్ధి ప్రదీప్. అతని వ్యక్తితం మరో విధమైనది. అతని ధోరణియే వేరు. పెద్దింటి అబ్బాయి. జలసాగా తిరుగుతుంటాడు. కాని తరగతులకు తప్పకుండా హాజరవుతుంటాడు. బుద్దిమంతుడు. చూడటానికి చాలా బాగుంటాడు. ఆకర్షణీయమైన శరీరాకృతి. చమత్కారి. మాటలతో అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకొనేవాడు. ఇంటెలిజెంట్. నలుగురి తలలో నాలికలా ఉంటాడు. అమ్మయిలు మాత్రం అతడిని పలకరించకుండా ఉండలేరు. కాలేజీలో ప్రతి అమ్మాయితో జూనియర్, సీనియర్, తన క్లాస్మేట్ అనే వ్యత్యాసం లేకుండా అందరితో స్నేహంగా ఉంటాడు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుంది. డబ్బుకు కొదవలేదు. జల్సా రాయుడు. కాని ఎవ్వరి మనసును నొప్పించడు. కాలేజీలో మూడేళ్లు తెలియకుండానే ఇట్టే గడచిపోయాయి.

ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సీఆఫ్ పార్టీలో జూనియర్ అమ్మాయిలతో పాటు ఫైనల్ ఇయర్ అమ్మాయిల కండ్లలో కూడా నీళ్లే...!? ప్రదీప్ పెదవుల పై ఉన్న చిరునవ్వు ప్రతి అమ్మాయికి ఓ చిన్న సాంత్వనం! ప్రదీప్ పాకెట్-డైరీలో అమ్మాయిలే కాదు అబ్బాయిల టెలిఫోన్, మోబైల్ నెంబర్లతో పాటు పోస్టల్ అడ్రస్ లు, ఈమైల్-ఐడిల తో నిండిపోయింది. అలా ఆ రోజు కాలేజీలో వీడ్కోలు విషాదంగా ముగిసింది.

***

మా పరీక్షల ఫలితాలు రాకముందే మా దగ్గరిబంధువు నవీన్ తో నాకు పెండ్లైపోయింది. నేను స్టేట్స్ కెళ్లిపోయాను మావారితో. షికాగోలో నవీన్ నాన్నగారు ఐ.టి. బిజినెస్-మాగ్నెట్ గా స్థిరపడిపోయారు. ననవీన్ ఐ.టి మేనేజర్ గా పనిచేస్తున్నాడు తన నాన్నగారి ఆఫీసులో. అక్కడి వాతావరణం కొత్తలో బగా అనిపించకపోయిన ఆ తర్వాత అలవాటుపడ్డాక అక్కడే బాగా అనిపించింది. షికాగోలో చాలామంది ఇండియన్స్ తెలుగువాళ్లు ఉంటున్నారు. వాళ్లతో వీక్ ఎండ్స్ చాలా బాగా గడిచేది. అలా మూడేళ్లు ఇట్టే గడచిపోయాయి. ఓ పాప, ఓ అబ్బాయి మాకు.

కొన్నాళ్లనుంచి ఇండియాలో ఉన్న అమ్మ-నాన్న, తమ్ముళ్లు, బంధుమిత్రులు, ఫ్రెండ్స్ బాగా జ్ఞాపకం రాసాగారు. వీళ్లందరిని చూడాలని నా మనసు తపించసాగింది. అదే విషయం నవీన్ తో చెప్పాను. తాను రాలేనన్నాడు. కాని నన్ను వెళ్లమన్నాడు. కొన్ని వారాలు ఇండియాలో గడిపి రమ్మని బాగా షాపింగ్ చేసి పంపించాడు. ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ కు చేరుకున్నాను. అమ్మ-నాన్నల దగ్గరనే మకాం పెట్టాను. ఇన్-లాస్ దగ్గరికి వెళ్లి వస్తూండేదాన్ని.

ఓ సాయంత్రం ఆబిడ్స్ లో ఓ సూపర్ మార్కెట్ లో నేను షాపింగ్ చేస్తూండగా అనసూయ తారసిల్లింది. ఒకరినొకరం బాగా గట్టిగా కౌగిలించుకొన్నాం సంభ్రమాశ్చర్యాలతో. మా కండ్లలో ఆనంద భాష్పాలు. మా కాలేజీ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాం. ఇద్దరం కలసి గడిపిన కొన్ని నిమిషాలలోనే చాలా విషయాలు మాట్లాడుకొన్నాం. మేమిద్దరం తొందర్లో ఉన్నాం, ఇంటికి చేరుకోవడానికి. మా ఇంటి అడ్రస్ లను నోట్ చేసుకున్నాం. అనసూయ మా ఇంటికి వస్తానని చెప్పి వెళ్లిపోయింది.

రెండవ రోజునే గ్రాస్-లాన్ లో నేను మా ఇద్దరి పిల్లలతో ఆడుకొంటూండగా, "హాయ్ లక్ష్మీ!" అంటు ప్రత్యక్షమైంది అనసూయ. కాసేపు లాన్ లో కూర్చున్నాక ఇంట్లోకి వెళ్లాం. చాలా విషయాలు చాలా సేపువరకు మాట్లాడుకున్నాం. డిన్నర్ చేశాం. అనసూయ ఏదో విషయం నాతో దాస్తూన్నట్లు ఫీల్ కాసాగాను.

"రేపు సాయంత్రం ఆరుగంటలకల్లా తప్పకుండా రావాలి. ప్రామీస్ చెయ్" అని నా నుంచి ప్రామీస్ తీసుకొని వెళ్లింది. 'మరి కొన్ని విషయాలు నువ్వొచ్చాక...!?' అంటూ సస్పెన్స్ లో పెట్టింది.

***

అనసూయ చెప్పిన టైం కే ఠంచన్ గా చేరుకొన్నాను ఊబర్లో. కాలింగ్ ఎల్ నొక్కగానే తలుపు తెరచి, నన్ను చూడగానే కౌగిలించుకొంది అనసూయ. లోనికెల్లగానే విశాలమైన హాలు. అనసూయ హాలును అలంకరించిన రీతిని, పద్దతిని చూసి ఆశ్చర్యచకితులాలినయ్యాను. మంచి ఇంటిరీయర్ ఆర్చిటెక్ట్ సహాయం తీసుకొన్నట్లుంది.

అతిథుల సందడి లేదు. మందంగా, కర్ణ వింపుగా పాశ్చాత్య సంగీతం డెక్ లో తప్ప వేరే అట్టహాసం లేదు. నా రిస్టువాచీని అనసూయకు చూపిస్తూ, 'ఏమిటి సంగతి! జనాలేరని సైగలతో అడిగాను. 'చెప్తాన’ని తను కూడా కనుసైగలతో చెప్పింది నవ్వుతు.

హాలుకు ఆనుకొని ఉన్న ఓ గదిలో నుంచి అందగాడు, హాండ్సమ్, సూట్-బూట్ లో చిరునవ్వులతో హాల్లోకి వచ్చాడు. మందంగా వెలుగుతూన్న లైట్ బల్బ్ లలో అతని మొహం స్పష్టంగా కనిపించలేదు, నాకు దగ్గరగా వచ్చేవరకు.

"యస్ లక్ష్మీ...నేనే!" అని అన్నాడు ప్రదీప్ శాంతంగా, చిరునవ్వులతో.

"మరిదేమిటి?" అర్ధంగాక అడిగాను ఆశ్చర్యంతో. ప్రదీప్, అనసూయ మొహాల వైపు చూడసాగాను.

"చెప్తాన్రా!" అంటు నా చేతిని పట్టుకొని సోఫాలో కూర్చబెట్టింది, కూడా కూర్చొంటు. ప్రదీప్ మమ్మల్ని అనుసరించాడు తన వ్హీల్ ఛైర్ పై!

"నీలో మా గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగిపోతుందని నాకు బాగా తెలుసు. క్లుప్తంగా చెప్తాను విను మా ప్రేమ గాథ...!” అంటూ అనసూయ చెప్పడం మొదలెట్టింది.

మన రిజెల్ట్స్ వచ్చిన కొత్తలో మార్క్-షీట్ తెచ్చుకోవడానికి కాలేజీ కెళ్లాను. అక్కడ ప్రదీప్ కూడా వచ్చాడారోజు. మామూలు ప్రకారం ఒకరినొకరం పలకరించుకొన్నాం. జోకులు వేసుకున్నాం. ఆ జోకులోనే ఓ జోకు మా పెండ్లి ప్రస్థావన! నేనే సూటిగా సవాల్ వేశాను ప్రదీప్ కు. దాన్ని నా ఆహ్వానంగా స్వీకరించాడు. అదే రోజు సాయంత్రం మా పెద్దలు పెండ్లి నిశ్చయం చేశారు. ఇంతా త్వరగా మేమిద్దరం ఒకరమైపోతామని కలలో కూడా ఊహించలేదు. పెళ్లీళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటే ఇదేనేమోనని మా నమ్మకం.

"మా పెళ్లైన మొదటి సంవత్సరం ఎలా గడిచిపోయిందో మాకు అర్ధం కాలేదు. చాలా జల్సగా ఉన్నాం. ఎన్నో ప్రదేశాలు చూశాం. గొప్పగా చెప్పుకోవాలంటే ఫస్టియరంతా మాకు హనీమూన్ యే! నేను ఆశించింది, కోరుకున్నది సాధించాననే గర్వం నాలో బలపడిపోయింది. మొదటి రెండేండ్లు పిల్లల గొడవల నుంచి దూరంగా ఉందామని నేను ప్రదీప్ నిర్ణయించుకొన్నాం.

"మా పెళ్లైన క్రొత్తలో అమ్మాయిల అదే మన కాలేజీ అమ్మాయిల ఫోన్స్ ప్రదీప్ మొబైల్ పై వస్తూండేవి. నేను వాటి గురించి అంతగా పట్టించుకునే దాన్నికాదు. ప్రదీప్ ప్రతి ఫోన్ కాల్ గురించి చెప్పేవాడు. నేను నవ్వి ఊరుకునేదాన్ని! ప్రదీప్ నాతో ఏ విషయాన్ని కూడా దాచేవాడు కాదు. టెక్స్ ట్-మెస్సేజెస్ కూడా నాతో చదివించేవాడు. నాకు ప్రదీప్ పై ఓ విధంగా గర్వంగా కూడా ఉండేది. ఎంతో అందమైన అమ్మాయిలకు ఇష్టమైన ప్రదీప్ నాకు దక్కాడు అని గర్వపడుతుండేదాన్ని.

"ఎందుకో మరి కొన్నాళ్ల తర్వాత...నాలో...ఎప్పుడూ...అమ్మాయిల ఫోనులు ప్రదీప్ కు రావడం నాకు నచ్చక పోవడం...ఎప్పట్నుంచి మొదలైందో సరిగా గుర్తు లేదు. పైగా పెండ్లైన ఆడవాళ్లు కూడా ప్రదీప్ కోసం పడి చావడం నాకు వింతగా తోచింది. 'డ్రీమ్ మ్యాన్ ' గా ప్రదీప్ ను అడ్రస్ చేసే వారు ఆడవాళ్లు!

"పెండ్లైన రెండవ సంవత్సరం ప్రదీప్ కు ఓ మంచి ఉద్యోగం దొరికింది. నాకు బోర్ కొట్టితూంటే ఓ స్కూల్ లో టీచర్ గా పని చెయ్యడానికి ఒప్పుకున్నాడు ప్రదీప్. ఇద్దరం కలసి సాయంత్రాలు బయట గడిపే వాళ్లం.

“అలా కొన్నాళ్లు గడిచాక, ప్రదీప్ సాయంత్రంపూట ఆఫీసు నుంచి ఆలస్యంగా రావడం మొదలెట్టాదు. అతర్వాత రాత్రులల్లో కూడా ఆలస్యంగా రావడం వరకు వెళ్లింది. ప్రదీప్ నడవడిక...క్యారెక్టర్ పై నాకు నమ్మకం లేదని కాదు...కాని వితవుట్ ప్రదీప్ తో అన్ని గంటలు ఒంటరిగా ఉండడం నా వల్ల అయ్యేది కాదు. చేసేదేమిలేక గంటలతరబడి ఏడుస్తూ...నిద్రపోయేదాన్ని. ఎప్పుడో నాకు మేలకువ వచ్చి చూస్తే నా పక్కలో ఉండేవాడు. తెల్లారుతూండగా 'గుడ్ మార్నింగ్' అని చిన్నగా నా పెదవుల పై ముద్దుపెట్టుకునేవాడు. మళ్లీ అవే కుంటిసాకులు చెప్పేవాడు ఆలస్యంగా వచ్చినందుకు. వాటిని నేను ఇంకా వినే స్థితిలో ఉండేదాన్ని కాదు. ప్రదీప్ చెప్పే గుడ్ మార్నింగ్ లు నాకు వరెస్ట్ మార్నింగ్ గా మొదలైయ్యేది.

"సో...రానురాను నాలో ఈర్ష్య, ద్వేషం, అసూయ చోటుచేసుకుంది. అది కాలక్రమేణ నాలో పెరుగుతూపోయింది.

"ఓ రోజు చిన్న ప్లాన్ వేశాను. ప్రదీప్ కు ఆఫీసు టైం అవుతుందనే హడావుడి, ఆదరాబాదరా ఎక్కువగా ఉండేది. చివరి నిమిషంలో బాత్ రూం కు పరుగెత్తడం అతనికో అలవాటు. ఓ రాత్రి అతికష్టంగా కండ్లు మూసుకొని ప్రదీప్ కోసం ఎదురు చూడసాగాను. యధావిధిగా అర్ధరాత్రి దాటాక వచ్చి నా పక్కలో పడుకున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత గాఢ నిద్రలోకివెళ్లిపోయాడు. నేను నెమ్మదిగా పక్కలో నుంచి లేచి బాత్ రూం లో కెళ్లి అక్కడ కొన్ని షాంపు చుక్కల్ని చల్లాను…" అనసూయ గొంతు బొంగురుబోయింది. కాని అనసూయ చెప్పడం ఆపలేదు. ప్రదీప్ మాకెదురుగానే కూర్చున్నాడు. తను కూడా వింటున్నాడు.

నా ప్లాన్ ప్రకారం ప్రదీప్ బాత్ రూం లో కాళ్లుజారి క్రిందపడ్డాడు...కాని దాని పర్యవసానం ప్రదీప్ ఇలా పారలైసిస్ అవుతాడనుకో లేదు...కొన్ని రోజు నాతో రాత్రింబగళ్లు ఇంట్లో ఉంటాడని, బయటికెళ్లడనే ఉద్దేశ్యంతోనే అలా చేశాను కాని...ఇలా నా జీవితం లో సంతోషానికి బదులు చీకటి క్రమ్ముకొంటుందని నేను ఊహించలేదు!" వెక్కిళ్ల మధ్య చెప్పింది అనసూయ.

"మన చుట్టూర ఉన్నచీకటిని తిట్టుకొంటూ కూర్చోవడంకన్నఓ కొవ్వొత్తి వెలిగించి ఆనందించడం బెటరు! సో..వైనాట్ యూ ఎన్లైట్ ద క్యాండిల్స్ అనూ..!" అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు ప్రదీప్.

అనసూయ ఓ గట్టి నిట్టూర్పు విడుస్తూ లేచి నిలబడింది. కూడా నేను నిలబడ్డాను. అనసూయ ప్రదీప్ వ్హీల్ ఛైర్ ను పట్టుకొని నడుస్తూ, "నేను ప్రదీప్ కలసి ప్రతి సంవత్సరం నా బర్త్ డే, ప్రదీప్ బర్త్ డే, మామ్యారేజీడేలు ఇలా జరుపుకొంటుంటాం. అందులో నా మూర్ఖత్వం, ఈర్ష్య, అసూయలకు నిర్మూలనగా ఓ చిన్న సెలబ్రేషన్ యే ఇది. నువ్వు మా ఇద్దరికి మంచి మిత్రురాలివి. నీ కంపెనీ మాకు ఓ ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నిన్ను ఆహ్వానించాను. నాకెందుకో ఇప్పుడు హాయిగా ఉంది. కాలేజీ రోజుల్లో నువ్వెప్పుడూ నా పర్సనల్స్ లో ఓ భాగంగా ఉన్నావు. ఇప్పుడు కూడా అలాగే ఉంటావని..." కన్నీళ్ల మధ్య చిరునవ్వులతో అంది అనసూయ.

నా కండ్లలో కూడా నీళ్లు తొణికాయి.

"ఓ.కే" అని అన్నాను చిరునవ్వుతో.

మేం ముగ్గురం కలసి అందమైన విలువైన కెండిల్ స్టాండ్ పై ఉన్న పెద్ద కొవ్వొతిని వెలిగించాం. ఆ తర్వాత వెంటనే ఖరీదైన కేక్ ను కోశాం నవ్వుల మధ్య.

***

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి